యుద్ధం తర్వాత మిగిలిన పగిలిన భూమిలా వుంది ఆ యిల్లు. తెల్లని గోడలన్నీ మసి పట్టినట్లు నల్లగా .. అక్కడక్కడా పిచ్చి పిచ్చిగా వొంకర టింకరగా చావు సంతకం. గది మధ్యలో పైన వ్రేలాడుతున్న నాలుగు రెక్కల ప్యాన్ శాసించినట్లు నలుదిక్కులకు గాలిని సమానంగా పంచుతున్నా స్విచ్ తీసేయగానే ఆగిపోయినట్లుంది. అస్తవ్యస్తంగా వున్న సామానులన్నింటిని సర్దుకోవాలని వున్నా అరంగుళం కూడా ముందుకు కదలలేక నేలమీద కూలబడిపోయింది ఆమె.
నలుగురు చూస్తుండగా చేయలేని పనిని అతను గది తలుపులు బిగించుకుని స్వేచ్ఛగా యథేచ్ఛగా చేసుకుంటున్నట్లు.. గంటలు గడిచాక యెవరో వచ్చి కిటికీ రెక్క నెమ్మదిగా తట్టినట్లు మరి కాసేపటికి మరింత గట్టిగా బాదినట్లు సమాధానం రాకపోయేసరికి సుత్తితో అద్దం పగలగొట్టి కళ్ళు చికిలించుకుని చూసి గది మధ్యలో వ్రేలాడున్న శవాన్ని చూసి వెర్రిగా కేక పెట్టినట్లు ఆమె కళ్ళముందు కలలా కదులుతూ వుంది.
ఖాళీ అయిన నెర్రెలిచ్చిన మాగాణి భూముల మధ్యనుండి వెర్రిగా యేడుస్తూ అడ్డదిడ్డంగా పరిగెడుతుంది. పెట్టెని మోస్తున్న మనుషుల వెనుక మనుషులు కొందఱు ఆమెను చూసి ఆవేశంగా కసిగా ఆమె వైపు పరిగెత్తివచ్చారు. ఒక ఆడది ఆమెని యెలా ఆపవచ్చో తెలుసుకున్న వు త్సాహంతో సులువుగా ఆమె చీరని లాగిపడేసింది. ఒక మగవాడు యుగయుగాల అహంకారాన్ని అతి తేలికగా ప్రదర్శిస్తూ జుట్టుపట్టుకుని క్రిందకి లాగి పడేసాడు. ఇంకొకడు కాళ్ళతో ఆమెని మట్టగించసాగాడు. ఇంకొకడు యెదకు అడ్డం పెట్టుకున్న రెండు చేతులను లాగేసి పిడిగ్రుద్దులు గుద్దాడు. అమ్మా అని ఆక్రోశంగా అరిచింది. కొద్ది దూరంలో ఇంకొందరు ఆమెను లాగి పడేస్తుండగా ఆ పిలుపు వినబడి రాక్షసిలా తిరగబడి వాళ్ళని కొట్టి తప్పించుకుని పిల్ల దగ్గరికి పరుగునవచ్చి బిడ్డ వొంటిపై దెబ్బలు పడకుండా కాపుకాసింది. వాళ్ళ ఆవేశం అణిగేదాకా తల్లి వొంటిపై దెబ్బల వర్షం కురుస్తూనే వుంది. పెట్టె దూరమైందో లేదో చూసి అలుపు తీర్చుకుంటూ దూరం జరిగారు. తల్లి లేచి దూరంగా పడి వున్న చీరను తెచ్చి బిడ్డకి చుట్టింది. ఒకడు ఆమె జుట్టుపట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొస్తుంటే తల్లి యేడుస్తూ వెనుక అనుసరిస్తుంది.
ఎక్కడ చూసినా దుఃఖం దుఃఖం వరదలై పారుతుంది. వాటికి ఆనకట్టలు వేస్తున్నారు. భద్రంగా నిలువజేసుకుని అహంకార పంటలు పండిస్తున్నారు. అహంకారాల మధ్య యేడుస్తూనే వుంది స్త్రీ. తాను కూడా యేడుస్తూనే వుంది. మెలుకువ, కాస్తంత మెలుకువ అందులో కూసింత వెలుగు. కలవరంగా లేచి కూర్చున్నాను. కల అని తెలిసింది. కలలో విషయాల చిరునామా యెక్కడుందో తెలుసు అందుకే మరింత కలవరం. ఎవరో చెపితేనే తనలో యింత కలవరం కల్గిస్తే అసలు మనిషి చెపితే ఆ అనుభవం యింకెంత దుఃఖంతో నిండి వుంటుందో... ఎక్కువగా ఆలస్యం చేయదల్చుకోలేదు. వీలైనంత తొందరగా రమేష్ భార్యను పలకరించి రావాలనిపించింది. ఆమె ఇంటి అడ్రెస్స్ కనుక్కుందామని "దాసు" కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
*************
కూరగాయల సంచీలను డిక్కీలో నింపుకుంటూ యెదురుగా నడచివొస్తున్న ఆమెని చూసాను. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. మొహమాటంగా నేను నవ్వి కొన్ని క్షణాలు ఆలోచించాను. ఎక్కడ చూసానో జ్ఞాపకం రావడం లేదు.ఇంకొకసారి చూస్తే గుర్తుకురావచ్చు అనుకుంటూ నన్ను దాటెళ్ళిన ఆమెని వెనక్కి తిరిగి చూసాను. ఎడమచేతిని అడ్డంగా మడిచి భద్రంగా పుస్తకాలని గుండెలకి హత్తుకున్నతీరు ముఖాన్ని బట్టి వయసు అంచనా వేస్తూ స్కూల్ టీచర్ లా వుంది అని మనసులో అనుకుంటుంటే వెనక్కి తిరిగి మళ్ళీ నన్ను చూసి నవ్వి ముందుకు సాగిపోతుంది. బండి స్టార్ట్ చేసి యెవరైవుంటుందీమె అని ఆలోచన చేస్తూనే యింటికి వచ్చి కారు ప్రక్కనే బండి నిలిపి స్టాండ్ వేస్తున్నప్పుడు వెలిగింది ఆమె డ్రైవర్ రమేష్ భార్య అని.
కూరగాయల సంచులు లోపల పడేసి దాసు కి కాల్ చేసాను. ఈ సారి ఫోన్ మ్రోగింది. అడ్రెస్స్ చెప్పాడు."రమేష్ భార్య ఈ టైమ్ లో అంగన్వాడీ కేంద్రంలో కూర్చుని వుంటుంది. వెళ్ళి ఆమెతో ఒకసారి మాట్లాడండి. యింకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆమె నోటివెంట వింటేనే మీకు నమ్మకం కల్గుతుంది,స్థిమితపడతారు" అన్నాడతను అంతలోనే నన్ను చదివేసినట్లు. మనుషులను చదవడం కూడా ఒక కళే కదా అనుకుంటూ బయలుదేరాను.
నన్ను చూసి "రండి మేడమ్,బాగున్నారా?" అని పలకరించి స్టూల్ చూపించింది కూర్చోమని. "ఇందాక కనబడినప్పుడు వెంటనే గుర్తుకురాలేదమ్మా రాణీ " అన్నాను ఆమె పేరుని జ్ఞాపకం తెచ్చుకుని. తెరిపిగా నవ్వింది. "నన్ను చూసి నాలుగేళ్ళయిందిగా, మర్చిపోయినట్టున్నారని అనుకున్నాను లెండి" అంది.
"ఎలా వున్నావ్ ? పిల్లలు నీ దగ్గరే వున్నారా? " అనడిగాను.
"నా దగ్గరే వున్నారండి. ఇంకెవరున్నారు చూడటానికి ? " అంది.
"అంతా మీ వాళ్లేనట కదా"
"అందరూ అయినవాళ్ళే. కక్ష కట్టి నా బతుకు బుగ్గిపాలు చేసేసారు" .
"చదువుకున్నావ్, గ్రామ సర్పంచ్ గా పోటీ కూడా చేసావ్ కదమ్మా. అంత మెలుకువ వున్న నువ్వు నీకు జరుగుతున్న అన్యాయాన్నియెలా భరించావు. మీ ఆయనకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు. ఎవరో వొకరు మధ్యవర్తిత్వం చేస్తే అర్ధం చేసుకుని సర్దుకునేవాడేమో,అన్యాయం జరిగిపోయింది"
"లేదండీ అతను చెప్పినదానికల్లా నేను వొప్పుకోకపోవడం వలెనే యివన్నీజరిగాయంటుంది నా బంధువర్గం. ఒరేయ్, అలా చేయడం తప్పురా అని యే ఒక్కరు ఖండించలేదు. ఇప్పుడు మాత్రం నన్నే బాధ్యురాలిని చేస్తున్నారు,మొగుడిని మింగింది అంటున్నారు" అంది బాధగా.
"ఏం జరిగిందమ్మా అభ్యంతరం లేకపోతే చెపుతావా, నీ గురించి నీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది" .
రమేష్ నా మేనమామే నండీ. ముగ్గురు మామయ్యల్లో ఆఖరివాడు. అమ్మ అందరికన్నా పెద్దది. ఇంకో పిన్ని. మొత్తం అయిదుగురు సంతానం మా తాతకి. అందరూ పొలాల్లో పని చేస్తూనే పాడి పశువులను పెట్టుకునే బతికారు. మా నాన్నది మాచవరం. ఆటోనగర్ లో రాడ్ వెల్డింగ్ పని చేస్తాడు. మేము ముగ్గురం పిల్లలం. అందరం దగ్గరలో ఉన్న ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. నాన్న సంపాదించిన డబ్బుతో రిజిస్టార్ ఆఫీస్ సందులో రెండు బిల్డింగ్ లు కొని అద్దెకి యిచ్చాడు. కొద్దిగా పొలం కూడా కొని వ్యవసాయం చేయాలనుకుని ఈ ఊరుకి వచ్చేసారు. మా తాత దగ్గరే స్థలం కొని యిక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాం. మా అన్నలిద్దరు వుద్యోగాలకు వెళ్ళకుండా రాడ్ వెల్డింగ్ పనే చేస్తూ పెళ్ళి చేసుకుని మాచవరంలో వుండిపోయారు. మా నాన్న నన్ను మంచి వుద్యోగస్తుడికి యిచ్చి చేయాలని ఆశ. నేనేమో రమేష్ ని ఇష్టపడి అతన్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. మా నాన్నకిష్టం లేదు. మనం అమ్మాయికి ఆస్థి యిస్తే వాడికి వున్నట్టే కదా, చదువబ్బలేదు కానీ రమేష్ మంచాడు. మన పిల్లల మధ్య పనిలో పడేస్తే వాడే దారిలోకి వస్తాడు పిల్ల కళ్ళ ముందు వుంటుందని వొప్పించింది అమ్మ . పెళ్ళై యెనిమిదేళ్ళు ఇద్దరు పిల్లలు. కార్ డ్రైవర్ గా వెళ్లి బాగానే సంపాదించేవాడు. హాయిగా గడిచిపోతుంది అనుకుని సంతోషించాను.
నాలుగేళ్లు మంత్రికి డ్రైవర్ గా పనిచేశాడు. గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం. రోజూ త్రాగుడు అలవాటైపోయింది. రాజకీయాలు మాట్లాడం తనని కులం పేరుతో అణిచివేస్తున్నారని గడ్డిపరక కన్నా హీనంగా చూస్తున్నారని వాపోయేవాడు. మా పక్కింటి అబ్బాయితో గొడవపడి అది మనసులో పెట్టుకుని యేడాది తర్వాత నాతో కేసు పెట్టించాడు ఈవిటీజింగ్ చేస్తున్నాడని కులం పేరున తిడుతున్నాడని. అలా పెట్టకపోతే వురి వేసుకుని చస్తానని బెదిరించాడు నన్ను. పాపం, ఇంటిప్రక్కబ్బాయి యేనాడు నన్నేమి అనలేదు. అతనికి బెయిల్ కూడా రాలేదు. కోర్ట్ లో జడ్జి గారు అడిగితే అబద్దం చెప్పలేక నిజం చెప్పేసాను. జడ్జి మందలించి కేసు కొట్టేశారు. ఆ రోజు నుండి రోజూ తాగొచ్చి నన్ను కొట్టడం పక్కింటి అబ్బాయితో నాకు సంబంధం వుందని అబాండాలు వేయడం మొదలెట్టాడు. మా అమ్మ నాన్న అన్నలు అందరూ అతని పద్దతి మార్చుకోమని యితరులతో గొడవలు పడొద్దని హితబోధలు చేసినా అతని చెవికెక్కేవి కావు. గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడం కూడా అతని వొత్తిడి మీదే. రమేష్ మాటల్లో నిజం లేకపోలేదు.కులవివక్ష,పెత్తందారీతనమూ యెప్పుడూ వున్నయ్యే కదా, ఓపిక పట్టాలి చదువుకుని ఉద్యోగాలు చేస్తే హోదా పెరుగుతుంది. హోదాలని బట్టేగా గౌరవం అని నేను నచ్చచెపుతూ ఉండేదాన్ని.
ఇక అతని కుటుంబం గురించి చెప్పాలంటే అదో పెద్దకథ. అతని పెద్దన్న వదిన హెచ్ ఐవి సోకి చనిపోయారు . రెండో అన్న భార్య రమేష్ కి మేనమామ కూతురే. వూర్లో ఉంటున్న రైతుతో సన్నిహితంగా మెలుగుతుందని అమ్మ గమనించింది . అతను యింటికి వస్తూ పోతుండటం చూసి తప్పు చేస్తున్నావని హెచ్చరించింది. ఆ విషయం యెక్కడ బయటపడుతుందేమో భర్తకి తెలుస్తుందేమో అని భయపడుతూనే అమ్మమీద , నా మీద కక్ష పెట్టుకుని చాటుమాటుగా రమేష్ కి మా మీద వ్యతిరేకంగా మరిన్ని మాటలు చెప్పి యెగదోసేది. ఆమె యేమి చెప్పినా నమ్మేసేవాడు. తాగొచ్చినా తాగకపోయినా లేస్తే తన్ను కూర్చుంటే తన్నుయేడాది పాటు నరకం చూపించాడు. నేను విసిగిపోయాను మా వాళ్ళు భరించలేకపోయారు . నాన్నదగ్గరుండి మరీ పోలీస్ కంప్లైంట్ యిప్పించాడు.
కేస్ పెట్టిన తర్వాత పిల్లల్తో సహా అమ్మ వాళ్లింట్లోనే ఉన్నాను . కేసు పెట్టినందుకు అమ్మ వాళ్ళింట్లోకి కూడా జొరబడి వచ్చి కొట్టేవాడు. అతని నుండి కాపాడటానికి అన్న వాళ్ళు వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు. చర్చికి వెళ్లే సమయానికి అక్కడ దారి కాసి నడి బజార్లో కొడుతూ వుంటే ఎస్ ఐ చూసి మరొక కేస్ ఫైల్ చేశారు. విచారణ చేసేటప్పుడల్లా వాళ్ళతో కూడా విపరీతమైన వాదనాడేవాడని నాన్న అన్నయ్యలు చెప్పే వాళ్ళు. మొత్తం అతని మీద అయిదు కేసులు. రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయింది. రోజూ వెళ్లి సంతకం పెట్టి రావాలనే నిబంధన. తనకున్న పలుకుబడి గురించి చెప్పి పోలీస్ లనే బెదిరించే వాడట. అది గమనించి హేళనగా నవ్వుకుంటూ మరింత హెరాస్ చేయాలని వొట్టి పుణ్యానికే పదే పదే విచారణకు పిలిచేవాళ్ళు. అలా జరుగుతుండగానే పిల్లలని బలవంతంగా నా దగ్గర్నుండి తీసుకువెళ్ళాడు. పిల్లలన్నా అతని దగ్గరుంటే వాళ్ళని చూసుకుని మార్పు తెచ్చుకుంటాడేమోనని నేను అభ్యంతరం చెప్పలేదు. పైగా ప్రక్క యింట్లోనే అమ్మ వుండటం వల్ల పిల్లలకు ఆలనా పాలన బాగానే వుండేది. మేము దూరంగా వున్న యేడాది కాలంలోనే అనుకోని యెన్నోమార్పులు వచ్చాయి. రమేష్ కి హెచ్ ఐ వి ఉన్నట్లు తెలియడం వల్ల మానసికంగా తల్లడిల్లిపోయి వుంటాడు. అతని ఆరోగ్య స్థితి, పరిస్థితులు అన్నీ అగమ్యగోచరంగానే అనిపించి వుంటాయని ఇప్పుడు తల్చుకుంటే దుఃఖంగా వుంది.
కంఠంలో దుఃఖం. చెప్పలేక కాసేపు ఆగింది. నేను మౌనంగా కూర్చున్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ చెప్పసాగింది.
అతనంత పిరికివాడేమీ కాదు. ఎన్ని కేసులనైనా ఎదుర్కునే మొండివాడు. చనిపోవడానికి కొద్దీ గంటల ముందే దాసు మామతో మాట్లాడుతున్నప్పుడే పోలీస్ స్టేషన్ నుండి విచారణకు రావాలని ఫోన్ చేశారని చెప్పాడు. విచారణకి వెళ్లొచ్చిన రెండు గంటలకు యింటికి వెళ్ళి ఉరి వేసుకుని చనిపోయాడు. అది తెలిసి గుండె పగిలిపోయినట్లయింది . నేనూ అన్నలూ అందరం యింటికి వచ్చాము. నా మూలంగానే రమేష్ చనిపోయాడని అతని రెండో అన్న వదినలు మిగతా బంధువులు అందరూ మా మీద కర్రలతో రాళ్లతో దాడి చేశారు. శవం దరిదాపులకు కూడా రానీయలేదు.ఇంట్లో వున్న వస్తువులు బీరువాలో వున్న బట్టలు అన్నీరోడ్డుపై వేసి తగలబెట్టేశారు. అమ్మ వాళ్ళ పాడి గేదలను తాళ్లు విప్పి దూరంగా పారదోలారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు.అరటితోటని నరికేశారు. ఆ హింస చూస్తే నోరు తడారిపోయింది. రమేష్ ని కడసారి చూడటానికి మాజీ మంత్రి వచ్చాడు. పోలీసుల గట్టి బందోబస్తు మధ్య అతని ఆఖరియాత్ర మొదలైంది. ఆఖరి చూపైనా చూసుకోవాలని చేలకి అడ్డంపడి ఖనం చేసే చోటికి వెర్రిగా పరిగెత్తాను అక్కడైనా చూడనిస్తారని. నన్ను దరిదాపులలోకి రాకుండా నా వొంటిపై చీరను లాగేసి నన్నుచేలో పడేసి కొట్టి జుట్టుపట్టుకుని ఊరి మధ్యలోకి యీడ్చుకొచ్చి యింకా అక్కడే వుంటే పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించి తరిమేశారు. ఊర్లో ఒక్కరు కూడా నాకు సహాయంగా నిలబడలేదు. కుటుంబ సభ్యుల గొడవ మనకెందుకులే అని చూసీచూడనట్టు వూరుకున్నారు.
నిజంగానే కుటుంబ రాజకీయాలమధ్య ఈర్ష్యాద్వేషాల ముళ్ళ మధ్య పడి నా జీవితం చిరిగిపోయింది. అమ్మ నాన్న అన్నయ్యలు వాళ్లకి భయపడి ఇల్లు విడిచి యెక్కడో అజ్ఞాతంగా తలదాచుకోవలసి వచ్చింది. ఊరికి దూరంగా యెక్కడో అనామకంగా తాళి తెంచేసి తెల్ల చీర కట్టుకుని జరిగినదాంట్లో నా తప్పెంత నా తల్లిదండ్రులు చేసిన నేరమేమిటీ అని మేమంతా కన్నీరు మున్నీరవుతుంటే జ్ఞాపకార్ధ కూటమి రోజున విందు భోజనాల మధ్య మద్యం యేరులా పారించి రమేష్ గురించి మంచిగా మైక్ లో చెప్పుకుని తెరిపినబడ్డారు. తెల్లవారేటప్పటికి నా పిల్లలని మా యింటికి తోలేశారు.
చనిపోయే ముందు రమేష్ అతని ఫ్రెండ్స్ కి పంపిన వీడియో వల్ల నిదానంగా అన్నీ బయటకొచ్చాయి. అందులో యేముందో చూడండి అని మొబైల్ఎ లో ఉన్నవీడియో తీసి నాకిచ్చింది చూడమని. నిర్వికారమైన చూపులతో నెమ్మదిన మాటలతో రమష్ "ఎవరిపైనో తెలియని కసి,ఆవేశం.బాగా బతికే అవకాశం నాకూ రావాలి. బ్రతకడానికి అణిగి మణిగి ఉండటం నా వల్ల కాదు. హెచ్ ఐ వి తో ఎన్నాళ్ళో బ్రతకను,బ్రతికినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. మా అన్న వదినలు హెచ్ ఐ వి తో పదేళ్ల క్రిందటే చనిపోయారని యిప్పటికీ అందరూ ఎగతాళి చేస్తుంటారు. అలాంటి ఎగతాళి మధ్య బ్రతకడం కన్నా చావే మేలుకుని ఉరి వేసుకుంటున్నాను. నా చావుకి కారణం నేనే. సమాధానపడని నా మనస్తత్వమే. అని ముగించాడు. అది చూసి అందరూ జరిగింది ఏదో జరిగిపోయిందిలే పోనీయండి.. పిల్లలను పెట్టుకుని ఆమె బతుకుద్ది అని చెప్పాక నన్ను నా యింట్లోకి రానిచ్చారు. అమ్మ నాన్న అండ వుంది. ఇల్లు వాకిలి డబ్బు అన్నీ వున్నాయి. మనిషే లేడు. రమేష్ లేడన్నదిగులు కూడా లేనంత గట్టిపడిపోయాను.అతనితో జీవితం పచ్చగా వుండాలని యెన్నెన్నో కలలు కన్నాను.ఆ కల పగిలిపోయింది. చివరకిలా బుగ్గి చేసి కడతేరిపోయాడు. ఎవరికీ ఇలాంటి బతుకు రాకూడదు అంది కన్నీటితో.
కాసేపు మౌనం.
జ్ఞాపకాలను మోయడం పువ్వు పరిమళాన్ని మోయడమంత సహజం కదండీ, మంచిగానో చెడుగానో అతను నా భర్త. నా కట్టే కాలేదాకా ఈ బాధ అనుభవించాల్సిందే. లోకులేమన్నా తలొంచుకోవాల్సిందే అంది తాను తప్పు చేసినట్లుగా తలొంచుకుని.
రాణి నాతో మాట్లాడటం చూసి ఆమె తల్లి మాదగ్గరికి వచ్చి నిలబడి అప్పటికే చాలాసేపైంది. "చిన్నప్పటి నుండి వాడంతేనమ్మా ఇంట్లో పేచీ, బడిలో పిల్లలతో పేచీ అసలు మనుషులతోనే పేచీ" అంది విరక్తిగా .
"అవున్నిజమే! అతనికి అందరితో గొడవే కానీ భార్యన్నా పిల్లలన్నా భలే ప్రేమ. మా ఆవిడ అసలు బయటకు రాదండీ పిల్లలను బడికి పంపించుకోవడం వాళ్ళకు చదువు చెప్పుకుంటూ కూచోవడం తప్ప లోకం సంగతి కొంచెమైనా పట్టించుకోదు అని గొప్పగా చెప్పేవాడు. ఏమిటో యిలా చేసాడు" అన్నాను బాధగా.
"భార్యాభర్తలమధ్య విభేదాలుంటే సరిదిద్దాల్సిన అయినవాళ్లే కుట్రలు చేసి మరింత మంటను యెగదోస్తే ఇట్టాగే వుంటాయమ్మా , పెద్ద పెద్దవాళ్ళతో పోల్చుకుని మన మట్టాంటి స్థితికి చేరుకోవాలంటే కష్టపడాలని అర్ధం చేసుకోక లేనిపోనీ ఆలోచనలు చేసి సంసారాన్నిట్టా చేసుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టుకుంటూ జీవితాన్ని నరకం చేసుకున్నాడు. బిడ్డను కళ్ళ ముందు పెట్టుకుని కుమిలిపోతున్నామమ్మా" అని కళ్ళొత్తుకుంది.
మార్పుగా వుంటుంది ఏదైనా వుద్యోగం చేయమ్మా అన్నాను రాణితో.
రాణి తలవూపింది. రాణి వాళ్ళమ్మ "మాకు డబ్బు కేమీ కొదవలేదమ్మా, ముప్పై యేళ్ళు కూడా రాలా,మళ్ళీ చదువుకుంటది.ఇంకా చదివి వుద్యోగం తెచ్చుకుని దైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలి ఓర్పు పట్టినాళ్ళదే వందేళ్ళ జీవితం అని ఊరికే అనలేదు పెద్దోళ్ళు. మేము అట్లాంటి పూరిగుడిసెలో పుట్టి కష్టపడి తెలివితేటలతో ఇంతో అంతే సంపాయిచ్చుకోలా, మా ఆయన ఎమ్ యెల్ ఏ ఆఫీస్ కి వెళితే యెదురెదురు మర్యాదలు చేస్తారు. వాడికి అప్పటికి చెప్పిచూసా అణుకువుగా వుండి యెదగడం నేర్చుకోవాలి ,చీకటి రాజ్యం యెల్ల కాలం చెలాయించదు రా అయ్యా అని. మిడిమేళం వింటేగా . జనుల నోట్టో మమ్మల్ని నానేసిపోయాడు" అని కళ్ళొత్తుకుంది. రాణి ముఖం చూస్తే గుమ్మరించని నీళ్ళకుండలా బరువుగా వుంది. అప్పటికి వాళ్ళ గుండెల భారాన్ని కొంత నా మీదకి మార్చినట్టుంది.
దాసు చెప్పిన కథ కూడా దాదాపు యిదే.కాకపొతే అతను చెప్పినప్పటికన్నా రాణి చెప్పినప్పటి బాధ పదింతలు యెక్కువ. నేరం యెవరిది? తిల పాపం తలా పిడికెడు. కళ్ళలోకి రాని నీళ్ళను రాణి వ్యధలో చూసి బరువుగా లేచి నిలబడి "వెళ్ళొస్తాను" అన్నాను.
"నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను" అని నవ్విందామె.
ఆ నవ్వులో వేల వేల భాష్యాలు, మనసుల కాలుష్యాలు, మనుషుల అహంకారాలు. అవెప్పుడు కాలి మసైపోతాయో కానీ అప్పటిదాకా రమేష్ కి యెదురుపడిన వివక్ష, కల్గిన అసహనం రాణి లాంటి వాళ్ళ కలలను పగలగొడుతూనే వుంటాయి. అవును.. రాణి జీవితం "పగిలిన కల " అనుకుంటుంటే మనసు మరింత బరువైంది.
(సెప్టెంబర్ 2019 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో ప్రచురింపబడ్డ రచన)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి