23, జూన్ 2023, శుక్రవారం

వానొచ్చే.. ఊరు గుర్తొచ్చే..

 


వారం రోజులుగా ముసురు. అయినా యెక్కడా చుక్క నీరు నిలిచి కనబడలేదు. ఎందుకో పద్దాక మా ఊరు గుర్తొస్తుంది. 

ఇదే ముసురు మా ఊరిలో పడితే.. పండగే.. ఎవరెవరికి అంటే.. మా ఊరి చెఱువుకు కప్పలకు బీడు భూములకు నిద్రాణమై వున్న గింజలకు రైతులకు 

పశువులకు పక్షులకు అన్నింటికి.. 

నాకొక సుందర దృశ్యం పారాడుతూ.. చెరువులో తమ్మచెట్టు పూసిన మల్లెల్లా కొంగలు..తొణికిసలాడుతూ.. ఎర్రని నీళ్ళు, నానిన చెఱువు కట్టలకు అలఅలలాడుతూ కొట్టుకునే కెరటాలు ఆ నీటిమీద తేలివచ్చే చల్లని గాలికి చిరుచలి కల్గించే ఆహ్లాదం.. చెరువుకట్ట కింద బురదమళ్ళను మెత్తంగా చేసే టాక్టర్ దమ్ము చక్రాల శబ్ధం.. అడుగు దూరం వచ్చే దాకా నిబ్బరంగా నిలబడి ఆహారపు వేటలో నిమగ్నమైన పక్షుల తదేకదృష్టి.. టాక్టర్ అడుగుదూరంలో వుందనగానే యెగిరిపోయే రెక్కల సౌందర్యం..  ఇంకొంత దూరంలోనే వాలి ఆకులు కనబడని  తెల్లతామరల్లా కదలాడుతూ వుంటాయి.

 లేత చివురుల ఆకుమళ్ళు, ముదురు పచ్చకు మారిన నారుమళ్ళు, ఆ నారుమళ్ళలో వొంగిన స్త్రీలు,  వారు విసిరి వేస్తున్న  ఆశల కట్టలు,  పార చేతబట్టుకుని గణెం సరిచేసుకుంటున్న రైతన్నలు. మొత్తంగా కలసి  భూమికి పచ్చరంగు వేయడానికి మన అందరి ఐదు వేళ్ళు నోటి దగ్గరకు చేరడానికి కృషి చేయడం కనబడుతూ వుంటుంది. 

మహా నగరాల్లో కూర్చుని కలలు కనే వారికి వారి కష్టం ఏ మాత్రం తెలుసు అని.. ప్లాస్టిక్ సంచుల్లో నార సంచుల్లో వివిధరకాల బ్రాండ్ ల్లో అందంగా ముస్తాబై వచ్చిన సంచీలకు కుట్టిన దారాన్ని విప్పడానికి కష్టపడే మనకు తెలుసా.. పండే ప్రతి గింజ వెనుక వున్న ఆశలు వారి శ్రమ  వారికి లభించిన విలువ? వారికన్నా మార్కెటింగ్ చేసేవారికే ఎక్కువ లాభం అని.

భూమి ని పంటతో కాక గజం విలువల్లోనో లక్షల కోట్ల విలువల్లోనో చూడటం అలవాటయ్యాక పంట విలువ తెలియకుండా పోతుంది. 

రాబోయే దశాబ్దాల్లో ఆహారపు కొరత ఏర్పడినప్పుడు కానీ రైతు విలువ పంట విలువ తెలియదు. వ్యవసాయం నష్టమై రైతులు వ్యవసాయాన్ని వదిలేసి స్విగ్గీ జమాటో  లాంటి ఆహార సంస్థల్లో అమెజాన్ లాంటి సంస్థల్లో డెలివరీ బాయ్ లుగా మారిపోతున్నారు. పల్లె వ్యవసాయం చిన్నసన్నకారు రైతు మాయమైపోయి ఫార్మ్ హౌస్ లు కార్పోరేట్ వ్యవసాయాలు వస్తాయనే ఊహ అబద్దమైతే కాదు. 

ఇంకొకవైపు మిద్దెతోటల ఫలసాయం మిద్దెతోటల రూపకల్పనల చుట్టూ నెలకొన్న వ్యాపార ధృక్ఫధం YouTube లో లక్షల వీడియోలు.. ఏమిటో అంతా అయోమయం నాకు. 

ఎప్పుడో రాసిన కవితను ..(దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటాను ) ఈ మధ్య ఒక పత్రిక వారు ప్రచురించారు. 

అప్పుడే నా ఆవేదన.. అలా వుంటే ఇప్పుడింకా ఎక్కువైంది.. 

ఆ కవిత.. హాలికుడా.. 

ఇదిగోండి.. ఆ కవిత. మన రైతువాణి మాసపత్రిక జూన్ సంచికలో.. 




కామెంట్‌లు లేవు: