కొందరు
రచయితలూ కవులు రచనలలోనే కాదు జీవితం జీవించి చూపడంలో కూడా ప్రేమైక స్వభావమే.
ఆ ప్రేమ కోసం లోకం గీసిన సరిహద్దురేఖలను చెరిపేసి తమకు కావాల్సిన విధంగా జీవించి
చూపుతారు. వద్దనుకుంటే తేలికగా జీవితాన్ని ముగించుకుంటారు.
అది వారి ముద్ర . ఆమె కవితలో
చిన్న భాగం ఇక్కడ ..
పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే!
"ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో
వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి
గుండె మెలిపెట్టినట్లు వుండటం" అని ఆమెకి అనుభవమై వొడలెల్లా కన్నీటి సంద్రమే.
ఆ సంద్రంలో ఆ క్షణంలోనే ఆమె మునిగిపోవచ్చు.
- నేను వ్రాసిన కథ "రాతి హృదయం " నుండి ఈ వాక్యం.
ఈ బ్లాగ్ లో పదే పదే చదవడం చూసాను.ఎవరో
ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారనుకున్నాను. కానీ అనుమానం
రాలేదు. జరగాల్సింది జరిగిపోయాక యిప్పుడనిపిస్తుంది..
అయ్యో ..అని. ఆమె తన ధాత్రి బ్లాగ్ నుండి ఆ కథను పదే పదే చదివారని తెలిసింది.
సాహితీ
లోకం గురించిన తెలిసిన వారందరికీ విశాఖ జగతి గారు తెలిసే వుంటారు.
జగమెరిగిన జగతి జగద్దాత్రి అనుకోవచ్చు. అందరిని
ప్రేమగా పలకరించే ఆమెను మర్చిపోవడం కష్టం. సహచరుడు
రామతీర్ధ గారు మరణించాక కల్గిన వొంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను.
ఆమెతో ఫేస్బుక్ లో కాకుండా వ్యక్తిగతంగా మూడు నాలుగుసార్లు
వ్యక్తిగత సంభాషణ జరిగింది. నేనెవరో
ఆమెకు పరిచయం లేకపోయినా నా కవిత "నా ఏకాంతంలో
నేను" అనే poem translate చేసారు. "మర్మమేమి"
కథ తీసుకున్నారు. Translate చేయడానికని.
ఈ మధ్య “రేపటి టీచర్లు” అనే కథ రాసారు
share చేసి Tag చేయబోతే Facebook deactivate చేసి
వుంది. Call చేస్తే తీయలేదు. కొద్దిరోజులకు facebook కి మళ్ళీ వచ్చారు. నేను
మంజు యనమదల కలిసి ఆమె దగ్గరకు వెళదామనుకున్నాము. ఇంతలో
యిలా.. ఒంటరితనం
అంత భయంకరం యింకోటి లేదు. 😞😢
జగద్దాత్రి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక సంగతులు బయటకు వచ్చాయి.
అవన్నీ నాకు తెలియక ముందు యెలాంటి ఫీలింగ్ వుందో తెలిసిన తర్వాత అదే ఫీల్ నాకు.
నేను జడ్జ్ చేయను. కానీ moral policing చేస్తూ యెన్నెన్నో వ్యాఖ్యానాలు.
అసహ్యమేసింది మనిషి చనిపోయాక కూడా వ్యాఖ్యానించడం చూసి. ఒంటరితనం భరించలేక చనిపోయారు అని అంటే అదే బాధ. ప్చ్.
ఒంటరితనం వేయి కొండచిలువులు కలసి చుట్టేసిన ఊపిరాడనితనం.
అందరూ జీవించడానికి రకరకాల కారణాలు వెదుక్కుంటారు ఆమె జీవించడానికి కారణమే లేదు
అనుకుని ఉండవచ్చు. కవులు రచయితలు సున్నిత మనస్కులు అని నిరూపించారు 😥
ఈ కల్లోల ప్రపంచంలో రకరకాల బాధలు.
మనవి కాకపోయినా యేదో బాధ. నాలుగైదు రోజులుగా నాలో అలాంటి బాధే! మనసు
కృంగకుండా ప్రశాంతంగా వుండటాన్ని సాధన చేస్తున్నా.. ఆమె గురించి
సానుభూతిగా వ్రాసిన మాటలు చూసి మెసెంజర్ ద్వారా కొన్ని వివరాలు అందించారు ఇద్దరు వ్యక్తులు.
ఆ వివరాలు చూసిన తర్వాత కూడా ఆమెపై నా అభిప్రాయమేమీ మారలేదుకూడా! తర్వాత నా ఆలోచనలు నాణేనికి రెండో
వైపు అనుకుంటూ ..ఇలా వ్రాసుకున్నాను.
ఉబుసుపోక కాదు యీ మాటలు రాస్తున్నది.
నా ఆలోచనలను వ్రాస్తున్నా! జరిగిన తప్పిదంలో పురుషుడిని వదిలేసి స్త్రీని మాత్రమే జడ్జ్
చేయడం నాకు నచ్చలేదు.
ఒకప్పుడు నా మధ్య నా భర్త మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేసుకుంటున్నాను.
"ఒక పురుషుడు హటాత్తుగా చనిపోతే ప్రియురాలు కూడా వెంటనే చచ్చిపోతుంది
అతనంటే అంత ప్రేమ. భార్య కావాలంటే పొర్లుగింతలు పెడుతూ గుండెలు బాదుకుంటూ యేడుస్తుంది
కానీ .. అని నా భర్త.
వెంటనే.. "భార్యకు అనేక భాధ్యతలుంటాయి వాటిని వదిలేసి భర్త తో పాటే
మరణించడానికి ఆ ప్రేమ అనేది అతను ఆమెకు ఏనాడైనా యిస్తే కదా..
ఆ భాధ్యతలేమిటో అతనికి తెలిస్తే కదా " అన్నాను
నేను.
ప్రేమ తెలియకపోయినా పర్లేదు బాధ్యత మాత్రం అందరికి తెలిసి
ఉండాలి.
ఆ బాధ్యత లేకుండా వ్యక్తిగత ఆనందం కోసం ప్రాకులాడిన వారికి
అయిన వాళ్ళెవరూ మిగలరూ..సమాజమూ వారిని అర్ధం చేసుకోదు. రాళ్ళుచ్చుకుని
వెంటబడి మరీ కొడుతుంది.
మనుషుల వ్యక్తిగత వివరాలు తెలియకుండా నాకు తెలిసిన వారు యిలా
మరణించినవారు రెండు జంటలున్నాయి. ప్రియురాలు చనిపోయాక కొన్నాళ్ళకు ఆ పురుషుడు చనిపోవడం వొకటి
అయితే రెండవది పురుషుడు చనిపోయాక అతని ప్రియురాలు విరక్తితో వొంటరితనంతో ఆత్మహత్య చేసుకోవడం.
కారణాలు ఏవైనా .. ఇలాంటి
సహజీవనాలలో స్త్రీ ని వొక్కరినే తప్పు పట్టడం భావ్యం కాదు. రెండు
చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరెవరో అవాకులు చెవాకులు పేలిన మాటలు వింటున్నా బాధేస్తుంది.
అప్పుడిలా అనుకుంటాను.
స్త్రీలకూ వొక విజ్ఞప్తి మీ చదువులు ఆర్ధిక స్వావలంబనలూ దైర్యాన్ని
ఒక్కటే కాదు విజ్ఞతను కూడా యివ్వాలి. ముఖ్యంగా మీరు
తల్లిదంద్రులైతే మీరు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తెరగాలి తప్ప సమాజానికి సవాల్ విసిరి
బ్రతుకుతున్నాం అని గొప్పగా బోర విరుచుకుని నడిచి కడకు అనామకులుగా కడతేరిపోకూడదు.
మరో రాజేశ్వరి కాకూడదు అని అనుకోవాలి అని.
ఈ విషయం
అర్ధమైనా సరే అనుచితంగా కామెంట్స్ చేయకండి ప్లీజ్.. సానుభూతి
చూపుతూ కూడా మనం ఆలోచించవచ్చు. పాఠాలు నేర్చుకోవచ్చు అని సున్నితంగా
హెచ్చరించాను. అయినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే వున్నారు.
సరే ఒకరి అభిప్రాయాన్ని మనం మార్చలేం. ఎవరి
అభిప్రాయం వారిది. గతంలో
ఇలాంటి అనుభవంతోనే "జాబిలి హృదయం " కథ వ్రాసాను.
ఆసక్తి ఉంటే యీ లింక్ లో చదువుకోవచ్చు.
జగతి జగద్ధాత్రి గురించి నా స్పందనను చూసిన మరికొందరు మెసెంజర్
లలో ఫోన్ కాల్స్ లో విపరీతంగా చెప్పుకున్నారు. ఆ విషయం
నాకు తెలిసి నవ్వుకున్నాను. మనుషులకు ఎంతసేపు సమాజాన్ని వేలెత్తి చూపించే పని మాత్రం
24*7 కావాలి. సమాజానికి కళ్ళెం వేసి నడిపించడం మావల్ల కావాలి అన్నట్టు
వుంటాయి వారి మాటలు. సంస్కృతీ సంప్రదాయం వివాహ వ్యవస్థ అనైతికం అంటూ మూకుమ్మడిగా
గళాలు విప్పడం మొదలెడతారు.
నేను శుద్ద సంప్రదాయవాదినే. కానీ
ఇతరుల జీవితాలను నిర్దేశించాలనో కట్టడిచేయాలనో అనుకోను. వేష భాషలందు
ఆధునికంగా వుంటాను. మూఢాచారాలను నిరసిస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడుతూ...
స్త్రీ పక్షపాతిగా వుంటూనే పురుషులను సమానంగా గౌరవిస్తాను.
ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ వుంటుంది.
ఆ స్వేచ్ఛతో వారు బ్రతకడం వల్ల ఇతరులకు యేమి హాని జరగదు.
జరగనంత వరకూ ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వాలి తప్ప ముల్లు కర్రతో వెనుక పొడవడం
సమంజసంకాదు. జగద్దాత్రి ఆమె వ్యక్తిగత ఆకాంక్షలకు వ్యక్తిస్వేఛ్చకు ప్రతీకగా నిలిచారు. ఆమె నిర్ణయాలకు ఆమె జవాబుదారీ. యిష్టమైనట్టు జీవించడం మరణించడం ఆమె హక్కు.
మీ అభిప్రాయం మీకున్నట్లే ఎదుటివారికి వారి అభిప్రాయాలుంటాయి.
మీ అభిప్రాయమే సరైనది అనుకుంటూ యితరులను బాధ పెట్టకూడదు.
సమాజం మొత్తాన్ని right track పై నడిపించాలనుకునే మితిమీరిన ఆశ
నాకు లేదు ఇతరులకు వుండకూడదని భావిస్తాను.
మాటల ద్వారా పరోక్ష వ్యాఖ్యానాల ద్వారా ఒక మనిషిని బాధకు
గురిచేసేంత కుసంస్కారం వుండకూడదు. అది మరీ పాపం.
పాండిత్యం వున్న వాళ్ళు పండితులు జ్ఞానం వున్న వాళ్ళు గురువులు
కావచ్చు. కానీ హృదయ సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కాగలరు.
ఓం శాంతి శాంతి శాంతి.
జగద్ధాత్రి గురించి నా స్పందనతో పాటు ఆమె మరణం తర్వాత విన్న వ్యాఖ్యానాలను ఇక్కడ
ఉదహరించాను. ఇది నివాళి కాదు. ఆమె పై
నా అభిమానం యిలా వుంది, లోకం తీరు యిలా వుంది అని చెప్పడమే నా వుద్దేశ్యం.
రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా గర్హించాలి అని నా అభిప్రాయం.
రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా గర్హించాలి అని నా అభిప్రాయం.
ప్రేమమూర్తి జగతి జగద్దాత్రి గురించి ఆమెకు ఎంతో సన్నిహితురాలైన "సాయిపద్మ" వ్రాసిన నివాళి క్రింద క్లిప్పింగ్ లో చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి