6, మే 2023, శనివారం

మా ఊరు -మా ఇల్లు 6

 మా తాతయ్య నాయనమ్మ down to earth మనస్తత్వం అని చెప్పాను కదా.. చాలా సాదాసీదాగా వుండేవారు. మా తాతయ్య సాయంత్రం వేళల్లో వీధి అరుగు మీద కాసేపు కూర్చుని వచ్చేవాడు. ఎప్పుడైనా గదిలోనే పడుకుని పడుకుని విసుగువచ్చి ఇంటిముందు వరండాలో గచ్చుమీద వాలు వసారా స్తంభానికి తల ఆన్చి తలగుడ్డ తలకింద పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని పడుకునే వాడు. నేలతల్లి వొడిలో యెక్కడ బడితే అక్కడ విశ్రమించిన అలవాటు అది. మా అమ్మకు నాన్నకు అది అభ్యంతరంగా తోచేది. మంచం వుందిగా అది వేసుకుని పడుకోవచ్చుగా కింద పడుకుంటే చూసినవాళ్ళు ఏమనుకుంటారు అని అజమాయిషీగా మాట్లాడేది. ఏమీ మాట్లాడేవాడు కాదు తాతయ్య.. కాసేపాగి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయేవాడు. మా అమ్మ అరవడం చూసి మాకు చిరాకు వచ్చేది. 

పెద్దలు తాము కట్టిన ఇంట్లో తాము ఇష్టం వచ్చనట్లు కూర్చోవడానికి నిలబడటానికి పడుకోవడానికి అధికారం లేకుండా.. పిల్లలకు ఇచ్చేస్తే భర్త కి వచ్చిన ఆస్థి అనుభవించడానికి వచ్చిన భార్యలు అత్తమామలను రాచిరంపాన పెడతారు. పెత్తనం చేస్తారు.  ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినవారైతే మరీనూ.. పాపం.. పెద్దల మనసు యెంత చిన్నబోతుందో కదా! 

ఇక్కడ ఒక మాట చెప్పదల్చుకున్నాను.. అందుకే ఇప్పటివారు ఒక విషయం గమనించాలి. ముసలితనంలో వుండటానికి ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాకనే పిల్లలకు ఆస్తులను పంచి ఇవ్వాలి. లేదా సంపాదించుకుని బ్రతకమని ఎడ తోలాలి. పశువులు పక్షులు అనుసరించే దారిని వదిలేసి  నా పిల్లలు వారి పిల్లలు అంటూ భ్రమత పెంచుకోవడం తర్వాత కుమిలి కుమిలి ఏడ్వడం పరిపాటి కాకూడదు. నేను ఎరిగినంత వరకూ పిల్లలు 90% మంది స్వార్ధం జీవలక్షణంగా వుంటున్నారు. ఎక్కడో కొంతమంది మంచివారు తల్లిదండ్రుల విలువ తెలిసినవారూనూ. 

మా నాయనమ్మ తాతయ్య వున్నదంతా పిల్లలకు అప్పజెప్పి మూగబాధ అనుభవించారు. అదే నా కళ్ళల్లో మనసులో మెదులుతూ వుంటుంది. 

ఉమ్మడి కుటుంబంలో వున్నప్పుడు మా తాతయ్య చేనుకు తీసుకువెళ్ళడానికి  జొన్న పిండి గండ్ర బియ్యంతో కలిపి సంకటి తయారు చేసేవాడంట. ఒక కుండలో సంకటి ఇంకో చిన్న కుండలో మజ్జిగ పండు మిరపతొక్కు ఇవన్నీ మోసుకుని వెళ్ళేవారంట. పాలేర్లు ఇంటివారు అనే బేధం లేకుండా అదే తినేవాళ్ళంట.  పిల్లాజెల్లాతో   దంపుడు వ్యవహారాలతో పాలు పితకటాలు మధ్య ఆడవాళ్ళకు పని చెప్పడం ఎందుకని తాతయ్య ఉలవలు వండుతూ ఆ పక్కనే పొయ్యి మీద సంకటి వండటం చేసేవారంట. ఉమ్మడి కాపురంలో ఇష్టం లేని మరదలు .. ఆ ఉడికే సంకటిలో కోడిపెంట తెచ్చివేయడం చూసారంట. అది కుమ్మరించి మళ్ళీ వండాడు అంట తప్ప తమ్ముడు భార్యను ఒక్క మాట కూడా అనలేదంట. ఆ మరదలే.. ఇంకో పిచ్చి చేష్టలు కూడా చేసేదట. పిల్లలు దొడ్డికి వెళితే  చేటతో అది తీసుకువచ్చి వాకిలి చిమ్మిన పాచిపోగులో పోసేదంట. రోజూ వాకిళ్ళు వూడ్చిన పాచిపోగును  వంట ఇంటి చెత్త  ఎత్తి దూరంగా వున్న పేడదిబ్బలో పోసేది తాతయ్యేనంట. ఒక ఆడమనిషి  ఇంటి పనులు చేయడానికి వుండేదంట. ఆమెను లోనికి రానీయకుండా ఏమీ అంటుకోనీయకుండా తను పనిచేయకుండా నానా ఇబ్బందులు పెట్టేదంట. ఆమె భర్త కూడా భార్య మాటను జవదాటకుండా పనులు చేయకుండా తప్పించుకు తిరిగేవాడంట. ధాన్యం కల్లంలో నూర్చే సమయానికి బళ్ళకెత్తే సమయానికి వచ్చి లెక్కలు వేసేవాడంట. మా తాతయ్య తమ్ముడిని మరదలను ఒక్క మాట కూడా అనేవాడు కాదని మా మేనత్త చెబుతుండేది. అందరూ ఇబ్బంది పెట్టినవారే! అయితే నేం.. అట్టాంటివాళ్ళే మీటలేసుకుని పోయారు. తెలివిగా సంపాదించుకుని పొలాలు కొనుక్కున్నారు. కూతురికి వొంటినిండా బంగారం దిగేసారు. అని ఉక్రోషంగా అనేది.  

ఇక మా మామిడితోట గురించి

మా ఇంటికి దగ్గరగా తూర్పు వైపు  మాగాణి పొలాలను దాటుకుని మా కంటి చూపు అనేంత సమీపంగా వాగు వొడ్డున మాకొక మామిడితోట వుండేది. చెట్లు కొంత తక్కువగా అప్పుడే వేసిన చిన్నమొక్కలతో బయలుగా వున్నట్టు వుండేది. మా పక్కనే చిన తాత గారి భాగం వుండేది. ఆ తోటలో బోరు సౌకర్యం వుండేది. ఎక్కువగా కూరగాయల తోట లేదా మల్బరీ సాగుచేసేవారు వారు. ఇక మా తోటలో పెద్దరసాల చెట్లు కలెక్టర్ కాయలు (తోతాపురి) బంగినపల్లి చెట్లు వుండేవి. 

పిందెలు పడి పప్పులో వేసుకునేంత సైజు కాయ అవుతుందనుకునే కాలానికి సుమారుగా శివరాత్రి వెళ్ళిన దగ్గర్నుండి మా తాతయ్య తోటకు వెళ్ళేవాడు.  ఇంట్లో ఒక ముద్ద తిని  గంజి మజ్దిగ కలిపిన అన్నం వున్న      చట్టినో తపేలా లాంటిదో ఉగ్గములో పెట్టుకుని మట్టి బుర్రకాయ నిండా మంచినీళ్ళు పోసుకుని కర్రకు ఆ రెండింటిని తగిలించుకుని చురచురమనే ఎదురు యెండకు మగాణి పొలాల మధ్య నడుచుకుంటా వెళ్ళేవాడు. పొలంలో పశువులు వెళ్ళే వీలుంటే వాటిని కూడా తోలుకుని వెళ్ళి సాయంత్రానికి తిరిగివచ్చేవాడు. ఉగాది వెళ్ళిన దగ్గర్నుండి  రాలిన మామిడికాయలు పప్పులోకి మామిడికాయలు తెచ్చేవాడు. ముంజెకాయలు ఈతకాయలు తెచ్చి పిల్లలకు ఇచ్చేవాడు. మామిడి పళ్ళు వచ్చే కాలంలో పెద్దరసాలు పండ్లు బంగినపల్లి పండ్లు భద్రంగా పైపంచెలో కట్టుకుని జాగ్రత్తగా తెచ్చేవాడు. ముందుగా మా చెల్లెలు కు తీపి కాయను తర్వాత అన్నయ్యకు ఆఖరిలో నాకు మా నాయనమ్మకు ఇచ్చేవాడు. నేను ఏది యిచ్చినా సంతోషంగా తీసుకునేదాన్ని. మామిడిపండ్లు అంటే నాకు అంత యిష్టం వుండేది కాదు. పెద్ద రసాలు కాయలతో యెండు వొరుగులు మాగాయ పచ్చడి వేసేవారు పులుపు యెక్కువ అని. బంగినపల్లి మామిడికాయలు అన్నయ్యకు యిష్టం.

 ఇలా తోట అమ్మకుండా మా ఇంటి వాడకానికి పంచడానికే సరిపోయేయి. ఎక్కువ కాయలు కావాలి అనుకున్నప్పుడు చిక్కం దోటీ పట్టుకుని నేనూ అన్నయ్య వెళ్ళేవాళ్ళం. తాతయ్య  చిక్కం దోటితో కాయలు కోసి చేతి సంచీ లో వేసి యిస్తే మోయగల్గినన్ని కాయలు తీసుకుని ఇంటికి చేరుకునే వారిమి. ఇంటి చాకలికి మంగలికి వతనుగా పనికి వచ్చేవారికి కాయలు పంచేవారు. మా నాయనమ్మ అమ్మ పందేరం అనే వాళ్ళు. కోసుకొచ్చి పండేస్తే పిల్లలు తినరా అనేవాళ్ళు. వేసవి సెలవులు వస్తే పొద్దున్నే అన్నం తిని పిల్లలందరం తోట దగ్గరికి పరిగెత్తే వాళ్ళం. వాగులో ఇసుకతో ఆడుకోవడం చిట్టీత పొదల్లో నల్లగా పండిన కాయల కోసం వెతకడం సీమతుమ్మ కాయలు కోసుకోవడం చెట్లెక్కడం అక్కడ నుండి పెద్ద వాగుకు పరుగులు దీయడం. ఒకోసారి ఆ వాగులో నీళ్ళు పారుతూ వుండేది. అక్కడే చెలమలు తవ్వడం గవ్వలు ఏరడం గచ్చకాయలు ఏరడం పిచ్చుక గూళ్ళు కట్టడం కాశీ పుల్ల ఆట ఆడటం.. సెలవలు యెంత త్వరగా అయిపోయాయో అనిపించేది. 

మా నాన్న లారీ రిపేరులకు అప్పు తెస్తే అది వడ్డీతో సహా తీర్చడానికి ఆ పొలం అమ్మి అప్పులు తీర్చారు. 1983 లో ఆ మామిడితోట యెకరం ఎనిమిది వేలు లెక్కన అమ్మినట్టు గుర్తు. అలా మా ఊరిలో మామిడి తోటకు కాలం చెల్లిపోయింది. నా బాల్యం జ్ఞాపకాలలో ఆ మామిడితోట ది అగ్రతాంబూలం. 2014 లో నేను ఆ భూమి కొందామని ప్రయత్నం చేస్తే ఎకరం నలభై లక్షలు చెప్పారు. అదే కాలంలో విజయవాడ  నిడమానూరు పక్కన గూడవల్లి లో  ఎకరం 46 లక్షలకు లభ్యం అవుతుంటే.. ఆ భూమి ని కొనడానికి వెనుకాడాను. ఇప్పటికీ ఆ భూమి అమ్ముతారా? రేటెంత అని ఆరా తీస్తాను. వాళ్ళు అమ్మరంట అని చెబుతారు. ఆ తోట ఇసుకతో కూడిన నల్లరేగడి నేల. కూరగాయలు మల్బరీ అరటి మొక్కజొన్న మామిడి జామ అన్నీ వేయడానికి అనువైన భూమి. తాతముత్తాల ఆస్థి అది. మళ్ళీ మాలో ఎవరైనా కొనుక్కొంటే బాగుండును అని ఏదో ఆశ భ్రమత. మా అక్కచెల్లెళ్ళ మగపిల్లలకు మార్కెట్ వాల్యూ పెరిగే రోడ్డు పక్కన భూములు కొనాలనే ఆసక్తి. మా మాట పడనివ్వరు. మాకేమో ఏదో ఆశ. మన పూర్వీకులు నడయాడిన నేల చేను ఇల్లు అనే సెంటిమెంట్ వుంటుంది కదా.. అది నాకు మరీ యెక్కువ. పుట్టింటి ధనంగా మా నాన్న వైపు నుండి నాకు సెంటు భూమి కూడా రాలేదు. అయినా మా ఊరు మా ఇల్లు అనేది నాకు ప్రపంచంలో వున్న అన్నింటికన్నా విలువైనది. అసలు నాకే కాదు ఆడపిల్లలందరికీ ఈ భావన వుంటుందేమో! ఆడపిల్లలకు అరకొర యిచ్చి పుత్ర సంతానానికి ఆస్తులకు వారసులను చేయడం తరతరాల ఆనవాయితీ. కానీ ఆడపిల్లలకూ మనసు వుంటుందే! 

భూమి నాది అన్న వాడిని చూసి భూమి ఫక్కున నవ్వింది అంట. ఇప్పుడు  అది నిజం కదా అనుకోవడమే మిగిలింది. 

ఈ మధ్య గూగుల్ యెర్త్ మేప్ లో మా ఊరు మా పొలం ని చూసుకుని వచ్చాను. ఆ జ్ఞాపకాల స్రవంతిలో.. 

ఈ కింది  Map లో  పసుపు గీతల మధ్య మార్క్ చేసి వున్నదే మా మామిడితోట. ఇప్పుడు ఖాళీ భూమి గా వుంది. ఆ భూమి కి ఆనుకుని తూర్పుగా వున్నది వాగు. కట్టువకాలువ అంటారు. ఆ వాగులో దిగి ఉత్తరం వైపు నడిస్తే పెద్ద వాగు వస్తుంది. అక్కడే మా  బాల్యపు ఆటలు. ఆ పెద్ద వాగు ఆనుకుని విజయవాడ కు వెళ్ళే రోడ్డు. భీమవరప్పాడు. ఆ గ్రామమే విప్లవ రచయిత శివసాగర్ ఊరు. ఆ పైన కనబడేది శోభన్ బాబు స్వగ్రామం చిన నందిగామ. ఆయన మా ఊరిలోనే  మాతామహుల ఇంట పుట్టాడు. (కుంటముక్కల)



కామెంట్‌లు లేవు: