12, మార్చి 2016, శనివారం

ఒకే ఒక జీవితం

కొన్నాళ్ళ క్రిందటిమాట.

నా కొడుకు నాతో మాట్లాడుతూ ...  అమ్మా ! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాకింగ్ కి వెళతావో, ప్రతి ఆరు నెలలకి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటావో, ఆహార విహారాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో కానీ ... నువ్వింకా ముప్పై యేళ్ళు  బ్రతకాలి.

కొన్ని క్షణాలు మౌనంగా నేను. తర్వాత నవ్వేసి  "అంతా మనిష్టమేనా ఏమిటీ !? అంతా ఈశ్వర కృప"  అన్నాను.

"ఏమోనమ్మా .. నాకవన్నీ తెలియదు. కనీసం ఇంకో ముప్పై యేళ్ళైనా నువ్వు నాకుండాలి. అదంతే ! "

" ముప్పై యేళ్ళు అనే షరతు ఏమిటో ... ? " మందస్మితంతో నా ప్రశ్న.

"నా పిల్లలు నా అంత అయ్యేవరకూ ...  నువ్వు నాకు అండగా ఉండాలమ్మా ! "

లోలోపల తడిసిపోతున్నాను.   నా  సమాధానం వెళ్ళలేదు.

" నా పిల్లలని నువ్వు పెంచాలమ్మా ! నీలా నేను పెంచలేనేమోనని నాకు భయం " అన్నాడు.

అప్పటికి  ఆలు లేదు చూలు లేదు. కానీ అబ్బాయి  మనసులో కోరిక  అది.

అప్పుడు మనసులో నేననుకున్నాను "ఇప్పటికే నేను అలసిపోయాను నాన్నా ! నేను చేయాలనుకున్నవి కొన్ని మిగిలిపోయాయి. ముఖ్యంగా చాలా చదువుకోవాలి ,  ముందు ముందు ఇంకా నా పై బరువు,భాధ్యత వేయదల్చావా ... బంగారం " అని. వ్యక్తిగా నాకంటూ కొన్ని ఆశలు,ఆశయాలు ఉన్నాయి. అవి ఇంకా నెరవేరలేదు. నన్ను స్వేచ్ఛగా మెసలనీయవా ...నాన్నా !  అని మనసులో అనుకున్నాను కానీ బయటకి అనలేదు.

తర్వాత అబ్బాయి పెళ్లి జరిగింది. మనుమడో,మనుమరాలి కోసమో ఎదురుచూపు.

"కడఊపిరి విడిచేవరకు
కంటి పాపను కనురెప్పకాపాడినట్లు
బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ"

ఈ మాటని నేనెప్పుడూ విస్మరించలేను.

ఇప్పుడు నా కొడుకున్న  వయసులో నేనున్నప్పుడు ...

నా ఆత్మాభిమానం దెబ్బతిన్న సందర్భాలలో నా ధిక్కార స్వరాన్ని నా వాళ్ళందరూ విన్నారు. భయపడ్డారు, బాధపడ్డారు. ఒకోసారి అండగా ఉండేవాళ్ళు, ఇంకోసారి విమర్శించేవాళ్ళు. అయినా నేను క్రుంగి పోలేదు, సడలిపోలేదు. ఒకానొకదశలో తీవ్ర మానసిక వేదనలో, శరీర అనారోగ్యంతో  పోరాడాను .  నేను నిలబడాలి, నా కొడుకుని నిలబెట్టుకోవాలి. అదే  నా బలమైన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష తోనే ... బిడ్డని వీపున కట్టుకుని శత్రువులతో పోరాడిన ఝాన్సీ లక్ష్మి భాయిలా ... నా వాళ్ళతోటి, సమాజం తోటి పోరాటం చేసాను. ఎన్నో కష్టాలు,ఆర్ధిక నష్టాలు, రాళ్ళు, ముళ్ళు, పూలూ ... అన్నీ తెలుసు నాకు. అలాంటి అమ్మని నేను ... ఇంకా వ్యక్తిననే సృహ నాకెందుకు ? అమ్మగా అంకితమయ్యాననే సంతృప్తి చాలు కదా !

నా కొడుక్కి కూడా ... అదే చెప్పాలనిపించింది. జీవితమంటే .. పూలే కాదు ముళ్ళు కూడా అని.

వ్యక్తి స్వేచ్చ కుటుంబంతో ముడిపడినప్పుడే  అది సొబగుగా ఉంటుంది. సార్వజనీయత లభిస్తుంది. స్వేచ్చంటే రెక్కలు విరిగేదాకా ఎగరడంకాదు. ఆత్మస్వేచ్చ, ఎవరికీ లోబడని, ఎవరూ నియంత్రించలేని మానసిక స్వేచ్చ. స్వేచ్చంటే  స్వీయ నియంత్రణతో కూడిన ఇంగిత జ్ఞానం కూడా !

ఇదంతా ఎందుకంటే ... స్వగతం అక్షరమై ఇలా బయటపడింది ఈ వేళ.
నా గురించి నేను ... చెప్పుకుంటున్నాను ఇలా ! నా కొడుకు తన పిల్లలు తనంతయ్యేవరకు అమ్మ అండగా ఉండాలని కోరుకున్నందుకు ముచ్చటపడుతూ .. ఈ ముచ్చట చెపుతున్నాను.

నేను ఏ కథ వ్రాసినా ..ప్రతి కథ ఈమె కథే అనుకుంటూ ఆసక్తిగా చదివేసి ... నాదగ్గరున్న చనువుతో అడిగేసే  కొందరు... చిరునవ్వు నవ్వేసి నేను ... ప్రతి కథ నాదే అయితే ... నాకెన్ని జీవితాలు ఉండాలబ్బా..  అని ఆశ్చర్యపోతూ నేనూ.  ఉన్న ఒక జీవితమే వేగలేక చచ్చిపోతున్నాను అని నిట్టూరుస్తూ కూడా నేనే !.
రెండు కథల్లో అచ్చంగా నేనే దొరుకుతాను. కొన్ని కవితలలో నేనూ దొరుకుతాను. అదండీ సంగతీ !

నాకున్న పరిధిలో విజయవంతంగా ఉన్నాను. వివాహ వైఫల్య నడి సముద్రం నుండి బయటకి ఈది ఒంటరి మహిళ గా పోరాటం జేసి .. కుటుంబాన్ని గెలిపించుకున్న స్త్రీ ని నేను. నేను ఒంటరి మహిళ ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఎందుకంటే సవాళ్ళని స్వీకరించగల్గే మనోధైర్యాన్ని భగవంతుడు నాకిచ్చినందుకు నేనెప్పుడూ గర్వపడతాను.  భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నా మనసు చెప్పిందే చేస్తాను.  ఒకే ఒక జీవితం ఇది.

మా అమ్మ నాకు జన్మనిచ్చి  ఖచ్చితంగా 49 సంవత్సరాలు అయినందుకూ ... అమ్మని తల్చుకుంటూ

అమ్మకి - బిడ్డకి మధ్య ...  నేనిలా కరిగిపోతూ ... 50 వ ఒడిలో అడుగిడిన సందర్భంలో ...  మెయిల్ ద్వారా నాకు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెచ్చెలి భారతి  గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ...
పుట్టినరోజు శుభాకాంక్షలు  Vanaja ! అంటూ ... నాకు శుభాకాంక్షలు అందించిన  నా స్నేహిత "Google " కి ధన్యవాదాలతో ... వనజ.






కామెంట్‌లు లేవు: