7, మే 2016, శనివారం

ఇప్పుడు కూడా రావా..అమ్మా!

ఇప్పుడు కూడా రావా అమ్మా ! (కథ)     - వనజ తాతినేని. 

"అస్మా నీతో మాట్లాడిందా ?"
 ఊ ...
"ఏమందీ ?" ఆత్రుత నాలో 

"ఇప్పుడు కూడా రావా అమ్మా ? అని అంది. మాట్లాడకుండా పెట్టి పడేసా ! " చెప్పింది విజయ. 

"మళ్ళీ చెప్పు ! అమ్మా అని పిలిచిందా నిన్ను"  ఎక్కడో ఆశ. సందర్భం ఏదైనా ఓ బిడ్డ తన తల్లిని పిలవడం నా దృష్టిలో ఓ అద్భుతం .

విజయ గుర్తుతెచ్చుకొంటున్నట్లుగా ఓ క్షణమాగి " ఇప్పుడు కూడా రావా అమ్మా !?" అంది

వింటున్న నేను విచలితమైపోయాను. సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసుకున్న తల్లి గుండె బండరాయేమీ కాదు మనసున్న మనిషే.  పరిస్థితులే ఆమెనలా  బండరాయిలా మార్చేసాయి.
.
అవతల  విజయ భోజనం చేస్తూనే నాతో  మాట్లాడుతుంది.    అలాంటి పరిస్థితిలోకూడా  అంత నిశ్చలంగా ఉందంటే, మాములుగానే తిండి తింటూ మాట్లాడుతుందంటే, నేను కాకుండా మరెవరైనా ఫోన్ లో మాట్లాడుతూ  ఉన్నట్లయితే    అసలీమె ఆడపుట్టుక ఎలా పుట్టింది ? అని తిట్టుకోవడం,అసహ్యించుకోవడమూ ఖాయం.

 ఈ సంభాషణ వినడానికి ముందు నేనో  గంట వెనక్కి వెళితే ఏం జరిగిందంటే ... 

ఇంట్లో పనై పోయాక కాస్త విశ్రాంతిగా  ఆన్ లైన్ లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ చూసుకుంటున్నాన్నేను. విజయ లైన్ లోకి వచ్చింది. క్షేమసమాచారాలు పూర్తయ్యాక .. చెప్పమ్మా ! ఏమిటీ విషయాలు అనడిగాను . నీతో మాట్లాడదామనే కాల్ చేసాను . మళ్ళీ ఇలాంటి అవకాశం నెల రోజులకి గాని రాదు "ముట్టుపండగ మూలంగా బయట కూర్చున్నా " అందుకే తీరుబడిగా ఉన్నా! కాస్తంత స్వేచ్చ, తీరుబడి లభించినందుకు ఆనందం ఆ  గొంతులో.  

" చెప్పు, ఏమిటీ సంగతులు ? "

"నిన్న మధ్యాహ్నం నేను, వాసుగారు  కలిసి భోజనం చేస్తున్నాం. రజియా ఫోన్ చేసింది . నేను తీయలేదు. పోన్ అన్నిసార్లు వస్తుంటే తీయవేంటి అనడిగారు  వాసు.  తీయాల్సిన అవసరం లేదులెండి, తీసే ఇంటరెస్ట్ కూడా లేదు అన్నాను . "ఏంటి మీ ఆయన ఫోన్ చేస్తున్నాడా " అని అడిగాడు. నేను మాట్లాడకుండా ఉండిపోయాను"  అంది విజయ. 

"అదేంటి, మీ ఆయన అంటుంటే ఎలా ఊరుకున్నావ్ ! మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా అని అనలేదా ?  అలా మౌనంగా ఎందుకున్నావ్ ? "  నాలో కోపం కట్టలు తెగుతుంది  .

"నీకున్న ఆవేశం, కోపంలో వందో వంతైనా లేవు నాకు. నిత్యం మనసుకి ఎన్నో గాయాలవుతానే ఉంటాయి. ఇదో గాయం అనుకుని  ఊరుకున్నాను." మళ్ళీ బాధ విజయ గొంతులో. 

"రజియా మళ్ళీ ఎందుకు కాల్ చేసింది . అసలా పాత నెంబర్ మార్చమంటే వినవు. ఆ నెంబర్ లేకపోతే వాళ్ళు  నీ వెంటపడటాలు ఉండవుగా?  కోపంగా అరిచాను నేను. 

"అసలు సంగతి విను, ఆ అమ్మాయి కాల్  నేను తీయలేదు కదా ! గుంటూరు పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది అంది విజయ. ఆ  మాట వినగానే అస్మా కి ఏం  జరగలేదుకదా ! నిత్యం ఆడపిల్లలపై ఏవేవో ఘటనలు జరుగుతున్నాయసలే , భయంవేసింది ఆక్షణంలో.  తర్వాత క్షణంలో విజయ  ఏం  చెపుందోనని వినడానికి చెవులు రిక్కించాను.

"సి ఐ  అంట. మీకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలని కాల్ చేసాను.  మీ భర్త  జానీ బాషా ఈ రోజు మధ్యాహ్నం చనిపోయాడు.  శవాన్ని మార్చురీలో ఉంచారు .  యాక్సిడెంట్ కేస్ కదా ! రేపు పోస్ట్మార్టం తర్వాత బాడీని అప్పగిస్తాము. విషయం మీకు చెపుదామని చేసాను, మీ వాళ్ళు  ఫోన్ చేస్తుంటే మీరు  లిఫ్ట్ చేయడం లేదంట.   అని చెప్పాడు . "

"నువ్వేమన్నావ్ ? "నా అసహనమైన ప్రశ్న. 

"అతనితో నాకేమీ సంబంధం లేదండి. మాకు విడాకులు కూడా అయిపోయాయి. నేను అక్కడికి  రాను, నా కోసం ఎదురు చూడవద్దని చెప్పండి" అని చెప్పాను. మళ్ళీ కాసేపాగిన తర్వాత ఇంకో  కానిస్టేబుల్ పోన్ చేసి ఇదే విషయం చెప్పాడు.  అతను మాట్లాడాక  రజియా మాట్లాడింది. "వదినా ఆఖరిసారి చూసుకుంటావని చెపుతున్నాను" అంది.

"నేను రాను, రావాల్సిన అవసరం లేదు, నా కోసం ఎదురు చూడకుండా మీ పనులు మీరు చేసేసుకోండి"  అన్నాను .

"అదేంటి వదినా అలా అంటావు ? పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి కూడా కాదు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు, గొడవలు పడ్డారు, విడిగా ఉంటున్నారు . విడిగా ఉంటున్నంత మాత్రాన నీ భర్త కాకుండా పోతాడా !? కడసారి  చూపు,  వచ్చి చూసుకుని వెళతావని చెపుతున్నా" అంది . ఫోన్ పెట్టేసాను. వాసుగారు  రాత్రి ఇంటికి వచ్చాక ఈవిషయం చెప్పాను . ఆయనేమీ  మాట్లాడలేదు.  "మీరేమి భయపడకండి  నేను వెళతానేమోనని. నాకస్సలు సంబంధంలేని విషయాలవి  అనికూడా చెప్పాను". అంది విజయ. 

"మనిషి ఎలాంటి  వాడైనా మరణం బాధిస్తుంది కదా ! నువ్వెళ్ళవని నేనూ  ఖచ్చితంగా చెప్పగలను. ఎలా జరిగిందట యాక్సిడెంట్ ? తాగి వెళుతూ తనే దేన్నో గుద్దేసి ఉంటాడు, అంతేనా ! "అడిగాను. విజయ మాజీ మొగుడు ఇప్పుడు చనిపోయిన జానీ బాషా పై నాకున్నది   అలాంటి అభిప్రాయమే! నాకే కాదు  అతనేమిటో   తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అతనంతే ! 

 విజయ వివరంగా  చెపుతుంది "ఆటో వాడు కొట్టేసాడంట. రెండు రోజులుగా  హాస్పిటల్ లో  ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందట. మూడో రోజు చనిపోయాడంట . ఈ రోజు ఉదయం కూడా రజియా కాల్ చేసింది. " వదినా! మేము మా సంప్రదాయాలవీ పాటించమని అడుగుతామని భయపడొద్దు ఊరికే వచ్చి చూసి వెళ్ళిపో" అంది. 

" తోడుగా రావడానికి మా నాన్నకూడా లేరు, చనిపోయారు.  నేను రానులే, మీరు  కానిచ్చేయండి" అన్నాను.

"ఇదిగో నీ కూతురు మాట్లాడుతుందట " అంది రజియా . 

నా కూతురు ఎందుకవుతుంది ? నా కూతురైతే నా దగ్గరే ఉండేది . నేను అడగగానే మీరే పంపించేసి ఉండేవాళ్ళు.  అలాగే నేను  అమ్మనని అస్మా  అనుకునుంటే  అది నా వెంట కొన్నేళ్ళ క్రితమే  వచ్చేసేది. అలా జరగలేదు కదా !   చిన్నప్పటి నుండి నువ్వే పెంచుకుంటున్నావ్ కనుక అది ఎప్పటికి నీకూతురే ! అని  ఫోన్ పెట్టేసాను. 

 విజయ పై జాలేసింది " అప్పుడైనా చెప్పకపోయావా తల్లీ , నీకు  మళ్ళీ పెళ్ళైంది అని.  మీ ఊరికి ఆ ఊరికి మధ్య  పది పదిహేను కిలోమీటర్ల దూరం కూడా లేదు. వాళ్ళకీ విషయం  తెలియదంటావా !? అడిగాను అనుమానంగా. 

"తెలియదమ్మా ! పిల్లని పంపకపోతే మా వాళ్ళు పెళ్ళి చేస్తానని అంటున్నారని చెప్పానే కానీ పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదు. వదిన అలాగే అంటుంటూ ఉంటుందిలే అన్నట్టు తేలిగ్గా తీసుకుంటుంది రజియా.   నేను  అస్మాతో మాట్లాడి రెండేళ్ళు అవుతుంది .   వాళ్ళూ  కాల్ చేయలేదు, నేను చేయలేదు. అలా జరిగిపోయింది ." మాములుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అంది విజయ. 

"బాధేస్తుందమ్మా, అస్మాని  రమ్మని, రజియానేమో  పిల్లని పంపమని మనం  వెళ్ళి ఎంతగా బ్రతిమాలాడాం. ఆపిల్లొచ్చి నీదగ్గర వుంటే నీకీ మరోపెళ్ళి  సంసారలంపటం ఏవీ  ఉండేవికాదు. ఆ పిల్లని పెట్టుకుని చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేదానివి.  పిల్లకి మంచి భవిష్యత్ లభించేది. ఏమిటో ఇదంతా తలచుకుంటే దిగులేస్తుంది" అన్నాను

"మా నాన్నని వద్దంటే నన్ను కూడా వద్దనుకో అని నిక్కచ్చిగా చెప్పిన  పిల్లని ఎలా తీసుకు రాగలం? తీసుకొచ్చినా ఆ పిల్లని బలవంతంగా ఉంచగలమా !  తండ్రి గురించి  ఆ పిల్లకి తెలియని కోణాలని  చెప్పి అర్ధం చేసుకుంటుందని ఆశించగలమా ? ఆచరించే మతం, ఆహారపు అలవాట్లు, నా పట్ల లేని ప్రేమ ఇన్నింటిమధ్య ఆపిల్లని పెంచడంకూడా కష్టమే ! పోనీ..  పొతే పోనీ అని వదిలేసానందుకే" కూతురు పట్ల ప్రేమ ,తన నిస్సహాయత విజయ గొంతులో తెలుస్తుంది నాకు.  

"బాధపడకు, అలా జరగడంలో నీ తప్పేమీ లేదని అందరికి తెలుసు" ఫోన్ లోనే ఓదార్చాలని చూసాను. 

"ఏం  చేస్తాం? భగవంతుడు నారాత, దాని వ్రాత అలా వ్రాసిపెట్టాడు. నేనిక్కడ ఇలా, అదక్కడ అలా ! అదే మనుషులు, అదే పరిసరాలు,  ఆ మురికి కూపంలోనే కూరుకుపోతుంది  "ఎంతో బాధని, ఆవేదనని గొంతులో అణుచుకుంటూ మాములుగా  చెప్పాననుకునేటట్లు చెపుతుంది.  తన మాటలని కొనసాగిస్తూ "అదే రోజు మళ్ళీ రజియా ఫోన్ చేసింది. నేను తీయ కూడదనుకున్నాను. అక్కడే ఉన్నమా  మేనల్లుడు తీసాడు. అస్మా మాట్లాడతానందని తెచ్చి చెవి దగ్గర పెట్టాడు .   " "ఇప్పుడు కూడా రావా అమ్మా! అంది .  ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాను" అంది విజయ. 

 వింటున్న నాకు గుండెలో కలుక్కుమంది.  వేయి మ్రుక్కలై విరిగిపోయిన మనసైనా ఆమాట వినగానే బిడ్డ దగ్గరకి  పరుగులు తీయాలి. మీ నాన్న చనిపోయినా నేనున్నాను కదమ్మా అని హృదయానికి హత్తుకుని ఓదార్చాలి. కానీ విజయ వెళ్ళలేని పరిస్థితులు.  కంటి వెంట చుక్క రాలని అంతర్దుఖాలు ఉంటాయి. బహుశా  విజయ కూడా ఈ క్షణంలో  అలా  దుఃఖపడుతూనే  ఉండి ఉంటుందనిపిస్తుంది నాకు.   

"జీవితంలో మనకి సంబంధించినవి, మనకి సంబంధం లేనివీ ఏవేవో జరిగిపోతూనే ఉంటాయి . ఒక చట్రం  నుండి మరొక చట్రంలోకి  మనం మారిపోతుంటాం కానీ తెంచుకోలేని బంధాలు వెంటాడుతూనే ఉంటాయి అల్లుకుందామనుకున్న బంధాలు  మొగ్గలోనే చిదిమి వేయబడతాయి. వద్దనుకున్నవి కాళ్ళకి పాముల్లా చుట్టుకుంటాయి, జీవితమింతే ! ఇంకా ఏదో చెబుతూనే ఉంది  విజయ. నాకు  వినాలనిపించలేదు.  "కొంచెం ఉండమ్మా ఏదో పని బడింది, మళ్ళీ మాట్లాడుకుందాం "అని ఫోన్ కట్ చేసేసాను .

ఏమిటీ విజయ ఇలా చేస్తుంది?  ఆ పిల్ల అడిగిన తీరు ఎంత బాధగా ఉంది. ఏ రక్త సంబంధంలేనీ నాకే  ఇలాఉంటే విజయ తన మనసుని ఎలా ఉగ్గబట్టుకోగల్గుతుంది, ఈమె అసలు తల్లేనా ? మొన్నటికి మొన్న నాలుగో నెల వచ్చాక అబార్షన్ చేయించుకుని పనిలోపనిగా ట్యూబెక్టమీ కూడా చేయించేసుకుంది. అబార్షన్ వద్దులేమ్మా ! ఈ ఒక్కరిని కని పెంచుకో!  నీ జీవితానికి  ఒక అర్ధం ఉంటుంది. ఆధారం ఉంటుంది అని చెప్పినా  ఈ విజయ  వినలేదు .

"కొడుకులకి పెళ్ళి చేసి తాత అవ్వాల్సిన వయస్సులో పిల్లలేమిటని జనం నవ్వుతారు. ఎంత ఖర్చైనా  పర్వాలేదు అబార్షన్ చేయించుకోమన్నారు వాసు గారు. మా అత్తగారు కూడా ఆయనకి  వంత పాడింది.  ఏదో  పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ నాక్కూడా పిల్లలని కనాలి, పెంచాలనే ఆసక్తి లేదులేమ్మా !   కొన్ని జీవితాలకింతే అని సరిపెట్టుకోవడమే ! " అని వేదాంతం ఒలకబోస్తే ఆమెని ద్వితీయ వివాహం చేసుకున్న వాసు పై నాకు చెప్పలేనంత  కోపం వచ్చింది.

అసలు కొడుకులకి పెళ్ళి  చేసే వయసులో భార్య చనిపోయిన ఏడు నెలలకే  అతను మళ్ళీ పెళ్ళెందుకు  చేసుకున్నట్టో !  విజయ చేస్తున్న ఉద్యోగాన్నిఅంత అవసరం లేదంటూ  మానిపించేశారు.  గర్భం ధరించి కడుపున ఒక కాయ కాస్తుందనుకుంటే పిందెలోనే త్రుంచేసారు.  వాళ్ళిద్దరికీ  పదిహేనేళ్ళకి పైగా  వయసు తేడా ! క్యాన్సర్ తో చనిపోబోతున్న తండ్రి  ఆఖరి కోరిక ప్రకారం  విజయ ఆ పెళ్ళికి తలవంచింది కానీ ఈ రెండో మొగుడి ప్రవర్తన తో ఎంత నరకం అనుభవిస్తుందో ! " మొదటి పెళ్ళి  బావుందా! రెండోది బావుందా? అనే వంకర ప్రశ్నలెదుర్కుంటూ, జీవితంలో గోల్డెన్ డేస్ అంటే గతించిన భార్యతో  గడిపిన ముప్పై ఏళ్ళ జీవితమే అని చెప్పుకుంటూ అడుగడుకుకి మొదటి భార్య జ్ఞాపకాల మధ్య తనతో సరసాలాడే అతన్ని భరిస్తూ, ఇంటికొచ్చే చుట్టపక్కాలని ఆదరిస్తూ అత్తగారి ఆజ్ఞలకి లోబడి ఇంటి పనులు చేస్తూ,  ప్రాణ స్నేహితురాలైన నాతో  కూడా మాట్లాడే తీరిక లేకుండా బ్రతుకుతుంది. ఈ ముదనష్టపు రెండో పెళ్లై  ఏడునెలలు కూడా  పూర్తీ  కాలేదు. విజయ నాన్న బలవంతం లేకుంటే ఆమె ఈ పెళ్ళి  చేసుకునేదే కాదు. ఈ జానీ బాషా ఒక ఏడు  నెలలు ముందు చచ్చి ఉంటే  ఎంత బాగుండేది. అస్మా  తండ్రి ఊసేత్తకుండా తల్లి దగ్గరకి వచ్చేసి ఉండేది కదా " అని మనసులొ తిట్టుకున్నాను.    

ఖచ్చితంగా నాక్కూడా  తెలుసు. తండ్రి  ఆఖరి కోరిక నెరవేర్చే క్రమంలో  విజయకి జరిగిన  రెండో పెళ్ళి ఆమెని   ఓ కాస్ట్లీ పనిమనిషిని చేసింది. ఇంకో తండ్రి మరణంవల్ల ఒకపిల్ల  "అస్మా" అనాధగా మారి ఎవరి దయదాక్షిణ్యాల మీదో పెరుగుతూ  మనసులో తల్లి పట్ల మరింత ఏహ్య భావాన్ని  పెంచుకుంటుంది. తల్లి బిడ్డల మధ్య విధి ఆడిన వింత నాటకమిది.  నా స్నేహితురాలు విజయ తల్లి మనసు "ఇప్పుడు కూడా రావా అమ్మా ? "అనే ప్రశ్నని నిమిషానికొకసారి గుర్తు చేసుకుంటూ, హృదయం తల్లడిల్లిపోతూ కూడా పైకి రాయిలా  బ్రతుకుతుంటుంది.  నాకేమో  విజయని  తలచుకుంటే  కన్నీరు ఉబుకుతుంది. 

(ప్రజాశక్తి ఆదివారం స్నేహ సంచికలో 2016 మే 8 వ తేదీ సంచికలో)



2 కామెంట్‌లు:

Lalitha చెప్పారు...

మీ కథలు చదివిస్తాయండి - బావుంది ఈ కథ - కథ అయితేనే బాగుండును అనిపించేలా వుంది.

Visala Appidi చెప్పారు...

ee story nijamaina abaddamaina bandhala madhya prema nammakam leni avasaram ilanti problemsne testai.yarlagadda vari droupadi book chadiviste khachhitamga bifore life ofter life ane magavadi noru mootha padutundi.