15, మార్చి 2023, బుధవారం

రెండు లక్షలు

 రెండు లక్షలు - వనజ తాతినేని

సన్నగా మోగుతున్న మంగళ వాయిద్యాలు.కొబ్బరి మట్టలు కట్టి ఈనె చీల్చిన ఆకులతో అందంగా అలంకరించిన గుంజలు. వాటిపై అడ్డంగా పడుకున్న పచ్చని తాటాకుల పందిరి.గుమ్మాలతో పాటు పెళ్ళి పందిరిని అలంకరించిన మామిడితోరణాల వాసన. ఆ ప్రాంతంలో వ్యాపారపంటగా బాగా వేళ్ళూనుకున్న  బంతిపూల పంట తొలిపూత గుమ్మరించే ఘాటైన వాసనతో  మనసుకు ఆహ్లాదం.గాడి పొయ్యిపై ఉడుకుతున్న పొంగలి వాసన..తేలికగా ఇల్లంతా కమ్మేస్తున్న కమ్మటి సాంబ్రాణి వాసన అదోరకమైన మైకం కల్గిస్తున్నాయి. నట్టింట తెల్లని పంచెపై ఆవిరి కుడుములను బోర్లిస్తున్న శారద అదే గదిలో చేతులకు తొడిగిన ఆకుపచ్చఎఱ్ఱగాజులను చూసుకుంటూ అద్దం చేతిలోకి తీసుకుంటున్న కూతురు ఉమ ని చూసింది. అద్దంలో ముఖం చూసుకుని విసుక్కొంటుంది ఉమ. “నువ్వులనూనె పసుపు దిట్టంగా రాసేసారు.  పేషియల్ చేయించుకున్న ముఖం నిగారింపుని నాశనం చేసేసారు. సంప్రదాయమో చట్టుబండలో..ఎవరికి నచ్చినట్లువారిని వుండనివ్వరు.” అనుకుంటూ ” అమ్మా! కాస్త పంచదార నిమ్మకాయ తీసుకొచ్చి ఇవ్వమ్మా. వాటితో రుద్ది కడిగితే కాని ఈ జిడ్డు పోదు” అంది.


“అవన్నీ తర్వాత చేసుకుందువుగాని. ముందు బొట్టు పెట్టించుకుని వరండాలోకి రా!అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు భోజనాల వేళైంది” అని శారద తల్లి మనుమరాలిని పిలిచింది.నా స్నేహితురాలి పెళ్ళిలో పెళ్ళికూతురిని  చేయడం మంగళస్నానం చేయించడం ఎంత సున్నితంగా వేడుకగా జరిపారు. అలాంటి ఇళ్ళల్లో జరిగేవి చూసి కూడా నేర్చుకోరు ఈ పల్లెటూరి మంద..అని గొణుక్కుంటున్న కూతురిని చూస్తూ పెరట్లోకి వెళ్ళింది శారద. గాడిపొయ్యి దగ్గర భర్త ఆడపడుచు మరికొందరు చేస్తున్న హడావిడిని చూస్తూ మామిడి చెట్టు నీడన కుర్చీలో కూర్చుంది.కుటుంబంలో తన విలువను బేరీజు వేసుకొంటుంది.అప్రయత్నంగా  కళ్ళు మనసు చెమ్మగిల్లాయి.


నిత్యం అప్పుల మధ్య లాభనష్టాల మధ్య ఊగిసలాడే భర్త.అతను చేసే  వ్యవసాయంపై ఆశపెట్టుకోకుండా కుటుంబపోషణకు పాడి మీద ఆధారపడింది, చీరలు అమ్మడం  కుట్టుపని ఎంబ్రాయిడరీ వర్క్ ఏది వీలైతే అది చేస్తూ కుటుంబాన్ని ఎలాగోలా గట్టెక్కిస్తూ కూతురు భవిష్యత్ పై కొండంత ఆశపెట్టుకుంటే ఇలా జరుగుతుందేమిటి? అన్న దిగులు ఆమెను స్థిమితంగా ఉత్సాహంగా వుండనీయడం లేదు. ఇన్నేళ్ళూ కూతురుకి చదువుతో పాటు ఆమె కోరినదల్లా శాయశక్తులా  అందిస్తూ ఏ లోటు లేకుండా నెట్టుకువచ్చానే, ఆమెకు మంచి భర్తను మాత్రం ఎంపిక చేయలేకపోతాననా!? కూతురు తొందర పడుతుంది. భర్త కూడా అయినవాళ్ళందరి ముందు తనని ఎంత తృణీకారంగా తీసిపడేసాడు.అడపా దడపా వ్యవసాయానికి రెండురకాల తన రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా అందించింది.  అడిగినప్పుడల్లా అతని తాగుడు వ్యసనానికి తృణమో ఫణమో కాదనుకుండా  అందించింది కూడా.అవన్నీ ఆడ పెత్తనం అనే వొక్క మాట ముందు విలువ లేకుండా పోయాయా? 


“ఏం వదినా.. అట్టా కూర్చుంటే పనులెట్టా అవుతాయి. ఎంతసేపూ నీ ఆలోచన నీదే. మంచి

సంబంధం వచ్చిందని అందరూ సంబరపడుతుంటే నువ్వు దిగులుగా కూర్చుంటావ్. ఉమ కి పెళ్ళికొడుకు బాగానే నచ్చాడు. చేసుకోబోయే పిల్లకు బాగా  నచ్చినప్పుడు నీకెందుకు బాధ. కట్నం కూడా ఎక్కువ ఇచ్చేది లేదు. రెండు లక్షలకు ఏ తలకుమాసినవాడన్నా  వస్తున్నాడా? ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు.పెళ్ళి కూడా ఓపికని బట్టి చేయమంటిరి. ఇంతకన్నా ఏం కావాలి.నీ ముఖంలో అయిష్టత దాచుకుని పిల్లకు  ఆ నాలుగు అక్షింతలూ వేసి పంపించి గుండెల మీద భారం తీర్చుకో” అని మందలింపు అనునయం కలిపి చెప్పింది. 


శారద మనసు మూలిగింది. లోలోపల ఆక్రోశించింది.

“అయ్యో! మీకెలా చెప్పను? ఉమ నాకెప్పటికీ  భారం కాదు.కూతురు  మంచి భర్తను ఎంపిక చేసుకుంటుంటే సహకరించడం నా భాద్యత. నా కూతురు మంచివాడ్ని ఎంపిక చేసుకుంటే నేను సంతోషించేదాన్ని. వాడు కచ్చితంగా తలకమాసిన వెధవే!. నా కూతురినే కాదు ఏ ఆడపిల్లకి అలాంటి మొగుడు రాకూడదు.అది మీకు నేను చెప్పలేను. చెప్పవలసిన వాళ్ళకు చెప్పినా తలకెక్కలేదు. ఎకరాల కొద్దీ  పొలం రెండస్తుల ఇల్లు కారు వాడి ఆటోపం చూసి మీరంతా మోసపోతున్నారు.”  అని మనసులో అనుకుంటూ కుర్చీలో నుండి లేచి కుళాయి చప్టా మీదగా ఇవతలకి రాబోయి కాలు జారి దబ్ మని కిందకు పడిపోయింది. 


“ ఇప్పుడే గంజి వొంచాం. చూసుకుని నడవొద్దూ! ఎంత పని జరిగిపోయింది వొదినా” అంటూ శారదను పైకి లేపబోయి విఫలమైంది ఆడపడుచు. విలవిలలాడతూన్న శారదను మంచం తెచ్చి నెమ్మదిగా దానిపై చేర్చారు. గంటసేపు జండూబామ్ అమృతాంజనం ఇంకా ఏవేవో  రాసి రాసి ఇంకా వాచిపోయి విలవిలలాడుతున్న ఆమెను గుంటూరు హాస్పిటల్ కు చేర్చారు.


“ఏడుపుగొట్టు ముఖం ది ఇది. పెళ్ళిచూపుల నాటి నుండే ముఖం గంటుగా పెట్టుకుంది. దీనికీ పెళ్ళి ఇష్టం లేదు.అందుకు తగ్గట్టు కన్యాదానం చేయకుండా కాలు ఇరగగొట్టుకుని కూర్చుంది. నాకు ఆ ప్రాప్తం లేదనుకుంటాను. మీరు కన్యాదానం చేయండి అంటూ తమ్ముడిని మరదలని పురమాయించాడు శారద భర్త భూషణం. 


రాత్రి వధూవరులు పాణిగ్రహణం చేసుకునే  వేళకు శారద విరిగిన కాలుకు ఆపరేషన్ జరిగి మత్తులో నుండి బయటపడింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న శారదను  చూసి “అనుభవకాలం ఇలా వుంది. ఒక్కగానొక్క బిడ్డ పెళ్ళి చూసుకునే భాగ్యం లేకుండా హాస్పిటల్ పాలు చేసాడు భగవంతుడు, ఊరుకోమ్మా ఊరుకో! ఏం చేస్తాం” అని ఓదార్చింది శారద పిన్ని. నొప్పి వలనో కూతురి పెళ్ళి చూసుకోకపోవడం వల్ల వచ్చిన  కన్నీరు కాదు ఇది.ఉమ జీవితం ఎలా వుంటుందో అని దిగులు వల్ల వచ్చిన కన్నీరని  ఎలా చెప్పను ఆక్రోశించింది తల్లి మనసు. బాధగా కళ్ళు మూసుకుంది శారద. 


ఆమె కనులు ముందు ఆనాడు తాము చూసిన అసభ్యకరమైన అసహ్యం కల్గించిన దృశ్యం పదే పదే తారాడింది. 


***********

ఏడాది క్రితం.. జరిగిందది. తన తో పాటు వ్యాపారం చేసి మహిళలతో కలిసి బెంగుళూరు మైసూర్ బయలుదేరింది. అక్కడ బిన్ని క్రేప్ జార్జెట్ చీరలు ప్యూర్ సిల్క్ రా సిల్క్ చీరలు హోల్ సేల్ ధరలకు కొనితెచ్చి పరిచయస్తులకు అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకుని కుటుంబానికి వేణ్ణీళ్ళుకు చన్నీళ్ళు తోడు అనుకునే గృహిణులు వాళ్ళందరూనూ.  అందరూ వొక మాట అనుకుని ఒకే బస్ కు రిజర్వేషన్ చేయించుకున్నారు. కొందరు విజయవాడ నుండి కొందరు ఏలూరు నుండి కొందరు గుంటూరు నుండి బయలుదేరారు. తను గుంటూరు బస్టాండ్ లో బస్ ఎక్కింది. బస్టాండ్ నుండి బయటకు వచ్చాక.. బస్ మరొకచోట పది నిమిషాలు ఆగింది. ముగ్గురు ప్యాసింజర్ లు రావాలి. వాళ్ళు రాగానే బయలుదేరదాం. ఐదు నిమిషాల్లో వస్తారంట అని పావుగంటపైనే ఆపాడు డ్రైవర్. 


 హడావిడిగా వచ్చి బస్సు ఎక్కిన ఆ  ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు. శారదకు కుడివైపు వున్న సీట్లలో ఒక స్త్రీ ఒక పురుషుడు కూర్చున్నారు. మరొక స్త్రీ వారి వెనుక సీట్ లో కూర్చుంది. ఆ పురుషుణ్ని ఎక్కడో చూసినట్టు వుంది. జ్ఞాపకం చేసుకోవాలని ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకొంది. కాసేపటి తర్వాత అతన్ని ఆనవాలు పట్టింది. తన ఊరి ప్రెసిడెంట్ చెల్లెలు కొడుకు అతను. పెద కాకాని లో ఇచ్చారు ఆమెను. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. అతనే ఇతను అనుకుంది. అతనితో కలసి బస్ ఎక్కిన స్త్రీల ఇద్దరి ఖరీదైన  వస్త్రధారణ అందంగా హుందాగా వుండటానికి బదులు ఎబ్బెట్టుగా అనిపించింది. మాటతీరు కూడా తేడాగా వుంది. అతనితో జరిపే సంభాషణల్లో  వెకిలిమాటలు అలవోకగా దొర్లిపోతున్నాయి. వినేవారు  ముందు ముఖం చిట్లించుకుని తదుపరి అసహ్యించుకుని ముఖంపై ముసుగేసుకుని రాని నిద్రను నటించారు. 


తను ఎంత కళ్ళు మూసుకున్నా వారి మాటలు చెవిన పడుతూనే వున్నాయి. అతను ఆ ఇద్దరిని బెంగుళూరు తీసుకువెళుతున్నాడు. వారికి అలుసుగా డబ్బు గడించే మార్గం కూడా అతనే వేసినట్లు అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వారు బయలుదేరి రావాలన్న ఆజ్ఞాపన అధికారం అతని మాటతీరులో వినబడుతున్నాయి. అందులో భాగంగానే వారిరువురూ అతనితో కలసి బయలుదేరినట్టు సులభంగా గ్రహించింది. కళ్ళు మూసుకొంది. 


కొన్నిగంటల నిద్ర తరువాత ఉలికిపడి కళ్ళు తెరిచింది. బస్ నెల్లూరు కు సమీపంలో వెళుతున్నట్లు రోడ్లపై వీధి దీపాల వరుస వెలుగు చెబుతుంది. కిటికీ అద్దాలు మూసి వుంచినా సరే ఆ వెలుగునీడల క్రమంలో  పక్క సీటులో జరుగుతుంది స్పష్టంగా తెలిసిపోతుంది.  అతను పక్కనున్న స్త్రీ గుండెల పై ఆబగా తలను వాల్చి వుండగా ఆమె చేతులు అతనిని రంజింపచేసే పనిలో నిమగ్నమై వున్నాయి. ఛీ ఛీ.. అని ముఖంపై చీర చెంగుని వేసుకుంది తను. పక్కనవున్న సరళ “చూసావా శారదా!.. ఆ రోత చేష్టలు,  వాళ్ళు మనుషుల్లా లేరు వీరికన్నా మృగాలు నయం” అని అసహ్యపడింది. కాసేపటి తర్వాత అతను వెనుక సీట్ లోకి మారాడు.  


సరళ లోగొంతుకతో చెప్పింది. “వాడిది మా ఊరే! ఆంబోతులా వున్న వాడికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అన్ని వ్యసనాలూ వున్నాయంట.  రైల్వే కాంట్రాక్ట్ లు చేస్తాడని చెప్పుకుంటాడు కానీ వాడు చేసే వ్యాపారం ఇదే. పైరవీలు చేసుకుంటూ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ గాడు అని మా ఇంటాయన చెప్పారు. ఆ ఆడవాళ్ళిద్దరూ కూడా అదే బాపతులా వున్నారు. ఈ రాసలీలలు చూడటానికా మనం ఈ బస్ ఎక్కాం, తప్పుకునే మార్గం లేకుండా ఏమిటీ శిక్ష మనకు” అని ఛీత్కరించుకుంది. మర్నాడు బస్ బెంగుళూరు చేరేదాకా ముళ్ళ మీద కూర్చున్నట్లు ప్రయాణించారు. తప్పేదో తాము చేసినట్టు చుట్టు పక్కల సీట్ల వారు వాళ్ళ ముఖం చూడటానికి కూడా సిగ్గుపడ్డారు. 


“మనం నీతిగా నిజాయితీగా బతకడానికి ఎన్నెన్ని తిప్పలు పడుతున్నాం. వాళ్ళు అన్నీ విడిచేసి జల్సాగా బతుకుతున్నారు. తేడా ఎక్కడుందంటావ్ శారదా” అని అడిగింది సరళ. 


“స్త్రీలలో స్త్రీత్వం మనుషుల్లో మానవత్వం అమ్మకం సరుకైపోయాక ఇక మిగిలింది ఏమీ వుండదు.వాళ్ తీరు అంతే మన తీరు ఇంతే! ఎవరి విలువలు వాళ్ళవి” అంది తను. 


కొన్ని నెలల తర్వాత భర్త భూషణం కూతురుకు  మంచి సంబంధం వచ్చింది పెళ్ళి చేసేద్దాం అన్నాడు. “చదువు అవనీయ్. ఇప్పుడే ఎందుకు పెళ్ళిమాట” అంది. 


“వాళ్ళు కట్నం కూడా అడగడం లేదు. అబ్బాయి కాంట్రాక్ట్ లు చేసి బాగానే సంపాదిస్తున్నాడు. మీ అమ్మాయిని చూసాడంట. మా వాడికి బాగా నచ్చింది మీ పిల్ల.ఇంట్లో చెప్పి చూడు అన్నాడు ప్రెసిడెంట్. ఏమంటావ్ మరి” అన్నాడు. 


“ప్రెసిడెంట్ మేనల్లుడు కా.. ఆ పోరంబోకు వాడికి పిల్లను ఇవ్వడమా!? కుదరనే కుదరదు. ఇప్పుడు పెళ్ళి చేయదల్చుకోలేదు అని చెప్పేయ్.” ఖరాకండిగా చెప్పేసింది. 


భూషణం భార్య మాటకు విలువ ఇవ్వలేదు. అన్నకు తమ్ముడికి, చెల్లెలు కు చెప్పాడు. 


“మనలాంటి వారికి అసలలాంటి సంబంధం రావడమే అదృష్టం. ఎలాంటి కుటుంబం అది.  ప్రెసిడెంట్ గారి చెల్లెలని ఇచ్చినచోట ఆస్తులు తరిగినా పేరు గొప్ప తగ్గలేదు. కళ్ళకద్దుకుని పిల్లని ఇచ్చి పెళ్ళి చేయొచ్చు. మీ ఆవిడ నీ మాట ఎప్పుడు పడనిచ్చింది కనుక ఇప్పుడు ఊ అనడానికి. ఉమ తో చెప్పి సంబంధం ఖాయం చేసుకో” అని సలహా ఇచ్చారు వాళ్ళు. 


భూషణం కూతురుకు చెప్పాడు. ఫణీంద్రను ఉమ కూడా చూస్తూనే వుంటుంది. లావు అన్నమాటే కానీ చూడటానికి అందంగానే వుంటాడు. మెడలో లావుపాటి చెయిన్ చేతికి కడియం గొలుసులు వేళ్ళ నిండా ఉంగరాలు పెట్టుకుని కారులో తిరుగుతూ వుండటం చూసింది. తన తండ్రి అలాంటి సంబంధం తేవడం కలలో జరగాల్సిందే అనుకుని తేలిగ్గా వొప్పేసుకుంది. ఉమ కు కూడా ఇష్టమే అయింది. నువ్వు కాదన్నా ఈ పెళ్ళి జరిపేతీరతాను. వాళ్ళను ఫలానా రోజు లగ్నం పెట్టుకోడానికి రమ్మన్నాను అని చెప్పాడు భూషణం. శారద నివ్వెరపోయింది.


వెంటనే కూతురు దగ్గరకు వచ్చి “అతని వయసుకు నీ వయసుకు పది ఏళ్ళు పైనే తేడా వుంది. ఇప్పుడు నీ పెళ్ళికి తొందరేం వచ్చింది. ముందు బి టెక్ చదువు పూర్తి చేయి. తర్వాత రెండేళ్ళు ఉద్యోగం చేసాక పెళ్లి సంగతి చూద్దాం” అంది. “నాకు చదవటం ఉద్యోగం చేయడం ఇష్టం లేదమ్మా.. ఫణీంద్ర నాకు నచ్చాడు”అంది.


 “అతను అంత గుణవంతుడు కాదమ్మా అతని డాబుసరి వేషాలు చూసి మోసపోతున్నావు. వద్దని చెప్పమ్మా “అని బతిమలాడింది. ఉమ వినలేదు. శారద మనసుని సరిపెట్టుకోలేకపోయింది. కళ్ళు మూసినా తెరిచినా బస్ లో చూసిన దృశ్యాలు ఫణీంద్ర  గురించి సరళ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. 


సంశయం మాని బిడియం విడిచి భర్తకు కూడా ఆ విషయం చెప్పింది.


 “మగాడన్నాక సవాలక్ష వ్యవహారాలుంటాయి. వయస్సలో వున్నోళ్ళు ఏదో వొకటి చెయ్యకమానరు. అవన్నీ మనకు తెలిసినా తెలియనట్టు పోవాలి. ఉన్న రెండకరాలకు సరిపడ అప్పులున్నాయి. ముందు ముందు ఏమీ లేని బికారి కూతురును ఎవడొచ్చి చేసుకుంటాడు చెప్పు? నువ్వు కూడా కూతురు చదువు ఉద్యోగం గురించి కలలు గనడం ఆపి నోర్మూసుకుని సంతోషంగా పెళ్ళి పనులు చేయి”  అన్నాడు. 


పసుపు కుంకుమ పెట్టడానికి వచ్చిన రోజునే కాబోయే అత్తగారు  పట్టుచీర పెట్టి మెడలో చంద్రహారం వేసి చేతులకు రెండు జతల గాజులు తొడిగి అమ్మాయి లక్ష్మి దేవిలా వుంది. పిల్లే పదెకరాల జరీబు భూమి వంటి కట్నం అని మెటికలు విరిచి మురిసిపోయింది.అవన్నీ చూసుకున్న ఉమ పట్టరాని సంతోషంతో తుళ్ళి తుళ్ళి పడుతుంది. 


ఇంట్లో మగవాడు డబ్బు సంపాదించలేని అసమర్ధుడు  నిండా అప్పులు వున్నవాడు భార్య మాటకు విలువ నివ్వనివాడు అయితే మూల కూర్చున్న ముసలి వారికి కూడా లోకువే!  భూషణంలో మూడు తోడైనాయి గనుక శారద మాటకు ఇంట్లోనూ చుట్టాలలోనూ విలువ లేకుండా పోయింది. శారద అయిష్టతను పట్టించుకోకుండా భూషణం తోడబుట్టిన వారు ముగ్గురు పెళ్ళి పెత్తనం అంతా తమ చేతుల్లోకి తీసుకున్నారు.  భూషణానికి నాలుగు లక్షల అప్పు కూడా ఇప్పించారు. శారద వొంటి మీద బంగారాన్ని వొలిచి ఉమకు సరి కొత్త నగలు చేయించారు.  అలా..శారదకు ఇష్టం లేనట్లే శారద లేకుండానే ఉమ పెళ్ళి అయిపోయింది.


జరిగినవన్నీ గుర్తు చేసుకుంది శారద . ఎంతైనా ఏమైనా ఉమ తన బిడ్డైనా ఆమె గురించి తను కలలు కనకూడదు. ఎవరి కలలను వారే కనాలి అనుకుంది దీర్ఘంగా నిట్టూర్చి.


***********

శారద హాస్పిటల్ లో వుండగానే ఉమ కాపురానికి వెళ్ళిపోయింది. గుంటూరు నగరంలో కాపురం. భర్త తోడిదే లోకం. మూడునెలలపాటు అమ్మమ్మగారింట్లో వున్న నడవలేని తల్లిని చూడటానికి రాలేనంత మైమరుపు కాపురం. భారంగా నిట్టూర్చింది శారద. నాలుగు నెలలకు తన ఇంట్లోకి తను మాములుగా నడిచి వచ్చింది. పరాయి ఇల్లుగా అనిపించింది. తన ఇంట్లో ఇంకెవరో తిరిగిన భావన. కట్టుకునే బట్టలతో సహా అన్నీ వదిలేసి కుట్టు మిషన్ ఒక్కటీ తీసుకుని ఇల్లు విడిచింది.ఆమెకు బాగా పరిచయం వున్న అశోక్ నగర్ లో చిన్న రూమ్ అద్దెకి తీసుకుంది. పరిచయస్తుల ఇంట్లో వంట మనిషిగా చేరింది. ఆ ఇంటి ఆమె కొడుకు న్యూరోసర్జన్. చిన్న వయసులోనే నగరంలో మంచి డాక్టర్ గా ప్రసిద్ది చెందాడు.ఉదయం సాయంత్రం  డాక్టర్ ఇంట్లో వంట చేయడం తర్వాత సమయాన్ని టైలరింగ్ కు కేటాయించేది. తన స్నేహితుల సాయంతో తిరిగి చీరల వ్యాపారాన్ని  కూడా మొదలుపెట్టింది. 


ఊర్లోనే వుంటున్న కూతురింటికి ఏనాడు తొంగి చూడాలనిపించలేదు శారదకు.  ఒకరోజు బస్టాప్ లో నిలబడి వున్న ఆమెకు అవతలగా కారు ఆగింది. అందులో నుండి కూతురు ఫణీంద్ర దిగి వచ్చి ఆమెను పలకరించారు. కూతురిని చూసి నవ్వుకుంది. పెరిగిన అందంతో పాటు మిడిసిపాటు అహంకారం కనబడ్డాయి. “నాన్నను ఇంటిని వదిలేసి వచ్చేసి వంటమనిషిగా మారి మా అందరి పరువు తీస్తున్నావ్” అంది. శారద మౌనంగా చూసింది. “ఇప్పటికైనా ఇంటికి వెళ్ళు.. ఇంట్లో వండి పెట్టే ఆడది లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చి వండించుకుంటారు. నాన్న అదే పని చేసాడు. నువ్వెళ్ళి ఇంట్లో వుంటే ఆమె వెళ్ళిపోతది లే” అంది. 


“నాపసాని మాటలు బాగా నేర్చావ్, నా సంగతి నేను చూసుకోగలను. మీరు వెళ్ళిరండి” అంది. కూతురిని కారు ఎక్కించి డోర్ వేసి వెనక్కి వచ్చాడు ఫణీంద్ర. “అత్తా.. నా గురించి అంతా తెలుసంటనే నీకు. ఉమ చెప్పిందిలే! అయినా నువ్వు ఇల్లిల్లు తిరిగి నెలకు ఎన్ని చీరలు అమ్మగలవు? ఎంత డబ్బుసంపాదించగలవు. ఎక్కే మెట్టు దిగే మెట్టు లెక్కవేసుకునే బదులు ఒక్కసారి నేను చెప్పినట్లు చేసావనుకో నెలకు లక్ష రూపాయలు లెక్కన కళ్ళజూస్తావ్.  అంతా గుట్టుగా జరిగిపోద్ది. నువ్వు సరేనంటే ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయి. అని జేబులో నుండి విజిటింగ్ కార్డ్ తీసి చేతిలో పెట్టాడు. 


కోపంతో ఊగిపోయింది శారద.“థూ.. నీ బతుకు చెడ! ఇంకోసారి నా ముందు నిలబడి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగేదాక కొడతాను. థూ..”  అని  ఊసి విజిటింగ్ కార్డ్ ముక్కలు చేసి ముఖాన విసిరికొట్టి.. ఎదురుగా వున్న ఆటో ఎక్కి కూర్చుంది.


మనుషులు ఇష్టాలు పరిస్థితులు ప్రభావాలు ఏవైనాసరే మనిషి నైతికతలో వెంట్రుక మందంపాటి మార్పును కూడా తేలేవని మనిషిని ఎన్నటికీ దిగజారనివ్వవని శారద గాఢాభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవసరం కల్గనటువంటి వ్యక్తిత్వం కూడా ఆమెది అవడం మూలంగా ఫణీంద్రను మరింత ఛీత్కరించుకుంది. ఉమపై వున్న ప్రేమను గుండెల్లో  భద్రంగా దాచుకుని రాతిగోడ కట్టింది.


నాలుగేళ్ళు గడిచిపోయాయి.  ఆడపడుచు అపుడప్పుడు ఫోన్ చేసి   మాట్లాడుతూ వుంటుంది. ఉమ గురించి భూషణం గురించి గొప్పగా చెప్పి చెప్పి అలసిపోయి ఆఖరికి ఫోన్ పెట్టేయబోతూ ఒక మాట అంటుంది. “నీ మాట కాదన్నారని మొగుడి మీద కూతురి మీద పగ బట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నా” అని. ఆ మాటలు శారద బండబారిన మనసుపై   ఏనుగు మీద కురిసిన వాన లాగా తోస్తుంది. ఉమకు ఇద్దరు పిల్లలు.బంగారంలా చూసుకునే భర్త దొరికాడు.అనే మాటలు విని విని మంచిదేగా.. అంటుంది.


శారద ఇల్లు వెతుక్కుంటూ ఉమ లేకుండా మరొకసారి వచ్చాడు ఫణీంద్ర. పాత పాటే పాడాడు. 


“కష్టపడి బతికేవారికి  నాలుగేళ్లూ లోపలికి వెళ్ళేంత మంచి కాలంలోనే బతుకుతున్నాను. నా శీలానికి నిజాయితీకి విలువ కట్టాలనుకోవడం నీ తరం బ్రహ్మ తరం కూడా కాదు. నైతికవిలువలు అనేవి అమ్మకానికి అతీతమైనవి. నీలాంటి తార్పుడుగాడికి నైతికవిలువలు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్నం రెండు లక్షలు మీ మామ ఇవ్వలేకపోయినా కష్టపడి సంపాదించి వడ్డీతో సహ అప్పచెబుతాను. గడప దాటు ముందు” అని గర్జించింది శారద.  అదే రోజు కూతురుకు ఫోన్ చేసి చెడామడా తిట్టింది. నా మొగుడు మంచోడు.. అని సమర్ధించుకుంది ఉమ. నీ ఖర్మ.. అని ఫోన్ పెట్టేసింది.

 

************

హాయ్..  అంటూ పలకరించిన వాట్సాప్ మేసేజ్ చూసి హాయ్ అంటూ సమాధానం ఇచ్చిన ఉమ తర్వాత ఆ మెసేజ్ అనౌన్ నెంబరు నుండి వచ్చిందని గుర్తించి నెంబర్ సెర్చ్ చేసింది. డా. వంశీధర్  పర్సనల్ నెంబర్ అది. ఉమ బుగ్గల్లో వెచ్చని ఆవిర్లు. ఎందుకితను మెసేజ్ చేసాడు అని ఆలోచించే అవసరం రాలేదు. అతనికి తన పట్ల ఎలాంటి అభిప్రాయం వుందో తెలిసిపోయింది. అత్తయ్య చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత గొడవై పోయుండేది. అయినా అతనికి అదేం బుద్ది!? పేషంట్ కు సహాయంగా వెళ్ళిన వారితో ప్రవర్తించే విధానం అదేనా? ఇక వయసులో వున్న పేషంట్ ని టెస్ట్ చేయటానికంటూ ఎలాంటి చొరవ తీసుకుంటాడో..అని ఆలోచిస్తూ వుండగానే.. అతని నుండి పలకరింపు. “భోజనం అయ్యిందా.. మీ హస్బెండ్ లేరు కదా.. ఏం చేస్తున్నారు” అని. ఉల్కిపడింది. భర్త ఇంట్లో లేని సంగతి అతనికెలా తెలుసు అని అనుకుంటూ వుండగానే.. 


“చిన్నప్పుడు నేను ఫణీంద్ర కలసి చదువుకున్నాం. చిన్నప్పటి స్నేహితులం.” 


“ఆహా”.. అని ఊరుకుంది. 


“ వాడు గోవా లో బెంగుళూరు లో తారసపడుతూనే వుంటాడు. డాక్టరైన నాకన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు అంట కదా! అయినా కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నాను అని చెప్పాడు. అంత పూర్ ప్యామిలీ నా మీది?” అని అడిగాడు.  మానని పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది ఉమ కు. భర్త కూడా కట్నం ఇవ్వలేనివాడి కూతురివి అంటూ పదే పదే చులకన చేయడం వల్ల పడిన పుండు అది. 


“అదేం లేదు.  ఫణీంద్ర వెంటబడి మరీ చేసుకున్నాడు. లేకపోతే నేను హైయ్యర్ స్టడీస్ కు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి వుండేదాన్ని” అంది బింకంగా. 


అటునుండీ.. ఓహో అంటూనే కూడా వొక  స్మైలీ.. కూడ వచ్చిపడింది. ఉడుక్కుని బై.. చెప్పేసి ఫోన్ పక్కడ పడేసింది. 


తన జీవితం ఇతరులు వూహించుకున్నంత గొప్పగా యేమి లేదు.  అది బహిర్గతమైతే  ఎవరెవరో యెగతాళి చేస్తారని తెచ్చిపెట్టికున్న హోదాతో  నకిలీ నవ్వులను పెదాలకు అతికించుకుంటూ బతుకుతుంది. ఫణీంద్ర మొరటు మనిషి. అతనికి ఎదురుచెప్పనంత వరకూ అపురూపంగా చూస్తుంటాడు. మాట మాత్రం భిన్నభిప్రాయం వెలువడిందో రాక్షసత్వం ప్రదర్శిస్తాడు. అతను చెప్పకపోయినా పెళ్ళైన కొత్తలోనే  అతని వ్యాపారం సంపాదనా మార్గం సులభంగానే గ్రహించింది. తల్లి అతన్ని ఎందుకు వద్దని అందో కూడా అర్దమైంది కానీ ఏం ప్రయోజనం చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎంత వృథా నో అంత వృథా అయిపోయింది. అతని భార్యగా సమాజంలో తనకెంత గౌరవం వుందో అదీ అర్దమైంది. 


భర్త వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు వెంకటేష్ అనే అతనిని సహాయంగా వుంటాడు అంటూనే  తనకు కాపలాగా నియమించాడనే సంగతి అర్దమైనపుడు అవమానంగా ఫీల్ అయింది. ఈ మొద్దు మొహం గాడిని చేసుకోకుండా అలాంటి వాడిని  ఎవడినో వొకడిని చేసుకున్నా తన జీవితం చాలా బాగుండేది అని ఎన్నిసార్లు మనసులో అనుకుందో. ఆ వెంకటేష్ కూడా అక్కా అక్కా అంటూ ఫణీంద్ర చేస్తున్న ప్రతి పని గురించి  సమాచారం అందిస్తూ వుంటాడు.  బావ మహా డేంజర్ అక్కా.. జాగ్రత్తగా వుండాలి అని హెచ్చరిస్తూ వుంటాడు కూడా.  పక్కలో పిల్లాడు ఏడుస్తూ కదలడంతో ఆలోచనలను పక్కకు పెట్టి పిల్లాడిని సముదాయించే పనిలో బడింది. 


మర్నాడు భర్త వచ్చే సమయానికి ఫోన్ లో  డా.వంశీధర్ తో చేసిన ఛాట్ ని డిలీట్ చేసింది ఉమ కానీ అతనిని మనసులో నుండి తీసేయలేకపోయింది. అత్తయ్యను గోడ వైపుకు తిప్పి పరీక్షిస్తున్నట్లు నటిస్తూ  నర్స్ ను బయటకు పంపించి వేసి చొరవ చేసి తన నడుంపై చేయి వేసాడు. బల్లపై పడుకున్న అత్తకు సమీపంలో నిలబడిన తనను కొంటెచూపుతో  కావాలని సృశించడం పొరబాటున చేయి తగలడం కాదని గ్రహించింది.నిజానికి అతని మెత్తని పొడవైన వ్రేళ్ళ స్పర్శ తనకు హాయిగా అనిపించింది.  పమిట ఎడమవైపు నుండి చేయి లోనికి చేర్చి గుండెలపై చేసిన అల్లరి గుర్తుకు రాగానే మరొకసారి గుండె జల్లుమంది. అప్పుడు ఆ చేయిని తీసేయలేకపోయినట్లే అతని తలపును మనసు నుండి తీసేయలేకపోతుంది.


రోజులు గడుస్తున్నాయి. భర్త ఊర్లో లేనప్పుడల్లా వంశీధర్ తో ఛాట్ ముదిరి మాటల్లోకి మారిపోయింది. వారి మధ్య బహువచనాలు మాయమై ఏకవచనాలు అధికారం సాగిస్తూ అరేయ్ ఒరేయ్ లోకి వొంపుకుని సన్నిహితంగా సర్దుకున్నాయి. 


“ఉమా! ఎంత అందంగా వుంటావ్! ఏ రాకుమారుడో నిన్ను వరించేవాడు. ఫణీంద్రకు నిన్ను కట్టబెట్టి నీకు చాలా అన్యాయం చేసారు మీ వాళ్ళు” అన్నాడు వంశీధర్. 


“రాత్రి కూడా మా నాన్న పైసా కట్నం ఇవ్వలేదని దెప్పిపొడిచాడు.ఆ రెండు లక్షలు నాకు గిఫ్ట్ గా ఇవ్వకూడదు. ఆ డబ్బు మా నాన్నకిచ్చి కట్నం డబ్బు ఇదిగో అంటూ మా ఆయన ముఖాన పడేయిస్తాను”  అనడిగింది సంకోచం లేకుండా. 


“ మీ అమ్మ వంటమనిషిగా పని చేస్తుంది మా ఇంట్లోనే కదా ఆమె రెండు లక్షలు కూడబెడుతున్నది అందుకే కదా!  అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను తప్పకుండా ఇస్తాను. మరి నాకు  “రిటన్ గిఫ్ట్” ఏమి ఇస్తావ్” అడిగాడు మొహమాటం లేకుండా. 


తల్లి మాట వినడానికి కూడా ఇష్టం లేనట్లు ఆ విషయాన్ని దాటేసి “నువ్వు కోరుకున్నదే” అంది బిడియపడకుండా. 


“గుడ్! తెలివికలదానివి. నా టైమ్ వేస్ట్ కాకుండా సేవ్ చేసావు” అన్నాడు. 


భర్త లేని రెండు రోజులు డా.వంశీధర్ ను ఇంటికి ఆహ్వానించింది. అతని పొందును మనసారా ఆస్వాదించింది. “నాకు నచ్చినట్లు  జీవించడమే నా సిద్ధాంతం. ఇతరుల ఆంక్షలకు లోబడి వారికి  అనుగుణంగా జీవించడంలో ఏ మాత్రం సంతోషం వుండదు.అంతా డొల్లతనం” అనుకొంది తెంపరిగా. 


తండ్రికి ఫోన్ చేసి పిలిపించి కట్నం డబ్బు ఇవిగో అంటూ తండ్రి చేత భర్తకు ఇప్పించింది. భర్తకు తెలియకుండా దాచుకున్న డబ్బుతో ప్రతి నెలా చీటి కట్టానని ఆ డబ్బు ఒక్కసారే ఇప్పుడొచ్చిందని తండ్రికి చెప్పింది. భూషణం పొలం అమ్మగా మిగిలిన సొమ్ము తెచ్చాను అని చెప్పి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఎట్టకేలకు యిచ్చినట్లు శక్తికొలదీ నటించాడు. ఫణీంద్ర మామ ఇచ్చిన డబ్బును ఏ అనుమానం లేకుండానే తీసుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బుతో ఉమకు నగ చేయించాడు.


************

“డార్లింగ్! ఏమీ తోచడం లేదు. బోర్ కొడుతుంది. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ బెట్టింగ్ లలో బిజీగా వున్నారు. ఎంతైనా క్రికెట్ బెట్టింగ్ కడితే ఆ మజానే వేరు. రెండు లక్షలు నువ్వు తీసుకొచ్చి ఇచ్చావంటే  మహాలక్ష్మి దయతలచి ఇచ్చినట్లే అనుకో. ఇస్తావు కదూ!” అన్నాడు ఫణీంద్ర.


“నువ్వు భలే జోక్ చేస్తావ్ , నా దగ్గర ఎక్కడ వుంటాయి రెండు లక్షలు. పర్స్ ల్లోనూ చీరల్లోనూ మహా వుంటే ఓ పదివేలు వుంటాయేమో కానీ” ఉమ సమాధానం.


“మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయకు పాపా! మొన్న  మీ నాన్నకు కట్నం డబ్బులు రెండు లక్షలు ఇచ్చి నాకు ఇప్పించడం నాకు తెలియదనుకున్నావా? అలాగే బుద్దిగా ఈ రోజు రాత్రికి వెళ్ళి  నీ డాక్టర్ ఫ్రెండ్ ని అడిగి రెండు లక్షలు తెచ్చి ఇచ్చావనుకో నేను రేపు హాయిగా ఎంజాయ్ చేస్తాను” అన్నాడు విలాసంగా.


మొబైల్ ఫోన్ పై వ్రేళ్ళు కదుపుతున్న ఉమ చేయి అప్రయత్నంగా ఆగిపోయింది. ముఖం నల్లగా నెత్తురుచుక్క లేనట్లు పాలిపోయింది. భయంతో బిగదీసుకుపోయింది.


 ఫణీంద్ర ఉమ చుబుకం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ.. “నాకే కథలు వినిపిస్తావా! ఆ మాత్రం గెస్ చేయలేను అనుకున్నావా?. బంగారు చిలకలా పంజరంలో పెట్టి చూసుకుంటుంటే నీ అధోగతికి నువ్వే దారి వేసుకున్నావ్. ఆడది ఒకసారి చెడినా వందసార్లు చెడినా వొకటే. ఆల్రెడీ నువ్వు గీత దాటావ్, గీత దాటిన ఆడది నాలాంటి మొగుడికి కల్పవృక్షం. నువ్విప్పుడు డబ్బులిచ్చే కల్పవృక్షానివి. నీ డాక్టర్ ఫ్రెండ్ కి కాల్ చేయ్, కావాలంటే ఈ ఇంటికే రమ్మను. నేను పిల్లలను తీసుకుని సినిమాకో షికారుకో వెళతాను” అంటూ మరోమాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. 


గంటసేపు అచేతనంగా కూర్చున్న ఉమను భర్త ఫోన్ చేసి మరీ కదలిక తెప్పించాడు.ఇంట్లో వుండమంటావా వెళ్ళమంటావా అని. బలహీన స్వరంతో చెప్పింది అడిగి చెపుతాను అని. 


బిడియం వదిలేసి వెంటనే వంశీధర్ కి మెసేజ్ చేసింది. “వంశీ, నాకు రెండు లక్షలు కావాలి.నువ్వు ఈ రాత్రికి మా ఇంటికి రావొచ్చు. మా ఆయనకు అంతా తెలిసిపోయింది.మళ్ళీ డబ్బు కావాలంటున్నాడు.” అని. రెండు గంటలు ఎదురుచూసినా వంశీధర్ నుండి రిప్లై లేదు. మళ్ళీ భర్త నుండి ఫోన్. ఈసారి మెసేజ్ కాకుండా వంశీధర్ కు కాల్ చేసింది. లిఫ్ట్ చేసిన అతను “సారీ ఉమా! నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు. రెండు రోజుల్లోనే ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఇంట్రెస్ట్ లేనిదే నేను పైసా కూడా ఖర్చు పెట్టనని నీకు తెలుసుకదా! బై.” అని ఫోన్ కట్ చేసాడు. ఉమకు ఏడుపు ముంచుకొచ్చింది. 


భర్త నుండి వస్తున్న ఫోన్ కాల్ పట్టించుకోనట్లు వుండిపోయింది. అరగంట తర్వాత కోపంగా తలుపుతోసుకుని భర్త లోపలికి వచ్చాడు. అతను అడిగేంత వరకూ వుండకుండానే వంశీధర్ చెప్పిన మాటలను వల్లెవేసింది. 


“అయితే వెంటనే బట్టలు సర్దుకో, బెంగుళూరు వెళదాం.రెండు రోజులుంటే రెండు లక్షలు. పిల్లలను మా అక్క ఇంటి దగ్గర దింపి వస్తాను” అని వెళ్ళిపోయాడు. ఉమ వెక్కిపడుతూ మంచం మీద అడ్డంగా  వాలిపోయింది. 


అప్రయత్నంగా తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. “అవసరమైతే అమ్మను అక్కను చెల్లిని పెళ్ళాన్ని కూడా అమ్మగల్గే   తార్పుడుగాడు వాడు. వాడు మంచోడు అంటావేంటి. వాడి మాట వింటేనే అసహ్యం నాకు” అని.


ప్రస్తుతం తల్లి అండ కోరుకోవడానికి కూడా సిగ్గుపడింది ఉమ.  తను వెళితే  ఆమె కాదని కూడా అనదు. కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. కట్నం డబ్బు రెండు లక్షల కోసం అలా చేసానని అబద్దం చెప్పి తనను తాను సమర్ధించుకోవాలని కూడా లేదు.కానీ ఆమెకు తన ముఖం చూపలేదు. వంశీధర్ తో గడిపిన రహస్యం బయటపడకుండా వుంటే తను కూడా పతివ్రతలా భర్త ముందు తల ఎగరేసుకుని తిరిగేది. పర పురుషుడిపై మోహం తనను మరింత దిగజార్చుతుందేమో అన్న ఆలోచన లేనందుకు మాత్రం చింతించింది. కళ్ళు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. బయటెక్కడ భర్త జాడ పార్కింగ్ లో కారు కూడా లేకపోవడం చూసి గబుక్కున్న చెప్పుల్లో కాళ్ళు దూర్చింది.


************

అర్థరాత్రి వేళ తలుపు కొడుతున్న శబ్ధానికి శారద నిద్ర లేచింది. కిటికీ తలుపు తీసి చూసింది. ఫణీంద్ర పక్కన ఇంటి యజమాని వుండటంతో తప్పనిసరై తలుపు తీసింది.


“ఉమ ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాను’’ అన్నాడు నీళ్ళు నములుతూ. 


“అది ఇక్కడికి ఎందుకొస్తుంది. అయినా ఈ వేళప్పుడు ఎందుకొస్తుంది? ఏమైంది నా కూతురికి,  ఏం చేసావు దానిని, నిజం చెప్పు “ పదునుగా అడిగింది. అతన్ని అనుమానంగా చూసింది. 


ఆమెను భయపెట్టడానికి బదులు అతను భయపడ్డాడు. శారద కళ్ళల్లోని తీక్షణమైన శక్తికి తలొంచుకున్నాడు.  తలొంచుకునే  చెప్పాడు. ”ఫోన్ కూడా ఇంట్లోనే  వొదిలేసింది పిల్లలు అక్క ఇంట్లో వున్నారు. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు.” 


 “ఉమ వాళ్ళ నాన్న దగ్గరకే వెళ్ళివుంటుంది.ఆయనకు ఫోన్ చేసి కనుక్కో. ఈ అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి హడావిడి చేయడం కన్నా అదే నయం” సూచన చేసింది. 


“ ఫోన్ చేసాను.అక్కడికి కూడా వెళ్ళలేదు” అన్నాడు చప్పున.


శారద లో ఆందోళన. అయినా కించిత్ తొణకలేదు. మౌనంగా చూస్తూనే వుంది. శారద ముఖం చూసిన ఫణీంద్ర “ నువ్వే ఏదో చేసి వుంటావ్! పోరా, వెధవన్నర వెధవ”అని తనను తిడుతున్నట్లు      ఊహించుకున్నాడు.గిర్రున వెనుక్కి తిరిగి తడబడుతూ కారు దగ్గరకు చేరుకున్నాడు. స్టీరింగ్ ముందు కూర్చుంటూ ఆమె వైపు చూసాడొకసారి. గేటు వేయడానికి వచ్చిన శారద నిలబడి చూస్తూనేవుంది. ఏమనుకున్నాడో ఏమో! కారు దిగి.. మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఈసారి అతని నడకలో ధైర్యం వుంది. ఏదో చెప్పాలనుకున్న మాట యిచ్చిన శక్తి అనుకుంటా. 


“ఎప్పటినుండో నీతో ఒక మాట చెప్పాలనుకున్నా, నీ నీతి నిజాయితీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా యిష్టం భయం కూడా అత్తా! నా లాంటి దగుల్బాజీలు వున్నచోట నీలాంటి వాళ్ళు కూడా ఉండాలి.అప్పుడే కాస్తయినా మంచికి రోజులుంటాయ్! “ నాటకీయంగానో మనస్పూర్తిగానో చేతులెత్తి మొక్కాడు. శారద అహం శాంతించినట్లైంది. అయినా అతని వైపు అభావంగా చూసింది. మళ్ళీ అతనే అన్నాడు. “నీ కూతురు నీలాంటిదైతే చాలనుకున్నా. కానీ అదికూడా నాలాంటిది నీ భర్తలాంటిదే అని నిరూపించింది. ఎవడితోనో లేచిపోయింది. గాలించి గాలించి ముల్లోకాల్లో ఎక్కడున్నా దాన్ని పట్టుకుని తీరతాను. నా కాళ్ళదగ్గర కుక్కలా పడివుండేలా చేస్తాను. కసిగా వెనక్కి తిరిగాడు. వింటున్న శారద స్థాణువులా మారింది. తేరుకునేసరికి  ఫణీంద్ర వెళ్ళిపోయాడు. కూతురు లేచిపోవడం ఏమిటి? నమ్మశక్యంగా అనిపించలేదు శారదకు. లోపలికి వచ్చి తలుపులు మూసింది.


మినుకు మినుకు మంటున్న వెలుగుతో కూడిన వైబ్రేషన్ తో ఫోన్ రింగ్. బల్లపై వున్న ఫోన్ చేతిలోకి తీసుకుంది శారద. ఆడపడుచు నెంబరు అది. “ వదినా, ఉమ కోసం ఫోన్  చేసాడు వాళ్ళాయన. ఉమ నీ దగ్గరకు రాలేదు అన్నయ్య దగ్గరకు కూడా వెళ్ళలేదంట కదా! ఎక్కడికి వెళ్ళివుంటుంది ఏమైపోయిందో అని భయమేస్తుంది వదినా” అంది ఏడుపు గొంతుతో.  పేగు బంధాన్ని  అప్పటి ఆ సమస్యను  తలకెత్తుకున్నట్లుగా శారద భృకుటి ముడిపడింది.మూసిన తలుపు గడియపై చేయి పడింది.


**************౦**************

#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.








కామెంట్‌లు లేవు: