కలువపూల చెంత చేరి కై మోడ్పు చేతును
నా కలికి మిన్న కన్నులలో కళ కళ విరియాలని
మబ్బులతో వొక్కమారు మనవి సేతుకొందును
నా అంగన పాలాంగనమున ముంగురులై కదలాలని
చుక్కలతో వొక్కసారి చూసింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని
పూర్ణ సుధాకర బింబంబునకు వినతి చేతును
నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని
ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్దింతును కడసారిగా
నా రమణికీ బదులుగా ఆకారం ధరియించాలని
**********************
ఏ పారిజాతమ్ము లియ్యగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూలు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలి
గుండె లోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందుచంద్రికా
శరదిందు చంద్రికా.. నీవు లేని తొలిరాతిరి
నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరిపానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు మనసులేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు
నీవు లేక నేనెందుకు
ఈ రెండు ఖండికలు జ్ఞాన పీఠ ఆవార్డ్ గ్రహీత డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు వ్రాసినవి .. మొదటిది "చూపులతో వొక్కసారి చూసింతును" అనే కావ్యంలో నుండియు రెండవది "ప్రకృతిలో ప్రణయిని " లో నుండియు తీసుకుని యీ చిత్రంలో పొందుపరిచారు.
పూర్వ జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల "ఏకవీర" ను 1969 సంవత్సరంలో నిర్మించిన "ఏకవీర " చిత్రంలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సంగీతం కె వి మహదేవన్.
ఈ రెండు గేయాల సాహిత్యాన్ని చదువరులకు పరిచయం చేయడం మరియు టెక్స్ట్ లో లభించేవిధంగానూ ఉండుటకు చిరు ప్రయత్నం చేయడమైనది. తప్పులు ఉన్నట్లయితే మన్నించగలరు. వింటూ వ్రాయడం జరిగింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి