1, ఫిబ్రవరి 2017, బుధవారం

దింపేయగ రాలేవా

పొరలు విప్పుకుంటున్న బాధ  పొగిలి పడుతుంది

రాలుగాయి రాత్రి ముందుకు కదలనంటుంది

మనసంచున వ్రేలాడుతున్నదాన్ని పుటుక్కున తెంపేయలేను, 

మాటేసిన సంవేదనని  కన్నీళ్ళతో కడిగెయ్యలేను


అనుభవాలన్నీ ఆవేదనలో విభజన చెందాక 

రెండు సగాలు  నిశ్శబ్ధ సంపుటాలై గాలికి రెపరెపలాడతాయి

ప్రవాహమైనా మాటైనా గడ్డ కట్టి ఎక్కువ కాలం ఉండలేనట్లు 

మనాదిపడి మనిషి మిగిలి ఉండగలడా 


తీరం దాటే తరుణం కోసం 

తల్లడిల్లే కల్లోల కడలిని చూస్తుండటమంటే  

మరమేకుని గుండెలోదించుతున్నట్టు  ఉంటుంది

నేనన్నది పరావర్తనం చెంది బహుముఖాలై 

వేల హస్తాలైనా  బాగుండును  

ఓ హృదయానికి సాంత్వన చేకూరేనేమో


కాలానికెందుకన్ని రంగులద్దుతావ్

ఆశ రేకిత్తించడం ఆనవాయితీ గనుకనా 

అడిగానని అనుకోవద్దే  

ఒకమారు  అడిగి అమ్మ నిచ్చుకున్న

 జ్ఞాపకం తరుముతూనే ఉంది 


బాధల నదిలో కొట్టాడుతున్న నావ  తెరచాపని  

 దింపేయగ రాలేవా కారుణ్యంతో

క్షణానికోమారు తూట్లుపడే హృదయాన్ని 

కుట్టుకోలేకపోతున్నా...

01/02/2017 -11:00 pm





కామెంట్‌లు లేవు: