రాజీవ్ ఇంకా యింటికి రాలేదు. పిల్లల్ని నిద్రపుచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంది మీనా. నిమిషానికొకసారి యింటి ముఖద్వారం నుండి రోడ్డు వారగా వున్న గేటు దాకా చూపు సారిస్తూ మధ్యమధ్యలో టీవీ చూస్తూ కూర్చుంది.
"ఎంతసేపని యెదురు చూస్తావమ్మా, భోజనం చేసి పడుకో. వాడొచ్చినప్పుడు తలుపులు నేను తీస్తానులే " అన్నాడు మాధవరావు. అయినా అక్కడినుండి కదలకుండా ఆవలిస్తూ కూర్చుంది మీనా . మాధవరావు నిట్టూరుస్తూ మూతపడని కళ్ళతో ఆలోచిస్తూ పడుకున్నాడు.
నారు వేరవుతుంది కానీ వేరు నారవుతుందా ? తనలాగే కొడుకూ. చెప్పాలంటే తనే నయం. ఏ దురలవాట్లు లేకుండా భార్య మనసుని కష్టపెట్టకుండా పూర్వీకులు యిచ్చిన ఆస్తిని నిలబెట్టుకుంటూనే వుద్యోగం చేసి ముగ్గురు బిడ్డలని చక్కగా చదివించాడు. ఆదర్శ వివాహాలు చేసాడు.
కొడుకు పెళ్ళైన కొత్తలో... "మీ ఇద్దరూ యెవరి వుద్యోగాలలో వాళ్ళు బిజీగా వుంటే యెలాగమ్మా , వాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా! నువ్వు కూడా వుద్యోగం చెయ్యాలా యింకా" అని అడిగాడు. వెంటనే కోడలు మీనా వుద్యోగం మానేసింది. MBA గోల్డ్ మెడలిస్ట్. నట్టింట్లో అలంకార ప్రాయంగా ఆమె ఫోటోకి వ్రేలాడదీసిన మెడల్ కంట్లోబడినప్పుడల్లా తాను కథల్లో వ్రాసిన స్త్రీ పురుష సమానత్వం వెక్కిరిస్తున్నట్లు కనబడేది మాధవరావుకి.
వెంటవెంటనే ఇద్దరి బిడ్డలని కని శ్రద్దగా పెంచుకోవడంతో పాటు యింట్లో యెంత మంది నౌకర్లు వున్నా తనకి కావల్సినదల్లా మొక్కుబడిగా కాకుండానూ యేదో సేవ చేస్తున్నాను అనుకోకుండానూ ప్రేమగా చేసే కోడలంటే మాధవరావుకి అభిమానం. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటుంటే చదివిన పుస్తకాల గురించి తనతో చర్చించడమో వెబ్ నుండి మంచి మంచి వ్యాసాల్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి యివ్వడమో,తాను చెపుతున్న దానిని టైపు చేసిపెట్టడమో చేస్తుంది . రుక్మిణమ్మ బ్రతికి వుంటే ఈ కోడలిని చూసి యెంతగా మురిసిపోయేదో అనుకుంటాడు మాధవరావు తరుచుగా .
మాధవరావు అలా జ్ఞాపకాల జడిలో కొట్టుకుపోతున్నాడు. పగలల్లా పత్రికాఫీస్ లో పని. సాయంకాలమైతే మిత్రులతో సాహిత్య గోష్ఠి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి పెళ్ళి కాని మిత్రుల గదుల్లో మీటింగ్ లు పెట్టేవాళ్ళు. వాళ్ళతో కబుర్లు కథలు కవిత్వాలు రాజకీయాలు అన్నీ కలబోసుకుంటూ రాత్రిని అరగదీసేవాడు. మూడొంతుల రోజులు అలాగే గడిచేవి. రాజీవ్ మీ కోసం యెదురు చూసి చూసి నిద్రపోతున్నాడు. పెందలాడే యింటికి రాకూడదూ అనేది రుక్మిణమ్మ.
నగరపు కొసన చిన్న పెంకుటింట్లో వుండేవాళ్ళు . భార్య పిల్లలని ప్రక్కనేసుకుని భారత రామాయాణాలు భాగవత కథలు చెపుతూ బిక్కు బిక్కుమంటూ కాలం గడిపేది. తను యే తెల్లవారుఝామునో వచ్చి తలుపు తడితే రుక్మిణిమ్మ కన్నా రాజీవ్ ముందు లేచొచ్చి తలుపు తీసేవాడు. అంత మెలుకువగా వుండేవాడు. "నాన్నా యిప్పటిదాకా యింటికెందుకు రాలేదు" అని నిలేసేవాడు."ఒరేయ్ చిన్నా డబ్బు సంపాదించడమంటే అంత తేలికైన పనేమి కాదు, అది తెలుసుకోవాలి నువ్వు" అనేవాడు మాధవరావు
"నేను పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి మీకిస్తాను కానీ త్వరగా యింటికొచ్చీయ్ నాన్నా. అమ్మకి మాకు భయమవుతుంది" అనేసి కాళ్ళకి వాటేసుకుని బిక్క ముఖం పెట్టి తల పైకెత్తి తన కళ్ళలోకి చూస్తుంటే .. మనసు చివుక్కుమనేది మాధవరావుకి.
తనకిష్టమైన వ్యాపకంలో పడి పసిపిల్లలని పట్టించుకోవడంలేదని సిగ్గుపడేవాడు. కొన్నాళ్ళు మిత్రులకి ముఖం తప్పించి ఆఫీసు నుండి నేరుగా యింటికి చేరుకోవడం కాసేపు పిల్లలతో గడిపి తర్వాత వ్రాసుకోవడం బాగానే ఉన్నట్టనిపించినా పాతవాసనలు మళ్ళీ రా రమ్మని పిలుస్తూ వుండేవి. మళ్ళీ మనసు పీకి కొన్నాళ్ళకి మిత్రులతో కాలక్షేపాలు యధావిధిగా జరిగేవి. అభిరుచులు కలసిన మిత్రులతో గడపడం కూడా ఒక మత్తే అని అనిపించేది. భార్య యెన్నడూ యిదేమిటని అడిగింది లేదు. పైగా నాన్నెప్పుడు వస్తాడు అనే ప్రశ్న రాజీవ్ నుండి వచ్చినప్పుడల్లా రోజూ అలా అడిగి విసిగించకూడదు, నువ్వు పడుకుందువు రా అంటూ యెత్తుకుని తీసుకెళ్ళి పడుకోబెట్టి కథలు వినిపించి మాయచేసేది రుక్మిణమ్మ . అప్పుడప్పుడు మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుటి ఫోటో పేపర్ లో వుంది చూడు ఆయన యేమి మాట్లాడారో క్రింద రాసారు కూడా, చదివి చెప్పు అని పేపరో పత్రికో వాడి చేతికిచ్చేది. అలా బుజ్జగించేది. నాన్న లోని మలినాలనన్నింటిని కాచి వొడపోసి స్వచ్చంగా చూపించేది తల్లి కదా అనుకునేవాడు మాధవరావు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు రాజీవ్.
ఇప్పుడు అదే మాదిరిగా “సన్నీ” పెరిగి పెద్దవాడవుతున్నాడు. కానీ ఈ మధ్య రాజీవ్ ప్రవర్తనే ముల్లులా గుచ్చుకుంటుంది. గుండె భారంగా వుంది. రాత్రుళ్ళు ఆలస్యంగా వస్తున్న కొడుకుని ప్రశ్నించడమే పనిగా బెట్టుకుని ఆరాత్రి మేలుకుని కూర్చున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే తలుపు తీసి "రాజీవ్! రోజూ ఇంత పొద్దుపోతుంది యెందుకని? " నిలదీసాడు మాధవరావు .
"డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదని మీకూ తెలుసు కదా నాన్నా, అప్పటి మీలాగే నాకు యేవేవో వ్యాపకాలు" అన్నాడు నవ్వుతూ.
"సన్నీ తనేసిన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నీకు చెప్పాలని పన్నెండు అయిందాకా యెదురు చూసి చూసి పడుకున్నాడు. అమ్మా డాడీ యెప్పుడొస్తారు, తాతయ్యా నాన్నెప్పుడొస్తారు అని అడుగుతూనే వున్నాడు. బిడ్డలతో గడపలేని సమయం మీదైతే బిడ్డలని కనడమే మానేయాల్సింది, హాయిగా బిజినెస్ చేసుకుంటూ డబ్బు సంపాదించి పార్టీలు చేసుకుంటూ బ్రతికేయాల్సింది, భార్య పిల్లలు యెందుకు నీకు?" అని గట్టిగా మందలించాడు కొడుకుని.
" కని పెట్టుకుని చూసుకోవడానికి పిల్లలకు వాళ్ళ అమ్మ వుంది. బోలెడన్ని కథలు కబుర్లు చెప్పడానికి మీరూ కాలక్షేపానికి టీవీ ఇన్ని ఉన్నాయి. ఇంకేమి కావాలి చెప్పండి" అన్నాడు రాజీవ్ తేలికగా.
నువ్వు పసివాడి మనసు గురించి ఆలోచించడం లేదు.
తనతోటి పిల్లలతో కూడా ఆడుకోవడం మానేసాడు. ఈ మధ్య
చదువులో కూడా డల్ గా ఉంటున్నాడని క్లాస్ టీచర్ చెప్పింది. కొన్నాళ్ళ
క్రితం ఒక రోజు ఏం చేసాడో తెలుసా ..అని ఆగాడు
మాధవరావు.
ఆ విషయాన్ని వినడానికి కూడా ఆసక్తి లేనట్లు మొబైల్ ఫోన్ చూసుకుంటూ మధ్యలో తండ్రి వైపు చూసాడు. ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ విచారంగా ముఖం పెట్టి " ఆ రోజు మన తోటలోకి వెళ్లి తన మేథ్స్ పుస్తకాన్ని అక్కడొక చెట్టుకి బూట్ లేసుతో కట్టేసి నీకెందుకు అర్ధం కావడంలేదు. ఇంతేనా ఈ టేబుల్ వేసేది. రేపు గనుక నాకు సరిగ్గా వేసి చూపకపోతే నీకు ఇదే పనిష్మెంట్ అంటూ చెట్టును బెత్తంతో కొడుతున్నాడు. వాడిని ఆ స్థితిలో చూసి గుండె చెదిరిపోయింది. నాకు మేథ్స్ అంటే యిష్టం లేదు తాతయ్యా. మా టీచర్ చెయ్యకపోతే పనిష్మెంట్ యిస్తుంది. డాడీతో చెప్పించుకుంటే నాకు మేథ్స్ వస్తుందేమో. డాడీ యేమో ఇంటికే రావడం లేదు" అన్నాడు నాకాళ్ళకి చుట్టుకుని. ఇంకో రోజు అన్నం కూడా తినకుండా అలిగి తోటలో బెంచీపై కూర్చుని రాత్రి పదకొండు గంటలు దాటినా దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా డాడీ వస్తేనే యింట్లోకి వస్తా అని మంకుపట్టు పట్టుకు కూర్చున్నాడు. వాడికి మాయమాటలు చెప్పి సమదాయించడం వాళ్ళ అమ్మ వల్ల కావడంలేదు. రేపట్నుంచైనా పెందలాడే యింటికి రా ..రాజీవ్. ఇంట్లో ఎందరున్నా నీ లోటు తీర్చగలరా ? ఆ పసివాడిని నిరాశ పరచకు." అనునయంగా చెప్పాడు కొడుకుకి.
ఆ విషయాన్ని వినడానికి కూడా ఆసక్తి లేనట్లు మొబైల్ ఫోన్ చూసుకుంటూ మధ్యలో తండ్రి వైపు చూసాడు. ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ విచారంగా ముఖం పెట్టి " ఆ రోజు మన తోటలోకి వెళ్లి తన మేథ్స్ పుస్తకాన్ని అక్కడొక చెట్టుకి బూట్ లేసుతో కట్టేసి నీకెందుకు అర్ధం కావడంలేదు. ఇంతేనా ఈ టేబుల్ వేసేది. రేపు గనుక నాకు సరిగ్గా వేసి చూపకపోతే నీకు ఇదే పనిష్మెంట్ అంటూ చెట్టును బెత్తంతో కొడుతున్నాడు. వాడిని ఆ స్థితిలో చూసి గుండె చెదిరిపోయింది. నాకు మేథ్స్ అంటే యిష్టం లేదు తాతయ్యా. మా టీచర్ చెయ్యకపోతే పనిష్మెంట్ యిస్తుంది. డాడీతో చెప్పించుకుంటే నాకు మేథ్స్ వస్తుందేమో. డాడీ యేమో ఇంటికే రావడం లేదు" అన్నాడు నాకాళ్ళకి చుట్టుకుని. ఇంకో రోజు అన్నం కూడా తినకుండా అలిగి తోటలో బెంచీపై కూర్చుని రాత్రి పదకొండు గంటలు దాటినా దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా డాడీ వస్తేనే యింట్లోకి వస్తా అని మంకుపట్టు పట్టుకు కూర్చున్నాడు. వాడికి మాయమాటలు చెప్పి సమదాయించడం వాళ్ళ అమ్మ వల్ల కావడంలేదు. రేపట్నుంచైనా పెందలాడే యింటికి రా ..రాజీవ్. ఇంట్లో ఎందరున్నా నీ లోటు తీర్చగలరా ? ఆ పసివాడిని నిరాశ పరచకు." అనునయంగా చెప్పాడు కొడుకుకి.
మర్నాడు సాయంత్రం పెందలాడే యింటికి వచ్చాడు రాజీవ్. "నీకోసం మంచి బహుమతి తెచ్చాను చూడు" అంటూ play store బాక్స్ ని సన్నీచేతుల్లోపెట్టాడు రాజీవ్ . సన్నీ ఆ అట్ట పెట్టె వైపు అనాసక్తిగా చూసాడు . లేచి వెళ్లి తండ్రి కాళ్ళని చుట్టేసాడు. కొడుకుని యెత్తుకుని భార్య వైపు చూస్తూ " మీ కళ్ళల్లో యెప్పుడూ యేదో కంప్లయింట్. ఇంటికొస్తే చాలు నేనేదో నేరం చేసిన వాడిలాగా చూడటం అలవాటైపోయింది మీకు. ఇంటికి రావడమంటే చిరాకు కల్గుతుంది. నాకు మాత్రం మనసుండదా, క్వాలిటీ ఆఫ్ టైం యింట్లో గడపలేకపోవడం పట్ల నాకూ అసంతృప్తిగానే వుంది. విషయాలు నాదాకా రాకుండా నువ్వే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి కదా " అన్నాడు భార్యవైపు కోపంగా చూస్తూ .
మీనా యేమీ మాట్లాడకుండా అతని దగ్గర్నుండి సన్నీని తీసుకుని “డాడీ ప్రెష్ అయి వస్తారు.అంతలోకి మనమెళ్ళి నువ్వేసిన చిత్రాలు తీసుకొద్దాం రా” అంటూ సన్నీని పిల్లల గదిలోకి తీసుకువెళ్ళింది. తండ్రికి తనేసిన చిత్రాలు, వచ్చిన ప్రైజ్ చూపించి అందరూ తనని యెలా మెచ్చుకున్నారో సంతోషంగా చెపుతుంటే రాజీవ్ ఓపిక చేసుకుని విన్నాడు. “మీరంటే సన్నీకి చాలా యిష్టం. ఎంత ఇష్టమంటే అంత వ్రాసి చూపడానికి పోల్చి చూపడానికి చేత కానంత అని చెపుతాడు” అంది మీనా నవ్వుతూ. మనసులో ఈ విషయం కూడా నేను మీకు చెప్పాల్సిరావడం దురదృష్టం అని కూడా అనుకుంది. రాజీవ్ మురిసిపోతూ ఆరేళ్ళ కొడుకుని గుండెలపై వేసుకుని కబుర్లు చెప్పాడు.
"డాడీ, మీరు రోజూ యిలాగే యింట్లో వుండొచ్చు కదా, వుండు డాడీ, ప్లీజ్ డాడీ" అని గడ్డం పుచ్చుకుని బతిమాలాడుతున్నట్టు సన్నీ ప్రేమగా అడిగేసరికి రాజీవ్ కరిగిపోయి "అలాగే డియర్. తప్పకుండా రోజూ మీరు నిద్రపోక ముందే యింటికి వస్తాను" అని మాటిచ్చాడు. మిగిలిన ఆ రాత్రంతా సన్నీ తండ్రి మెడచుట్టూ చేతులేసి కావిలించుకొని పడుకునే వున్నాడు.
ఉదయాన టిఫిన్ చేస్తూ భార్య మీనాతో "నాకోసం యెవరూ యెదురు చూడొద్దు. పిల్లలు, నాన్న యెవరేమడిగినా నువ్వే సమాధానం యిచ్చుకోవాలి. ఫోన్ చేసి పిల్లలు మాట్లాడతారంట అని పదే పదే డిస్ట్రబ్ చేయొద్దు. చూడబోతే నువ్వు మౌనంగా వుండి వాళ్ళని నామీదకి వుసిగొల్పుతున్నట్టు వుంది. రోజూ సాయంత్రమయ్యేసరికి కారు రెడీ చేసి వుంచుతున్నాను. ఎప్పుడూ ఆ వంటింట్లోనూ పుస్తకాలలోనూ మగ్గకుండా నాన్నని పిల్లలనూ తీసుకుని పార్క్ కి వెళ్ళరావచ్చుకదా, సరదాగా మూవీస్ కి వెళ్లొచ్చు. బయట డిన్నర్ చేసి రావచ్చు. కావాల్సినంత డబ్బు సమకూరుస్తున్నా యెప్పుడూ యేదో పోగొట్టుకున్న యేడుపు వొకటి" అన్నాడు.
"మీరేమి చేస్తున్నారో మీకే తెలుసు. ఇంట్లో అందరిని తప్పుపట్టడం మానేయండి ప్లీజ్.. అంది మీనా. సమాధానం చెప్పకుండానే ప్లేటులోనే చేయి కడిగేసి విసురుగా నడిచివెళ్లి కారెక్కి డోర్ గట్టిగా వేసుకున్నాడు. కళ్ళల్లో ఉబికిన నీటిని దాచేసుకుని బలవంతంగా నవ్వుతూ బై చెపుతూ భర్తని నయమారా చూసుకుంది. మళ్ళీ వారానికో పదిరోజులకో కంటికి కనబడేదని ఆమెకి తెలుసు కాబట్టి.
పిల్లలిద్దరూ రాత్రి తండ్రి యిచ్చినమాట నిజమనుకుని పదిగంటలదాకా యెదురు చూసి పడుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఇవాళ డాడీ వచ్చేదాకా యిక్కడే కూర్చుంటాం అనేసి యెదురు చూసి చూసి హాల్లోనే పడి నిద్ర పోయారు. మరుసటిరోజు కూడా అలాగే ఎదురుచూస్తారని "డాడీ మధ్యాహ్నం యింటికి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్లిపోయారు బిజినెస్ పనిమీద స్విజర్లాండ్ వెళ్ళారు. నాలుగైది రోజులలో వచ్చేస్తారంట. ఇవిగో మీకు బొమ్మలు, చాక్ లెట్స్ కొని తెచ్చారు చూడండి" అని తాను కొని తెచ్చిన వాటిని చూపించి పిల్లలకి అబద్దం చెప్పింది. "ఇలా యెన్నాళ్ళు మభ్య పెడదాం తల్లీ! నిన్ను చూస్తే దిగులేస్తుంది. నీ సంసారం యేమవుతుందోనని భయమేస్తుంది" అన్నాడు మాధవరావు.
“జరిగేదే జరగనివ్వండి మామయ్యా! ముందునుండే భయపడటం యెందుకు? "అని పని కల్పించుకుని మారు మాటలకందకూడా దూరంగా వెళ్లిపోయింది మీనా.
ఆ రోజు ఆదివారం. రాక్ లో వున్న పుస్తకాల వరుసలను చూస్తూ తాతయ్యా .. ఈ పుస్తకాలలో యేముంది? అని అడుగుతూనే మళ్ళీ మాధవరావు ఫోటో వున్న ఒక పుస్తకం పట్టుకుని.. "తాతయ్యా! ఈ కథలు నువ్వే వ్రాసావా?" ఆసక్తిగా అడిగాడు సన్నీ. "అవునురా మనుమడా, నేనే వ్రాసాను. నీ అంత వున్నప్పుడు నుండే కవిత్వం వ్రాసేవాడిని తెలుసా" అన్నాడు కాస్త గర్వంగా .
"నాలాగా మీ చిన్నతనమంతా యెప్పుడూ స్కూల్, ఇల్లు యిలాగే వుండేదా, ఇంట్లో కూర్చునే ఇవన్నీ వ్రాసారా" అనడిగాడు సన్నీ. గతుక్కుమన్నాడు మాధవరావు. సమాధానమేమి చెప్పాలో తెలియక మాటమార్చి "మన బుజ్జి కుక్క పిల్లకి జ్వరమొచ్చి పాలు తాగడం లేదు చూసొద్దాం పద" అంటూ తోటలోకి తీసుకెళ్లాడు మనుమడిని.
వారం రోజుల తర్వాత రాజీవ్ యింటికొచ్చిన రాత్రి పిల్లలు మాధవరావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నారు. కొడుకుని చూసి కోపం అణుచుకోలేక "పదేసి రోజులు యింటికి రాకపోతే ప్రతిరోజూ నిద్ర లేచి కోడలి ముఖం చూడాల్సి రావడం నాకు సిగ్గుగా ఉంటుంది. పాపం! ఆ అమ్మాయేమీ అనదు, మనసులో బాధ బయటపెట్టదు. భర్త యెదుగుదలకి స్నేహాలు పార్టీలు యెంత అవసరమో అర్ధం చేసుకుంది కాబోలు. ఆ వొంకతో నువ్వు పరాయి స్త్రీల మోహంలో పడి కొట్టుకుని పోతున్నావని తెలిసి కూడా భరిస్తుంది ఇంటికి యెప్పుడు వస్తున్నా అడగడం మానేసింది.పాప అంత అడగపోయినా సన్నీ అడగడం మానలేదు. వాడితో పాటు ముసలి ప్రాణం నేనూ యెదురుచూస్తున్నాను. ఈ పది రోజులలో సిటీలో కారులో వెళుతూ రెండుసార్లు కనబడ్డావు కానీ యింటికి వచ్చే తీరిక లేకపోయింది నీకు. నువ్వు ఇంటికి రానిరోజులే కాదు వేకువఝామున కాలింగ్ బెల్ మోగని రోజులు ఈ యింట్లో వుండాలని ఆశపడుతున్నాను'' గట్టిగా మందలించాననుకున్నాడు కొడుకుని .
"కోడలి తరపున వకాల్తా పుచ్చుకుంది చాలు, యిక ఆపండి నాన్నా. ఇంటికి రావడం ఆలస్యం హితబోధ మొదలెడతారు" విసుగ్గా అన్నాడు రాజీవ్
"రాజీవ్, నేను చేసిన తప్పునే మళ్ళీ నువ్వు చేస్తున్నావ్, మనిషికి బాల్యం తిరిగి రాదు.నాన్న గురమెక్కి ఊగాలి . నాన్న వేలు పట్టుకుని షికారుకి వెళ్లి రావాలి.పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు చిలిపి చేష్టలు అన్నీ నాన్నతోనే అనుకుంటారు. పిల్లలకి నాన్నే అసలు హీరో. డబ్బు అంతస్తు రెండు చేతుల్లో పెట్టి అందించగలవు గానీ మధురమైన బాల్యాన్ని అందించగలవా, సన్నీని చూడు నీమీద దిగులుతో యెంత చిక్కిపోయాడో , వాడి ఆలోచనలు చితికిపోతున్నాయి తెర పై కనిపించే జీవితాలేకాదు అసలు ప్రపంచాన్ని వాడికి చూపించాలి. అప్పుడే బాల్యం వికసిస్తుంది. ఇదంతా పదే పదే చెప్పాల్సిరావడం నాకూ ఇబ్బందిగా వుంది" అనునయంగా చెప్పసాగారు మాధవరావు .
"అంత యిబ్బందిగా వుంటే కొన్నాళ్ళు ప్రియ వాళ్ళింటికి వెళ్లి వుండండి. అక్కడికి వెళ్లడం యిష్టం లేకపోతే యేదో ఆశ్రమానికి వెళ్ళి వుండండి. ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు రాజీవ్. ఊహించని మాటలకు మాధవరావు అవాక్కయ్యాడు.
"అయ్యో! పెద్దవారిని అలాంటి మాటలని బాధపెడతారెందుకు? మీరెప్పుడు యింటికి వచ్చినా యెవరూ అడగరులెండి.ముందు పైకి వెళ్ళండి, పిల్లలు చూస్తున్నారు. వాళ్ళ ముందు యివన్నీ బాగోదు" అంది వాటర్ బాటిల్ అందిస్తూ.
"షిట్ ...అసలు దీనికంతటికీ కారణం నువ్వు కాదూ " అంటూ భార్య చెంప చెళ్ళుమనిపించాడు రాజీవ్. చెంప పట్టుకుని నిలబడిపోయింది మీనా. పిల్లలు మౌనంగా అన్నం తినేసి తమ గదిలోకి వెళ్లిపోయారు. వెళుతూ "డాడీ బ్యాడ్ తాతయ్య. నేను కటీఫ్ చెప్పేస్తున్నా" అంది తొమ్మిదేళ్ళ పాప. మాధవరావు కోడలి వైపు చూసి "నన్ను క్షమించమ్మా" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
కాసేపటి తర్వాత సూట్కేస్ నిండా బట్టలు సర్దుకుని నౌకరుతో మోయించి కారులో పెట్టించుకుని బయటకి వెళ్ళిపోయాడు రాజీవ్ . ఆ రాత్రి తమ ప్రక్కన పడుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న తల్లిని దిగులుగా చూస్తూనే వున్నాడు సన్నీ. తన చిట్టి చేతులతో కన్నీరు తుడుస్తూ "అమ్మా! నువ్వేడుస్తుంటే నాకు యేడుపొస్తుంది" అన్నాడు. మీనా కొడుకుని హత్తుకుని మరింత యేడ్చింది.
తెల్లవారింది. పిల్లలు స్కూల్ కి వెళితే మాధవరావు మిత్రుడిని కలవాలని బయటకు వెళ్ళిపోయాడు. మీనా కూడా గది వదిలి బయటకు రాలేదు. సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత కూడా ఆ యింట్లో మౌనం రాజ్యమేలింది.
ఆ రాత్రి తనప్రక్కనే నిద్రపోయిన తల్లిని చూసి అప్పటిదాకా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సన్నీ పైన కప్పుకున్న కంఫర్ట్ ని తొలగించి మెల్లిగా మంచం దిగాడు. శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీసుకుని బయటకి వచ్చాడు. హాలంతా మసక చీకటిలో నిశ్శబ్దంగా వుంది. మోయలేని బరువున్న కుర్చీని శబ్దం కాకుండా సింహద్వారం దగ్గరికి చేర్చేసరికి సన్నీకి చెమటలు పట్టేసినయి. చేత్తో చెమట తుడుచుకుని కుర్చీ యెక్కి బోల్ట్ ని మెల్లిగా క్రిందికి లాగి మళ్ళీ కుర్చీని యధాస్థానంలో పెట్టేసాడు. తాతయ్య చూడకుండా దాచుకున్న తాళాల గుత్తిని జేబులో నుంచి తీసి గుర్తుపెట్టుకున్న తాళంచెవి పెట్టి రెండు సార్లు తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పి మధ్యలోకి తెచ్చి ఆపాడు. నెమ్మెదిగా తలుపు తీసుకుని బయటకి వొచ్చి బూట్లు తొడుక్కున్నాడు. చెట్ల నీడల్లో దొంగలా నడుస్తూ గేటు వరకూ చేరుకున్నాడు. వాచ్ మెన్ కూడా చలికి మునగదీసుకుని టోపీని ముఖం మీదకి జార్చుకుని గుర్రు పెడుతున్నాడు. గార్డ్ షెడ్ లోపలికి వెళ్లి గ్లాస్ డోర్ తాళం తీసుకుని రోడ్డు మీదకి వచ్చి స్వేఛ్చగా వూపిరి పీల్చుకుని కుడివైపుకు తిరిగి నడక మొదలెట్టాడు.
ఎదురొస్తున్న వాహనాల వేగం వెలుగు సన్నీకి భయం కల్గిస్తున్నాయి. ముఖం దించుకుని చకచకా నడుస్తున్నాడు. పెద్ద కూడలి వచ్చింది. నిన్న వుదయం అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి కాగితం మీద గజిబిజిగా వ్రాసుకున్న గుర్తులని పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు. అక్కడక్కడా జన సంచారం. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. సన్నీని అసలు పట్టించుకోవడం లేదు. రెండు గంటలు పైనే నడిచాడు నడిచాడు. నడుస్తున్న కొద్దీ పట్టుదల పెరిగి మనసులో భయం పటాపంచలై పోతుంది. రావాల్సిన చోటుకి చేరుకున్నాడు. అక్కడ గేట్ మెన్ మెలుకువగానే వుండి అటుఇటు తిరుగుతూ వున్నాడు. అతనికి కనబడకుండా చెట్టు మొదలునానుకుని నిలబడ్డాడు కాసేపు. రోడ్డుకావలి వైపున యెదురింటి ప్రక్కనే వున్న టీ కొట్టు దగ్గర టీ తాగుతూన్న ఇంకొకతను ఇతన్ని చేయి వూపి పిలిచాడు. హమ్మయ్య అనుకున్న సన్నీ పిల్లిలా అక్కడికి చేరుకొని కోతిలా గేటు యెక్కి లోపలికి దూకేసాడు.
కొంచెం చిన్నగా వున్నప్పుడు నాన్నతో కలిసి వొకసారి అక్కడికి వచ్చిన గుర్తు.
దైర్యంగా నిటారుగా ముందుకు అడుగులు
వేస్తున్నాడు. సరాసరి ఇంటి గుమ్మం ముందు నిలబడి మూడుసార్లు కాలింగ్ బెల్ మోగించాడు .
ఒక స్త్రీ వచ్చి తలుపుతీసి ఆశ్చర్యంగా చూసింది. మళ్ళీ
ఆపకుండా పదిసార్లు పైగా బెల్ మోగించాడు. వద్దు వద్దని
వారిస్తూ చేయి పట్టుకున్న స్త్రీ చేతిని అవతలకి తోసేస్తూ మళ్ళీ బెల్ మోగిస్తూనే వున్నాడు.
"కమలా, అన్నిసార్లు బెల్ మ్రోగుతుంటే చూడకుండా యేమి చేస్తున్నావ్, నిద్రంతా చెడిపోయింది" అనుకుంటూ ఆమె మెట్లు దిగివస్తుంది. ఆమె వెనుక నైట్ డ్రెస్ లో అతను. అతన్ని చూస్తూనే స్విచ్ బోర్డ్ వదిలేసి వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు సన్నీ. ఆమె సన్నీని చూసి ఆశ్చర్యపోయి అనేక అనుమానాలతో వెనుక యింకెవరైనా వున్నారేమోనని తొంగి చూస్తుంటే సన్నీని చూసిన రాజీవ్ నిరుత్తురుడైపోయాడు. మెల్లిగా తేరుకుని "సన్నీ! ఇంత అర్ధరాత్రి యిక్కడికి యెలా వచ్చావ్ నిజం చెప్పు, నిన్నెవరు తీసుకొచ్చారిక్కడికి" అనడిగాడు.
"ఎవరూ తీసుకురాలేదు డాడీ, నేనే వచ్చాను. నిజ్జంగా నేనొక్కడినే యిక్కడికి వొచ్చాను. ఇంటికి వెళదాం రా డాడీ" అని తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. "ఇప్పుడే వెళదాం, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను" అంటూ అతను మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు.
"కమలా, అన్నిసార్లు బెల్ మ్రోగుతుంటే చూడకుండా యేమి చేస్తున్నావ్, నిద్రంతా చెడిపోయింది" అనుకుంటూ ఆమె మెట్లు దిగివస్తుంది. ఆమె వెనుక నైట్ డ్రెస్ లో అతను. అతన్ని చూస్తూనే స్విచ్ బోర్డ్ వదిలేసి వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు సన్నీ. ఆమె సన్నీని చూసి ఆశ్చర్యపోయి అనేక అనుమానాలతో వెనుక యింకెవరైనా వున్నారేమోనని తొంగి చూస్తుంటే సన్నీని చూసిన రాజీవ్ నిరుత్తురుడైపోయాడు. మెల్లిగా తేరుకుని "సన్నీ! ఇంత అర్ధరాత్రి యిక్కడికి యెలా వచ్చావ్ నిజం చెప్పు, నిన్నెవరు తీసుకొచ్చారిక్కడికి" అనడిగాడు.
"ఎవరూ తీసుకురాలేదు డాడీ, నేనే వచ్చాను. నిజ్జంగా నేనొక్కడినే యిక్కడికి వొచ్చాను. ఇంటికి వెళదాం రా డాడీ" అని తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. "ఇప్పుడే వెళదాం, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను" అంటూ అతను మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు.
"సన్నీ, ఇలా రా బాబూ" అంటూ వొంగి సన్నీని యెత్తుకోబోయింది ఆమె. ఉహూ అంటూ తల అడ్డంగా వూపుతూ దూరంగా వెళ్లి నిలబడ్డాడు. "నా దగ్గరకి రావద్దులే, అలా సోఫాలో కూర్చో డాడీ వచ్చేస్తారు" అంది.
"నువ్వు బాడ్ గర్ల్ వి. నీతో మాట్లాడను" ఆ ఒక్క మాట అనేసి యింట్లో నుండి బయటకొచ్చి నిలబడ్డాడు. ఆమె కన్నార్పకుండా సన్నీని చూస్తూ నిలబడిపోయింది.
రాజీవ్ క్రిందికి వచ్చి "బై డాళింగ్ మళ్ళీ కలుద్దాం" అని ఆమె నడుంచుట్టూ చెయ్యేసి చెంపకి చెంప ఆనించి కళ్ళు చికిలించాడు. ఆమె రాజీవ్ ని మృదువుగా తోసేసి ముందుగా తానే గుమ్మము వైపుకి నడిచింది.
అతను గుమ్మము దాటి సన్నీని యెత్తుకుని "ఆంటీకి బై చెప్పు" అంటున్నాడు. సన్నీ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు కానీ పెదవి విప్పలేదు, చేయి వూపనూ లేదు. ఆమె అలా సన్నీ కళ్ళలోకి చూస్తూ రాజేష్ యేదో చెపుతున్నాకూడా వినిపించుకోకుండా ఠక్కున తలుపులు మూసేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి