మాటల దారం - వనజ తాతినేని
ఇంట్లో మనుషులు మనుషులతో కాకుండా గ్రూఫ్ ల్లోనూ గోడలపైన మాట్లాడుకునే రోజులివి. మనుషులు మనసులతో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనసుమాట ప్రక్కనపెట్టి మనషుల కోసమే మరీ కరువాసి పోతున్నానేను . చేతిలో వున్న పుస్తకం చూస్తే రమ చప్పున గుర్తుకొచ్చింది. ఏలూరు రోడ్ లో వున్న సాహిత్య నికేతన్ కి వెళ్ళి స్వంత డబ్బుతో పుస్తకాలు కొనుక్కెళ్ళి అందరికి అభిమానంగా పంచి చదవమని ప్రోత్సహిస్తుంది. అలాగే మా అబ్బాయికివ్వమని యిచ్చిన పుస్తకం యిది. నేను నా కొడుకు దగ్గరకు ప్రయాణమవుతున్నప్పుడు వచ్చి రెండు మూడు రోజులుండి వస్తువులు సర్దటంలో సాయం చేసి నేను బయలుదేరాకే తను యింటికి బయలుదేరింది.
ప్రతి మనిషి నుండి యేదో వొకటి నేర్చుకోవడం నాకలవాటు.నాకొక కొత్తచూపునిచ్చిన మిత్రురాలు రమ.మమ్మల్ని కలపడానికి చిన్నపాటి అభిరుచి కారణమై వుండొచ్చుకానీ వూడల్లా దిగిపోయిన స్నేహానికి కారణం మరొకటి వుంది. అది మా ఆలోచనా విధానం అని తర్వాత అర్ధమవుతూ వచ్చింది నాకు. అప్పటికప్పుడు తనతో మాట్లాడాలనిపించింది.సమయం చూస్తే అక్కడ అర్ధరాత్రి దాటి వొక గంటే అయింది. మరో రెండు గంటలు వేచి చూడటం దుర్భరంగా అనిపించినా రమతో స్నేహం గుర్తుకుతెచ్చుకుంటే హాయిగా వుంది ఆ క్షణంలో.
కాళ్ళు కడుక్కుని లోపలి వస్తూ గాయం యెలా వుంది జ్వరం తగ్గిందా అంటూ వొంటిపై చెయ్యేసి చూసి కాలు పట్టుకుని చూసి ఇంత లోతు గాయాలైతే జ్వరం రాక యేమొస్తుంది అంది. కళ్ళల్లో నీరు ఉబికింది. ఆ మాత్రం అయినవాళ్ళు నలుగురు అరకిలోమీటరు దూరంలో వున్నా కూడా ఆత్మీయంగా పలకరింపుకి నోచుకోని కడుపేదరాలిని.
ప్రొద్దున్నే తను ఫోన్ చేసినప్పుడు మా మాటల్లో బంధువుల యింటికి వెళితే అక్కడ కుక్క కరిచిందని, వస్తూ వస్తూనే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చానని తెల్లవారేటప్పటికి వొళ్ళు నొప్పులతో బాటు జ్వరం బాగా వచ్చిందని అన్నాను. ఎవరున్నారు యింట్లో అనడిగింది. అత్తగారు అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాను. చెప్పిన మూడుగంటలకి రమ నా ముందు ప్రత్యక్షమైంది. వాళ్ళ వూరుకి మా పట్టణానికి మూడు గంటల ప్రయాణ సమయమన్నది నేనెలా మరువగలనూ! "మనసెలా వొప్పిందీ యిలా వున్న మనిషిని వొదిలేసి యెలా వెళ్ళింది" అనంటూ బాధపడింది. అయిదు రోజులుంది. సేవలు యేమి చేసిందనేది లెక్క కాదు. అదొక తోడు అంతే.
“ఇవాళ రైల్వే స్టేషన్ లో కొంతమందిని చూస్తే అసహ్యం వేసింది “ అంది రమ.
ఎందుకు అన్నట్లు చూసాను.
“ముద్ద ముప్పావల, కాదు కాదు ముప్పై రూపాయలుగా తినేవాళ్ళు తిని జీర్ణించుకునేవాళ్ళు తమ ముందు దీనంగా చెయ్యిచాచిన వాళ్ళని తుస్కారంగా చూసినా పర్వాలేదు కానీ తూటాల్లాంటి మాటలతో యెగతాళి చేయడం బాధ కల్గిస్తుంది “ అంది.
“కష్టపడి సంపాదించి దారినపోయే పిల్లులకు రోజూ రెండు పాల పేకెట్లు పాలు పొసే నీ మనసంత మనసు వుండొద్దూ.. అందరికీ” అన్నాను.
“ఏమిటో కొందరిలా అంత కఠినంగా నేనుండలేను, మొదట్లో అమ్మ కూడా గొడవ చేస్తుండేద. రాక్షసిలా అరిచేదాన్ని. ఇప్పుడు వాళ్ళకీ ఆ దయా గుణం అబ్బి రెండు రూపాయల రేషన్ బియ్యాన్ని కట్టెలపొయ్యి ముట్టించి వూది వూది దగ్గు వస్తున్నా సరే లెక్కచేయకుండా అన్నం వొండి వీధి కుక్కలకి పెడుతున్నారు, పక్షులకి వేస్తున్నారు” అని చెప్పింది..
రమ ను చూస్తే నాకెంతో అబ్బురం. మనిషి మాటల్లో కాదు చేతల్లో కనబడుతుంది. ప్రేమ విఫలమై బ్రతుకు బండయినా కానీ స్వచ్ఛంగా స్పందించే మనసు తనది. భావపురి వాళ్ళది. ఊరి చివర ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో చివరింట్లో చుట్టూ ఎలుకలు తవ్వేస్తున్న ప్రహరీగోడల మధ్యలో యజమాని ప్రక్క పోర్షన్లో వుంటూ జీవితాన్ని జీవించడమెలాగో తెలిసిన మనిషి. ఏళ్ళ తరబడి బలవంతంగా భర్త యిచ్చిన విడాకుల బరువును మోస్తున్న రెండో అక్క, అక్కుపక్షి లాంటి అమ్మతో కలిసి జీవిస్తుంది. ముందు గదిలో రెండు కుట్టు మిషన్లు పెట్టుకుని బట్టలు కుడుతున్నట్లే మనుషులనూ మాటల దారంతో కుట్టుకుంటూ వెళుతుంది. అవసరమైనచోట నిర్మొహమాటంగానూ సమాజంతో స్నేహంగా మిత్రులతో ఆప్యాయంగా, తోటి ప్రాణులపట్ల కరుణగా అమ్మంటే ప్రాణంగా ఇతరులకు సాయంగా ఉండే అబ్బురమైన మనిషి. తీరిక చేసుకుని అప్పుడప్పుడూ ఏదో స్వచ్చంద సంస్థ లో కార్యకర్త గా పని చేస్తూ వుంటారు అక్క చెల్లెళ్ళు. మనుషుల మధ్య కులాల మతాల గోడల్ని బద్దలుకొట్టి మరీ యింటికి ఆహ్వానించి యిన్ని టీ నీళ్ళిచ్చి వేళకి వెళితే ఆదరంగా పచ్చడి మెతుకులైనా ఆప్యాయంగా పెట్టే మనుషులు.
ఏళ్ళ తరబడి మోస్తున్న కుటుంబ భారానికంటే యెక్కువ మానసిక వేదనని కల్గించిన అమెరికా బావని పచ్చని పెళ్లిపందిరిలో బంధుమిత్రుల సమక్షంలో కాలర్ పట్టుకుని గిర గిరా త్రిప్పుతూ ప్లాస్టిక్ కుర్చీ యెత్తి కొడుతూ ఉగ్ర స్వరూపం ప్రదర్శిస్తే ఆశ్చర్యపోవడం నా వంతే కాదు ప్రైమ్ టైమ్ వార్తలలో తెర ముందు కూర్చున్న ప్రేక్షకులది కూడా.
“వాడి డబ్బు మదం, అంగబలం చూసి భయమేయలేదా “ అనంటే.. " సైనికుడిని ప్రేమించిన మనసు నాది ఆ మాత్రం ధైర్యంగా వుండొద్దూ" అంటుంది. అంతలోనే దిగులు పడుతుంది. కులం వేరని మా బండది నా ప్రేమని పెళ్లిని చెడగొట్టింది అని రెండో అక్కని తిడుతుంది .
తనకన్నా రెండు నిమిషాలు చిన్నవాడైన తమ్ముడు అయినవాళ్ళ చెప్పుడు మాటలు విని అనారోగ్యంతో వున్న తండ్రికి వైద్యం చేయించలేక యిల్లు వదిలేసి వెళ్ళినా ఆడదాన్నని బెదిరిపోకుండా కుటుంబానికి యజమానిగా నిలబడిన తన దైర్యం చూస్తే ముచ్చటేస్తుంది. ఆ తమ్ముడే ఆస్తులు సంపాదించుకుని పెళ్ళిచేసుకుని పిల్లలను కని వాళ్ళకు యే లోటూ లేకుండా చూసుకుంటూ తల్లి అనారోగ్యం పాలైతే రిక్త హస్తాలతో వచ్చి నిలబడి బంధువుల దగ్గర నాకు వాళ్ళేమిచ్చారు నేను వాళ్ళకివ్వడానికి అని అంటుంటే విని వెళ్ళేటప్పుడు చార్జీలకని జేబులో డబ్బులు పెట్టిపంపిన రమ చూపు యెంత తీక్షణమైందో! అప్పుడు ఆమె చూసిన చూపు ఆ తమ్మునికి సిగ్గుచేటు అనిపించడం తేలికగానూ జీర్ణించుకోవడం కష్టంగాను వుండాలి కదా అనుకున్నాను.
“మనుషులను చూసే దృష్టి. మారాలి. కార్లు వున్నవాళ్ళకు తలనొప్పి అన్నా పరామర్శించడానికే పరిగెత్తే జనం అదే రక్తస్పర్శ కల్గిన నా అన్న వాళ్ళు యెవరూ లేని కడు పేదరాలను పట్టించుకున్న పాపానపోరు. ధనం వెంట పరుగులు. ఎవరెక్కడ స్పందించాలో యెంత స్పందించాలో యెంత మృదువుగా మాట్లాడాలో ఆకట్టుకునేలా సమాధానమెలా చెప్పాలో అన్నీ తరగతులకు హాజరై మరీ నేర్చుకుంటున్నారు. మనుషులను సహజంగా సాధారణంగా స్వభావసిద్దంగా బతికే స్వేచ్ఛను దూరం చేసుకుంటున్నారు “ అంటుంది కోపంగా. నిజం కాదని నేనలా అనగలనూ!
ఆర్దికంగా యెంత యిబ్బంది వున్నా డబ్బు వున్నప్పుడు పెళ్ళి రాదుకదా అని అప్పు తీసుకుని బాబాయి కూతురు పెళ్ళికి వెళ్ళాను. బాబాయి పిన్ని సంతోషంగా పలకరించి బాగానే మర్యాదలు చేసారు. పెళ్ళికూతురే యెవరో తెలియదన్నట్టుగా చూసింది తప్ప అక్కా బాగున్నావా! అని పలకరించకపోయింది. సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేసి లక్ష రూపాయలు సంపాదిస్తే గొప్ప కాదు. ఆ పిల్ల ప్రవర్తన గుర్తొస్తే ములుకులా గుచ్చుకుంటూనే వుంటుంది అని చెప్పింది ఒకసారి.
మాటేగా వారధి. అదికూడ తెలియని వాళ్ళతో సంబంధాలు యేమి వుంటాయి. మానవ సంబంధాలు యెవరికి కావాలి. ఆర్ధిక సంబంధాలో రాజకీయ సంబంధాలో తప్ప.. మా పెద్దక్క భర్త పెద్దగా చదువుకోలేదు ఆర్జితమే తప్ప యే కోశానా అభిమానం చూపడం తెలియని మనిషి. బేంక్ లావాదేవీలు యేవీ తెలియదు కాబట్టి హడావిడిగా వూరు నుండి ఫోన్ చేస్తాడు బేంక్ దగ్గరికి రా రమ్మని. ఆ లోన్లు పని అదీ పూర్తయ్యేటప్పటికి నాలుగుగంటలు పట్టినా బేంక్ యెదురుగా టీ కొట్టు కనబడుతున్నా టీ తాగుదాం రామ్మా అని పిలవడు ఒక్కడే వెళ్ళి తాగి వస్తాడు. అలాంటి ఆయనకు కూడా సమయానికి చేసిపెట్టిన టిఫిన్ వుంటే డబ్బాలో పెట్టుకుని వెళుతుంది రెండో అక్క . తనే టీ కొట్టు కెళ్ళి ఆయనకూ టీ పట్టుకెళ్ళి యిస్తుంది. ఎప్పుడూ జేబును గట్టిగా పట్టుకుంటాడు.డబ్బంటే అంత తీపి ఆయనకు. ముందస్తు సూచనలు కనబడ్డా డబ్బు ఖర్చు అవుతాయని వెనుకాడితే కేన్సర్ ముదిరిపొయ్యాక ప్రాణం మీద తీపితో లక్షలు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకపోయింది. చూసే దానికి ఇవన్నీ చిన్న విషయాలు లాగానే కన్పిస్తాయి కానీ యివే మనుషుల గుణాన్ని తెలియజేస్తాయి అని చెప్పింది మరొకసారి.
ఒకసారి ఆమెతోపాటు వాళ్ళింటికి వెళ్ళింది తను. అతిధి మర్యాద కన్నా ప్రేమ యెక్కువ కనబడిందక్కడ. నేలపై బొంత పరుచుకుని ముగ్గురు అక్క చెల్లెళ్ళులా పడుకుంటే... పక్కనే వాళ్ళింట్లో వున్న వొకే వొక చిన్న నవ్వారు మంచంపై వాళ్ళమ్మ. అందరూ పడుకుని మాట్లాడుకున్న మాటల్లో పడుతున్న కష్ట నిష్ఠూరాలను విప్పి చెప్పుకుని మనసులను తేలికపరుచుకున్నాం. నాలుగున్నర గంటల కన్నా ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బుట్ట పట్టుకుని రెండు పర్లాంగుల దూరంలో ఉన్న పాలబూత్ కి వెళుతుంటే దట్టంగా కురుస్తున్న ఆ మంచులో రమతో కలిసి నడిచింది తను కూడా. తెల్లని చుడీ దారు ధరించి తెల్లని పొగమంచులో కలిసిపోయే రమని గుర్తించడానికి ఒకటే మార్గం తల మీదుగా చుట్టుకున్న ఆకుపచ్చని చున్నీ.
సందుమూల మెయిన్ రోడ్ లో ఉన్న కిరాణా షాపు అతన్ని "ఏమయ్యా ప్రకాష్ మీ లక్ష్మి ఎలా ఉంది, లేచి తిరుగుతుందా" అని పలకరిస్తుంది. షాపు ముందు శుభ్రం చేసుకుంటున్న అతను పనాపి "పర్వాలేదక్కా కాస్త లేచి నిలబడుతుంది" అని సమాధానమిచ్చి "ఎక్కడికి వెళ్ళారు నాలుగు రోజులనుండి కనబడటం లేదు" అని ప్రశ్నించాడు. మా స్నేహితురాలికి కుక్క కరిచి జ్వరమొస్తుంటే తోడుగా వుందామని వెళ్లాను అంది. "ఇప్పుడెలా వుంది ఆమెకి" అనంటాడు ఆదుర్దాగా. పర్వాలేదు. ఇదిగో ఆమె ఈమె అంటూ ప్రక్కనున్న నన్ను చూపించింది. ముందుకు నడుస్తూ " లక్ష్మి అంటే ప్రకాష్ పక్కింటి వాళ్ళ ఆవు దూడ. ఏదో జబ్బుచేసి నిలబడే ఓపిక కూడా లేకపోతే కటిక వాడికి అమ్మేస్తుంటే అతనికి డబ్బులిచ్చి ఆ ఆవుదూడని కొన్నాడు. ఇంకో మనిషిని తోడుగా తీసుకుని మోటార్ సైకిల్ పై పెట్టుకుని గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించాడతను. చచ్చిపోయే దానిని బ్రతికించాడు" అని చెప్పింది. అప్రయత్నంగా ఓసారి వెనక్కి తిరిగి చూసాన్నేను.
ఇంకొంచెం ముందుకెళుతుంటే పెద్దాయనొకరు వాకింగ్ కి వెళుతూ యెదురైనారు "బాబాయి గారూ మంచు దట్టంగా కురుస్తుంది. వచ్చేపోయే వాహనాల లైట్లు కూడా కనబడటం లేదు కాస్త ఎండెక్కినాక వెళ్ళేపనిగా" అంటుంది. "వచ్చావమ్మా రమా, నోరారా పలకరించే వాళ్ళు లేక నోరు మూగబోతుందనుకో. నువ్వు మాత్రం ఇంత మంచులోనే బయలుదేరావెందుకూ .. పిల్లులు అప్పుడే కాళ్ళకి చుట్టుకుంటున్నాయా పాల కోసం" అన్నాడాయన. "వాటి కోసమనే యేముందిలెండి అమ్మ కి కూడా కావాలిగా" అంది మొహమాటంగా. "నీకు భూతదయ యెక్కువమ్మా, పిచ్చితల్లి యెలా బతుకుతావో యేమిటో " .. అనుకుంటూ ముందుకు వెళ్ళాడాయన.
పాల బూత్ దగ్గరికి వెళ్ళి శుభోదయం చెప్పి "గణేష్ నేను లేని నాలుగు రోజులు ఇంటిదగ్గర పాలు యిచ్చినందుకు ధన్యవాదాలు" అంది. "పర్వాలేదులే అక్కా "అన్నాడు . "ఇదిగో నువ్వడిగిన పుస్తకం"అంటూ బుట్టలో నుండి తీసి అందించింది . పుస్తకం విలువ యివ్వబోతే "భలేవాడివి నువ్వు డబ్బులిస్తావని తెచ్చి యిచ్చానా" అని కోపగించుకుంది. "ఆ నల్లకుక్క యెలా వుంది కాలు కట్టుకున్నట్లేనా?" అని ఆరా తీస్తుంది. "తగ్గినట్లుంది అయినా అదిక్కడ నుండి పోనట్టు వుంది నేను చేసిన సేవ రుణం తీర్చుకోవాలనేమో" అని అన్నాడతను. "కుక్కకి ఏమైంది ?"అని అడిగాను. "వీధికుక్క , ఏ బండో ఎక్కి వుంటుంది. కుంటుతూ నడుస్తుంటే చేరదీసి కట్టు కట్టాడు. కొంచెం దయ చూపిస్తే విశ్వాసంగా ఉంటాయి జంతువులు. మనుషులకే విశ్వాసం వుండదు " అంది.
మనుషులు ఇలా కూడా వుంటారా అని అనిపించింది . ఆ మాటే అంటే "మనిషికి మనిషికి అడ్డుగోడ కట్టుకుని జీవించడం మానేస్తున్నారు. కేవలం నటిస్తున్నారు. మేము ఇలాగే వుంటాం. ఇలాగే పలకరించుకుంటాం. ఓ చిన్న నవ్వు పడేసి పని వున్నట్టు హడావిడిగా వెళ్లిపోవడమో కాస్త డబ్బు సంపాదించేటప్పటికీ వాళ్ళెవరో మాకు తెలియదన్నట్టు చూడటమో చేస్తారు కొంతమంది మనుషులు. కష్టం వచ్చినప్పుడు కాస్త మనిషి సాయమో ఆపదలో అప్పు యిచ్చి మనిషిమనిపించుకోవడం ధర్మం కదా" అంది. ఆ రోజు తనతో కలిసి నడిచిన నాలుగు పర్లాంగులు మనిషి అంటే యేమిటీ మనుషుల మధ్యన వేసుకున్న వంతెన యెటువంటిదన్నది నాకర్ధమైంది. తను నాపట్ల మాత్రమే అలాంటి స్నేహాన్ని వ్యక్తపరిస్తే కేవలం కృతజ్ఞతగా వుండేదాన్ని. ఆమె చుట్టూ అల్లుకున్న స్నేహాలు మనుషులు మాటలను చూస్తే గొప్ప గౌరవభావం నాకే కాదు యెవరికైనా యేర్పడుతుందనేది సత్యం.
సాయంత్రం వాకింగ్ కి వెళుతూ అయిదు లీటర్ల కేన్ తో నీళ్ళు నింపుకుని వెళ్ళి యెండిపోయిన చెట్లకి పోసి వాటిని బ్రతికించినట్లే సిమెంట్ బెంచీలపై కూర్చున్నయెండిపోయిన వృద్దులకూ మాటల తడితో కాస్త జీవం పోస్తుంది. నిత్యం వీథిలో నాటిన మొక్కలకు నీళ్ళు పోస్తుంది. పూజకి పూలు కోసుకు వెళ్ళే వాళ్ళది చూసి నవ్వుకుంటారు.మీ నవ్వులే రేపటి పువ్వులు అంటుంది. కసుక్కున గుచ్చుకోవడం అంటే అర్ధం కాని వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటారు. యెందరో స్నేహితులు పరిచయస్తులు. తాను వాలంటీర్ గా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ రాష్ట్రం వేరు పడినప్పుడు వేరు పడిపోయినా వాళ్ళు పిలిస్తే చాలు వెళ్ళిపోయేది. తన అవివాహ జీవితం గురించి వెకిలితనంతో వ్యాఖ్యానించినా సర్దుకుంది కానీ కులరాజకీయాలు ఆహారపు అలవాట్లతో విడదీసి చూడటం మనుషులను వెలివేసినట్లు చూడటం జరిగేపటప్పటికీ మనసుకి కష్టం కలిగి పక్కకు తప్పుకుంది. సంస్థ తరపున పనిచేయడం మానేసినా ఆ మనుషుషులందరూ తనవాళ్ళే అన్నట్లు వాళ్ళకు తన చేతనైన విధంగా చేసే మాట సాయాలు చిరు సహాయాలు. తన చుట్టూ వుండే ప్రపంచమే వేరసలు. అదొక మానస ప్రపంచం. చేసిన సాయాలు వ్యర్థం కావులే అంటే తిరిగి ప్రతిఫలం ఆశించి నేను చేయడంలేదు అంటుంది.
ఎన్నోసార్లు నా కష్టంలో సుఖంలో నా యింటి మనిషై నిలబడటం మాత్రమే కాదు తన మనసు బాగోలేనప్పుడు పని వొత్తిడిలో అలసిపోయినప్పుడల్లా నా దగ్గరకొచ్చి పడుతుంది. వినకోరిన హిందీ పాటలు వినిపించి తన అనుభవాలని చెప్పించుకోవడం నాకిష్టం. అప్పటిదాకా విన్నపాటలని ఈల పాటలో పాడి నన్ను అబ్బురపరిచేది. ఏవేవో పాత పాటలు అడిగితే వాటిని వెతికి డౌన్లోడ్ చేసి మెమరీ కార్డ్ లోకి యెక్కించకపోతే అలిగి కూర్చుండటం చూస్తే ఫక్కున నవ్వుకోవడం నావంతయ్యేది. చాలాసార్లు దేశంలో ఆమెతో కలసి పర్యటిస్తూ ఆమెంటే యేమిటో బాగా అర్దం చేసుకోగల్గాను.మనుషుల్లోనూ తోటి ప్రాణుల్లోనూ దైవత్వాన్ని దర్శిస్తూ యెన్నో అగాధాలను పూడ్చేస్తూ జీవన ప్రయాణం చేస్తూ వుంది. తోటి మనుషుల పట్ల కొంచెం ఆత్మీయత ఇతర ప్రాణులపై పిడికెడంత దయ కురిపించలేనివాళ్ళు కనీసం పక్క మనిషిని పలకరించకుండా వెళ్ళిపోవడం, అదే మనుషులు వారికి అవసరమైతే చాలు అమాంతం యెలా ప్రేమలు వొలకబోస్తారో చూస్తుంటే రమకి తెలియకుండా వీడియో తీసి ఆమె సాధారణ జీవితంలో అసాధారణను ప్రపంచానికి పరిచయం చేయాలనిపిస్తుంది.
మా ప్రక్కింటామె చెల్లెలింటి గేటు తెరుస్తుంటే "ముండకి యేమి అవసరం వచ్చిందో కోడల్ని వేసుకుని మరీ వచ్చింది"అని అనబడటం వినబడిందట. ఇక ఆ అక్కకు చెల్లెలు ముఖం చూడాలనిపిస్తుందా! ఇవి రక్తసంబంధాల బోలుతనం. చిన్న విషయాలుగా అనిపించే పెద్ద పెద్ద అవమానాలు. అగాధాలు. మనుషులు ఆ అగాథాలలో పడిపోకుండా కాపాడేది మాటనే స్పర్శమణి యే కదా. ఆ మాట వెనుక వున్న మనిషి గుణమే కదా!మాటే కదా మనుషుల మధ్య వంతెన. మాటే కదా మనుషులను కలిపి కుట్టే దారం.
ఇలా రమ గురించి జ్ఞాపకాలు తవ్వుకుంటూ కాస్తంత ఆత్మీయంగా మాటలు పంచుకోవాలనుకునే కదా నేనూ ఓ మనిషిని వెతుక్కుంటున్నానిపుడు అనుకుంటూ .. సమయం చూస్తే దేశ కాలమానం ఉదయం నాలుగున్నర. ఆ సమయానికి దట్టమైన మంచులో తెల్లని చుడీదారులో ఆకుపచ్చ చున్నీ కప్పుకుని ఊరుతో మాట్లాడటానికి వెళుతున్న రమ దృశ్యంలా కనబడింది నాకళ్ళకి. ఏ మాత్రం స్వార్ధం లేని మాట కూడా వినబడింది.
ప్రజాశక్తి ఆదివారం సంచిక స్నేహ లో ప్రచురితం (18/08/2019)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి