"కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన ఉత్తేజం, మిగిల్చిన అనుభూతి, ఏర్పడిన నా అవగాహన ఇది.
మహ్మద్ ఖధీర్ బాబు గారికి వైభోగం పట్టుకుంది . ఇది నేనన్న మాట కాదు ఆయన మాటల్లోనే! లేకపోతే మిట్ట మధ్యాహ్నం మండి పోయే మా బ్లేజ్ వాడ పుర వీధుల్లో ఏలూరురోడ్ లో విశాలాంధ్రని వెదుక్కుంటూ నేను వెళ్ళడం ఏమిటీ ?
నిజంగా పాఠకులు ఒక పుస్తకం కోసం వెదుక్కుంటూ వెళ్ళడం అంటే కచ్చితంగా అది రచయితకి పట్టిన వైభోగమే! అలా విశాలాంధ్ర లోకి అడుగు పెట్టగానే మొట్టమొదట మాట్లాడిన మాట ఖదీర్ బాబు గారి కొత్త పుస్తకం ఉందా ? ( మనసులో వీళ్ళు గనుక లేవండీ అంటే మళ్ళీ లైన్ లో ఉన్న షాప్ లన్నీ వెతుక్కోవాలి అన్న భయం ఉంది లోలోపల)
"ఉందండీ" అంటూ అందరికీ కనబడేటట్టు పెట్టి ఉంచిన బుక్ తీసుకొచ్చి ఇచ్చారు . హమ్మయ్య ఒక పని అయిపొయింది అనుకుంటూ ఇంకొన్ని పుస్తకాల కోసం వెదుకుతూ ఒక పావుగంట శీతల పవనాలని ఆస్వాదించి కొన్ని కొసరు పుస్తకాలు కొనుక్కుని బయట పడ్డాను.
ఆరోజు సాయంత్రమే చదవడం మొదలెట్టాను .
కథలు ఎవరు వ్రాస్తారు ? జ్ఞాపక శక్తి ఉన్నవాళ్ళు , రోజూ వారి పనులు విషయాలు గుర్తు పెట్టుకోలేని వాళ్ళు , చిలవలు పలవులు ఊహించుకునే వాళ్ళు. నాకు రుజువు దొరికేసింది. చెల్లెలు పుట్టినరోజున ఎదురుగా కొత్తబట్టల్లో కనబడినా ఆ సంగతే గుర్తు ఉండదు, చిన్నప్పుడెప్పుడో నాయనమ్మ చెప్పిన కథ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మెదడు.
కథ వ్రాయడానికి ముందు ఏం వ్రాస్తారు? అవును .. నేను ఏమి వ్రాస్తాను ? బ్లాగ్ లో ఏదో ఒకటి వ్రాస్తాను . అలా వ్రాస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు కథ వ్రాసేస్తాను అనుకుంటూ మళ్ళీ ఆగిన దగ్గరనుండి . చదవడం మొదలెట్టి అప్పటికి ఒకగంట పది నిమిషాలు అయింది. కథలెందుకు రాస్తారు ? నాలుగో అధ్యాయంలోకి వచ్చాను . ఒక్క వాక్యం దగ్గర ఆగి పోయి మళ్ళీ చదివాను .
కనుక మనం ఏదైనా చెప్పాలనుకున్నామంటే ఆ చెప్పేది, చెప్పాలనుకునేది ఏదీ వృధా అయి ఉండకూడదు అన్న వాక్యం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తూ ఆలోచిస్తూ వృధా అయినవి ఏమైనా వ్రాయడం అంటే... చెక్ చేసుకోవాలి మనం వ్రాసిన వాటిని వెనక్కి మళ్ళి ...మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అప్పుడు వృధా అయినది తొలగించి వేస్తాం. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అదే సెల్ఫ్ ఎడిటింగ్ అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారిపోయాను. ఉలిని శానం మీద సాది సాది ఉలిని పట్టుకోవడమేలాగో తెలిసినవాడు, కొయ్యని తొలిచినట్టు ఇలా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను కూడా !
తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్లి ...
కథ వ్రాయడానికి ముందు ఏదో ఒక రచయిత కథని చూస్తూ మనమూ అదే కథని తెల్లకాగితం మీద వ్రాయాలి అది అనువాద కథైతే మరీ మంచిది అని చదివాను.
అనువాద కథని ఎక్కడనుంచి తేవాలిప్పుడు ? విపుల లో ఏదో ఒక కథని ఉన్నపళంగా వ్రాసేయాలి . అయ్యో ! విపుల ఎక్కడిది ? మంచి ఐడియా తట్టింది .ఆన్ లైన్ పత్రిక ఉంది కదా అని. అలా ఆన్లైన్ పత్రిక తెరిచి ఓ కథని వ్రాస్తున్నప్పుడు ఈ అనువాద రచయిత వ్రాసిన ఈవాక్యాన్ని ఇలా కూడా వ్రాయవచ్చునే, పర్యాయ పదం కూడా వాడవచ్చునే అనే ఆలోచన మనకి వస్తుందన్నమాట. ( అప్పటికప్పుడు ఇది నా అభ్యాసంలో నేర్చుకున్న విషయం )
అలా చదవడం ద్వారా కల్గిన ఒక్కో అనుభవాన్ని ప్రోది చేసుకుంటూ ఆక్టోపస్ లాంటి స్నేహితులకి చిక్కకుండా .. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని ఆరు రోజులో ఆ పుస్తకాన్ని చదవడం పూర్తీ చేసాను . ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రయాణం అసలు సరిగ్గా సాగనే లేదు . 28 శీర్షికలున్న అ పుస్తకాన్ని ఒక్కో శీర్షిక చదువుతున్నప్పుడల్లా మధ్యలో ఆగి ఆలోచించడం అనివార్యమైంది.ఎంతమంది రచయితలని ఎన్ని కథలు పరిచయం చేసారు. ఒకోసారి చదువుతున్న ఆ పుస్తకం పక్కన పడేసి అందులో పరిచయం చేసిన కథల కోసం ఆన్ లైన్ లో అన్వేషించాను కూడా !
.
ఇలా ప్రతి అధ్యాయం చదువుతున్నప్పుడు నాకంటూ కల్గిన జ్ఞానోదయాలు, జ్ఞాపకం వచ్చిన విషయాలు, అరె ఈ విషయం భలే వ్రాసారు ఇంతగా మనసులని చదివినట్టు వ్రాయడం ఎలా సాధ్యమవుతుందో !మనం కూడా ఇలా వ్రాయడానికి తగినంత సాధన చేయాలి అనుకోవడం సాధారణం అయిపొయింది. ప్రతి శీర్షిక చదివేటప్పుడు నాకు కల్గిన ఆలోచనలు వ్రాయాలంటే అదొక పుస్తకం అయిపోతుంది కాబట్టి వాటిని దాచేసుకుని ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను .
ఈ పుస్తకం చదవడం వల్ల కల్గిన లాభాలు .
.
నేనూ కథలు వ్రాసే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ప్రతి శీర్షిక ఆసక్తిగానూ ఉంది, పాఠం లాగా కూడా ఉంది .ఇంతకు క్రితం కథలు వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు గురించి రెండు పుస్తకాలూ చదివాను, కొన్ని విషయాలు గ్రహించాను కానీ ఖదీర్ బాబు గారి "కథలు ఇలా కూడా రాస్తారు " అంటూ ఇంకో సరికొత్త పరిచయాన్ని ఇవ్వడం మాత్రం అద్భుతంగా ఉంది . ముఖ్యంగా ప్రతి అధ్యాయం చివర బోర్లా పడుకుని పుస్తకం చదువుకునే బొమ్మైతే చాలా నచ్చింది . పుస్తకం వ్రాయడం కన్నా పుట్ నోట్స్ అందించిన శ్రమ చాలా ఎక్కువని చెప్పారు. అది చాలా చాలా నిజం అనిపించింది. చాలామంది గురించి ఒక్క పుస్తకంలో తెలుసుకోవడం సులభంగా ఉంది.
అలాగే ప్రతి విభాగం చివరా చమక్ మనిపించే ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం పట్టుకుని ఆలోచిస్తే చాలు ఎంతో విషయం అవగతమవుతుంది. అలాంటి వాక్యాలని ఒక్కో కొలికి పట్టుకుంటూ వెళితే ఒక గొలుసు అవుతుంది. అదే ఈ పుస్తకం అవుతుంది. అది చదవటం ద్వారా వచ్చిన అవగాహన, జ్ఞానం అవుతుంది అని నేను చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని చదివిన ఇంకొకరి అనుభంతో నా అనుభవాన్ని సరిపోల్చుకున్నాను.
ఈ పుస్తకం రావడం వెనుక ఎంతో శ్రమ ఉంది.నాలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదివి ఎంత ఉపయుక్తంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చెప్పడం కూడా అవసరం . అది ఇచ్చే సంతృప్తి రచయితకి బలం.
ఇంతకు ముందు కథలు వ్రాయడం అలవాటు లేనివాళ్ళు హటాత్తుగా కీ బోర్డ్ ముందు కూర్చోవడం ఆశ్చర్యం కాదు.
నాలా ఎలాగోలా కథలు వ్రాస్తున్నవాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ కథలు వ్రాస్తారు . అది సాహిత్యలోకానికి చాలా మంచిది కదా !
ఇప్పటికే బాగా కథలు వ్రాసి ప్రసిద్ది చెందినవాళ్ళు ఇందులో అంశాలన్నీ భలే ఉన్నాయి . ఇవి మనకి ఒకప్పటి అనుభవమే కదా, అప్పుడు అలా జరిగింది, అలా వ్రాసాను, తర్వాత సరిచేసుకున్నాం అని అనుకుంటారు కూడా .
ఔత్సాహిక రచయితలకి, కొత్తగా పుస్తకం విడుదల చేయాలి అనుకునేవాళ్ళకి ఎన్నో సలహాలు,సూచనలు ఉన్నాయి. వెరసీ ఇది వ్రాసే వాళ్ళకందరికీ ఓ గైడెన్స్ లాంటిది.
నా కథల ప్రయాణంలో మంచి కథలేమైనా వ్రాయగల్గితే "కథలు ఇలా కూడా వ్రాస్తారు " చదివిన అనుభవం తప్పకుండా ఉంటుంది .
ఇంత మంచి పొత్తం అందిందించిన మహ్మద్ ఖదీర్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు,ధన్యవాదాలు తెలుపుతూ ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి