చెరగని గీత - వనజ తాతినేని
ఇక్కడ అందరూ భలే కలసిమెలసి ఇళ్ళు కొనుక్కొన్నారు. నాకు భలే నచ్చిందిలే మీ కమ్యూనిటి” అంది అమ్మ. అబ్బాయి ఇల్లు తీసుకున్నాక అమ్మ అమెరికా రావడం అదే తొలిసారి.
అబ్బాయి నిగూఢంగా నవ్వాడు. అమ్మకు అర్థంకాలేదెందుకో.
“తెల్లోళ్ళు నల్లోళ్ళు అరవోళ్ళు పంజాబోళ్ళు తెలంగాణా వాళ్ళు కడపోళ్ళు తెనాలోళ్ళు బెజవాడోళ్ళు అంతా పక్కపక్కన ఎదురుబొదురు వున్నారు.మూడొంతులు మనవాళ్ళే. భయం లేదు లే” అంది మళ్లీ అబ్బాయితో.
“తప్పు అలా అనకూడదు. ఇక్కడ ఎవరూ మరొకరిని ఏమి అనరు, అస్సలు పట్టించుకోరు కూడా. మనమే ఏవేవో ఊహించుకుని భయపడకూడదు” అన్నాడు అమ్మ అపోహలను పోగొట్టడం తన భాద్యత గా భావించి.
“మన తెలుగోళ్ళు కూడా ఒకొరితో మరొకరు పలుక్కోరా ” అమ్మ ప్రశ్న.
“రెండేళ్ళైంది ఇక్కడకొచ్చి. ఇంతవరకూ పక్కింటామెను చూడలేదు నీ కోడలు. అతనితో అప్పుడప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు నేను మాట్లాడటమే”
“అయ్యో! ఇది మరీ విడ్డూరంగా వుంది. ఇరుగు పొరుగు మరీ అంత విచిత్రంగా వుంటారా” పైకి అనేసింది అమ్మ.
వాకింగ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరింటి ముందూ ఆగి ఉత్సాహంగా పూలు చెట్లూ ఫోటోలు తియ్యకు, అనుమానిస్తారు, కంప్లైంట్ కూడా చేస్తారు” అని హెచ్చరించాడు అబ్బాయి.
“అలాగే” అంది. స్వగతంలో అనుకుంది. విరిసిన ముద్దు ముఖంతో వేలదరహాసాలు చిందిస్తున్న నా మనుమరాలిని చూసుకోవడమే నాకిష్టమైన వ్యాపకం. ఈ పువ్వులు గివ్వులు నాకేమి వద్దు పో! “ అని.
“వద్దన్నా నువ్వు తీస్తూనే వుంటావ్ అని చెప్పా. సీరియస్ గానే చెబుతున్నా తీయొద్దు “ అంటూ అమ్మ చేతిలో టూల్ ని తను తీసుకుని మొక్కల మధ్య తవ్వుతూ “ నీ మనవరాలు నిద్ర లేచినట్టు వుంది. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళు” అన్నాడు.
ఈ లోపు మనుమరాలు తలుపు దగ్గరకు వచ్చి “నాయనమ్మా నేను నేనూ” అని కేకలు వేస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కొని పాపాయికి తగలకుండా డోర్ తీసి “బంగారు తల్లీ! అప్పుడే నిద్ర లేచేవెందుకే, ఏమి ఆరిపోతుందని ఇక్కడ” అని ఎత్తుకుని ముద్దులాడింది నాయనమ్మ. వచ్చిన నాలుగు రోజుల్లోనే నాయనమ్మను అంటుకొని పోయింది. చీటికిమాటికి నాయనమ్మ నాయనమ్మా అంటూ పిలవడం చిన్నితల్లీ అంటూ నాయనమ్మ హత్తుకోవడం. వారి మురిపాలకు ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా తగిలేటట్టు వున్నారిద్దరూనూ.
******
“చిన్ని తల్లీ, నా బంగారు కొండా, రామ్మా ! వొళ్ళు తుడుచుకుని క్రీమ్ రాసుకుని పౌడర్ అద్దుకుని కొత్త గౌన్ వేసుకుందువు గాని, నా బంగారు తల్లి రా!” నాయనమ్మ మనుమరాలిని ముద్దుగా దగ్గరకు రమ్మని పిలిచింది. స్నానం చేసొచ్చిన ఒంటితో బెడ్ మీద ఆటలాడటం మిక్కిలి సరదా.
ఉహూ.. రాను, పట్టుకో పట్టుకో నాయనమ్మా పట్టుకో” మంచం తలకోడువైపుకు వెళ్ళి నాయనమ్మ ను ఆటపట్టించింది.
“అనగనగా ఒక రాజు అంట, ఆ రాజు పేరేమో అంటూ మనుమరాలిని కథ లో లీనంచేయాలని మాయలో పెట్టాలని ప్రయత్నిస్తూ నాయనమ్మ నెమ్మదిగా మంచం చుట్టూ తిరిగివెళ్ళింది. చిన్నితల్లి పకపక నవ్వుకుంటూ అందకుండా ఇంకో వైపు పరుగుతీసింది. మంచం కొసకు వెళ్ళి గబుక్కున వెనక్కి తిరిగింది చిన్నితల్లి. చూస్తున్న నాయనమ్మకు గుండె ఝల్లుమంది. పాప నాలుగడుగుల బెడ్ పై నుండి కింద పడితే.. కించిత్ కోపం ప్రదర్శిస్తూ..
“అమ్మో! ఇంకొంచెం వుంటే కిందకు పడిపోయి వుండేదానివి. ఎంత దెబ్బ తగిలేదో. చెప్పినమాట వినమ్మా! బంగారు తల్లివి కదూ! రైమ్స్ లో డాక్టర్ ఏమి చెప్పాడు? మంచంపై ఎగరకూడదు అని చెప్పాడా లేదా?”
నాయనమ్మ బతిమలాడటం చిన్నితల్లికి నచ్చింది. ఆట ఆపి “పాప ఢాం అంటంది. పాపకు అబ్బు అయితే ఇంజెషన్, నర్స్ ఆంటీ” అని చేతిపైన యాక్షన్ చేసి చూపించింది.
“అవును మరి. అందుకే మంచం మీద ఎగరకూడదు అంటా” మాటల్లో పెట్టి పాప ని చటుక్కున పట్టుకుంది. ఇష్టంగా నాయనమ్మకు దొరికి డైపర్ వేయించుకుని క్రీమ్ రాయించుకుని గౌన్ వేసుకునేటప్పటికి మళ్ళీ ఆట మొదలెట్టింది.
“ఇదిగో ఇలా అయితే నీతో కటీఫ్, నాయనమ్మ వెళ్ళిపోద్దీ. కొత్త గౌను గాజులు అన్నీ ఎదురింటి రీటా పాపకు ఇచ్చేస్తది. నాయనమ్మ రీటా పాపను పెంచుకుంటది అంట” అని బెదిరించింది. నీ ఉత్తుత్తి మాటలు నాకు తెలుసులే నాయనమ్మా అన్నట్టు పాప మనోహరంగా నవ్వింది కానీ నాయనమ్మకు చిక్కలేదు.
ఇక ఇలాకాదు అనుకుంటూ రీటా పాపకు ఇచ్చేస్తా గౌన్. నేను కిందకు వెళ్ళిపోతున్నాను. ఈ డార్క్ రూమ్ లో నువ్వు ఒక్కదానివే ఇక్కడే వుండు అంటూ లైట్ ఆఫ్ చేసి తలుపు మూసి బయట చప్పుడు చేయకుండా తలుపు దగ్గరే నిలబడింది.
నాయనమ్మా! గట్టిగా అరుస్తూంది పాప. గౌను వేయి, పాపది గౌను, రీటా పాపకు వద్దు” అనడం విని నవ్వుకుని తలుపు తెరిచి లైట్ ఆన్ చేసింది. నాయనమ్మ బెడ్ దగ్గరకు రాగానే గబగబ వచ్చి నాయనమ్మ చంకనెక్కింది. పాపను ముద్దాడి గౌన్ తొడిగి బొట్టు పెట్టి చేతులకు గాజులు వేసి విబూధి బొట్టు పెట్టి స్వామికి దణ్ణం పెట్టుకుందాం రా దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. మందిరం ముందు బుద్ధిగా నిలబడి దణ్ణం పెట్టుకుని మళ్ళీ నాయనమ్మ చంక నెక్కింది.
మెట్లు దిగి కిందకు వస్తూ “హమ్మయ్య ఇవ్వాళ్టికి ఈ స్నానం తతంగం అయ్యింది. ఇక అన్నం తినే దగ్గర ఎంత అల్లరి పేచీ పెట్టుద్దో” అనుకుంది నాయనమ్మ.
ప్రతిరోజూ పాప తనకు ఇష్టం లేనప్పుడల్లా అన్నం వద్దనో పాలు వద్దని పేచీ పెట్టడం, నీ కేప్ లు వేసుకోకుండా చెప్పులు వేసుకోకుండా పరుగులు తీయడం చేతులకు వేసిన బంగారు గాజులు తీసి విసిరికొట్టడంతో పాటు పెద్దలు వారించినప్పుడల్లా అమ్మ వద్దు నాన్న వద్దు నాయనమ్మ వద్దు అంటూ తిరస్కారం తెలియజేయడం మొదలెట్టింది. పాప అలా అన్నప్పుడల్లా.. నువ్వు అలాగే చెయ్యి. నీ బొమ్మలు నీ గౌనులు నీ గాజులు కొత్త చెప్పులు అన్నీ రీటా పాపకు ఇచ్చేస్తా అని నాయనమ్మ అమ్మ బెదిరించడం మాములైపోయింది.
రీటా పాప అని చెప్పే అమ్మాయిది కూడా కుడియెడంగా చిన్నితల్లి వయస్సే! తెల్లగా పాలు కారే బుగ్గలతో అమ్మ నాన్న డాగీ తో కలసి కనబడుతూ వుంటుంది. ఎక్కువగా సాయంత్రం వేళల్లో వాకింగ్ కు వెళుతూ కనబడుతుంది. ఆ పిల్ల అసలు పేరేమిటో తెలియదు. నాయనమ్మ ఆ పాపకు రీటా పాప అని పేరు పెట్టింది అంతే! నాయనమ్మకు తెలియకుండా మనుమరాలి మనసులో రీటా పాప కు పెద్ద స్థానం ఏర్పడిపోయింది. నాయనమ్మ రూమ్ లోకి వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద కిటికీ అద్దాల గుండా బ్లెండర్స్ లేపి మరీ ఎదురింటి వైపు చూస్తూ రీటా పాప అని చూపించేది. ఆ పిల్ల కనబడకపోతే రీటా పాప ఏది? లేదు, రీటా పాప లేదు అంటూ చేతులు త్రిప్పి చూపించేది.
ఒకోసారి తనను బెదిరిస్తూ అన్న మాటను పట్టుకుని రీటా పాపకు ఇచ్చేస్తామన్న వస్తువును పట్టుకుని మెయిన్ డోర్ వైపు పరుగులుదీసేది. గరాజ్ తలుపులు తీసివుంటే ఆ వస్తువును తీసుకుని రోడ్డు దాటి వారి ఇంటి వైపు వెళుతూ “రీటా పాపా, రా, బొమ్మ తీచుకో అని” కేకలు పెట్టేది. తన బొమ్మలను తను తినేదాన్ని తన గౌన్లను ఆ పిల్లకు ఇచ్చేస్తా” అనే ఇష్టాన్ని అంగీకారాన్ని ప్రదర్శించేది.
మనుమరాలిలో ఆ ఇచ్చే గుణాన్ని చేసే ప్రయత్నాన్ని చూసి నాయనమ్మకు సంబరం. “నా బంగారు తల్లి, నీకు అన్నీ నాన్న సుగుణాలు వచ్చేయి” అంటూ ముద్దులు కురిపించేది.
చిన్ని తల్లి కోవిడ్ 19 లో పుట్టింది. ఆ పాప పుట్టే సమయానికి అదే హాస్ఫిటల్ లో మూడొందల మంది కోవిడ్ పేషంట్ లు వున్నారు. ప్రీమెచ్యూర్ బేబిగా కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య ఇరవై వొక్క రోజులు వారి మధ్య గడిపి వచ్చిన బిడ్డను అమ్మ నాన్న అపురూపంగా భద్రంగా పెంచుకుంటారు. తగిన జాగ్రత్తలూ ఎక్కువే! ఏదో రెండు మూడు కుటుంబాల స్నేహితులు బంధువులు తప్ప మనుషుల పరిచయమే లేదు. రెండేళ్ళపాటు మనుషులకు దూరంగా వుండటం వల్ల ఎక్కువమంది మనుషుల సాంగత్యం కూడా లేకపోవడం వల్ల కొత్త మనుషులను చూస్తే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. భయం బెరుకు కూడా. నన్నంటుకోకు నేనసలే అత్తిపత్తి ఆకు అనుకుంటూ ఎవరైనా కొత్త మనిషిని చూస్తే చాలు అమ్మ చంకకు అంటుకొనిపోద్ది. మగవాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళదు. ఆడవాళ్ళ దగ్గరకు తోటి పిల్లల దగ్గరకు వెళ్ళడానికి కాస్త సమయం తీసుకునేది.
ట్రావెల్ బేన్ ఎత్తివేయడంతో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ పరిచయమయ్యారు. కాస్త మనుషుల లోకంలోను తన ఈడు పిల్లల లోకంలోను పడింది కానీ కలసి ఆడుకోవడానికి స్నేహం చేయడానికి తోడు లేక పిల్లల కోసం మొహమాచిపోయేది. తోటి పిల్లలను చూస్తే చాలు ముఖం వికసించేది. వారితో కలిసిపోవాలని ఉబలాటపడేది.
రీటా పాప కనబడుతుందేమో అని కళ్ళతో వెతుక్కొనేది. ఆ రీటా పాప చిన్నితల్లి వైపు ఒక్కసారన్నా చూసిందో లేదో! ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఇంటిముందున్న వేన్ పై ఏదో పేరుతో హౌస్ క్లీనింగ్ డాట్ కమ్ అని వుండేది. అది వేసుకుని రీటా పాప తండ్రి, తెల్లని హంస లాంటి కారు వేసుకుని రీటా పాప తల్లి బయటకు వెళుతుండేవారు. బ్రాండెడ్ బట్టలు వేసుకుని ధనవంతులు లాగానే కనబడేవారు నాయనమ్మ కళ్ళకు. వారికి బంధువులు స్నేహితులు కూడా ఎక్కువే. వారాంతంలో ఇంటి ముందు కార్ల రద్దీ ఎక్కువగానే వుండేది.
నాయనమ్మ కు మనుమరాలికి మధ్య మాటల్లో రీటా పాప గురించి వారి కుటుంబం గురించి కబుర్లు నడుస్తూ వుండేవి. మధ్యాహ్నం పూట గరాజ్ ఓపెన్ చేసి గోరు ముద్దలు తినిపిస్తూ.. “ఇవాళ రీటా పాప వాళ్ళ అమ్మమ్మ మామయ్య వచ్చినట్టు వున్నారు. ఇందాక బయటకు వెళ్ళారా, అదిగో చూడు ఇప్పుడు రీటా పాపకు కొత్త గౌను, పింక్ కలర్ గొడుగు కొనుక్కొచ్చుకున్నారు. రీటా పాప అవి తీసుకుని లోపలకు వెళుతుంది చూడు” అని చెప్పింది. వాళ్ళింటి వైపే చూస్తూ.. ఊ అనేది పాప.
సాయంత్రం అందరూ వాకింగ్ కు వెళుతుంటే అందరినీ ఆసక్తిగా చూసేది. కొందరు పిల్లలు చిన్నితల్లికి హాయ్ చెప్పేవారు. కొందరు పెద్దలు ఆగి నాయనమ్మతో మాట్లాడేవారు. పంజాబీ అంకుల్ చిన్నితల్లితో దోబూచులాట ఆడుతూ పకపకా నవ్వించేవాడు. తెలంగాణా అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలూ అంకుల్స్ ఆంటీలు అందరూ చిన్ని తల్లితో మాటలు కలిపేవారు. బ్లాక్ అంకుల్ ఆంటీ కూడా హాయ్ చెప్పేవారు. బ్లాక్ అంకుల్ నాయనమ్మను హాయ్ మా అని పలకరించేవాడు. అతని భార్య నమస్తే అమ్మా అని సంస్కారంగా పలకరించేది.
కానీ రీటా పాప అమ్మ నాన్న అపరిచితుల్లా ముఖం మీద ఏ భావం కనబడకుండా చెక్కముఖాలేసుకుని ఆగకుండా చిన్నితల్లి ఆ పిల్లకు హాయ్ చెబుతున్నా పట్టించుకోకుండా రీటా పాపను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళేవారు. నాలుగైదుసార్లు ఆ విషయాన్ని గమనించిన నాయనమ్మ ముఖం నల్లబడింది. మనుమరాలి ఉత్సాహాన్ని రీటా పాపతో స్నేహం చేయాలన్న ఆకాంక్షను కనిపెట్టింది. కానీ అసాధ్యమని తెలిసిపోయింది.
నాయనమ్మ కళ్ళే కాదు మనసు కూడా పూర్తిగా విచ్చుకున్న తరుణం కూడా అది. తనే పొరబాటు చేసానని అనుకుంది. ఇంకెప్పుడూ చిన్నితల్లినే కాదు ఎవరినీ కూడా తెలిసీ తెలియకుండా కూడా బెదిరించడం ద్వారా పోల్చడం ద్వారా అవతలి వారిపట్ల అమితాస్తక్తి ని కల్గించకూడదూ అని గట్టిగా నిర్ణయించుకుంది.
ఇంట్లోకి వచ్చి “చిన్నితల్లి దగ్గర ఆ రీటా పాప గురించి పదే పదే ప్రస్తావించి మనం చాలా తప్పు పని చేస్తున్నాం. ఆ పిల్లతో స్నేహం చేయాలని తన బొమ్మలు తినుబండారాలు పంచుకోవాలని మన పిల్ల ఆరాటపడుతుంది. ఆ పిల్ల అమ్మ నాన్న ఆ పిల్లను ఇటువైపు చూడనీయరు. మన చిన్నితల్లి బాగా నిరాశపడుతుంది. ఆ పిల్ల గురించి మనం మాట్లాడటం ఆపేద్దాం” అని ఇంట్లో వారికి సూచన చేసింది.
అలా చేయడమే కాదు, ఆచరణలో ప్రయత్నించింది కూడా.
మరొకరోజు అబ్బాయితో అంది అమ్మ తన అసంతృప్తిని వెల్లడిస్తూ..
మన కుటుంబాల్లోని నాలుగవ తరం వారందరిలో మూడొంతులు మంది ఇక్కడికే వచ్చేసారు. ఈ వలసల వల్ల ఏమి బావుకుంటున్నాం. ఇక్కడ కూడా మనుషులు మనుషుల్లో కలవరు. అంటరానితనం వొంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం అన్నది ఇక్కడ కూడా వుంది. ఇది మాత్రం నాకేమి నచ్చలేదబ్బాయ్”
“అసలు నేటివ్ అమెరికన్స్ వేరే వుంటారు. ఈ తెల్లవాళ్ళంతా ఎక్కడెక్కడ నుండో వచ్చినవాళ్ళే! నల్లవాళ్ళందరూ బానిసలుగా తీసుకొచ్చినవాళ్ళ సంతతే! ఎన్నో వివక్షలుంటాయ్. ఇక్కడ బతకాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. అమ్మా! ఎక్కువ ఆలోచిస్తునట్టున్నావ్ వదిలేయ్”
మళ్లీ తనే తల్లికి విశదీకరించే ప్రయత్నం చేసాడు.
“ఈ కమ్యూనిటిలో అందరూ ఇండియన్సే వున్నారని కొంతమంది తెల్లవాళ్ళు ఇళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయారు రెండేళ్ళలోనే.ఆహారం వండేటప్పుడు వచ్చే ఘాటైన వాసనలు వారికి నచ్చవట”
“మనవాళ్ళు మాత్రం అద్దెకు ఇళ్ళు అందరికీ ఇస్తారా ఏమిటీ? అందుకు అనేక కారణాలు. అలాగే ఎవరి కారణాలు వారికి వుంటాయిగా మరి’’అంది కొడుకుతో.
నాయనమ్మ సాయంసమయాల్లో పాపను ఇంటి ముందు వైపుకు తీసుకువెళ్ళకుండా వెనుక వైపు తోట బయటకు తీసుకెళ్ళి కడపోళ్ళ పిల్లలతో తెలంగాణా పిల్లలతో కలిసి ఆడుకునేటట్లు ఉరికొల్పింది. చిన్నితల్లి కూడా వారితో కలిసిమెలిసి అక్కా అన్న అంటూ బాగా ఆడుకుంటుంది. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న అక్క అభినయాన్ని అనుకరించింది కూడా.
హమ్మయ్య ! కాస్త పెద్దపిల్లలన్న మాటేకానీ మనుమరాలు ఆడుకోవడానికి కొద్దిమంది పిల్లలు దొరికారు అది చాలు అనుకుని నాయనమ్మ నిశ్చింతగా నిట్టూర్చింది.
ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ సన్నగా చినుకులు పడుతున్న సమయంలో చిన్నతల్లి అమ్మ మీటింగ్ లోనూ నాన్న కాల్స్ లోనూ బిజీగా వున్న సమయం. చిన్నితల్లి ఆడుకుంటూ గట్టిగట్టిగా అరుస్తూ అల్లరి చేస్తుంది. అమ్మా! కాసేపు అమ్మాయిని బయటకు తీసుకెళ్ళు, కాల్ లో వున్నాను అన్నాడు చిన్నితల్లి నాన్న. వంటగదిలో వున్న నాయనమ్మ స్టవ్ ఆపేసి వచ్చి చిన్నితల్లిని చంకనేసుకుని తలుపుతీసుకుని గరాజ్ లోకి వచ్చింది. గరాజ్ ఓపెన్ చేసింది. చిన్నితల్లి వాన వాన అంటూ నాయనమ్మ చంక దిగి బయటకు పరిగెత్తింది.
“బంగారు తల్లీ పడపోతావ్, అబ్బు అవుద్ది, నీ కేప్ వేసుకుందువుగాని వుండు అంటూ వుండగానే డాగీని రీటాను పట్టుకున్న రీటా అమ్మా నాన్నలు గబగబ నడుస్తూ వస్తూ చిన్నితల్లికి కనబడ్డారు. చిన్నితల్లి గబగబా లోపలికి వచ్చి తనకెంతో ఇష్టమైన జెజె బొమ్మను తీసుకుని బయటకు పరిగెత్తుతూ “ రీటా పాపా, తీసుకో తీసుకో జెజె ను తీసుకో “ అంటూ ఎదురెళ్ళింది. రీటా పాప అమ్మనాన్న చిన్నితల్లిని చూసి పట్టించుకోనట్లు చూసి రీటాను కుక్కను లాక్కుంటూ చిన్నితల్లిని దాటుకుని ముందుకు వెళ్ళారు.
ఆ క్షణంలో బాల్యంలో బలంగా నాటుకుని తర్వాత మరుగునపడివున్న దృశ్యం పెళ్ళగించుకుని వచ్చి నాయనమ్మ కళ్ళ ముందు నృత్యం చేసింది.
*******
అన్నయ్య తను కరణం గారి మేనకోడలు డాక్టర్ గారి అబ్బాయి మేడ ఇంటి పద్మ అందరం కలసి సందడి సందడిగా ఆడుకుంటున్నప్పుడు చూసిన విషయమూ జ్ఞాపకం వున్న దృశ్యం అది. చంకలో వెదురుబుట్ట పెట్టుకుని మా అందరిని ఆసక్తిగా చూస్తూ మనసులో మాతో కలిసి ఆడుకోవాలనే కోరికను అదిమిపెట్టి దూరంగా నిలబడి బిక్కముఖం వేసుకుని చూస్తున్న యేసుకుమారి. చీకటి పడుతున్న వేళకు యేసుకుమారి వాళ్ళమ్మ మా ఇంట్లో నుండి చెమట తుడుచుకుంటూ వచ్చి చేతిలోని చద్దిమూటను తన కూతురి చంకలోని వెదురబుట్టలో పెట్టి ”మిడిగుడ్లేసు కుని అట్టా చూత్తావేమే, పెద్దోళ్ళ పిల్లలతో ఆడకూడదని చెప్పాగా. మనింటికాడ పిల్లలతో ఆడుదువు గాని పా” అంటూ రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయింది.
అప్పుడు నేను ఆశ్చర్యంగా చూసిన చూపు ఇప్పుడు ఇక్కడ మనమరాలి తో కూడిన తనకు అనుభవంలోనికి వచ్చినట్లైంది అనుకుంది నాయనమ్మ.
****************
వాస్తవంలోకి వచ్చిపడింది.
ఒకోసారి పెద్ద పెద్ద విషయాలకే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా గుండె చెరువై పోతుంది. కానీ అది చాలా పెద్ద విషయమని తర్వాతెప్పుడో తెలుస్తుంది అనుకుంటూ.. చిన్ని తల్లి వైపు చూసింది.
ఆగకుండా హాయ్ చెప్పకుండా బొమ్మ ఇస్తానన్నా తీసుకోకుండా వెళ్ళిపోతున్న రీటా వైపు చూస్తూ కదలకుండా మౌనంగా నిరాశనిండిన కళ్ళతో నిలబడి వుంది చిన్నితల్లి. అది చూసి నాయనమ్మ గుండె బ్రద్దలైపోయింది. అప్రయత్నంగా కళ్ళనిండా కురిసిన నీళ్ళు జలజలా రాలాయి.
ఒక్క ఉదుటున వొంగి చిన్నితల్లిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది నాయనమ్మ.
ఇంకా రీటా పాప ఇంటివైపు చూస్తున్న మనుమరాలి దృష్టిని మళ్లించడానికి మాయమాటలు చెప్పింది.”రీటా పాప వానలో తడిస్తే జ్వరం వస్తుందంట. అందుకే గబగబ వాళ్ళమ్మ నాన్న లోపలికి తీసుకెళ్ళారు. మనం కూడా గబగబా లోపలికి వెళ్ళిపోదాం పద”
గబగబ చకచక తపతప టపటప పకపక అంటూ నాయనమ్మ నేర్పిన జంట పదాలను వల్లిస్తూ నాయనమ్మ మెడను వాటేసుకుంది చిన్నితల్లి.
మనుమరాలిని హత్తుకుంటూ.. “మనుషులు తోటి వారి మధ్య గీసుకున్న గీతలు చాలా బలమైనవి క్రూరమైనవి. కులాలు మతాలు వర్ణాలు దేశాలు ఏవైనా వాటిని చెరపడానికి కొన్ని తరాలు వారి హృదయాలు కూడా అవసరమవుతాయి. ఈ లోగా గాయపడే హృదయాలెన్నో! నాయనమ్మ భారంగా నిట్టూర్చింది.
************౦***************
#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి