పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అంటారు. అలాగే దూరపు కొండలు నునుపు అంటారు. అదే రీతిగా.. దేశం వీడితే కానీ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు గుర్తుకు రానట్టు.. వుంటుంది. ఎక్కడైతే పరాయి భావన మనుషులను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో అక్కడ మనం మన ఉనికి మనవాళ్ళు అప్రయత్నంగా గుర్తుకు వస్తారు. అలాగే ఇతర దేశాల సంస్కృతి గురించి పరాయి వారికి ఆసక్తి ఎక్కువ. మన వాటిపై మనకు చిన్నచూపు అని కాదు కానీ.. అంత శ్రద్ధ ఆసక్తి వుండవు. ఎవరైనా మన దేశం గురించి మన గొప్పతనాన్ని గురించి చెప్పమంటే పట్టుమని పది వాక్యాలు చెప్పడానికి మాటలు తడుముకుంటాం. ఇతరములపై చూపిన శ్రద్ద మన వాటిపై వుండదు.
మనకు సంబంధించిన వివరాలను సంపద రహస్యాలను పరాయి వారికి అందించేది కూడా మనవాళ్ళే అన్నది కూడా సత్యమే. ఈ కథ గొప్ప సెటైర్ గా తోచింది నాకు.
ఈ కథలో ఒక పేద యువకుడు విదేశానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి అనారోగ్యంతో వుంటాడు. తల్లి 15 రోజులకు ఒకసారి క్షేమసమాచారంతో ఉత్తరం రాయిస్తుంది. అతనికి విదేశంలో లైబ్రరీకి వెళ్ళి మన దేశ ఆచారాలు వ్యవహారాలు గురించి చదువుతూ వుంటాడు. .. ఇక కథ నేను చెప్పడం బాగుండదు. ముగింపు చదివేటప్పటికి హృదయం మెలిపెట్టింది. ఏమైందో మీరే కథ చదివి తెలుసుకోండి.
ఏ కె రామానుజన్ రాసిన కన్నడ కథ “ అణ్ణయ్య మానవ శాస్త్రం“ కు తెలుగు అనువాదం ఇది.
అన్వర్ పోష్ట్ లో ఈ కథ గురించి ప్రస్తావించడం జరిగింది. వెతికితే ఆంగ్లం లోనూ తరువాత తెలుగు అనువాదం లోనూ ఈ కథ దొరికింది. అనువాదం: శార్వాణి.
అణ్ణయ్య మానవ శాస్త్రం
డా. ఎ.కె. రామానుజన్
అతనికి ఆశ్చర్యంగా, చాలా ఆశ్చర్యంగా వుంది.
ఈ అమెరికా మానవశాస్త్రవేత్త ఈ ఫర్గూసన్ వున్నాడే, ఇతను మనుధర్మశాస్త్రం చదివాడు. ఇతనికి మన సూతకాల సంగతి ఎంత బాగా తెలుసు! తను బ్రాహ్మణుడై వుండి కూడా తనకివేమీ తెలియవు.
ఆత్మజ్ఞానం సంపాదించాలంటే అమెరికాకి రావాలన్నమాట. మహాత్ముడు జైల్లో కూర్చుని కటకటాలు లెక్కపెడుతూ ఆత్మచరిత్ర రాసినట్లుగా, నెహ్రూ ఇంగ్లండికి వెళ్ళి స్వదేశాన్ని గుర్తించినట్టుగా, దూరంగా వుంటేనే కొండ గొప్పదనం.
"మన దేహంలో పన్నెండు విసర్జక ద్రవ్యాలవల్ల మనకి మురికి-మైల. దేహంలోని జిడ్డు పదార్థాలు, వీర్యము, రక్తము, మెదడులోని మజ్జారసం, మూత్రం, మలం, చీమిడి, చెవిలోని గుల్మము, శ్లేష్మము, కన్నీరు, కంటి-పుసి, చమట.” మను(5.135)
చికాగోలో వున్నా లెక్క పెట్టడం కన్నడంలోనే లెక్కపెట్టాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు.... మొదటిసారి లెక్క పెట్టినప్పుడు పదకొండే మలాలు దొరికాయి. మళ్ళీ లెక్కపెట్టినప్పుడు పన్నెండు, సరిగ్గా పన్నెండు. ఈ పన్నెండింటిలో అతనికి తెలిసింది. ఉమ్మి, ఉచ్చ, దొడ్డి. చిన్నతనంలో చెప్పేవారు - ఎంగిలి చెయ్యకూడదు, దొడ్డి కెళితే శుభ్రంగా కడుక్కోవాలి. ఉచ్చపోస్తే కడుక్కోవాలి, అంటూ. వాళత్త కక్కసుకి వెళితే పిడికెడు మట్టి (మృత్తిక) కూడా తీసికెళ్ళేది. ఆవిడున్నంతకాలం పెరట్లో గొయ్యి ఒకటి వుండేదెప్పుడూ.
దక్షిణదేశంలో, నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి ఊదే బూరా, నాగస్వరం, ఇవన్నీ ముట్టకూడని వస్తువులు. ఎంగిలి వస్తువులు అస్పృశ్యులు మాత్రమే ముట్టుకుని వాయించే వాయిద్యం. వీణ బ్రాహ్మణలకు ముఖవీణ మాదిగ జాతికి.
కుండకన్నా వెండి, పత్తికన్నా పట్టు, ఉత్తమం. ఎందుకంటే దానికి ఈ పన్నెండు మలాలు అంత సులువుగా అంటుకోవు. పట్టు, పట్టుపురుగు వొంటినుంచి వెలువడే విసర్జక ద్రవం, నిజమే. కాని అది మనుషులకి మడి. చూడండి ఎలా వుంటుందో!
ఈ అమెరికన్లకి ఎన్ని విషయాలు తెలుసు! ఏవేవో లైబ్రరీలకి వెళ్ళి చూశారు.
కాశీలోని పాతకాలపు పండితుల్ని పట్టుకుని, వాళ్ళకి తెలిసినదంతా సంగ్రహించి పాండిత్యపు సారాన్ని పిండుకున్నారు. ఎక్కడెక్కడి తాళ పత్రాలు వెతికి, దుమ్ము దులిపి సేకరించారు. మహా ఆశ్చర్యం ఇతనికి. భారతదేశపు విషయాలు తెలుసుకోవాలని వుంటే ఫిలడెల్ఫియా, బర్క్లీ, చికాగో - అలాంటి చోట్లకి వెళ్ళాలి. వీళ్ళకున్నంత ఆసక్తి మన కెక్కడుంది ? వివేకానందుడు చికాగోకి రాలేదూ? ఆయన మన ధర్మం మీద ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఇక్కడే కదా.
సూతకం తెప్పించే మూడు క్రియలలో ముట్టవడం మొదటిది. పుట్టుక దాని కన్న ఓ డిగ్రీ ఎక్కువది. అన్నిటికన్న ఎక్కువ సూతకం అంటే చావు సూతకం. చావు మైల తగిలినా చాలు. సూతకం తెప్పిస్తుంది. కాలుతున్న పాడె నుంచి వచ్చిన పొగ తగిలినా చాలు బ్రాహ్మణుడు స్నానం చెయ్యాలి. మాదిగ వాళ్ళు తప్పించి మరొకరెవరూ చచ్చిన వాడు కట్టుకున్న గుడ్డలు కట్టుకోరు.
(మను 10.39) శుభంలో శుభ ప్రదమైన ఆవు చనిపోతే ఆ గోవు మాంసాన్ని తినేవాళ్ళు అందరికన్న తక్కువ జాతి వాళ్ళు. కాకి, గ్రద్ద కూడా ఈ కారణం చేతనే పక్షి జాతిలో నీచజాతిగా పరిగణింప బడతాయి. కొన్ని సార్లు చావుకి, అస్పృశ్యతకీ వున్న అంచు చాలా సూక్ష్మంగా అనిపిస్తుంది. బెంగాల్లో తెలివికలవాళ్ళలో రెండు శాఖలున్నాయి. నూనె అమ్మేవాళ్ళు ఉత్తమ జాతివారు. కాని గానుగ ఆడించి గింజల్ని నూనెగా చేసేవాళ్ళు తక్కువరకం జాతి. ఎందుకంటే వాళ్ళు విత్తనాల్ని చంపుతారు గాబట్టి చావు - మైల వున్నవాళ్ళు.
ఇవన్నీ అతనికి తెలియనే తెలీదు.
అతనేమీ చదువుకోని వాడు కాదు. మైసూరులో రోజూ యూనివర్శిటీకి, లైబ్రరీకి చెప్పులరిగేలా తిరిగిన వాడే. అక్కడున్న వాళ్ళలో ఐదారుగురు గుమాస్తాలతో పరిచయం వుంది. అందులో శెట్టి తనతో బాటే ఎకనమిక్స్ చదువుకుని పోయిన సంవత్సరం ఫెయిల్ కావడంతో లైబ్రరీలో పనిలో చేరాడు. అణ్ణయ్య వచ్చినపుడల్లా శెట్టి అతనికి లైబ్రరీ తాళం చెవులు గుత్తి నిచ్చేసి 'కావల్సిన పుస్తకం చూసుకుని తీసుకోండి' అనేవాడు.
బరువైన గుత్తి అది. బాగా వాడటం వల్ల చేతి నుంచి చేతికి మారి, అరిగి, నున్నగా మెరుస్తున్న ఇనుప తాళం చెవులు. వాటి మధ్య కలిసిపోయిన పసుపురంగు ఇత్తడి తాళం చెవులు. ఇత్తడి తాళానికి ఇత్తడి చెవులు, ఆడతాళానికి మగ తాళం చెవి, మగ తాళానికి ఆడతాళం చెవి. పెద్ద దానికి పెద్దది, చిన్నదానికి చిన్నది. కొన్ని మాత్రం పెద్ద తాళానికి చిన్న తాళం చెవి, చిన్న తాళానికి పెద్ద చెవి. ఇలా విపర్యాసం, పర్యాయం, అనులోమం ఈ పుస్తకంలో చెప్పిన మనువు చెప్పిన పెళ్ళిళ్ళలాగ. కొన్ని బీరువా కన్న తాళం పెద్దదిగా వున్నా, తాళం వెయ్యడానికే కుదిరేది కాదు. ముట్టుకుంటే విడిపోయేది. కొన్ని మహా బిగువు. పగలగొట్టే తియ్యాలి. దాని వెనకాలే కళ్ళకి కనిపిస్తూ, చేతికి దొరకని పుస్తకం. ఏ కథ వుందో, సమాజ శాస్త్రవు నగ్న చిత్రం వుందో ఏమో ఆ పుస్తకంలో.
మైసూర్లో ఇతను చదివినదంతా పాశ్చాత్యుల గురించి. ఇంగ్లీషు, కన్నడం చదువుకున్నా అన్నాకెరీనా అనువాదం. మూర్తిరావు, షేక్స్పియర్ మీద రాసిన పుస్తకం. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు రాసిన స్థల పురాణాలు సముద్రపు అవతల నుంచి, అపూర్వ పశ్చిమం, అమెరికాలో నేను లాంటివి.
మల శుద్ధికి మనువు పదకొండు మార్గాలు చెప్పాడు. బ్రాహ్మణ్యపు విధులు, అగ్ని, ప్రసాదము, మట్టి, అంతఃకరణ సంయమము, నీరు, పేడ చేతిలో పట్టుకుని చేసే ప్రమాణం, గాలి, కర్మలు, సూర్యడు, కాలము దేహదారులని శుద్ధి చేసేవి. - ఇవి
(మను 5-105) ఈ తెల్లవాళ్ళకి ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి ? ఇంత దూరంలో, పదివేల మైళ్ళ దూరంలో, నీరు, సూర్యడు, గాలి, నేల, కాలాలని దాటివచ్చి ఇతను, ఈ గబ్బు కంపు కొట్టే చికాగోలో, అణ్ణయ్య - శ్రోత్రియుల జాతిలో మేకులా పుట్టిన అణ్ణయ్య, ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకోవల్సి వచ్చింది. ఈ చలిలో, ఈ తెల్ల మంచులో వుండి ఆ వేడి, ఆ ఎండల మధ్య బ్రతికే ఈ నల్లవాళ్ళ రహస్యాలన్నీ ఆ తెల్లవాళ్ళెలా తెలుసుకున్నారు? ఈ మంత్రం వీళ్ళ చెవుల్లో ఎవరు జపించారు? జర్మనీ మ్యాక్స్ ముల్లర్ సంస్కృతం నేర్చుకుని మోక్షముల్లా భట్టుగా మారి మాకే వేదాలు నేర్పుతున్నాడు కదా!
భారతదేశంలో అతను అమెరికా, ఇంగ్లండ్, యూరప్ అని జపించినట్లుగా ఇక్కడ ఈ అమెరికాలో అతను మళ్ళీ మళ్ళీ భారతదేశం గురించి చదివాడు, మాట్లాడాడు. కనపడ్డవాళ్ళందరికి కాఫీ ఇప్పించి, వాళ్ళిచ్చిన బీరు తాగి, తెల్ల పిల్లల చెయ్యి పట్టుకుని తనకి రాని హస్తసాముద్రికం చెప్పాడు.
ఇక్కడ అతనికి ఆంత్రపాలజీ గురించి జిజ్ఞాస. కామతురం లా, ఈ అత్మజ్ఞానాన్ని గురించిన ఆత్రం దీనిక్కూడా సిగ్గు, భయం, మొహమాటం లేవు. హిందూ సంప్రదాయం గురించి మానవశాస్త్రజ్ఞులు రాసినవి. దొరికినవన్నీ చదివాడు. రెండవ అటక (అర)లో ఆ పుస్తకాలు దొంతర్లుగా వున్నాయి. దాని నంబరు PK 321. నిచ్చెన ఎక్కి, కాలావధిలా చెక్కతో కట్టిన, చేతిపిడి వున్న అటక. ఈ పశ్చిమాన తూర్పు వచ్చి చేరుకుంది. దూరపు పచ్చదనం, ఇంటర్నేషనల్ హౌన్లో అలవాటైన తెల్ల అమ్మాయిలు.
"మీ దేశపు స్త్రీలు నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకుంటా రెందుకు? అని కుతూహలంతో ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి సిద్ధంగా వుండాలి అన్న ఉద్దేశంతోనో ఏమో మైసూర్లో వున్నపుడు వాళ్ళ నాన్న ఎంత కోపగించుకున్నా చెయ్యని గీతాపారాయణం అమెరికాలో చేసి, వీరు, విస్కీ, గోమాంసం, దొడ్డికి వెళితే శాచానికి నీళ్ళు లేక కాగితంతో తుడుచుకునే చండాలత, ప్లేబాయ్ మ్యాగజైన్లో బూతు బొమ్మలు చూడ్డం, వీటి మధ్యనుంచి ఎకనమిక్స్ చదువు మధ్య నుంచీ ఖాళీ చేసుకుని అతను ఈ రెండేళ్ళూ హిందూ సంప్రదాయం చదివాడు. స్టాటిస్టిక్స్ సంఖ్యల మధ్య రామకృష్ణాశ్రమపు పుస్తకాల జాబితా. హిందూ సంస్కృతి తెలుసుకోవాలంటే అమెరికా రావాలి అనేవాడు. మా చికాగో లైబ్రరీలో ప్రజావాణి కూడా వస్తుంది సుమండీ - హిందూ సంస్కృతిని దాచిపెట్టి మూసిన తలుపులకి వేసిన తాళాలెన్నింటికో అమెరికాలో తాళం చెవులు దొరికాయి. తాళాల గుత్తే దొరికింది ఇప్పుడు.
అతను ఆ రోజు పుస్తకాల అలమార్ల మధ్యలో తిరుగుతున్నపుడు హఠాత్తుగా ఒక కొత్త పుస్తకం కనిపించింది. నీలిరంగు గుడ్డ అట్ట. చేతినిండుగా వున్న పుస్తకం, బంగారు రంగులో ఆ నీలం రంగు అట్టమీద, Hinduism: Custom and Ritual అని రాసుంది. స్టీవన్ ఫర్గూసన్ రాసినది. 1968లో అచ్చయిన కొత్త పుస్తకం. వేడి వేడి విషయాలు. సీమంతం, నామకరణం, పుట్టు వెంట్రుకలు . తీయించడం, అన్నప్రాశన, వడుగు, పెళ్ళి, సప్తపది, శోభనం రాత్రి ఇచ్చే పళ్ళు, బాదం పాలు....
"కొత్త పెళ్ళానికి ఏలకులు, బాదం పప్పు తినిపించి తనేమో తిన్నగా బాదంపాలు తాగేస్తాడురా ఈ రసికుడు" అంటూ హుణసూరులో ఎవరింట్లోనో శోభనం జరిగినపుడు బూతు జోక్ ఒకటి విన్నాడు.
భర్త భార్యకి చెప్పే సంస్కృత మైధున మంత్రం, షష్ఠ్యబ్ధి పూర్తి శాంతులు, ప్రాయశ్చిత్తాలు, దానాలు, ఉత్తర క్రియలు ఇలాంటి సంస్కారాలన్నిటినీ విడివిడిగా వివరంగా రాశారు.
బ్రాహ్మణుల ఉత్తర క్రియల వర్ణన, చిత్రాలతో సహా. ఎన్ని విషయాలు చెప్పాడు. 'ఈ ఫర్గూసన్ మహాశయుడు! మాటిమాటికి మనువు, పితృమేధ - సూత్రం అంటూ, సపిండం. ఎవరు నిజం, ఎవరు కాదు. సన్యాసికి, పళ్ళురాని పసిపాపకి సూతకం లేదు. వళ్ళు వచ్చాక బిడ్డ చనిపోతే ఒక రోజు మైల. బేల కర్మ (పుట్టు వెంట్రుకలు) జరిగి వుంటే మూడు రోజులు. శ్రాద్ధానికి ఏడుగురు కావాలి. కొడుకు, మనవడు, వాడి కొడుకు శ్రాద్ధం చేసేవాళ్ళు, తండ్రి, తాత, ముత్తాత చేయించుకునే వాళ్ళు. మూడు తరాలుపైన, మూడు తరాలు క్రింద మథ్యలో తను. ఏడు పిండాల మధ్యన వున్న పిండం. ఇలాంటి వివరాలెన్నో. దానికి తోడు ఏ యే వర్ణాలలో ఎవరెవరికి ఎన్నెన్ని రోజుల సూతకం అన్నదంతా వరుస క్రమంలో రానుంది. అంతేకాదు, పర దేశంలో సంబంధీకులు చచ్చిపోతే, సంగతి వినేవరకూ సూతకం లేదు. విషయం తెలిసిన వెంటనే సూతకం అంటుకుంటుంది. దానికి తగ్గట్టు రోజుల లెక్క, స్నానాల లెక్క అవ్వాలి. ఇతని శ్రద్ధ, కుతూహలం ఒక్కొక్క వాక్యానికి ఎక్కువ కాసాగింది.
పుస్తకాల మధ్యన అలాగే కూర్చుని చదివాను. శ్రాద్ధాలలో నాలుగు భాగాలనీ చెప్పింది పుస్తకం. అతను ఇంతవరకూ ఎవరి చావునీ చూసిన వాడు కాదు. మూడో వీధిలో చాకలి వాళ్ళు శవాన్ని అలంకరించి, వూరేగింపు తీసికెళుతుంటే రెండు సార్లు చూశాడు. పెద్దనాన్న చనిపోయినపుడు బొంబాయి వెళ్ళాడు. ఇంట్లో నాన్నకి మూత్రరోగం వున్నప్పటికీ, జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకుంటే ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది. ముఖం ఎడం వేపు వంకర పోయింది. అయినా బాగానే వున్నారంటూ రెండు వారలకోసారి అమ్మ రాస్తూనే వుంది. నీరసమైన ఉత్తరాలు, దమయంతి పురుడు, అక్కడ ప్రతి శనివారం తలంటుకుని నీళ్ళు పోసుకో. లేకపోతే వేడి చేస్తుంది. సీకాయి పంపనా అంటూ వణికే అక్షరాలతో ఉత్తరం రాస్తుంది.
బ్రాహ్మణుడికి చావు దగ్గరయితే అతన్ని మంచం మీంచి కిందకి దింపేసి దర్భలు పరిచిన నేల మీద దక్షిణంగా కాళ్ళు పెట్టి పడుకోపెడతారు. దేహం నేలకి ఆకాశానికి మధ్య ఇబ్బందిగా మంచం మీదుండకుండా నిరాటంకంగా నేల దుండాలి. దర్భ ఎలాగూ భూసారాన్ని పీల్చుకున్న రసమయమైన గడ్డి నిప్పుకీ ప్రియమయినది. దక్షిణ దిక్కు యముడి స్వంతం. పితృ దేవతలకీ అదే దిక్కు.
ఆ తరువాత కుడి చెవిలో వేద స్వరం నోటిలో పంచ గవ్యం. చనిపోయిన మనిషి దేహం మైల. సజీవమైన అవు మలం పవిత్రం. చూడండెలా వుందో. దశ దానాలు - నువ్వులు, ఆవు, భూమి, నెయ్యి, బంగారం, వెండి, ఉప్పు, బట్టలు, ధాన్యం, పంచదార. మనిషి చనిపోగానే మగ పిల్లలంతా స్నానం చేసి, పెద్దకొడుకు జందెం ఎడం వేపు చంక కిందికి మార్చుకుంటాడు. అశుభానికి సూచనగా. దేహానికి స్నానం చేయించి, విభూది రాసి, భూమి తల్లికి శ్లోకం చెబుతారు.
పేజీ ప్రక్కనే నున్నటి కాగితం మీద ఒక బొమ్మ వుంది. మైసూరు ఇళ్ళల్లో మాదిరిగా వున్నట్టు ఇంటి ముందు వరండా, వెనుక గోడకి కటకటాల కిటికి, వరండా నేల మీద స్నానం చేయించి అలంకరించి పడుకోబెట్టిన శవం. చనిపోయిన వాడు దేవుడు. అతని దేహం విష్ణువు, స్త్రీ అయితే లక్ష్మీ. దేవుడికి చేసినట్టు దానికి ప్రదక్షిణ, హారతి అన్నీ జరుగుతాయి.
ఇప్పుడిక యముడికి అగ్ని నర్పించి నేతి హవిస్సు వేస్తారు. శవానికి, అగ్నికి సంబంధం కోసం ఒక నూలు పోగు వుంచుతారు. శవం బొటన వేళ్ళని దగ్గరికి చేర్చి కట్టి, దాని మీద నూలు గుడ్డ కప్పుతారు.
దీని చిత్రం కూడా వుందక్కడ. అదే మైసూరులో మాదిరి ఇల్లు. కటకటాల కిటికీ, కాని ఒకరిద్దరు విభూతి పట్టెలు పెట్టుకున్న బ్రాహ్మణులు చిత్రంలో వున్నారు. ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తోంది. ఇంత దూరంలో వుండి చూస్తే మైసూరు విభూతి బ్రాహ్మణులందరి మొహాలు ఒక్కలాగే వుంటాయి అనిపించింది.
నలుగురు శవం మోసేవాళ్ళు. పాడె కట్టి ఇంటికి విముఖంగా శవం ముఖాన్ని తిప్పి, ఆఖరి వూరేగింపు బయలుదేరుతుంది.
ఇక్కడ మరొక చిత్రం. మైసూరు వీధే అది. సందేహం లేదు. నాలుగైదు ఇళ్ళు చిరపరిచితంగా అనిపించాయి. మూడు ప్రదేశాలలో వూరేగింపు ఆపి పాడె దింపుతారు. దానికి ప్రదక్షిణ చేసి క్షుద్ర దేవతలకి బియ్యపు గింజలు విసురుతారు.
వల్లకాటికి వచ్చాక దక్షిణ ముఖంగా చితి మీద దేహాన్ని వుంచి, బొటన వేళ్ళ ముడి విప్పి, కప్పిన తెల్ల గుడ్డ తీసి, దాన్ని శ్మశానంలో చండాలుడికి దానం చేస్తారు. కొడుకు, సంబంధీకులు శవం నోట్లో నీళ్ళు చిలకరించిన అక్షింతలు వేస్తారు. బంగారు నాణెంతో దాని నోరు మూస్తారు. నడుము కింద చిన్న· అరటాకో, గుడ్డ పీలికో తప్ప పుట్టినప్పుడున్నట్టుగానే వుంటుంది అప్పుడూను. బంగారం, ఈ కాలంలో ఎక్కడ దొరికిందో తెలీదు. పద్నాలుగు కారెట్లయితే ఫరవాలేదా? వేదసమ్మతమేనా?
పెద్ద కొడుకు కొత్త కుండలో నీళ్ళు నింపి, దాని పక్కగా చిల్లు చేసి, భుజం మీద పెట్టుకుని, చితి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, నీళ్ళు నేలమీద పోస్తాడు. మూడు సార్లయ్యాక భుజం వెనుకగా దాన్ని విసిరేసి పగలకొడతాడు.
వల్లకాటి చిత్రం కూడా ఒకటుంది అందులో. దాన్ని చూసి ఇతని మనసు కలిచి వేసినట్లయింది. ఎందుకో అంతా చిరపరిచితంగా వుంది. మంచి కేమేరాతో తీసిన చిత్రం. చితి, దేహం, తల బాదామి ఆకారపు కావు మధ్యవయస్కుడి భుజం మీద కారుతున్న కుండ ఇతరులు.
దూరంగా చెట్లు అరె, ఈ మధ్య వయస్కుడి మొహం బాగా తెలిసినట్లుందే! దాయాది సుందర్రావు మొహమే. హుణసూరులో స్టూడియో వుందాయనకి. ఇక్కడెందు కుంది ఆయన ఫొటో? ఈ ఛండాలుడు ఇక్కడకెక్కడ్నుంచి వచ్చాడు? పక్క పేజీలో చితి మండుతున్న చిత్రం. దానికింద అగ్నికి చెప్పిన మంత్రాలు.
"అగ్ని దేవుడా ఇతని దేహాన్ని కాల్చకు, చర్మాన్ని కాల్చకు. ఇతన్ని పక్వం చేసి పితృ దేవతల దగ్గరికి చేర్చు. అగ్నిదేవుడా! నువ్వు ఈ యజమాని యజ్ఞంలో పుట్టావు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇతను పుట్టుగాక!
మంత్రం సగంలో ఆపేసి మళ్ళీ అతను వెనుక పేజీ తిప్పి దాయాది సుందర్రావుగారి మొహం ఓసారి చూశాడు. తెలిసిన మొహమే. కళ్ళజోడు తీసేశాడు. సగం నెరిసిన పూర్తి కాపు బదులుగా, కొద్దిగా శాస్త్రానికి తీయించిన బాదామి కాపు. కొత్తగా సర్వాంగ క్షవరం చేయించుకున్నాడు. రొమ్ము మీద వెంట్రుకలు కూడా లేవు. బొడ్డు కిందకి మేలుకోట మడి పంచె. ఇతడెందు కొచ్చాడిక్కడికి? ఈ పుస్తకంలోకి?
మున్నుడి చూశాడు. అందులో ఈ ఫెర్గూసన్ ఫోర్డ్ విద్యార్థి వేతనపు సాయంతో మైనూరికి 1966 68లో వెళ్ళినట్టుగా తెలిసింది. మైసూర్లో మ. సుందరరావుగారు, ఆయన కుటుంబము విషయ సంగ్రహణకి చాలా సహాయం చేసుకున్నట్లుగా వుంది. అందుకే మైసూరు ఇళ్ళు కనిపించాయన్న మాట! మళ్ళీ బొమ్మలన్నీ పరిశీలనగా చూశాడు. ఆ కటకటాల కిటికీ ఇల్లు ఆ పక్కిళ్ళు గోపీ ఇల్లు సంపంగి చెట్టున్న గంగమ్మ ఖాళీ ఇల్లు - తమ ఇంటి వీధి, ఆ వరండా తన ఇంటి వరండా శవం తండ్రిదయి వుండొచ్చు. మొహం సరిగ్గా కనిపించలేదు. వంకరబోయిన మొహం. పారే నీటిలో చూసే మొహంలా వుంది. వొంటి నిండా తెల్లటి గుడ్డ కప్పి వుంది. బ్రాహ్మణులూ తెలిసిన వారిలాగే వున్నారు.
మళ్ళీ మున్నుడి చదివాడు.
సుందర్రావుగారు చాలా సహాయం చేశారు. తమ సంబంధీకుల ఇంట్లో పెళ్ళి. ఒడుగు, సీమంతం, ఉత్తరక్రియలు అన్నిటికి తీసికెళ్ళి, ఫోటోలు తియ్యడానికి సాయం చేసి, ప్రశ్నలడిగి సమాధానాలు రాసుకోడానికి, మంత్రాలను టేన్లికార్డు చేసుకోడానికి వీలు కల్పించారు. ఇంట్లో భోజనం పెట్టారు. ఆయనకి ఈ మ్లేచ్చుడు చాలా కృతజ్ఞతలు వెలిబుచ్చాడు. మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. మండుతోంది. దాని క్రింద అగ్నికి చెప్పే మాటలు. చెట్లు, చేమలు, మైసూరు శ్మశానంలో వున్నట్టే వుంది. క్రింద సన్నటి అక్షరాలతో కృతజ్ఞత : సుందర్రావుగారి స్టూడియో అని వ్రాసుంది. అతనే తీసిన చిత్రం.
అతని తండ్రి చనిపోవడంతో దాయీది సుందర్రావు కర్మ చేశాడు. కొడుకు పరదేశంలో వాళ్ళమ్మ తెలియజేయడానికి ఒప్పుకోలేదేమో. దూర దేశంలో వంటరిగా వున్నాడు. తండ్రి లేని నిస్సహాయుడు. దుర్వార్త తెలిపితే ఏమవుతాడో ఏమో. వెళ్ళిన పని పూర్తి చేసుకుని రానీలే అని వుండాలి. లేకపోతే, ఈ సుందర్రావే ఆ సలహా ఇచ్చి వుండాలి. అతని మాటంటే గురి అమ్మకి. పక్షవాతం వల్ల చెయ్యి స్వాధీనం లేక నాన్న వుత్తరాలు రాయడం లేదని సర్ది చెప్పింది అమ్మ రెండేళ్ళ క్రితం. ఇతను ఇక్కడి కొచ్చిన మూడు నెల్లకంతా జరిగిందన్నమాట. ఇక అమ్మనేం చేశారో! ఆచార వంతులంతా చేరి జుట్టు తీయించేశారా? సుందర్రావు మీద ఒళ్ళు మండుకొచ్చింది. నీచుడు, చండాలుడు మళ్ళీ మళ్ళీ చితి చిత్రాన్ని చూశాడు. కటకటాల కిటికి, ఆ శవం, సుందర్రావు బాదామి క్రాపు, బొడ్డు చూశాడు. వర్ణన చదివాడు.
వెనక, ముందు పేజీలు తిప్పాడు. కంగారులో పుస్తకం లైబ్రరీ నేల మీద పడింది. తలక్రిందులుగా ఆ పేజీలు కలిసిపోయాయి.
కంగారుగా పుస్తకం పైకి తీసి సరిచేసి తిరగేశాడు. మళ్ళీ తిరగేశాడు. అంతవరకూ ఏమీ మరింకే ధ్యాస లేని అతనికి కారిడార్ కొసలో వున్న అమెరికన్ కక్కసులో ఎవరో ఫ్లష్ చేసిన నీరు జలపాతపు చప్పుడులా భోరుమని పైకి లేచి దిగిపోయి ఇంకిపోవడం వినిపించింది.
పేజీ తిప్పాడు. సీమంతపు అధ్యాయంలో సీతలాగా వేషం వేసుకుని, తలకి కిరీటం పెట్టుకుని చాలామంది ముత్తైదువుల మధ్య కొద్దిగా మూతి వంకరగా పెట్టుకుని కూర్చుంది దాయాది సుందర్రావు కూతురు దమయంతి. తొలి చూలు. ఏడు నెలల పొట్ట కనిపిస్తోంది. ఈ సుందర్రావు ఎలానూ ఒక అమెరికన్ వచ్చాడు కదా, ఇదే మంచి సమయం ఫోటో తీయిద్దాంలే అని కూతురికి కడుపు రావడం కోసమే కాచుకుని సీమంతం చేయించి వుండాలి. ఉత్తర క్రియలు చూపిద్దామని కాచుకున్నాడేమో పెద్దనాన్న ఇంట్లో వీలు దొరికింది.
వాడుకున్నాడు. ఎంత డబ్బిచ్చాడో ఆ ఫెర్గూసన్ మానవుడు. ఆ ముత్తైదువల మధ్య అమ్మ మొహం కోసం వెతికాడు. కనబడలేదు.సంపంగి చెట్టు గంగమ్మ, అవతలి ఇంటి లచ్చమ్మ వున్నారు. అవే మొహాలు. ముక్కుపుడక, దుద్దులు, పైసా వెడల్పు బొట్టూనూ. ఆత్రంగా అనుక్రమణిక పేజీ తిప్పాడు. వకారం, వికారం, వుకారం దాటి,'వై' దాటి, వేదాలు వేష భూషణాలు దాటి, వైఖానస, వైదిక అనుక్రమణికలో వైధవ్యం దొరికింది. వైధవ్యం మీద మొత్తం ఒక అధ్యాయం వుంది. వుండదామరి. అందులో 233 వ పేజీ ఎదుట ఒక పొగసైన ఫోటో.
హిందూ విధవ. కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం తల మీద జుట్టు పూర్తిగా తీయబడి వుంది.అంటూ వున్నదున్నట్టు శీర్షిక. కృతజ్ఞత సుందర్రావుగారు, స్టూడియో : హుణసూరు. అమ్మ ఫొటో నా అది? తెలిసిన మొహమే. అయినా అపరిచితంగా వుంది. గుండు గీయించుకున్న తల. దాని మీద ముసుగు. అది నలుపు-తెలుపు చిత్రమే అయినా ఇతనికి తెలుసు అది ఎర్ర చీరని మాసిన చీరె.... సుందర్రావుగారు పసిఫిక్ సాగారానికి అవతల, 10,000 మైళ్ళ దూరంలో వున్న హుణసూరు బెలువాంబా అగ్రహారం వెనకాల సందులో నివసిస్తున్నందువల్ల ఆ రోజు బ్రతికిపోయారు
**************0****************
నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు ప్రచురించిన కథా భారతి కన్నడ కథానికలు పుస్తకం నుండి సేకరించబడింది.
రచయిత పరిచయం: డా.. ఎ.కె. రామానుజన్ జననం 1929, మైసూరు. మైసూరు విశ్వవిద్యాలయం, పూనా డెక్కన్ కాలేజీలలో విద్యాభ్యాసం. ఇండియానా విశ్వవిద్యాలయం వారి పిహెచ్.డి పట్టా 1963. ఇప్పుడు చికాగో విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషాధ్యయనంలో ప్రాధ్యాపకులు. హెూక్కుళల్లి హూవిల్ల (కవితా సంకలనం), హళదిమీను (అనువాద నవల) సామెతలు - కన్నడ గ్రంధాలు, The strides, Relation(కవితా సంకలనాలు), Speaking of Shiva, The Interior Landscape మరికొన్ని - ఇంగ్లీష్ రచనలు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి