ఏనాటికీ ముగియని కథ
కన్నడమూలం :డా॥ యు, ఆర్. అనంతమూర్తి
తెనిగింపు: శ్రీ శంకరగంటి రంగాచార్యులు.
టైమ్ ప్రెజెంట్ అండ్ టైమ్ పాస్ట్
ఆర్ బోత్ పర్ హాప్స్ ప్రెసెంట్ ఇన్ టైమ్ ఫ్యూచర్
అండ్ టైమ్ ఫ్యూచర్ కంబైన్డ్ ఇన్ టైమ్ పాస్ట్
టి. ఎస్. ఎలియట్.
"బయట శానా చలిగా వుండాలి.".
పండు పండు ముసలివాడు మనస్సులోనే చలిని వూహించుకుని వణకి, ధగధగ మండుతూన్న కుంపటి వద్ద ఒళ్ళు కాచుకుంటూన్నాడు. ఏవేవో స్మృతులు మనస్సులో మెదలాడుతాయి.... ఎన్నేళ్ళ క్రిందటివో ఏమో!
కాంతిగా నుండే నిప్పుల్లా వెలుగుతున్నాయి... ఆ ముసలికళ్ళు.. ఏమో తృప్తి! ....
దేవుడి దయ అనాలి. సుఖమైన బదుకు. నిండుగృహం. వయస్సయినా ఇంటి బాధ్యతనంతా అతడి కొడుకే వహిస్తున్నాడు. అతడికి చేతికి అందుబాటులోకి వచ్చిన నలుగురు కుమారులు, అందరికీ లక్ష్మీదేవుల్లాంటి భార్యలు... మళ్ళీ ముద్దుముద్దుగా పుట్టిన ఆ మనముల పిల్లలు మునిమనుములు!!
ఎంత అదృష్టవంతుడు ముసలివాడు!
రెండు పూటలకూ అయి మిగిలేటట్టు వడ్లు పండుతూన్న మాగాణి ! చిన్నదైనా ఉత్తమంగా పంటనిస్తున్న పోకతోటా! కొట్టం నిండా పాడి పశువులూ అన్నీఉన్నాయి.
ఇంకేం కావాలి, ఇంతకన్నా?
తొంభై ఏళ్ళు వచ్చినా రాయిలాంటి ఒళ్ళు, కొడుకు అధికారంలోకి వచ్చినా తన్నడగకుండా ఏపనీ చేయడు. అదలా వుండనీ... ఎంతభక్తి వాడికి! ఈనాటికీ తన్ను తలయెత్తి చూడడుగదా!.... ఇక ప్రాయపు మనుమలు... ఈకాలం వాళ్ళయితే ఏమంట? తాతయ్యంటే వాళ్ళకు నాన్న గార్ల కన్నా ఎక్కువ ప్రేమ....
... లోపల్నించీ జోలపాట వినవస్తోంది.....
ఏడ్తువేల రంగ,
ఏమికావలె నీకు....
నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా
నీ నడిగినపుడంత ఇస్తానులేరా
వోవలా హోనీ.... ... చిట్టి జోజో
జోజో బాబూ..జోజో…
ఇంకెవరంట బాగా జోలపాట పాడతారు. అతడి ముసల్దే!..... ఆ చిన్న మనునుడి పాపడిని ఊదుతూండాలి....
ఔను! ఆ పాపడిరి అతడి పేరే పెట్టారు. అతడి ముఖంలాగే వాడి ముఖమూనూ హుం! అతడి లాగే హదమారి తనం కూడా!.. .....
ఇప్పటికి ఎనభై రెండేళ్ళక్రితం... శానా కాలం క్రితం అతడూ అలాగే ఏడ్చేవాడు! అపుడు అతడి అవ్వకూడా పూచి లాలి పాడుతూండేది.
ఏడ్తువేల రంగ, ఏమికావలె నీకు....
నాలుగెనుములు పిండినట్టి పాల్ చక్కెరా..
ఆ జోలపాటకు ముగింపే లేదేమో!
ఆ తొట్లలోనే .... తాను ! ....
తన కొడుకూ!.....
కొడుకు కొడుకూ!.....
అతడి కొడుకు కొడుకూ
ఆ తొట్ల ఊగక ఆగిన దినమే లేదు!
ఆ జోలపాట పాడని దినమూ లేదు!
అతడి పాలిట ఆ జోలపాట ఎంత సత్యం
అతడి ఇంట్లో పుట్టిన పిల్లలు ఎందుకేడ్వాలి? కావలసినవన్నీ ఉన్నాయి. ఇంట్లో నాలుగెనుములెందుకు? అరెనుములున్నాయి! ఇంట్లో ' జనం నిండుగా వున్నారని ఇంకా మొన్నే అతడి కొడుకు జాతరకు వెళ్ళి మరొక ఎనుము తెచ్చాడు.
ఆ నాలుగెనుములంటేనో తన ఇంట్లోనే పుట్టి పెరిగాయి,. వాటి తల్లి, తల్లి, తల్లి,తల్లి, ఆవ్వ పాలో ఏమో తను తాగి పెరిగింది......
హూం! మొదలైంది హదమారితనం! వాడే పెద్ద మనుమని కొడుకు! ...ఇంకేముంటుంది! 'కథ చెప్పు..... ఒకటే పోరు! అతడి ముసల్దానికి ప్రతి నిత్యపు గోడు!…
ఔను! అతడి లానే కదా అతడి మనుమలు! 'తాత ప్రతి బింబాలు' అంటూ వాళ్ళ తల్లులు ఎందుకు దూరుతూంటారు... ముసలివాడి ముఖం తృప్తితో విప్పారుతుంది .... ఔను! అతడూ అలానే చేస్తూవుండలేదా, పిల్లవాడై వుండినప్పుడు, అవ్వ కధ చెబితే తప్ప నిద్రపోయిన దినం ఒకటైనా వుందా?....
ఆ ఒక కథను మాత్రం.... హో! అదే! అదే కథ! అతడి అవ్వ అతడికి చెప్పిన కథ.
అతడి లానే అతడి మనుమడి కొడుకూ తన అవ్వను వేధించి, కథ వింటూన్నాడు...
ముసలిదానికి ఆకథ ఎవరు చెప్పారు? అతడి అవ్వ అతడి కొక్కడికే చెప్పిన కథ అతడి ముసలిదానికెలా తెలిసింది? ... ఏమో జ్ఞాపకమే రాదు!
అతడే కదా..
ఆరోజు! .... సంక్రాంతికి ముందు!... పొలంలో వంగి పనిచేస్తూ వున్నపుడు ఆమె చెంపకు తన చెంపను సోకిస్తూ.....
ముసలివాడి ముఖం ముడతలు పడి వుండినా సిగ్గుతో ఎర్రబారుతుంది.
మనస్సులోనే ముసి ముసి నవ్వు నవ్వుతాడు.
అతడని ఆ అవ్వకు ఎవరు చెప్పి వుంటారు.
ఇంకెవ్వరూ..అతడి ఆ తాతయ్యే!
అతడికి అతడి అవ్వ
ముసలివాడు తన ఆలోచనలకు తనే నవ్వుకుని మంటను మరింత పెద్దదిగా చేసి వీపు రాచుకుంటాడు.
ఔను,అదోకథ! వంశపారంపర్యంగా తామందరూ వింటూ వచ్చిన కథ! అదే ముగియని కథ. ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకు ఏళ్ల తరబడి చెప్పినా ముగియని కథ!
అతడు తన అవ్వను అడిగినప్పుడంతా ఆమె చెప్తూండేది.
రేపు ముగుస్తుందా
ఊహూ
ఎల్లుండి..
ఊ హూ..
ఇంకెప్పుడూ
“ఎప్పుడూ ముగియదు”
“ఎందుకు”
అతడు ఎనభై రెండేళ్ళక్రితం అతడి అవ్వను కుతూహలంగా అడిగాడు.
అపుడామె బహు గంభీరధ్వనితో చెప్పింది.
ఈ కథ చివరికి వస్తే పొద్దు పొడవదు చెట్టులో పండ్లు కాయవు తీగలో పూలు పూయవు. మనుషులకు కథలు చెప్పే అవ్వలు బతకరు”
ఇప్పటికీ ముసలివాడు అవ్వ మాటల్లో నమ్మకం పెట్టాడు.ఆ కథ ఏనాడు తుదముట్టరాదు.. ముట్టితే?
అతడి అవ్వ ఆ రోజు చెప్పి వుండలేదా? ఏమవుతుందని?
************
ముసలివాడికి చెవులు చాలా చురుకైనవి. అతడి ముసలిది
మునిమనుమనికి చెప్తూన్న కథను చెవియొగ్గి వింటాడు.
తను పాపడై వుండినపుడు అవ్వ తొడమీద పడుకొని వింటూవుండిన చిత్రం కనులముందు కదలుతుంది.
అతనికేమో ఆశ్చర్యమవుతుంది. అతడి ముసలిది ఆ కథనింకా సాగదీసి, సాగదీసి చెప్పుతూవుంది......
నిదానంగా.... పాపడికి నిద్రను తెప్పించే గంభీరమైన, కంపి స్తున్న స్వరంతో..
ఎక్కడో కొంచెం కొంచెంగా వినబడుతోంది.
" ... తరువాత.... ఆ రాజకుమారుడూ, రాజకుమారీ నిండు ప్రేమతో బదుకుతూంటే.... ఒకానొక దినం.. అయి, చనిపోయారు... చనిపోయినా తోడుగానే వున్నారు.... ఇద్దరూ ఆకాశానికి పోయి, రెండు మేఘాలై, అక్కడంతా సందరిస్తూ సుఖంగా వున్నారు .. ఒకదినం రాజ కుమారుని మేఘం బరువెక్కి, వానై క్రిందపడింది... ఒక కొలనులో నీళ్ళలో చేరుకుంది... అప్పుడు రాజకుమారి కొలనులో చేపగా వచ్చి చేరుకుంది.... తర్వాత ఇట్లే ఉంటూండగా, ఒకానొక దినం ఒక బెస్తవాడు ఆ చేపను పట్టుకుని తినేశాడు..... నీళ్ళై వుండిన రాజకుమారుడు కృశించి, కృశించి, చిక్కి పోయి, మేఘమైనాడు….. చేపను తిన్న బెస్తవాడు ఇట్లే వుంటూ ఒకదినం చచ్చి మన్నయ్యాడు. ఆమట్టి నుంచి చెట్టొకటి పుట్టింది, చూడు, బాబూ, చేపై బెస్తవాడిలో చేరి వుండిన రాకుమారియే ఇలా అంటుంది. మేఘమైన రాజకుమారుడప్పుడు అచెట్టుకు వానై కురిశాడు. .... ఒకటి అక్కడినించీ కూడా వాళ్ళిద్దరికీ ఎడబాటు కలిగింది. రాజకుమారి పోయి చంద్రుడిని చేరింది. రాజకుమారుడు వెళ్ళి సూర్యుడిని చేరాడు. చూడు బాబూ, అందుకే చంద్రుడు రాజకుమారిని మోసుకుని ఆకాశంలో తిరుగుతాడు.... అయితే సూర్యుడు క్రూరుడు చూడు... అతడికి దూర దూరంగా పరుగెత్తిపోతాడు... అప్పుడు రాజకుమారి, రాజకుమారుడూ శానా దుఃఖంతో ఏడుస్తాను.... అందుకే తెల్లవారు జామున ఈ భూమి మీదంతా మంచు బొట్లు బొట్లుగా పడివుంటుంది..... పిల్లవాడు ఉత్సాహంగా నడుమ అడుగుతున్నాడు:
"ముగిసిందేమవ్వా, కథ"
"లేదు. బాబూ...."
"రేపటికి ముగుస్తుందా?"
“ఏ నాటికి ముగియదు బాబూ”
"ఎందుకవ్వా!"
ఆ పిల్లవాడు అతడు అతడి ఆవ్వను ప్రశ్నించినట్లే, ఇపుడు తన అవ్వను మొండిగా అడుగుతున్నాడు.... ఔను.... అతడి అవ్వ జబాబునే ఇపుడు అతడి ముసలిది తన మనుమలకు చెబుతూవుంది. అతడి అవ్వ మాదిరిగానే అతడి ముసలిది కూడా నెలల తరబడి ఆ కథను కొత్తకొత్తగా అల్లి, ముందుకు లాక్కుని పోతుంది.... ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఆ ముగియని కథను వింటూ ఎన్నో రోజులు నిద్రపోయారు,
ఇలానే.. .
ఆ రాజకుమారీ రాజకుమారుల కథ ఇంకా కొనసాగి ముందుకు పోవడం విన్నాడు అతడు....ప్రతీసారీ ఎలాగో ప్రయత్నించి, మళ్ళీ కలుసుకుంటారు. అలాగే ప్రతిసారీ వేర్పడతారు..... మళ్ళీ కలుసుకుంటారు.
తుది మొదటిలేని అనంతమైన కథ.... అనంతములైన రూపాల్లో వాళ్ళ ప్రేమ.... పూవై, కాయై, నీళ్ళై మేఘమై, గాలై, అగ్గియై, ఒకటా? రెండా.... ముగియని కథ.... ఏనాటికి ముగియని కథ!....
అతడికి అన్నం పెట్టిన పొలంలానే .... అతడిని ఊచిన తొట్లలానే...
తన్ను లాలిలో నిద్రపోగొట్టిన - ఆ జోలపాటలానే....
కొడుకులూ, మనునులూ, మునిమనమలూ అనక సతతంగా, అనంతంగా ఒకరినుంచీ ఒకరికి సంక్రమించిన కథ!
_ఔను! ఆది ముగియరాదు, ముగిస్తే? —
_అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?
************
.... పాపడికి నిద్రవచ్చివుండాలి ముసలిది చలికాచుకోవాలంటూ ముసలివాడి పక్కన వచ్చి కూర్చుంటుంది.
"శానా వీపు దురద...."
థూ! ఏం సుఖమాశిస్తూందీ ముసల్ది! మొగుడంటే కొంచమైనా సిగ్గులేదు? ఇలా వీపు గీరమని అడుగుతుంది నిత్యమూ.....
ముసలివాడు నవ్వి, గుద్ది, ఆమెకు కొంచెం బాధకలిగేటట్టే అదేపనిగా గట్టిగా గీరుతాడు.
ఔను! ఆ ముసలివాడి అవ్వకూడా అలాగే....
మనుమలకు, 'అర్థరాజ్యమిస్తాను వీపు గీరితే' అని ఒప్పించి, గీరించుకున్నది చాలక, అతడిప్పుడు, చలికాచుకుంటూన్న కుంపటి ముందే కూచుని, తన మొగుడిచేత కూడా గీరించుకుంటూవుండేది.
అతడి ముసలిది అతడి అవ్వలానే. అన్నిటిలోనూ,
కొంతవరకూ రూపంలోనూ,
...ఏమో కిలకిల నవ్వినలా వినబడుతోంది. ముసలివాడు వీపు గీరడం నిలిపి చెవియొగ్గి వింటాడు.....
ఓ, అతడి చిన్న మనమడూ, అతని భార్యా,
ఇంకేం! పగడకాయలు కావొచ్చు..... ముప్పొద్దులూ అదే పిల్లాట.... ఎంత ధైర్యంగా, గట్టిగా నవ్వుతారు!... ఏం ముద్దో, ఏమో!.....
గొణుక్కుంటూ ముసలివాడు ముసిముసి నవ్వుతాడు.
పాపం ... ఇంకా పసివాళ్ళు పెళ్ళై ఇంకా ఎక్కువ రోజులు కాలేదు. ముసలివాడు నవ్వుతూ దూరుతాడు.
ముసలి సిగ్గుపడి, కుంపటిముందు పెళ్ళికూతురిలా ముసలి వాడితో కూర్చుని, చిరునవ్వు నవ్వుతుంది.
మనమలను ఎందుకు దూరాలి?.... ఎంత దొంగ ఆ ముసలి వాడు! .... ముసలిదాని సిగ్గుతో ఎరుపెక్కిన ముఖం చూస్తే తెలియడంలేదా?.... చాలా కాలం క్రితం.... వాళ్ళిద్దరూ పగడకాయలాడాక, ఆడుతూ కొట్లాడక.... పడుకొనడానికి వెళ్ళిన దినం ఒకటైనా వుండేదా?
అవే పాచికలు,
అదే పట్ట
అవే కాయలు,
ముసలివాడి అవ్వ, తరువాత ఆ ముసలివాడు, తరువాత అతడి కొడుకు, ఇపుడు మనుమడు, అందరూ వాటితోనే తమ ప్రేమ క్రీడలు కొనసాగించారు.
జీవన ప్రవాహం నిరర్గళంగా సాగుతోంది....
ఊహు!... ఏనాటికీ ముగియదు...
ఇది ఎపుడైనా ముగుస్తుందా? ఆ కథలాగే ఈ ప్రేమక్రీడలు ఏనాటికీ ముగియవు.
ఎపుడైనా ముగిసిపోతే?.....
అతడి అవ్వ చెప్పి వుండలేదా? ఏమవుతుందని?_
"అప్పుడు పొద్దుపొడవదు- చీకటిపడదు. చెట్టులో పండ్లు కాయవు. తీగపూలు పూయదు ..."
*****************0****************
చిత్రం:
Gibbs Garden GA
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి