22, మార్చి 2023, బుధవారం

బీగాలు వేయకండి


కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ కి బ్లాగ్ కి ఉద్వాసన పలికి వెబ్ రహిత జీవనానికి స్వాగతం పలికాను. అలా వున్న ప్రాణిని హఠాత్తుగా యెందుకు ఫేస్ బుక్ యాక్టివేట్ చేసాను అంటే.. మూడు రోజుల క్రితం నుండి కొన్ని హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ వార్తలు యెక్కువగా వినడం మూలంగానేమో అదోరకం భయం ప్రవేశించింది. శారీరక వ్యాయామాలు నడక ఇక్కడ (అట్లాంటా) వాతావరణ పరిస్థితుల వల్ల జీరో అవడం మూలంగా చెడ్డ కొవ్వు పేరుకుపోయి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఎసిడిటీ సమస్యలు కూడా యెక్కువే! మొన్నంతా నిన్న కూడా  సమస్య బాగా భయపెట్టింది. ఇప్పుడు బాగున్నాను. అప్పుడు కొంత ఆలోచించాను. 

ఫేస్ బుక్ బ్లాగ్ తాళాలు వేసుకుని కూర్చుంటే.. భ్లాగ్ లో డ్రాప్ట్ లలో పడవేసి వుంచిన పోస్ట్ లు కథలు యేమైపోతాయో!  సడన్ గా లోకానికి వీడ్కోలు చెపితే మన రాతలు అన్నీ మరుగున పడిపోతాయి. ఒక్కో రాత బయటికి రావడం వెనుక యెంత ఆలోచన కృషి తపన ఆరాటం వుంటాయి. అవన్నీ మరుగున పడిపోతే ఇంకేమైనా వుందా అని.. అనిపించి.. అప్పటికప్పుడు ఫేస్ బుక్ యాక్టివేట్ చేసాను. వరుసగా బ్లాగ్ లో కథలన్నీ పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను.

దయచేసి రైటర్స్ ఎవరూ వారి అకౌంట్ లను స్థబ్థత పరిచి లేదా మరుగున పడేసిన వుంచకండి. మన పిల్లలకు మన అభిరుచులు పట్ల మన ఆసక్తుల పట్ల ఆసక్తి తక్కువ.వారి జీవనపోరాటాలు వారివి. కనీసం మన మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఠక్కున నోటితో చెప్పగల శ్రద్ధ వుండదు కనీసం ప్రయత్నం కూడా చేయరు. ఇక మన ID లు passwords బ్లాగ్ పబ్లిష్ లు వాళ్ళకు ఏం పడతాయి చెప్పండి? అని చెప్పడమే కాదు మీకందరికి గుర్తు చేస్తున్నాను. (అందరి పిల్లల సంగతి నాకు తెలియదు. మా ఇంట్లో వారి గురించే నేను చెబుతూ జనాంతికంగా అంటున్నానని మనవి)

మనల్ని నచ్చినవాళ్ళు యెప్పుడైనా మన రాతలను చదవాలనుకుంటే వాళ్ళకు అందుబాటులో మన రాతలను  మిగిల్చివెళ్ళాలని మనం మరువవద్దు. అన్ని రాతలు అచ్చులో వుంచుకోవడం సాధ్యం కాదు కదా! రాయడం వెనుక వున్న శ్రమలో ఒక వంతు భద్రపరచడం లో అందుబాటులో వుంచడం కూడా వొక భాద్యత గా భావించుదాం. కొందరు రచయితలు వారి రచనలను యెప్పటికప్పుడు భద్రపరుచుకోలేక తర్వాత వగస్తూ వుంటారు. మరికొందరు కీర్తిశేషులైన తర్వాత వారి రచనలు అందుబాటులో వుండవు. ఆ విషయాలన్నీ విన్నప్పుడు చచ్చువో పుచ్చువో మంచివో చెడ్డవో కాకి పిల్ల కాకి కి ముద్దు లాగా మన రచనలు మనకు ముద్దుగా గొప్పగా భావించి భద్రపరచడం సమంజసం అని నేను భావించాను. మీ రాతలకు తాళాలు (బీగాలు ) వేయకండి. :)

మిత్రులందరూ బ్లాగ్ చూస్తున్నందుకు ఆత్మీయంగా స్పందించినందుకు ధన్యవాదాలు.

వీలైనప్పుడు స్పందిస్తాను.. నమస్తే!

వ్యాఖ్యల సౌలభ్యం తొలగించాను. రద్దు చేసాను. మన్నించండి. అందుకు చాలా పెద్ద కారణమే వుంది. దాని గురించి ఒక టపా రాస్తాను .





కామెంట్‌లు లేవు: