5, డిసెంబర్ 2013, గురువారం

అణువు అణువునా వెలసిన దేవా

ఈ ప్రపంచమంతా ఓ..పక్షి గూడు లాంటిది  కృత్రిమమైన ఎల్లలు,సరిహద్దులూ ఏవి లేని అందమైన వసుదైక కుటుంబంగా ఉండాలని కవి ప్రగాడమైన ఆకాంక్ష ఒక పాటలో నేను గమనించాను.  ఎక్కడ చూసినా ఆకలితో అలమటించి పోతున్నవారు, వర్గజాతి బేధాలతో,,లింగ వివక్షతో , అసమానతలతో వెలివేయబడుతున్నవారే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అధికార తృష్ణ,అర్ధ పిపాసతో ప్రాకులాడే మానవులనే చూస్తున్నాం,శాంతి,అహింస  కనుమరుగై మానవుడు మానవుడిగా ఉండే లక్షణాలు లోపిస్తున్నాయి. ఇవన్నీ గమనించిన కవి ఈ పాటలో తన ఆవేదనకీ అక్షర రూపం ఇచ్చి హృదయాలని మేల్కొలిపే భాద్యత చేపట్టారా ..అని ఈ పాట వింటున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాట మానవుడు -దానవుడు చిత్రంలో పాట. పాట రచయిత  డా:సి.నారాయణ రెడ్డి గారు. 40 సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రంలోని  ఈ పాట అవసరం ఇప్పుడు చాలా ఉంది. ముఖ్యంగా  స్వార్ధ రాజకీయ నాయుకులకి , స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో నిధులని  దోచుకునే దొంగలకి, కళ్ళ ముందు కనబడే దీనుల ఆక్రందనలు కనబడని,వినబడని బధిరులకి, ముఖ్యంగా వైద్యం పేరిట అక్రమార్జనకి పాల్బడుతున్న వైద్యులకి , అంతుచిక్కని వ్యాధుల బారిన బడ్డ వారిపట్ల వివక్ష చూపుతున్న వారికి ఈ పాట వినిపించాలని అనిపిస్తూ ఉంటుంది. మంచి మనసు ఉన్న వారికి వారిలో అంతర్లీనంగా దాగున్న దయార్ద్రత,కరుణ, మమత వెల్లువలా పొంగి విశ్వమానవసౌహార్ధం, సౌభ్రాతత్వం పెంపొందించాలని కోరుకుంటూ ..ఈ పాట పరిచయం    


నా గీతమాల ఆమనీ .. లో  ఈ లింక్ లో 


సకల ప్రాణ కోటిలో మానవుని ఉనికి ఉదాత్తమైనది. వివేకవంతమైన మానవుడు ఇతర జీవకోటి పట్ల, తోటి మానవుల పట్ల దయార్ద్ర హృదయుడై మెలగాలి కానీ మానవుడు దానవుడిగా మారి హింసాత్మక ప్రవృత్తితో మెలుగుతూ ఇతరులకి బాధని కల్గిస్తున్నాడు


నేడు మానవ సమాజంలో ఒకరి పై మరొకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయతఅన్నీ కనుమరుగై పోతున్నాయి మనిషికి మనిషే శత్రువైపోతున్నాడు  దయ,సత్యం,కరుణ లాంటివి అంతరించిపోతున్నాయి. మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే ఇలాంటి పాటల అవసరం ఉంది 


 "మానవ సేవే మాధవ సేవ " గా భావించి సమాజంలో నిరాదరణకి గురైన అన్నార్తులకి, వ్యాదిగ్రస్తులకి  అండగా నిలిచిన  అమృత మూర్తులు కొందరు తోటి మనుజుల పట్ల అపారమైన ప్రేమతో మెలుగుతూ వారి  అమృత గుణం తో సేవలందించారు. పేదలకి చదువు చెప్పడం,  అనాధలకి సేవ చేయడం కరుణ, శాంతి, సహనం ప్రదర్శిస్తూ  సేవా గుణం తో నడచిన   వారి అడుగు జాడలలో నడవాలని కోరుకుంటూ ఈ పాట మొదలవుతుంది. 


జాతికి జాతి అంధకార బంధరంలో మునిగి పోయినప్పుడు జాతిని చేతన పరుస్తూ..  పరపీడన నుండి జాతిని కాపాడాలని స్వేచ్చా స్వాతంత్ర్యాలు   కావాలని ఆకాంక్షిస్తూ వారి నిస్వార్ధ గుణంతో అహర్నిశలూ శ్రమించిన త్యాగధనుల గుణాన్ని మనకి అందించాలని 


 "వైద్యో నారాయణ హరి" అన్నట్లు కొత్త కొత్త వ్యాధుల పాల్బడి వైద్య సేవలు అందక ఎందఱో దీనులు అకాల మరణంకి గురిఅవుతున్నప్పుడు నిస్వార్ధంగా వైద్య సేవలందించి జీవనదాతలుగా మారే వారి గుణాన్ని కూడా సామాన్యమైన మన మానవులందరికీ అందించమని కోరుకుంటూ .. కుల మతాలకతీతంగా విశ్వమానవ శ్రేయస్సుని కోరుకుంటూ సామూహికంగా చేరి అణువు అణువునా ఆర్తిని నింపుకుని ప్రార్దించే గీతం ఇది. ఈ గీతానికి  అశ్వత్థామ  సంగీతమందించారు . ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం ఈ పాటని ఆలపించారు.  


    


ఈ పాట వీడియో లింక్ 

చిత్రం : మానవుడు - దానవుడు (1972)

సంగీతం : అశ్వద్దామ గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు 
చిత్రం : మానవుడు - దానవుడు (1972)

పల్లవి:
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 1:
మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ...
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా
అణువును అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 2:
జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ...
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

చరణం 3:
వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ...
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా ..