మాధవయ్య గారు రచ్చబండ పై కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండాడు. జేబులో పెట్టుకున్న ఫోన్ మోగింది.
అక్క చేసి ఉంటది అనుకుంటూ పచ్చ బటన్ నొక్కి చెవికాడ పెట్టుకున్నాడు.
"మాధవా , నాస్టా చేసావా,కాఫీ తాగావా ? రాజ్యం పెట్టిందా, హోటలికి పోయి తిన్నవా? అని ప్రశ్నలు.
"ఎట్టోగట్టా తిన్నాలే! నువ్వు అమ్మి దగ్గర ఉండాలని వెళ్ళావుగా .. బాగుందా ఆ పట్టణం ? "
"ఆ ఏం బాగు లేరా ! పొద్దస్తమానూ ఆ టీవి ముందు కూకోటం,లేదా ఫోన్లో టికీ టికీ మని నొక్కుకోవడం. ఇదే సంబడం అయిపాయే. కాకపొతే మన వూరుకన్నా ఈ బెంగులూరే నయమనిపించే, ఏడ చూసినా చెట్లే, అగ్గిపెట్టెల్లాంటి గదుల్లోంచి రేపటేల,పయిటేల పద్దతిగా బయటకొస్తారు, పిల్లలని పార్కులల్లో ఆడిచ్చుకుంటారు. బాగానే ఉండాది గానీ పక్కనాల్లతో మాట్టాడదామంటే ఆళ్ళ భాష నాకు రాకపాయే ! చిన్నమ్మీ పిల్లలు ఇంటికొచ్చేదాకా బిక్కు బిక్కు మంటా ఉండాలి. పక్కింటాళ్ళతో కూడా తాళాలేసుకున్న ఇనుపకమ్మీ వరండా లోనించే మాట్టాడాలి. కాళ్ళు కట్టేసినట్టు ఉందిరా ! బిన్నా వచ్చేస్తా ! అంటుంటే విని నవ్వుకున్నాడు మాధవయ్య .
కూతురు ఫోన్ తీసుకుని కాసేపు మాట్టాడి .. అత్తమ్మని రిజర్వేషన్ దొరకలేదని ఆపుతున్నా నాన్నా! మనిషి ఇక్కడున్నదన్నమాటే కానీ మనసంతా ఇంటి మీదే ఉంది. వచ్చే ఆదివారం తర్వాత పంపుతాలే ! అని చెప్పింది .
అట్టాగేనమ్మా , పిల్లకాయలకి సెలవలు ఇస్తారుగా మీరూ రాకూడదూ , రెండేళ్ళు అయింది వచ్చి. "
సెలవు దొరికితే అల్లాగే వస్తానులే నాన్నా !
ఫోన్ పెట్టేసాక ... అక్క మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు మాధవయ్య.
ఇంటి ముందు మొక్క మాను లేకపోయినా మోటారు బైక్ ఉండాలా , కాడి ఎద్దు లేకున్నా కారు ఉండాలి. కొట్టాం కారు షెడ్ అయిపోయే . మూడు దినాలకోమారు పిల్లకాయల్ని చూసే ఒంకతో టౌన్ కి పోవాల చెడీ బడీ కొనేసి భుజం సంచీ దులిపేసుకుని రావడం. గుట్టుగా మట్టంగా కాపురం చేసుకునే పద్దతే లేదాయే, మొగుడు చూస్తే ఆ వరస, పెళ్ళాం చూస్తే ఈ వరస. పువ్వు నవ్వు, పిట్టల కువ కువ, లే దూడల గెంతులు, పిల్లల అల్లరి అన్నీ పోగొడితిరి. తోటంతా బయలై పోయింది. ఇల్లంతా మూగవోయింది.బతుకు మీద తీపి ఎట్టా కల్గుతుందిరా! నేను ఈడ ఉండలేను పది దినాలు చిన్నమ్మి దగ్గరికి పోయోస్తా .. అని వెళ్ళింది కానీ వెళ్ళాక ఊరొదిలి అక్కడ ఉండలేకపోతుంది.
పూట పూటకి ఫోను . తను ఎట్టాగో సర్దుకుని బతుకుతున్నాడు. అక్క సర్దుకోవడమే కష్టంగా ఉంది. డెబ్బై ఏళ్ళ వయసయ్యే , పుట్టినకాడి నుండి కళ్ళముందు చూసినయ్యి అన్నీ, పెంచినయ్యన్నీ గబుక్కున మాయమై పోతుంటే ఎట్టా తట్టుకుంటుంది. అసలే మెత్తని మనసాయే.. దీర్ఘంగా నిట్టూర్చాడు .
ఇక అదే సమయానికి బెంగుళూరు మహా నగరంలో .. ఓ అపార్ట్మెంట్ లో ... యశోదమ్మ మేనకోడలితో ..
"మోహన్ గాడికి ఈ వాస్తు పిచ్చి పట్టిందేన్టిరా చిన్నమ్మి ! "
"ఏం జేశాడు అత్తమ్మా ! "
చెట్లన్నీ నరికేయించాడు , ఉత్తరం పక్కన అంతెత్తు పశువుల కొట్టం ఉండకూడదని కూల్చేయించాడు. పశువులన్నింటిని సంతకి అమ్మేశాడు. యెర్ర బర్రె పాలు ఎంత చిక్కగా ఉండేయ్. నీకు తెలుసుగా ! ఎన్ని ఈతలు ఈనింది. మచ్చావు ఎన్ని కోడి దూడలు ఇచ్చింది. రెండేళ్ళకో కోడె. ఆటిని అమ్మిన డబ్బులతో కాదు ఈడు ఇజీయవాడ లో ఆరేళ్ళు చదివొచ్చిందీ. ఈడి చదువైపోయే నాటికి కొట్టాం అంతా ఊడ్సుకుపోయింది. చదువుకున్నోడికి చదువుకున్న పిల్ల కావాలని ఒంగోలు పిల్లని చూస్తిరి . ఆ యమ్మికి కసువుజిమ్మటం వచ్చా ముగ్గు పిండి వేయడం వచ్చా ! పాల చెంబు పట్టుకుని కుడిపక్క కూసోవాలో ఎడమపక్క కూసువాలో తెలియదు. ఆమె కాఫీలకి, టీ నీళ్ళకి,కౌసల్యమ్మ పుణ్యమా అని తెల్లారిపాటికి పాలొచ్చి ఇంటిముందు పడబట్టి సరిపోయింది. . "
"అబ్బ ... ఆపవే తల్లీ ! ఏదన్నా కదిలిస్తే చాలు. వెనుకటి నుండి తవ్వుకొచ్చి మరీ చెపుతావ్. నీ చాదస్తం తట్టుకోలేకే మామ తొందరగా పోయాడు." విసుక్కుంది మోహన.
"నన్ను చెప్పనీయవే తల్లీ! నీకాడన్నా చెప్పుకోకుంటే ఎవురితో చెప్పుకోవాలి నలుగురిలో చెప్పుకుంటే పలచబడిపోమూ "
"సరే చెప్పు " అంటూ అత్తమ్మ ఒడిలో పడుకుంది మోహన .
"పిల్లలు తాగడానికి తొలీత పడ్డ నైనా ఉండనీయమని మొత్తుకున్నా .. ఊరుకుందా. అన్నీ పోయే . నేను పట్టు బట్ట బట్టీ ముసలి బర్రె అయినా మిగిలింది. ఆఖరికి దాన్ని కటికోడికి అమ్మేయడానికి చూసాడు.నేనూరుకుంటానా ? ఈడిట్టా కటికాడు అయిపోయాడేంటి?. హెచ్చులకి పోయి డబ్బులవసరపడితే మంచి చెడు గానకుండా మనుషులు ఇట్టాగే తయారవుతారు కాబోలు. చెల్లెలు కూడా కనబడటల్ల ఆడి కళ్ళకి. నువ్వు రాడమే తప్ప ఆడెప్పుడైనా నీ ఇంటికి వచ్చి మంచి సెబ్బర కనుక్కున్నాడా ?"
ఆమాటకి దిగులెక్కువై పోయింది మోహనకి. అత్తమ్మ ఒడిలో నుంచి లేచి నడుం చుట్టూ చేతులేసి మరింత అతుక్కుంది.
"మా అక్కా తమ్ముడి లాగా మీరెందుకు ఉండటల్లేదో అని దిగులైతది చిన్నమ్మీ. మేము పోయాక ఆ వూరికొచ్చే ప్రాప్తముందో లేదో నీకు. మాటి మాటికి ఆ అమ్మికి అంతెందుకు పెట్టాలి,ఇదెందుకు ఈయాలీ అని తగవుకి దిగుతాడు. "బిడ్డలు ఇద్దరూ రెండు కళ్ళే కదా! తేడా ఉండకూడదనేగా ఇద్దరి పేర్లు ఒకేలా ఉండేలా పెట్టింది " అని మీ నాయన."
"పంట డబ్బులు కూడా అడగలేదుగా అత్తమ్మా! అయినా ఆర్నెల్ల కొక్కసారి కూడా ఫోన్ చేసి పలకరించడు. మా ఆయన ఎట్టా పంపుతాడు నన్ను పుట్టింటికి ? "
" మీ ఆయన్ని అడిగి నిన్నునాకూడా తీసుకుపోతాలే.. నాలుగు రోజులుంది వద్దువుగాని . " నేనుండగా నీకేమైనా లోటూ రానిస్తానా ?'' అంది.
మోహన రెండేళ్ళ క్రిందట ఊరేల్లినప్పటి సంగతి తలుచుకుంది. అన్నకి చదువు అబ్బినా సంస్కారమబ్బలేదు, ఉద్యోగానికి వెళ్ళలేదు. అన్ని వ్యాపారాల్లో వేలు పెడతాడు. అన్నింటిలోనూ నష్టమే ! తనకి వ్యాపారంలో నష్టం రావడానికి కారణం ఉండే ఇల్లు సరిగా లేదని వాస్తు మార్పులు చేయించేవాడు . ఈ ఇంట్లోనే కదరా మేమందరం పెరిగింది. అప్పుడు అందరూ బాగానే ఉన్నాము కదరా అంటే అప్పుడు మన వారసులే ఉండేవాళ్ళు . అక్కని అత్త గారింటికి పంపకుండా ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నావ్ కదా ! ఆడపడుచు పైభాగాన ఉంటే మగ పిల్లాడికి కలిసి రాదంట . ఆ శాఖే నాకు చూపుతుంది అన్నాడు .
"అక్క ఒంటి మీద నగలతో సహా ఉన్న ఆస్తి అంతా నీకు, చెల్లికే ఇచ్చింది కదరా నిన్ను చిన్నప్పటినుండి కన్న తల్లికన్నా ఎక్కువ పెంచింది ఈ వయసులో ఇల్లు ఒదిలి ఏడకి బోతుందిరా? కావాలంటే ఈ ఇల్లొదిలేసి నువ్వే పో ! కయ్యల్లో నీ భాగం నీకు రాసిస్తా " అన్నాడు మాధవయ్య .
"ఈ ఇంట్లో భాగం కూడా ఇవ్వు , అప్పుడే పోతానన్నాడు. పాత మండువా ఇల్లు తమకుంచుకుని డాబా ఇల్లు, ఉత్తరం ప్రక్క స్థలం వాడుకోమని ఇచ్చాక ఇద్దరికీ మధ్య ఆరడుగుల ఎత్తు గోడ కట్టేశాడు మోహన్.
మోహనకి అన్న వరస చూసి విరక్తి కల్గింది. ఎక్కువ రోజులు ఉందామనుకుని వచ్చి నాలుగు రోజులకే తిరుగు ప్రయాణమైన సంగతి గుర్తొచ్చి మనసు భారమైంది .
నాలుగు రోజులు సెలవు దొరకగానే యశోదమ్మ, మోహన,పిల్లలూ అందరూ ఊరికి వచ్చేసారు. మోహనకి పల్లెని చూస్తుంటే ..తన ఊరేనా ఇది అని ఆశ్చర్యపోయింది. పంటలు లేవు, బావుల్లో నీళ్ళు లేవు, తాగేదానికి నీళ్ళు కూడా లేవు. పేరుకి పండగ నెలే కానీ ఎండ మండిపోతుంది. ఆటో దిగుతూనే బోసి పోతున్న ఇంటి ముందు లేనిదేమిటో క్షణకాలంలో గ్రహించింది. వేప చెట్టు ఏమైపోయిందత్తమ్మా అంది ఆశ్చర్యంగా.
"ఏడాది పొడుగూతా ఆకులు,కాయలు రాలుతున్నాయి పని వాళ్ళు రానప్పుడు కసువు ఊడ్వ లేకున్నానని కాకుల రొద పడలేకపోతున్నామని చెట్టుని నరికేదాకా ఊరుకోలేదు. అమ్మితే పాతిక వేలు వచ్చాయంట నీ అన్నకి "
చల్లటి నీడనిచ్చే, శుభ్రమైన గాలినిచ్చే అంత పెద్ద మానుని నరికి ఎండకి తట్టుకోలేక పోతున్నామని ఏ. సి కొనుక్కొచ్చిన వెర్రినాయాల్ని యేమనాలమ్మా !" అన్నాడు మాధవయ్య .
"ఇప్పుడాళ్ళకి ఏమీ చెప్పలేం. మీకేమీ తెలియదు మీరూరుకోండి అని తీసి తీసి పడేస్తారు. నోరు మూసుకుని ఇట్టా ఉండాము. ఇంతకీ మించీ ఏం చేయగలం చెప్పు తల్లీ ! మాట్టాడుతూనే ఇంటి పనిలోకి దిగిపోయింది యశోదమ్మ.
ఇంట్లోకి కూడా వెళ్ళకుండానే పిల్లలని తీసుకుని తోటలోకి వచ్చింది . అరెకరం తోట అది. చెట్లన్నీ కూల్చేశారు. అత్తమ్మ చెప్పిన విషయాలు ఇవే కాబోలు. అప్పుడు పట్టించుకోలేదు. ఎలా ఉండే తోట ఎలా అయిపొయింది ? ఎన్నెన్ని జ్ఞాపకాలు ఆ తోటతో.
మణుగుల లెక్కన చింత పండు ఇచ్చే చెట్టుని ఇంటిముందు చింత చెట్టుంటే చింతలు ఎక్కువంట అని కొట్టి పడేసారంట . తన చిన్నప్పుడు పడి మొలిచిన మొక్క అది. కంది పప్పులో చిగురేసికూర వండేది. లేత కుందేలు మాంసంలో చింత చిగురేసి వండమని మామయ్యా పురమాయించేవాడు. ఆ కుందేళ్ళని చంపడానికి నీకు ప్రాణమెట్టా ఒప్పుదయ్యా! మన ప్రాణం లాంటిదే కదా వాటి ప్రాణం కూడా ! నువ్విట్టా కుందేళ్ళు పట్టి చంపి తెస్తే నేను ఊరుకోను అన్జెప్పింది అత్తమ్మ . తనెళ్లి మామయ్యా! బుజ్జి కుందేళ్ళు తెల్లంగా మెత్తంగా ఎంత బాగుండాయి వాటిని చంపుతావా ? పాపం గందా, ఒదిలేయవా అని అడిగిందని వదిలేసి ..ఇక తర్వాతెప్పుడూ ఏ మాంసం తినలేదు! అత్తమ్మ చింత పిందలేసి పిత్త పిరకలు కూర చేసినా, సొరకాయ బజ్జీ చేసినా ఎంత బాగుండేవని. ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్ళూరు తూండేవి. దోర చింతకాయల తొక్కు .... చుట్టాలందరికి సరిపోయే చింతపండు అన్నీ పోయాయి.
నిమ్మ చెట్టు ఏదత్తమ్మా అడిగింది మోహన . ముళ్ళ చెట్టు ఉండకూడదని నిలువునా కొట్టేసి వాడి పైత్యపు చేష్టని పదిమందికి చాటుకున్నాడు. మీ వదినకి కూడా చెప్పా ! అట్టా పూచే పూచే వాటిని కాసే చెట్లని నరకకూడదు. ఉణ్ణీయ రాదా అని. ఆ సంగతి నాకు తెలుసులే అంది ఆ పెడద్దరపు మనిషి. అదసలు ఆడదే కాదు వీసమెత్తు జాలి, దయ లేవు ఏం చేద్దాం అంది యశోదమ్మ. వుసూరుమనిపించింది మోహనకి. పది గజాల్లో విస్తరించి ఉండేది. ఎన్ని కాయలు కాసేది . రెండేళ్ళ నాడు వేసవి కాలంలో వచ్చినప్పుడు రాజ్యం వదిన కాయ రూపాయకి లెక్కన అమ్మి సవర బంగారం కొన్న సంగతి మర్చిపోలేదు.నిమ్మకాయలమ్మటమనేది ఇంటావంటా లేనిపని అని అత్తమ్మ చీదరిచ్చుకుంది కూడా !
ఇంటి గోడలు నెర్రలిచ్చుతున్నాయని రావి చెట్టు, పురుగులు వస్తున్నాయని మునగ చెట్టు , ఈశాన్యం ఎత్తు ఉండకూడదని కొబ్బరి చెట్లు,ఉసిరి చెట్టు అన్నీ మాయం అయిపోయాయి. తోటలో మాధవయ్య గారిల్లు అనే పేరుండే తమ ఇల్లు ఇప్పుడు తోటంతా పోయి ఆరు బయలు మిగిలింది .
" ఏదో అత్తమ్మ ఉండబట్టి గుట్టుచప్పుడు కాకుండా నా తిండి తిప్పలు గడిచి పోతుందమ్మా . లేకపోతే ఆ యమ్మి ఇంత కూరాకేసిన కూడు కూడా పెట్టదు. మొగుడు పెళ్ళాం ఇద్దరూ జల్సాలకి అలవాటుపడ్డారు . ఎక్కెడెక్కడ వాళ్ళు వచ్చి మనవూర్లో కేరళ స్కూల్లో పిల్లకాయల్ని చేరిపిచ్చి పోతుంటే వీళ్ళు నాణ్యమైన చదువులు నెల్లూరు లోనే చదవాలంటూ హాస్టల్ లో జాయిన్ చేరిపిస్తిరి. చేరిన్దగ్గర్నుండి వడ్డీ ఏకాడికైనా అప్పులు తెచ్చి ఫీజులు కట్టటమే సరిపోయే. సేద్యం లో పైసా మిగలకపోయే, ఏం చేస్తాడో మీ అన్న. కయ్యలు బేరానికి పెట్టాడు. అమ్మితే ఒక్క దినం కూడా ఇక్కడ నిలవడు. పట్నంలో కాపరం పెడతాడు"
మౌనంగా విని ఊరుకుంది. తనొచ్చింది చూసి కూడా చూసి చూడనట్టున్న అన్న ఇంటికి తనే వెళ్లి పలకరించి వచ్చింది. వదిన ఒక్కపూటయినా భోజనానికి పిల్చి రవిక గుడ్డ పెట్టనందుకు బాధపడింది. వీలైనప్పుడు అత్తమ్మని, నాన్నని బెంగుళూరుకి పిలిపించుకోవాలి తప్ప ఇంకెప్పుడూ ఊరికి రాకూడదు అనుకుంది. ఊరొచ్చిన ఆనందం ఏమీ లేకుండానే తిరుగు ప్రయాణం అయింది మోహన.
పదిరోజుల తర్వాత ఉదయాన్నే యశోదమ్మ కాలు గాలిన పిల్లిలా ఇంట్లోకి వరండాలోకి తిరుగుతుంది. ఉత్తరపు వైపు గోడకి ఆనుకున్న మామిడి చెట్టుపైకెక్కిన మనుషులు కొమ్మలపై కూర్చుని ముందు భాగాల్ని పదునైన గొడ్డలితో ఒకటి రెండు వేటులతోనే కిందికి కూల్చేస్తున్నారు. ఇంటి అరుగు పై నిలబడి ఎదురెండ కళ్ళల్లో పడి గుచ్చుకోకుండా కళ్ళపై చేయుంచి వీధి మలుపుపై దృష్టి సారించి వీడింకా రాడేంటి ? వచ్చేటప్పటికి చెట్టు మొత్తం నేలపాలు అయిపోయ్యేటట్టు ఉంది . అయినా ఏం పని ఉందని చేనుకి వెళ్ళినట్టో ? అని విసుక్కుంది.
రాత్రి అన్నం తినేటప్పుడు తనతో కొడుకు మాట్లాడిన విషయం చెపుతూ ... "నిరుడు తోలిన చెరుకు డబ్బులు ఈ ఏడు చెరుకు నరకడానికొచ్చినా బిల్లులవలేదు. పెద్దపండగక్కి సెలవులు ఎల్లుండి నుండి అంట. నలబై వేలు దాకా ఫీజులు కట్టాలంట . ఫీజులు కట్టి పిల్లలని తీసుకుపొమ్మని లెటర్ పంపిచ్చారంట. నాయనా, డబ్బులేమైనా ఉండాయా అనడిగాడు. నాలుగైదేలైతే ఉండాయి గానీ అన్నెక్కడ ఉండాయిరా అన్నా ! ఏం జేస్తాడో ఏమో ! " అన్నాడు
తెల్లారేటప్పటికి గొడ్డళ్ళు రంపాలేసుకుని మనుషులు దిగారు. చుట్టూ తిరిగి ఎటువైపుకి చెట్టు పడితే పని తేలికగా ఉంటాదో అని లెక్కలేసుకుంటున్నారు. గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది యశోదమ్మకి. నరకబోతున్న మామిడి చెట్టు తోటలో ఉన్న ఆఖరి చెట్టు. వాడు పుట్టినప్పుడు వేసింది. దాయాదుల వాటాల్లో మామిడి తోట రాకపోయాక మామిడి చెట్టు లేకుండా ఎట్టా అని అప్పటికప్పుడు వేసిన చెట్టది. రోజూ నీళ్ళు పోసి, వారానికొకసారి ఎరువేసి అపురూపంగా పెంచింది. దాని వయసు నలబయ్యి ఏళ్ళు. ఎన్ని కాయలు కాసింది. మామిడికాయ పప్పు , చిన్నముక్కల పచ్చడి , వంకాయ మామిడికాయ కూర , మాగాయ పచ్చడి ,ఆవకాయ పచ్చడి, సంవత్సరానికి సరిపోయే ఒరుగు , విదేశంల్లో ఉన్న చుట్టాలకి పంపే ఆమ్ చూర్, పండిన మామిడిపళ్ళ కమ్మటి వాసన. కుటుంబానికి . ఎన్ని అవసరాలు ఉన్నాయో చెట్టుతో. వీడికి మాత్రం అది తెలియనిదా ? అన్ని పొంగు మాలిన పనులకి పూనుకుంటాడు లోలోపల తిట్టిపోస్తుంది.
కూలీలు మామిడి చెట్టు పైకి ఎక్కి నరకడం మొదలెట్టారు. అడితీ వాళ్ళంట. మంచి తలుపు చెక్కలు తెగుతై అని చెప్పుకోవడం వినబడింది . అవును మరి రెండు చేతులతో ఇటొకళ్ళు అటొకళ్ళు వాటేసుకున్నా ఇంకా మిగిలిపోద్ది. దారినపోయేవాళ్ళు ఆగి చూసేంతగా నిండా పూతపూసి ఉంది. అట్టాంటి చెట్టుని నరకడానికి ఆళ్ళకి మనసెట్టా ఒప్పుతుందో ...
అన్ని పట్టింపులు మానుకుని గబా గబా అవతలి వైపుకి వెళ్ళింది . మోహన ఒరే మోహనా ... ఏడ ఉండావురా ! మామిడి చెట్టుని ఉన్నపళాన అట్టా నరికించడానికి నీకు మనసెట్టా అయిందిరా !? ఆ చెట్టు కొమ్మకి ఉయ్యాలేసి ఊగింది, ఊగూతూనే ముప్పూటలా గోరు ముద్దలు తింది ఎట్టా మరిసిపోయేవు రా ! బయటకి రా .అని గట్టిగా కేకలేసింది . ముందు మీరందరూ చెట్టు దిగండయ్యా ఈ చెట్టు కొట్టేదానికి ఈల్లేదు అంటూ చెట్టు కిందకి వెళ్లి నిలబడింది. కొమ్మలని గొడ్డలితో కొట్టేవాళ్ళు, రంపంతో కోసేవాళ్ళు పని మానేసి ఇదెక్కడి పితలాటకం అన్నట్టు ఆమె ఒంక చూస్తున్నారు
ఏందత్తమ్మా ! రచ్చకి కాసుకూచ్చుండట్టు ఉన్నావ్ ! నీ ఏపుకొచ్చానా, నీ దాంట్లోకి వచ్చానా, నా దొడ్డో చెట్టు,నా ఇష్టం, గమ్ముగా అవతలకి పో, పయిటేలకల్లా మొద్దులన్నీ లారీకి ఎక్కి నెల్లూరికి పోవాలి. నువ్వు పో . .. అంటూ వీధి వైపుకి చెయ్యి చూపిచ్చాడు.
"ఎట్టెట్టా ... నీది కాదు పో అన్నట్టు దులపరిచ్చి మాట్టాడుతున్నావ్ రా ! నాది కాకుండా నీది,నీ బాబుది, ఎట్టైయిందిరా ? ఈ ఇల్లు ఈ తోట అంతా మా తాత మాయమ్మ కిచ్చిన ఆస్థి గంద. మీ తాత ఈ ఇంటికి ఇల్లరికం వచ్చాడని నీకెరుగు. మా యమ్మ ఆస్తి నాకు గాకుండా నీకెట్టా అయ్యిద్దిరా ! రూల్స్ మాట్టాడుతున్నావ్. అంతలావు రూల్స్ మాకు తెలియకుండా పోలేదులే, నువ్వు నీ పెళ్ళాం కలిసి ఎన్ని అన్నా నేను, నా తమ్ముడు మూసుకు కూర్చున్నామని మరీ ఎగిరెగిరి పడతాన్నావ్ ! ఏమైనా ఈ చెట్టు నరికేదానికి లేదు. ఆ చెట్టు నరకాలంటే నన్ను నరికి ముందుకుపో " అంటూ గబుక్కున చెట్టు మొదట్లో నేల మీద కూర్చుంది.
"నా పనికి అడ్డం రాబాకు ..తర్వాత నెట్టేసానని గుంజుకోకుండా నువ్వు పో ఈడనుంచి" యశోదమ్మ చేయి పట్టుకుని చెట్టు కిందనుండి ఈవలకి లాగబోతూ ఉంటే ఆమె వెనక్కి గుంజుకుంటూ కనబడింది రోడ్డు మీద పోయే మాధవయ్యకి. బిర బిర నడుచుకుంటూ మామిడి చెట్టుకాడికి వచ్చాడు . నరికి కిందేసిన కొమ్మలని, చెట్టుపై కూర్చున్న కూలీలని, ఏడుస్తున్న అక్కని చూసి విషయం అర్ధమైంది. కొడుక్కేసి చూసాడు. చెట్టుని నరక్కుండా అడ్డమొచ్చిన మేనత్తని నమిలి మింగేసేటట్టు చూస్తున్నాడు.
మాధవా ! ఈడు చెట్టుని నరికిచ్చేస్తున్నాడు రా ! వద్దని చెప్పు " దుఃఖం లో తడిసి పోయింది.
"మోహనా .. ఆళ్ళని పంపిచ్చేయి ముందు" గట్టిగా కోప్పడ్డాననుకున్నాడు ఆయన.
ఏం నాయానా ! ఎందుకు పంపాలా ? నా చెట్టు గంద, నా ఇష్టం . అన్నాడు.
" ఈ ఆస్తి నీది, నాది ఎట్టవుతుదిరా! మా అమ్మ అచ్చంగా అక్కకే రాసేసిపోయింది. మా అమ్మ దాయాదులందరూ ఆడపిల్లకి మాతో పాటు సమానంగా ఆస్థి ఎందుకెల్లాలని కయ్యలని కాజేయాలని చూత్తే కొంగు బిగించి కోర్టుల చుట్టూ తిరిగి పోరాడి తల్లి ఆస్థిని గెలుచుకుంది నా అక్క . అప్పుడికి నేను పసోడినే ! మా అమ్మ చచ్చిపోతే నన్ను పెంచింది. మీ అమ్మ రోగిష్టి దైతే సంసారాన్ని తన భుజం మీద మోసింది. అత్తమ్మ ని బాధ పెట్టడం బాగోదు,వాళ్ళని పంపేయ్ " అన్నాడు మళ్ళీ .
"బిడ్డలకి ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలి.అందుకే చెట్టుని అమ్మేసా, మనుషులే శాశ్వతం కాదు ఇక్కడ. చెట్టేమన్నా శాశ్వతమా ? అయినా ఈ గొడ్డుమోతు మనిషికి మనుషులమీద లేని ప్రేమ చెట్టూ చేమ మీద ఎందుకంటా ! "
మాధవయ్యకి కోపంతో ఊగిపోయాడు. ఎంత మాట అంటావురా నా అక్కని అంటూ కొడుకుని చెంపకి మళ్ళిచ్చి లాగిపెట్టి కొట్టాడు . తండ్రిలో అంత కోపం ఎప్పుడూ చూడని మోహన్ చెంప పట్టుకుని అట్టాగే నిలబడి పోయాడు. కూలీలు సామాను సర్దుకుని అక్కడి నుండి జారుకున్నారు.
"అక్క గొడ్డుమోతుదే కావచ్చు. ఈ దొడ్దో పెట్టిన మొక్కలన్నింటిని, పశువులని,మిమ్మల్నీ తల్లిలా సాకింది. నువ్వొక్కక్క చెట్టుని మూలకంటా నరికేసినప్పుడల్లా విల విల లాడి పోయింది. అయిందానికీ కానిదానికి నోరేసుకుని అరిసె అత్తమ్మే తెలుసురా నీకు, పైకట్టా అరుస్తుంది కాని మీ అత్తమ్మ మనసు వెన్నని నీకు తెలియదా ?. కళ్ళముందే ఆస్తులన్నీ కరుగుతున్నా కిమ్మనకుండా ఊరుకుంది. ఇప్పుడీ మామిడి చెట్టుని కూడా నరికిచ్చి అక్కని నిలువెల్లా కూలదోయకురా . తండ్రిగా ఇదొక్కటే నేనిన్నడుగుతున్నా! చేతులు జోడించాడు కొడుక్కి .
మాధవా ! ఊరుకోరా ఆడు చిన్నోడు. నువ్వు మొక్కితే ఆయుష్షు తగ్గిపోద్ది నేలమీద నుండి లేవబోయి మళ్ళీ కూలబడింది.
అక్కా ! నెమ్మళమ్ గా లేయ్, అంటూ దగ్గరికెళ్ళి చేయి ఆసరా ఇచ్చాడు మాధవయ్య.
అక్కడినుండి కదిలి తమ భాగం వైపు వస్తూ "మోహనా మళ్ళీ మామిడి చెట్టు జోలికొస్తే మాత్రం ఊరుకోను. ఇష్టముంటే ఈడ ఉండండి లేకుంటే పోండి. తమ్ముడూ, నేను బతికుండగానే కయ్యలు చెట్టు చేమా అన్ని నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోము బెదిరించింది యశోదమ్మ.
బెణికిన కాలుకి జండూబామ్ రాసుకుని మళ్ళీ కాసేపటికే మేనల్లుడి డాబా ముందుకి వచ్చి "ఇగో రాజ్యం ఇటు రామ్మే ! " అని పిలిచింది. రాజ్యం అడుగుక్కూడా ముందుకు నడవలేదు. "బెదురు గోడ్డల్లే అట్టా చూస్తా ఉండావ్. నిన్నేమీ కొండసిలువ మాదిరి మింగబోటంలే," అంటూ తనే వెళ్లి రాజ్యం చేయి పట్టుకునిలాగి అరచేతిలో వస్తువులున్చింది. "మా అమ్మ చేయించిన మూడు వరుసల బుట్టకమ్మలియ్యి. నీ కూతురికి ఇద్దామనే దాపెట్టి ఉంచా , రెండు సవర్లు పైనే ఉంటయి, ఇయ్యమ్మి పిల్లకాయలకి ఫీజులు కట్టమను." అన్జెప్పి తన ఇంటికి వచ్చి పడింది.
అంతా చూస్తూనే ఉన్న మాధవయ్య నిన్ను అర్ధం చేసుకోలేక పోవడం మోహన్ గాడి దురదృష్టం అక్కా " అన్నాడు. నిజం చెప్పరా తమ్ముడూ! ఆడు చెట్లన్నిటినీ నరికేసినప్పుడల్లా నీక్కూడా కాళ్ళు చేతులూ అన్నీ కోసి పారేస్తున్న బాధకలగలేదు ? అంది.
అక్క మనసేమిటో తెలిసిన మాధవయ్య "అవునక్కా " అన్నాడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కన్నీళ్ళని తుడుచుకుంటూ.
వంట ఇంటోకి పోయి కాఫీకి నీల్లేసి అరుగు మీద కూర్చుంది. పాల చెంబు తెచ్చిచ్చిన తమ్ముడితో "మాధవా!
నిదర లేచింకాడి నుండి అమెరికా ఇట్టా అమెరికా ఇట్టా అని ఒకటే కలవరిత్తారు గందా ! ఆ దేశంలో చెట్టుని నరకాలన్నా అనుమతి ఇయ్యాలంటగా. అనుమతి లేకుండా చెట్టుని నరికితే జరిమానా వేస్తారంట కదా ! అట్టాంటి రూలు మనదేశంలో ఎందుకు పెట్టలేదంటావ్ ? " అని అడిగింది.
ఈడా అన్నీ ఉండాయి లేక్కా! పాటించేది ఎవరని ?
ఉండు రేపు పేపరోడికి చెట్టుని నరికితే శిచ్చేమి పడుద్దో చెప్పమని ఉత్తరం ముక్క రాస్తా. తోటలో చెట్లన్నీ నరికేసేటప్పుడు ఇయ్యాలడ్డం పడినట్టు అడ్డం బడితే చెట్లన్నీ నేలకూలేయ్ కాదుగా. ఇట్టా అడ్డంబడకపోవటం కూడా మన తప్పే ! ఈ అపరాధానికి శిచ్చ పడాలి మనకి. ఎనకటి మాదిరిగా తోటంతా మొక్కలేద్దాం. వాటిని చూసుకుంటా బండి నడిచినన్నాళ్ళూ నడిపిద్దాం . మనుషులు పోతా ఉంటే పుడతా ఉన్నట్టు చెట్లని కూడా పెంచుతా ఉండాలి. ఈ తోటలో మామిడి చెట్టు ఆఖరి చెట్టు అవకూడదు ధృఢంగా అంది యశోదమ్మ.
మాధవయ్య గారి కళ్ళ ముందు ఎడారి బయలుగా మారిన నేలంతా మొక్కలతో పచ్చగా కళ కళ లాడుతూన్నట్లు ఓ సుందర దృశ్యం పారాడింది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి