"పూవై పుట్టి "
(కొత్త కథ 2019 కథా సంపుటిలో ప్రచురించిన కథ).
(కొత్త కథ 2019 కథా సంపుటిలో ప్రచురించిన కథ).
"రచయితలను
నేరుగా స్వర్గానికి కదా తీసుకు వెళ్ళాల్సింది విచారణకు యెందుకు తీసుకొచ్చారు" అని అడిగింది
పెద్ద వెలుగు.
"ఈమె
స్వర్గానికి వెళ్ళడానికి గింజుకుంటున్నారు. తనకు అర్హత లేదంటున్నారు. అందువల్ల మీ ముందుకు
విచారణకు తీసుకుని వచ్చాము" అని చెప్పింది చిన్న వెలుగు
"యిక్కడ స్వర్గం నరకం మాత్రమే నిజం. స్వర్గమంటే వెలుగు
నరకమంటే చీకటి. సాధారణంగా చేసిన పనుల వల్లనూ
వారి గురించి మాట్లాడుకుంటున్న మాటల వల్లనూ ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. రచయితంటే
రవిలాంటి వాడని అర్దం. అక్షర బ్రహ్మ అని కూడా వ్యవహరింతురు కదా తను సృష్టించే యే పాత్ర వైపు బరువు పడకుండా
ధర్మదేవతలా నిలబడే వాడనికదా అర్దం. అందుకే
మీరు చేసిన పాపాలతో నిమిత్తం లేకుండా సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తూ వెలుగులోకి చేరుకున్నారు . వెళ్ళండి వెళ్లి ఈ వెలుగును మరింత అనుభవించండి" అంది
పెద్ద వెలుగు.
"లేదు
లేదు నాకొక కోరిక వున్నది అది తీరువరకూ నన్ను ఆ లోకంలోనే సంచరించే అవకాశం ఇవ్వండి" అభ్యర్ధించింది బూడిద రంగు సూక్ష్మ శరీరం.
"అలా
ఎందుకు కోరుకుంటున్నారో మీరు విన్నమించుకోగల్గితే
ఆలోచిస్తాం" అంది పెద్ద వెలుగు
బూడిద
రంగు సూక్ష్మ శరీరం తన వేదనను యిలా వినిపించసాగింది.
"రచయిత
సృష్టించిన పాత్రలలో తనను చూసుకుని లీనమవుతూ లేదా తనకు తెలిసిన వారినెవరినైనా స్పురణకు
తెచ్చుకుంటూ పాఠకులు రచనలో మమేకమై పోతుంటారు. రచయితకి యిలా జరిగే ఉండొచ్చు అని కూడా
వూహిస్తారు. అది నాకు ఎప్పుడూ ఇబ్బంది కాదు కానీ యిప్పుడక్కడ నన్నెవరూ అభిమానంగా అక్షరాలపల్లకీ యెక్కించి వూరేగించడంలేదు.
అవార్డ్ లు రివార్డ్ ల సంగతి అలా ఉంచండి కనీసం
వర్దంతి జయంతి వేడుకలు పూలదండలు యేమీలేవు. దుర్మార్గురాలు, ద్రోహి. సమస్తం మాధవమయం అని మధురభక్తితో వూరేగినన్నాళ్లు వూరేగి హఠాత్తుగా నల్లముసుగు వేసుకుంటుందా.. అని తిట్టిపోస్తున్నారు.
నన్నెవరూ అర్దం చేసుకోవడం లేదు, పత్రికల వాళ్ళు కొందరైతే నా గురించి
యిష్టం వచ్చినట్లు వండి వడ్డిస్తున్నారు. నేను యెంతో బాగా వ్రాసానని మెచ్చుకుని అభిమానంతో వూగిపోయిన
పాఠకజనం కూడా నా చిత్రాన్ని చూసి ముఖం తిప్పేసుకుని మరలా ఆపుకోలేని వుత్సాహంతో ఆసక్తిగా
చదువుతున్నారు. ఏ వొక్కరూ కూడా నను అదివరకటిలా మనఃస్పూర్తిగా హృదయానికి హత్తుకోవడం లేదు. ఎవరికీ వారు నువ్వు ఇంకో దేవుడి తాలూకూగా అన్నట్టు నన్ను అనుమానంగా చూస్తున్నారు.
మీరన్నట్టు చదువరి కూడా న్యాయ దేవతలా నిలబడి
నన్ను ఇష్టా ఇష్టాలున్న మనిషిగా గుర్తించి
నా వ్యక్తిగత జీవితంతో సంబంధం లేని ఒక రచయితను మాత్రమే ఆ రచనల్లో చూసినప్పుడు
నాకు మనఃశాంతి వుంటుంది. అప్పుడే యీ వెలుగు లోకంలోకి వస్తాను. అప్పటిదాకా నన్ను సూక్ష్మరూపంలో ఆ లోకంలోనే సంచరించడానికి అనుమతి ఇప్పించండి" అని వేడుకుంది ఆ బూడిదరంగులో
కనబడుతున్న సూక్ష్మ శరీరం.
"సరే మీ వేదన
జాలి గొలుపుతుంది.అనుమతి ఇచ్చాము వెళ్లి రండి" అంది పెద్ద వెలుగు.
తాను
జీవించి మరణించిన కాలానికి ఈ భూమి పై చేరుకొని
సంచరిస్తూ వుంది బూడిద రంగు సూక్ష్మ
శరీరం. వెతుకుతూ వుంది. ఆ శరీరానికి రోజులే,కానీ ఈ లోకంలో యేళ్ళుకేళ్ళు గడిచిపోతున్నాయి. ఆమె సూక్ష్మ శరీరం సహస్రాక్షుడిగా
మారి భూమిపై తాను సృజించిన అక్షరాలను చదువుతూ తన చిత్రాలను
చూస్తూ వున్న వారి మెదడునూ మనసునూ పట్టిపట్టి చూస్తుంది.కొందరు అభిమానంగా తల్చుకుంటున్నారు. కొందరు మంచిగానూ చెడుగానూ
మధ్యస్థంగానూ తల్చుకుంటుంటే సంతోష పడుతూనే తనకు కావాల్సిన అభిప్రాయం కోసం సహనంగా
ఎదురు చూస్తుంది.
ఆ
సూక్ష్మ శరీరం ఓ కార్పొరేట్ హాస్పిటల్లో టీవీ చూపిస్తున్న దృశ్యాల
ముందు ముగ్గురి మనుషుల మధ్య జేరి ఆసక్తిగా
చూస్తుంది. ఆ సూక్ష్మ శరీరానికి సంతోషంగా కూడా వుంది అక్కడ కొన్నేళ్ళు తనతో మెలిగిన మున్నీని చూసి .
.*******************************
సెలైన్ బాటిల్ లో కలిసిన డ్రగ్
చుక్కల చుక్కలుగా రాలి శరీరంలోకి యెక్కుతుంటే మగతగా కళ్ళు మూసుకున్న భర్తను
చూస్తూ టీవీ ఆన్ చేసి ఛానల్స్ మార్చుతుంటే
ప్రఖ్యాత రచయిత గురించి సంస్మరణ కార్యక్రమం వస్తుంటే అక్కడ ఆగిపోయింది పద్మ.
నర్స్
వచ్చి పేషంట్ ని సెలైన్ బాటిల్ ని చూసి లంచ్
కి వెళుతున్నాను. అయిపోవడానికి అయిదు నిమిషాల ముందు బజర్ నొక్కండి. ఇంకొక బాటిల్ యెక్కించాలి
అని చెపుతూ యధాలాపంగా టీవీ వంక చూసి కొన్ని
నిమిషాలు అక్కడే నిలబడి "కొన్ని సత్యాలు అసత్యాలుగా అసత్యాలు సత్యాలుగా చెలామణి
అవుతూ ఆ ప్రేమమయి చరిత్రకు మసి పూస్తుంటే బాధ కల్గుతుంది" అంది.
"ఆమె
గురించి మీకు తెలుసా, ఆమె రచనలు చదువుతారా" ఆసక్తిగా అడిగింది పద్మ
"ఆమె
నా ఆలోచనల్లో ఇరవయ్యేళ్ళకు పైగానే ప్రయాణిస్తుంది. ఆమె అనంత ప్రయాణం ముగిసి తొమ్మిదేళ్ళు.
ఆమెతో కొన్నేళ్ళు కలిసి వున్నాను కూడా"
అంది..
"నిజంగా
".. మరింత ఆశ్చర్యం పద్మ ముఖంలో
"అవును"
అంది బలవంతంగా నవ్వుతూ. అప్పటికే ఆ నర్స్ ముఖం
పై నీలినీడలు.
"భోజనం
చేసి త్వరగా వచ్చేయండి. మీ దగ్గర ఆమె గురించిన విషయాలు చాలా వినాలి. ప్లీజ్ చెపుతారు
కదా!" అంది పద్మ వొకింత ఉద్వేగంగా.
"
తప్పకుండా, కొన్నేళ్ళుగా యెవరితో పంచుకోవాలో తెలియని బాధని మీతో పంచుకుంటాను అంటూ తెరపై వో
మూలగా కనబడుతున్న ఆమె ఐకాన్ ని చేతితో
ప్రేమగా ఆత్మీయంగా తడిమి చిప్పిల్లిన కళ్ళతో బయటకి వెళ్ళిపోయింది.
తనంటే
ఇంత గాఢ అభిమానం వుందా మున్నీకి. ఆమె ఏమి చెపుతుందో తప్పక విని తీరాలి అనుకుంది సూక్ష్మ
శరీరం. అంతలోనే అసలు తన కొడుకులేమనుకుంటున్నారో
తెలుసుకోవాలి. ముందు చిన్న కొడుకింటికి వెళితే
బాగుంటుంది అనుకుని అక్కడికి చేరుకుంది.
అక్కడ
చిన్న కొడుకు ఆదిత్య పత్రికలో తల్లి గురించి
వ్రాసిన విషయాలని చదివి ఆవేశపడుతున్నాడు. భార్య ఉష తో మా అమ్మ గురించి యేమి చెప్పాలనుకుంటుందీమె సత్యాలను దాచి కొన్ని శక్తులు అనుకూలంగా చిత్రించే భాధ్యతను తలకెత్తుకుందా ? అమ్మని ప్రపంచం ముందు
చపలచిత్తురాలిగా చిత్రించడం నాకసలు నచ్చలేదు. అమ్మది యెంత దృఢ
సంకల్పం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే యెన్నటికీ మార్చుకోదు. మతం మార్చుకునేముందు అన్నయ్య,
పిల్లలు, బంధువులు యెందరు అభ్యంతరం చెప్పినా ఆమె
అనుకున్నదే చేసి తీరింది. ఆమె పట్టుదలే నాకూ వచ్చింది కాబట్టే ఆఖరి క్షణాలలో ఆమె చెవిలో
నారాయణ నారాయణ అంటూ మంత్రాన్ని వినిపించింది నేనే కదా, నాది కాని మతాన్ని ఆవహింపజేసుకుని ఆమెకి సాంత్వన కల్గించనూలేదు. నీకు తెలుసు కదా యిదంతా.. నువ్వెందుకు స్పందించవు
వీటి గురించి అని అడిగాడు తీవ్రంగా.
నిజమేనండీ, ఎవరి యిష్టాలు వారివి.
అత్తయ్యగారు జీవితంలో వందలమంది పురుషులని చూపులతోనే
వొడపోసి వుంటుంది.ఇప్పుడీ అపవాదులని మోస్తుంది. తాము అనుకున్నదే నిజమై తీరాలన్న లోకం
తీరుపై ముఖ్యంగా ఆ వ్యాసం వ్రాసిన ఆమెపై నాక్కూడా అమితమైన కోపం వస్తుంది
అంది ఉష.
జీవన
నాటకంలో అందరూ పాత్రధారులే. అప్పుడప్పుడు వెళ్లి ప్రేక్షకుల మధ్య మనమూ కూర్చుంటాము.
ఆమె జీవితంలోనూ అతనొక పాత్రధారుడు. శుక్లపక్ష తదియ లాంటి అతని నవ్వులో ఆకర్షణ వుండటం
నిజమే కావచ్చు. నాలుగు మెరమెచ్చు మాటలు చెప్పి కొన్ని గజల్స్ వినిపించి అమ్మకి సంతోషం
కల్గించి వుండుంటాడు. అంతమాత్రానికే తన కొడుకుల
వయసు కన్నా చిన్నవాడైన అతనితో అలాంటి బంధంలోకి వెళుతుందా ? అసహ్యంగా వుంది. తమ జీవితాలను
తీర్చిదిద్దుకోవడం, సంతోషంగా యెలా వుండగలమో తెలుసుకోలేని మూర్ఖులు
యితరుల జీవితాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటి అయిపొయింది. కల్పనకి కూడా హద్దూ పద్దూ
వుండొద్దూ అని విసుక్కున్నాడు.
చిన్న
కొడుకు కోడలు మాటలు విని నవ్వుకుంది సూక్ష్మ
శరీరం.
పెద్దన్నయ్య
భాస్కర్ తో మాట్లాడాలని కాల్ చేస్తున్నాడు ఆదిత్య. లైన్ ఎంగేజ్లో వుంది. భార్యతో మళ్ళీ
తల్లి గురించిన మాటల్లో పడ్డాడు.
ఆమెకి
దొరకనిది వెతుకుతున్నది వొకటే.అది సుసాంగత్యం. అమ్మ అన్ని మతగ్రంధాలను చదివేది కదా బైబిల్ ఖురాన్ బౌద్ధ గ్రంధాలను యెన్నింటిని చూడలేదు
మనం ఆమె బల్లపై అన్నాడు తన అభిప్రాయాన్ని బలపరుచుకుంటూ .
"అవునండీ..మనుషులు
సృష్టించిన దేవుళ్ళు యే వరాలు ఇవ్వలేరు. నువ్వొక
వరమీయి అంటూ మీ వద్ద యెన్నిసార్లు మాట తీసుకోలేదు చనిపోయిన తర్వాత తన సమాధి ప్రక్కన జ్ఞాపకంగా యిష్టమైన పూల మొక్కని నాటమని కూడా చెప్పింది. ఆ పని చేయలేకపోయినందుకు బాధగానే వుంది.
మన తోటలో ఒక మొక్క నాటి అత్తయ్య గారి విగ్రహం
పెడదాము. అలా చేస్తేనన్నా ఆమె ఆత్మ శాంతిస్తుంది" అంది ఉష.
వద్దొద్దు.
ఆ పని చేస్తే మళ్ళీ మనం పత్రికల నోళ్ళలో మరికొన్నాళ్లు
నానుతాము. పొరుగురాష్ట్రంలో మరణించితే స్వరాష్ట్రానికి తీసుకెళ్లి అధికార లాంఛనాలతో
ఆమెను సాగనంపడం ఎంతైనా అమ్మకి దక్కిన అపురూప గౌరవం కదా "అన్నాడు
గొప్పగా.
"హృదయగానాన్ని
గుర్తించడం యెలా అనేకదా అత్తయ్య వ్రాసినది. ఆమె వ్రాసిన రాతలతో అతికొద్ది సత్యం
అప్రమేయమైన వూహలు మాత్రమే యెక్కువగా వుండేవి. సంచలనం కోసం యేవేవో రాస్తే వొకప్పుడు ఆమెని నిందించిన కుటుంబమే ఆమె మతం మార్చుకున్నానని విచారపడితే
సంతోషించాల్సిన వారిమే కదా ! ఆ కోణంలో
అయినా ఆలోచించదు లోకం. ఆమె తోడబుట్టిన వాళ్ళు కూడా యేదో వొక వ్యాఖ్యానం చేస్తున్నారు. బాధగా వుంటుందండి" అంది కోడలు.
"అన్నయ్య
యేమి ఆలోచన చేస్తున్నాడో, తన గౌరవానికి భంగం కల్గుతుందని విసుక్కున్నవాడు యిలాంటి సమయాల్లో ఖండించవద్దూ,
మా అమ్మకి అలాంటి వుద్దేశ్యం విచారమూ వుండేది కాదు. ఆమె మనఃస్ఫూర్తిగా
ఆ మతాన్ని ప్రేమించింది ఆలింగనం చేసుకుంది అని చెపుతాడా చెప్పడా" అని ఆదిత్య
అనుకుంటుండాగానే పెద్ద కొడుకు భాస్కర్
నుండి కాల్ వచ్చింది.
"అన్నయ్యా
అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు" అని అడిగాడు ఆదిత్య. "అమ్మ మనసులో యేముందో నాకు మాత్రం
యేమి తెలుసు,నీ దగ్గరేగా యెక్కువ కాలం వుంది. మంచిగానో చెడుగానో మనకి ఒక ఖ్యాతిని ఆర్జించి
పెట్టిన అమ్మని అగౌరవపరచడమెందుకు నువ్వన్నట్టుగానే
నేను ఒక ట్వీట్ చేస్తాను. పైగా వరల్డ్ వైడ్ గమనిస్తుంది. అని ఫోన్ పెట్టేసాడు.
ఉస్సూరుమంది
సూక్ష్మ శరీరం. వీడికెప్పుడూ హడావిడే. తమ్ముడితో యెక్కువసేపు మాట్లాడితే వాడికి అనుమానాలు
తీరిపోయేవిగా అనుకుంది. ఇక రెండవ కొడుకు కిరణ్ యింటికి వెళ్ళింది.
అక్కడ
ఒక పత్రికలో వున్న అమ్మ ఫోటోని చూసి కళ్ళ నీళ్ళు
పెట్టుకుంటున్నాడు కిరణ్ . మా అమ్మ మహారాణిలా యెంత అందంగా వుంది. ఈమె కడుపున కదా తానూ జన్మించినది.
ఆమె ప్రేమ కూడా మధ్య వాడైన తనపైన కూడా యెంతో వుండేది. ఆ
యిద్దరిని వదిలేసి తన రచనలపై పూర్తి
హక్కుని నాకే వ్రాసి యిచ్చింది. ఆమె మనసుని
నాకన్నా యెక్కువ చదివినవారు యెవరుంటారని
? ఆమె ప్రాణ స్నేహితులు కూడా సెన్సేషన్ కోసం ప్రపంచానికి యేదైనా చెప్పవచ్చు, యేమైనా సృష్టించవచ్చు. ఎవరినీ నమ్మడానికి
వీలులేదు అసహనంగా అనుకుంటూ యింకొక పత్రిక వైపు చూసాడతడు.
ఆ
పత్రికలో మారిన మత సంప్రదాయ వస్త్రాలు ధరించి మార్చుకున్న పేరుతో వున్న చిత్రం ఒకటి
. తానిప్పుడు నట్టింట్లో యే ఫోటో
పెట్టుకోవాలి? అన్న చిన్న సందేహంతో పాటు ఆమె గురించి బాగా తెలిసిన సహాయకురాలు పత్రికలవారికి
వున్నవీ లేనివీ చెపుతూవుండవచ్చు అని అనిపించింది. ఆమె నెంబర్ కోసం చూసాడు. దొరకలేదు. అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురిని వెతికి వారిని అడిగి ఆమె నెంబర్ ను అడిగి తీసుకుని వెంటనే ఆమెకి కాల్ చేసాడు.
మున్నీ,మీరు పత్రికల వారికి అమ్మ గురించి యే
విధమైన సమాచారం యివ్వడం అంత మంచిది కాదు. కుటుంబానికి యెంత గర్వకారణంగా ఆమెని
మోసామో అంతకన్నా యెక్కువ అపకీర్తినిపుడు మోయాల్సివస్తుంది.
దయచేసి మా బాధని అర్ధం చేసుకుని పత్రికలవాళ్ళని దగ్గరకి రానీయకుండా వుంటే మంచిది అని హెచ్చరిస్తూనే యిది ఆమె అభిమానిగా మీ కర్తవ్యమ్ కూడా అంటూ చిన్నపాటి ఎమోషన్ ని జతచేసాడు మాటల్లో.
కిరణ్ బాబూ ఆ మాత్రం నాకూ తెలుసు. అయినా నేనెక్కడో రెండు
రాష్ట్రాల అవతల వున్నాను. మీరు నిబ్బరంగా వుండండి. కానీ అమ్మ గురించి మీకు తెలియని విషయాలుంటాయి కదా, పోనీ అవేంటో మీకైనా
చెప్పనీయండి అంటూండగానే వద్దు, అలాంటివి వినే ఆసక్తి,
అవసరం నాకు లేదు. నాకే కాదు యింకెవరికి చెప్పే ప్రయత్నం చేయొద్దు నిష్కర్షగా
చెప్పి అని ఫోన్ పెట్టేసేడు.
సూక్ష్మ
శరీరం విరక్తిగా నవ్వుకుంది. ఇంతకన్నా తన కుటుంబం నుంచి యేమి కోరుకున్నాను గనుక అననుకుంటూ అక్కడి నుంచి తప్పుకుంది.
కిరణ్ మాటలు విన్న మున్నీ రాయిలా నిలబడిపోయింది కాసేపు.
ఎంత
చెడ్డదీ లోకం. సత్యాన్ని మరుగుపర్చడమే దాని నైజం. దేనినైతే ఆమె అమితంగా ద్వేషించేదో
అదే నిజమవుతుంది. తనవాళ్లు పరాయి వాళ్ళు యెవ్వరూ దానికతీతులు కారు అంటూ వుండేది. అదే
నిజమవుతుంది.
ఏడెనిమిదేళ్లపాటు
ఆమెతో కలిసి వుంది. ఆమెని,
ఆమె ద్వారా లోకాన్ని చదవగల్గింది ఆమె. ఈ పాపిష్టి లోకపు మాటలు అంటని సుదూర తీరాలకేగిపోయాక కూడా అప్పుడు
పొడిచి చంపిందికాక తీరికగా మళ్ళీపొడిచి పొడిచి చంపుతున్నారిపుడు. అప్పటికప్పుడు
జ్ఞాపకాల గుట్టలని తవ్విపోస్తూ తనకిష్టమైన ఆమె కవిత్వాన్ని గుర్తుతెచ్చుకుంది.
మర్నాడు ఆ కవిత్వాన్ని చదివి వినిస్తుంది హాస్పిటల్
లో పద్మ కి.
"బ్రతికుండగానే
ఆత్మని సమాధి చేసి పవిత్రత ముసుగేసుకునే ప్రపంచానికేమి తెలుసు ప్రణయ బాధ
కురిసి
కురవక మరలి వెళ్లే మేఘాలను చూస్తూ ఇసుక తుఫాన్
గా మారిన ఎడారి యెడబాటు కథ
హృదయాలను
కెలకకండి ఆలోచనలను త్రుంచ ప్రయత్నం చెయ్యకండి.
బూతద్దాలతో అంతరంగాలను
శోధించే పని మొదలెట్టకండి
బడబాగ్నులు
దాచుకున్న మహా సముద్రం వాళ్ళు
యేదో
వొకనాడు దావానలంలా చుట్టేస్తారు వాళ్ళు"
వింటున్న
బూడిదరంగు సూక్ష్మ శరీరం ఆనందంతో నాట్యం చేసింది
అక్షరాలా
విస్ఫోటనం ఆమెది కాక మరెవరిది. అభిమానులు ఆమె వాక్యాన్ని చప్పున పోల్చుకోగలరు వెనువెంటనే
హారతి యివ్వగలరు.శీర్షికల క్రింద పేరు చూసి
పాఠకులు ఆత్రుతగా చదువుకునే సంచనల రచనలు చేసేది.స్త్రీల కోరికలు, దుఃఖం మరియు నిరాశ గురించి
నిజాయితీగా మాట్లాడేది ఆమె. గజగామిని వీపు ప్రదర్శన , చాందిని నడుము ఒంపులు, టబు కటి నాట్యం
చూసే రసిక ప్రేక్షకులున్న దేశంలో కళని, స్త్రీ అంతరంగ వేదనని
యెగతాళి వ్యాఖ్యలతో వొంకర నవ్వులతో లెక్కించే
సమాజంలో ఆమె స్త్రీల గురించి యేమి వ్రాసినా
అబ్బురంగా చదివిన పాఠకులు లక్షలమంది. ఆమె అభిమానిని అని చెప్పుకోవడమూ నాకు గర్వంగానే వుంటుంది. ఆమె దగ్గరే నాకు వుద్యోగం దొరుకుతుందంటే సంతోషం కాదు. ఇష్టంగా వుద్యోగంలో
చేరాను . ఆమె భర్త చనిపోయినరోజులవి. బిడ్డలు యెవరి దారిన వాళ్ళు యెగిరిపోతే తోడు కోసం
నన్ను నియమించుకుంది. ఆమె మంచి హాస్యప్రియురాలు. చీటికీ మాటికీ పెద్దగా నవ్వేది ఆ నవ్వులో
అమాయకత్వమే కనబడేది. ఆశగా వుత్సాహంగా చైతన్యంగా వుండేది. ఏ విషయాన్నైనా నిర్భయంగా ధారాళంగా
తార్కికంగా మాట్లాడే ఆమె దగ్గరకి నిత్యం యెందరో మిత్రులు పత్రికా రంగం వారు అనేకులు
వచ్చిపోతుండే వారు. అభిమానిని అంటూ ఫోన్ చేసిన అతనికి అపాయింట్మెంట్ కూడా కుదిర్చి
పెట్టింది నేనే. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం.
వేళల్లో
వేళ్ళు జొనుపుకుని మంచంపై కూర్చున్న ఆమెని సమీపిస్తూ ఆమె గోరింట గోళ్లని చూస్తూ నా
హృదయ రుధిరంతో మీ గోళ్లు ఎర్రబారినట్టున్నాయి, అంతగా మీ భావాలతో నన్ను
గుచ్చి చంపారు అంటూ ఆమె పాదాలకు కొంచెం ఎడంగా
వినయంగా నేలపై కూర్చున్నాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఇచ్చిన రెండు గంటల సమయం దాటి మరో
మూడు గంటలు పైగా అతని ఆకర్షణీయమైన కబుర్లతో
రచనలపై అభిప్రాయాలతో గడిచిపోయాయి. ఆకలవుతుందని
అడిగిన అతనికి అప్పటికప్పుడు స్వయంగా వొండి
వడ్డించింది. వెళ్ళేటప్పుడు తాను వ్రాసిన పుస్తకాలన్నింటిపైనా ఆటోగ్రాఫ్ యిచ్చి బహుకరించింది.
అది
మొదలు ఆమెకి ప్రతి రోజూ అతని నుండి ఫోన్ కాల్స్
వస్తూ వుండేవి. విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడి నుండి కూడా ఆమెకి కాల్స్ వచ్చేవి. గంటల
తరబడి ఆకలి దప్పికలు మరచి అతనితో సంభాషిస్తూ వుండేది. అతని సంభాషణలన్నీ గ్రీష్మపు గాలిలో
మొగలి పూల వాసనని మూటగట్టుకుని వచ్చి మొహంపై
కొట్టినట్లు వుండేవని వ్యాఖ్యానించేది . ఆమె
ఊహలన్నింటిని ఊసులుగా మార్చి అందమైన భాషలో సంభాషించేవాడు ఆమె డిజైర్స్ ని ఆకళింపుజేసుకుని
యెలా మాట్లాడితే ఆమెకి నచ్చుతుందో గ్రహించి అలాగే సంభాషించి ఆమె మనసుకి దగ్గరైపోయాడు.అతను సమ్మోహనంగా నవ్వినప్పుడల్లా నేరుగా వచ్చి హృదయానికి దిగబడి నట్లుంటుందని తనకి కల్గిన భావాలని సంకోచంలేకుండా చెప్పేది. ఒకరకంగా
సునామీలా ఆమె జీవితంలోకి వచ్చాడతను.నిప్పుని వొడిలో దాచుకున్నట్లు అసంతృప్తిని యాభై
ఏళ్ళు దాచుకుని బ్రతికింది ఆమె . తాను సుఖించడం ఆదేశించడమూ తప్ప తన మనసులోకి తొంగి చూడలేకపోయిన భర్తను తృణప్రాయంగా తుడిచేసిందనే అనిపించేది.
కొన్నాళ్ల
తర్వాత అతని ఆహ్వానం మేరకు అతని అతిధి గృహానికి వెళ్లాం. ఆ ఇల్లు నది వొడ్డునే వుంది. మసక చీకట్లో నది వొడ్డున్న కూర్చున్న ఆమె వద్దకు వచ్చి ఆలస్యానికి
చింతించమని అడుగుతూ నదిలో కాళ్ళు జాపుకుని
కూర్చున్న ఆమె పాదాలపై దోసెళ్లతో నీళ్లు వొంపుతూ "ఎచట నీ పదాంకముల నీక్షింతు నచట
అడవి దారియు నందన వనమట్లు తోచు " గజల్ వినిపించాడు. ఆమె నవ్వుతూ అతని వంక చూసింది.
"ప్రేమ భిక్షకునిన్ హింస పెట్టు టరయు ప్రాణ సౌందర్య రాజ్ఞికి పాడి కాదు
" అని మరో గజల్ వినిపిస్తూ ఆమె కళ్ళల్లోకి చూసాడు. అతని కళ్ళల్లో ఆరాధనకి చలించిపోయినట్లయింది. అతి
తేలికగా అతని బాహువుల మధ్య ఆమె. నేనొకదాన్ని వున్నాననే సృహ కూడా లేకుండా నదిలో స్నానాలు, చేతిలో చెయ్యేసి తిరగడాలు
కొసరి కొసరి తినిపించుకోవడం అలా మూడు రోజులపాటు
వారిదైన సామ్రాజ్యంలో విహరించారు.రచనలలో స్త్రీల ఆలోచనలు మనసు గురించి రచయితగా యెంత
స్పష్టమైన ప్రతి బింబమో వ్యక్తిగా అంత
అస్పష్టమైన ఆలోచనలతో అమాయకంగా అతని మోహంలో చిక్కుకుంది. తన ఆలోచనలతో యేకాభిప్రాయం గల,
తన మేథని మెచ్చుకోగల స్నేహితుడిని ఆకాంక్షించిందేమో. వయసు పెరిగేసరికి
జ్ఞానం తెలిసే కొద్దీ సంస్కారం పెరిగే కొద్దీ
కొత్త అభిరుచులు మేల్కొని కోర్కెలు
బలపడతాయేమో అనిపించేది నాకు.
వీడ్కోలు
తీసుకుని వచ్చిన కొన్నాళ్ళకి ఆమె యింట్లోనే
కొద్దిమంది మత పెద్దల మధ్య ఆమె మతం మార్చుకుని పేరు కూడా మార్చుకుంది. వారు ఆమెకి కొత్తగా మారిన మత సంప్రదాయ దుస్తుల్ని
బహుకరించారు. ఆమె నిర్ణయం నన్నే కాదు లక్షల ఆమె అభిమానులని గాయపరిచింది. సంప్రదాయాల
ముసుగులో మనిషిని అవమానించే మత విశ్వాసాలపై వెగటు పుట్టిందని తనకి కావాలనుకున్నది స్వల్పంగానైనా దక్కించుకున్నానని సంతోషంగా చెప్పేది . ఇదే విషయాన్ని ఆమె మిత్రురాలికి ఫోన్ లో చెబుతూ
వుండేది. ఆమెని బంధువులందరూ వెలివేశారు. ముఖ్యంగా
వృద్ధురాలైన తల్లిని చూడలేకపోవడం ఆమెకి అమిత బాధ కల్గించింది. స్త్రీ అంతరంగం సముద్రం
లాంటిది లోతుపాతులు చెలియలికట్టలు తెలుసుకొనుట
మానవమాత్రులకి అసాధ్యం. ఆ కాలంలో పత్రికలలో వచ్చిన గూఢ చిత్ర కవితలు కూడా ఆమె మనసుని తెలియజేసాయి.
మనుషులని
మతాల వారీగా విడదీసే మనుషులకేమి తెలుసు మతాలకి అతీతమైనది మానసిక ప్రేమ. దశాబ్దాలపాటు తన మానసిక ఆధారమైన మాధవుడ్ని
మరిపించే ప్రేమ నాకు లభ్యమైనప్పుడు ఆ మతాన్ని
తృణప్రాయంగా విసర్జించానని లోకం కోపగించుకుంటుంది.
ఆ మాధవుడే ఈ మానవుడై తనకి తటస్థించి మధుర ప్రేమని రుచి చూపించి మతమెందుకు మారకూడదు
అని సూటిగా నన్ను నాద్వారా సమాజాన్ని ప్రశ్నించినప్పుడు అవును యెందుకు మారకూడదు అని
నాకూ అనిపించింది. జీవన పర్యంతం ప్రేమరాహిత్యాన్ని అనుభవించి ద్రోహాన్ని,బంధాలలో మోసాన్ని మోసిన
నాకు రవంత వుపశమనం కల్గితే యీ లోకానికి యేమి నష్టం అనేది పదే పదే. అవును వొకరి
అంగీకారాలతో ఆమెకి యేమి అవసరం ఆమె జీవితం ఆమెది అనుకునేదాన్ని నేను కూడా.ప్రణయం అంటే
ఆమె దృష్టిలో దైవత్వం. పలుకులో చూపులో స్పర్శలో అనుభూతిని పొందుతూ యిరువురూ మమేకం చెందటం.
అతను
బహుమతిగా యిచ్చిన మొబైల్ ఫోన్ ని యెప్పుడూ జాగ్రత్తగా నడుముకి బిగించుకున్న బెల్ట్
లో పెట్టుకుని అతని పలకరింపుకై ఆశతో యెదురు చూసేది. కానీ అతను మళ్ళీ యెప్పుడూ ఆమె యింటి వైపు తిరిగి
చూడలేదు.ఇప్పటికే మన గురించి లోకం కోడై కూస్తుంది.
నా రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి చాలా నష్టం అంటూ ముఖం చాటేశాడు. అప్పటికే
రెండు వివాహాలు చేసుకున్నతను మళ్ళీ వివాహం
అనే పదం వినడం నచ్చక ముఖం చాటేసాడని
ఆమెకి అర్ధమయ్యింది. ఆమె స్పర్శను ప్రేమని కోరుకుంది. కోరికను కాదు. మోసపోయానని ఆమెకి తెలిసిపోయింది.కానీ
వొప్పుకోవడానికి ఆభిజాత్యం అడ్డువచ్చేదనుకుంటాను. ఘర్ వాపసీగా వెనక్కి వచ్చేయమని హితుల
వొత్తిడిని కూడా ఆమె తిరస్కరించింది. ఒకోసారి
దైద్వీ భావనలో వూగిసలాడేది అలాంటప్ప్పుడు ఆమె ఆలోచనలను నాతోనూ దాపరికం లేకుండా పంచుకునేది.అంతరంగంలో ఆమెకి భయం. అల్లరి మూకలు తనపై దాడి చేస్తారని పసికట్టింది. తన పిల్లలు,వారి పిల్లలపై దాడి చేస్తారని
భయపడి మౌనంగా వుండిపోయింది.నిజానికి మతాల రంగు పులుముకున్న మనుషులని కాకుండా మనసు విప్పుకుని మాటలు కలబోసుకునే స్నేహాన్ని ప్రేమని ఆకాంక్షించింది. మనిషికి మతం
చిరునామా కాదని ప్రేమే అన్ని మతాలకి చిరునామా అని తాననుకున్నది నిరూపించాలని నిమిష
కాల వ్యవధిలోనే మరో మతాన్ని యిష్టంగా హత్తుకుంది.
అతను మాత్రం చిన్న చిన్న చేపలని వలవేసి మత
మార్పిడిలోకి లాగడం కన్నా తిమింగలానికే వలవేసి విజయం సాధించాడని అనిపించేది.
సంప్రదాయ
కుంటుంబాలలో పురుషులు, పిల్లలు ఆఖరికి తోటి స్త్రీలు కూడా పితృస్వామ్య భావజాలంతో నోళ్ళు నొక్కేస్తారు.
నిజాలను కూడా కల్పనలుగా, సెన్సేషన్ కోసం వ్రాసిన వ్రాతలుగా కొట్టిపడేస్తారు.
డబ్బు కోసమే రాతల్ని ప్రోత్సహించినా ఆ రాతలు నిజమని అంగీకరించడానికి దైర్యం చాలదు.
పవిత్రత ముసుగులో తెలియనట్లు నటిస్తారు. అరవై ఐదేళ్ల వయసులో సిగ్గుమాలిన పని చేసిందని
తలలు బాదుకునే బదులు ఆమెని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసివుంటే బాగుండేది అనిపించింది.
కుటుంబమంతా వెలివేసినా అభిమానులు,మత సమాజం ద్వేషించినా ఆమె నిబ్బరంగా
ఆత్మ వంచన లేకుండా జీవిస్తూనే వియోగాగ్నిలో
మండీ మాడిపోయింది. ఆశాభంగాలని జీర్ణించుకుంటూ మౌనాన్ని ఆశ్రయించింది. ప్రేమ పవిత్రయుద్ధంలో
ఆమె ఒక సమిధ. అతనిలో ఆమెకి తన ప్రియ సఖుడు కృష్ణుడే కనిపించాడు. ఆమె అప్పటి బ్రతుకంతా విరహ రాత్రుల మరకలే.ప్రేమను ఆరాధనను కలవరించి
పలవరించింది. ఆమె రాధ.కృష్ణుడికై తపించిన రాధ. ప్రేమని ఆశించి కొంత అనుభవించి తనివితీరక
ఇంకా ఇంకా ప్రేమించి శుష్కించి క్షీణించి మరణించింది.రోగం కాదు ఆమెని బలితీసుకుంది
ప్రేమ అని,దుఃఖవిషం మింగి ఆమె చావుని ఆమె కొనితెచ్చుకుంది అని
యెందరికి తెలుసు.
సాహిత్య సంద్రంలో ఒక నదిలా స్వేచ్ఛగా ప్రవహించింది.
పూవై పుట్టి అక్షర పరిమళాల్ని పంచి ప్రేమరాహిత్యంతో ద్రోహం పాదాల క్రింద నలిగిపోయిన పువ్వులాంటి ఆమెకి యేమివ్వగలను. ఆశలు ఆలోచనలు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటివని
అవి ఎప్పుడూ చేతికందవు అన్న సత్యాన్నిగ్రహించి
ఒక స్త్రీ అంతరంగాన్ని అర్ధం చేసుకున్న మనసుతో యిలా కన్నీటి అక్షరాల మాలని గ్రుచ్చి ఆమె జ్ఞాపకాలకు అలంకరించడం
తప్ప. అని బరువైన మాటలతో ఆమె కథను ముగించింది మున్నీ. బాగ్ లో దాచిన గులాబీని తీసి ఆమె వ్రాసిన పుస్తకానికి ముఖచిత్రంగా వున్న ఆమె ఫోటో పై ఉంచింది
అభిమానంగా..
బూడిదరంగు
సూక్ష్మ శరీరం మున్నీ చెప్పిన తన కథను వింటూ కన్నీళ్ళు తుడుచుకుంది.
పద్మ కూడా భారమైన మనసుతో ఆలోచిస్తూనే
ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. లోపలి పేజీల్లో వున్న పూల చిత్రాలను చూపిస్తూ
ఆమెకి యిష్టమైన పూలు ఇవేనా అని అడిగింది.
.
అవును,మా ప్రాంతంలో వుండే అరుదైన
పూలివి. ఆమె వ్రాసుకున్న ఆత్మ కథ
పుస్తకం యిది. నేను చెప్పిన కథకు ఎన్నో సంవత్సరాలు ముందు జరిగిన కథ. ఇందులో నేను చెప్పిన కథ వుండదు అంది మున్నీ.
ఇప్పుడు మీరు చెప్పిన కథ ఆత్మకథ పార్ట్ టూ గా రావాల్సిన కథ అనిపిస్తుంది
నాకు. ప్రేమ పవిత్ర యుద్ధంలో దగా పడిన స్త్రీల జాబితాలో యిలాంటి
ప్రఖ్యాత రచయిత వుండటం ఆశ్చర్యమే కానీ అసాధారణమేమి కాదు కదా ఆమె ఒక స్త్రీ యే కదా
! ఆమె ఒక మైనం ముద్దలాంటింది. అభిమానులు,పాఠకులు సమాజమూ యే మచ్చులో పోసుకుని చూసుకుంటే ఆ విధంగానే కనబడుతుంది అంతే కదా అంది పద్మ.
పాపపుణ్యాల
భీతిని జయించిన ఆమె మతం దేవుడు అనే విశ్వాసాన్ని మట్టుకు గుడ్డిగా పట్టుకుని వేలాడింది. మాములు మనుషులు లాంటి వారే ఈ రచయితలు కూడా.
తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ముగింపు ఘట్టాలకు ప్రత్యక్ష
సాక్షి అయిన మున్నీ పాఠకురాలైన పద్మకి చెప్పడమూ ఆమె ఓ
న్యాయదేవతలా వ్యాఖ్యానించడమూ చూసిన
బూడిద రంగు సూక్ష్మ శరీరం సంతోషంతో తబ్బిబై
పోయింది. ఇదిగో ఇలాంటి ఆలోచనలున్న మనిషి కోసం తన రచయిత మనసు ఆరాటపడింది . ఇక ఈ భూమి
పైన సంచరించాల్సిన పని లేదనుకుంటూ వెలుగు
లోకము వైపు ప్రయాణిoచింది
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి