చెడు వినకు, చెడు కనకు,చెడు మాట్లాడకు.. జాతిపిత కోట్స్...మనకి అస్సలు నచ్చవు.ఎందుకంటే నిద్ర లేచింది మొదలు..మనం నిత్యం జీవించేదే వీటి మద్య . మళ్ళీ జాతిపిత జన్మిస్తే.. ఆయన చెప్పిన కోట్స్ తిరిగి వ్రాస్తారు...అని అనుకుంటాను. అయ్యో!! ఆ మహానుభావుడుని, ఆయన చెప్పిన కోట్స్ ని అవమానించడం నా ఉద్దేశ్యం కాదండీ.. చెప్పాలంటే.. మా బెజవాడ నడిబొడ్డున ఆయనికి,ఆయన స్పూర్తికి రోజు అవమానమే!
"పని చేయ కుండా తిండి తినే వాడు దొంగ " అని ఆయన చెప్పినందుకేమో.. ఆయన వేషం కట్టి నడివీదుల్లో..నిలబడి..కాసుల కోసం ఎదురు చూపులు. అది చూడలేని నాలాటి వారందరు కలసి బాబూ! ఇలా ఈ వేషం కట్టి యాచించడం చాలా అవమానకరం. ఆ మహాత్ముని అవమానించడం న్యాయమా!? అంటే "ఆయన ఎవరో.. నాకు తెలియదండీ.. ఈ వేషం కట్టి సెంటర్ లో.. నిలబెడితే.. చాలా డబ్బులు మాత్రం వస్తాయి" అన్నాడు. నాకు నోట మాట రాలేదు.
ఈ.. సిగ్గు లేనిజాతికి..డబ్బు సంపాదించడంలో.. ఉన్న నైపుణ్యం జాతి చరిత్రని భావి పౌరులకి తెలియజేయడం ఎలాగో తెలియడం లేదు.పట్టుమని పదేళ్ళైనా లేని పిల్లలని ఇలా ప్రేరేపించడంని..మనం కనడం అనగా చూడడం మన దురదృష్టకరం. మహాత్ముడు ఎవరో తెలియదు అనడంని వినడం "హర హర ఎంతటి మాట వినాల్సి వచ్చింది " అనుకోక తప్పదు. ఆ పదేళ్ళ పిల్లాడిని "బాబూ" నీకు మంచి పుడ్డు పెట్టి మంచి స్కూల్లో చేర్పించి చదువు చెప్పిస్తాం వెళతావా!? అడిగాం.. ఊహు..తల అడ్డంగా తిప్పేసాడు." ఎందుకని?" మా ప్రశ్న. రోజు నాలుగు వందలు వస్తాయి. చదువుకుంటే అన్ని రావుగా.. దిమ్మ తిరిగి పోయింది.
ఇలా మంచి మాట్లాడటం, మంచి చేయాలనుకోవడం..చాలా తప్పు...అని మాకు ఉత్తరక్షణం లో అర్ధమైంది.. ఎందుకంటే.. ఆ పిల్లవాడి తాలూకు వాళ్ళు నిమిషాలలో.. మా ముందు ప్రత్యక్షమై.. మాకే క్లాస్ ఇచ్చారు. ఏమని అంటే.. "మా పని మమ్మల్నిచేసుకోనివ్వండి. తల్లీ! ఇష్టమైతే.. ఒక రూపాయో.. రెండు రూపాయలో ఇవ్వండి. పిల్లలకు ఏవేవో..మాటలు చెప్పి మా పొట్ట కొట్టకండి.." అని.
ఇలా చాలా తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం వాళ్ళ దగ్గర ఉంటె..వాళ్లకి కష్టం విలువ, పని విలువ, చదువు విలువ,మహనీయుల విలువ ఎలా తెలుస్తుంది ? ఈ.. జాతికి తెలిసింది ఒక్కటే! అలా మహాత్ముని వేషంలో.. నడివీధిలో.. బిచ్చమేత్తుతుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలని తెలియదు. అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియదు.తెలిసింది అల్లా.. అబ్బో! భలే.. అచ్చు.. గాంధీ లాగానే ఉన్నాడే..అన్న కాంప్లిమెంట్ ఇవ్వడం... రూపాయలు ఇవ్వడం...అంతే! ఇది ఒకటే కాదులెండి.. ఆయన పేరు పెట్టుకున్న వీధి రౌడీలు, ఆకు రౌడీలు.. ఎందరెందరో! వాళ్ళ జయంతులకి, వర్దంతులకి . వీధి వీధినా.. బేనర్లు కట్ అవుట్ లు.. పూల దండలు సభలు.. ఓహ్.. చూడతరమా! ఆ జాతి పితకేమో.. చెప్పుల దండలు.. కారుకూతలు.. విగ్రహ ద్వంసనలు .
ఏమైనా .. మనవాళ్ళు..గొప్ప దేశ భక్తిపరులండీ! పరాయి దేశాలలో.. ఎక్కడన్నా మనవాళ్ళకి అవమానం జరిగితే.. అప్పుడు భారతీయులందరికీ ఏకతా సూత్రం అకస్మాత్తుగా గుర్తుకొస్తుంది. మనమందరం భారతీయులం .. భారత దేశం మా మాతృభూమి ..భారతీయిలందరు మా సహోదరులు .. మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం. మా జాతి మహనీయులని అవమానిన్చుకుంటాం. ఎవరైనా మాకులా చేస్తే..మేము ఊరుకోం.. అంటాం. కదా! ఏమిటో.. ఈ రెండురోజులుగా.. దేశ పౌరులకి దేశ భక్తి పెరిగిపోయింది. "మొహాలి" మ్యాచ్ పుణ్యమా అని. ఐ లవ్ ఇండియా .. మేరా భారత్ మహాన్.. అంటూ ప్రేమ ఒలకబోస్తూ.. కీర్తిస్తున్నాం. కాస్త చుట్టుపక్కల కూడా చూసి మహాత్ముని నడివీదులలో.. బిచ్చమేత్తుకోకుండా.. చూసుకుందాం..అని నా ప్రార్ధన.
(విజయవాడ పట్టణంలో.. నడి బొడ్డున నది ఒడ్డున మహాత్ముని వేషంలో.. యాచించడం చూసి వేదనతో) . ఇలాటి చెడును చూడవద్దు.చెడు వినవద్దు. చెడు మాట్లాడవద్దు. హే!రామ్..వంద కోట్ల భరత జాతి..ఆత్మ ఘోషిస్తుంది.. సంఘం శరణం గచ్చామి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి