ఉదయం పది గంటలకన్నా పది నిమిషాల ముందు ఎండలు బాగా ముదిరిన మార్చి నెల ఎండ మాడ్చేస్తుంది. బురఖా వేసుకున్నామె ఒకరు బాంక్ లోపలకి ప్రవేశిస్తూ ఉండగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. లోపల పూజ జరుగుతుంది చెప్పులు విప్పి రండమ్మా అని.
"ఇదేమన్నా గుడా! బ్యాంక్. ఇక్కడ అలాంటివి పాటించాల్సిన పనేంటి? " అంటూ చెప్పులు విప్పకుండానే లోపలికి ప్రవేశించి చుట్టూ పరికించింది. ఇంకా బ్యాంక్ సేవలు మొదలు పెట్టక పోయినా మరుసటి రోజు రెండవ శనివారం కావడంతో అప్పటికే బ్యాంక్ కిక్కిరిసి ఉంది. జనం కుర్చీలలో కూర్చోకుండా తొందరగా పని ముగించుకుని బయటపడదామనే తొందరలో క్యూలో నిలబడి ఉన్నారు. ఆమె ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
ఈశాన్య భాగంలో పూలదండలతో అలంకరించిన దేవుడి చిత్రపటాల ముందు పూజా కార్యక్రమం జరుగుతుంది. దీపారాధన కావించి మహా లక్ష్మీ అష్టకాన్ని చదువుతూ ఉంటే స్టాఫ్ అంతా బుద్దిగా చేతులు ముందుకు ఉంచి కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆ దైవాన్ని ప్రార్దిస్తూ నిలబడ్డారు. పూజారి కొబ్బరి కాయ కొట్టి హారతి వెలిగించి గంట మ్రోగిస్తూ మంత్రాలు చదువుకుంటూ దేవుడి చిత్ర పటాలకి, కాష్ డిపాజిట్ మిషన్ కి ముమ్మారు హారతిచ్చి తర్వాత లోపలున్న అందరికి హారతి చూపించాడు. కొంతమంది భక్తిగా కళ్ళకద్దుకుంటున్న కార్యక్రమాన్ని విసుగ్గా చూసింది.
అప్పటికే అగరబత్తీ వెలిగించడం మూలంగా లోపలంతా తేలికగా వ్యాపించిన పొగ కొంత మందిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎంత సువాసనలు వెదజల్లితే మాత్రం ఈ పొగని ఎక్కడ తట్టుకుంటాం? కాస్త డోర్ తీసి ఉంచవచ్చు కదా? అంది సెక్యూరిటీ గార్డ్ తో బురఖా ఆమె.
"పొగ మరీ అంత ఎక్కువేమీ లేదు కదమ్మా! ఏసి వేసి ఉంది కదా అని డోర్ తీసిపెట్టలేదు " అన్నాడు కానీ మనసులో మాత్రం కొందరు మనుషులు ఇంతే ! అన్నింటికీ ఏవేవో అభ్యంతరాలు చెపుతూనే ఉంటారని అనుకున్నాడు. పూజారి అందించిన ప్రసాదాన్ని తీసుకుని ఒక్కొక్కరే సీటులలో కూర్చుంటున్నారు.
వెంకట్ సీట్ లో వచ్చి కూర్చోగానే బురఖా వేసుకున్నామె ఖాతా పుస్తకం విత్ డ్రా ఫారం అతనికి అందించింది. అది చూడగానే " మీకు చెక్ బుక్ లేదా? "అని అడిగాడు.
"లేదండి " అంది.
" ఏ టి యెమ్ కార్డ్ ఉంది కదా ? "
"ఎక్కువ మొత్తం డ్రా చేయాలని అది ఉపయోగించలేదండి " కొంచెం విసుగ్గా చెప్పింది.
"అకౌంట్ హోల్డర్ మీరే కదా ! లూజ్ చెక్ ఇస్తాను ఇక్కడొక సంతకం చేయండి" అంటూ ఓ పుస్తకం ముందు పెట్టాడు. కొంచెం సంశయిస్తూ సంతకం పెట్టింది. తర్వాత చెక్ పై సంతకం పెట్టి అతనికి ఇచ్చింది. వెంకట్ సంతకాన్ని పరిశీలించాడు. తేడాగా ఉన్నట్టు అతనికి అనిపించింది." సంతకం తేడాగా ఉన్నట్టు కనబడుతుంది. ఆయేషా బేగం మీరేగా, మీ ముఖం చూపించండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను" అన్నాడు.
ఉలికిపడి వెనక్కి జరిగింది ఆమె. "ముసుగు తీసి ముఖం చూపించమంటున్నారూ , పరాయి వాళ్ళు అలా అడగడాన్ని మా ముస్లిం స్త్రీలు ఎంత తప్పుగా భావిస్తారో మీకు తెలియదా ఆ విషయం ? "అనడిగింది.
"సంతకం టాలీ అవడంలేదండీ అందుకే అడుగుతున్నాను. అవసరం లేకుండా మీ ముఖాలు చూడటం నాకేమన్నా సరదా అనుకుంటున్నారా ఏమిటీ? " అన్నాడు వెంకట్.
"సరదాకే అడిగావో, అవమానించాలనే అడిగావో, నా అకౌంట్ కాకుంటే ఎందుకు వస్తాను. ముఖం చూపించడం కుదరదు, డబ్బు ఇప్పించండి, త్వరగా వెళ్ళాలి. అర్జంట్ పని ఉంది. గొంతు పెంచి చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి తనపై పడేటట్టు చేసుకుంటుంది ఆమె. .
"సంతకం తేడాగా ఉంది మీరెవరో కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బు ఇవ్వడం కుదరదు" ఇంకా గట్టిగా అన్నాడు వెంకట్.
వాదన వింటున్నఅసిస్టెంట్ మేనేజర్ చైతన్య వచ్చి "ఏమిటీ విషయం ? "అనడిగాడు. వెంకట్ సంగతి చెప్పగానే అతనూ సంతకాన్ని పరిశీలించి "బాగా తేడాగా ఉందండి. డౌట్ క్లియర్ చేస్తే పోయేదేముంది" అన్నాడు.
ఆ మాట విన్న శివాలు తొక్కింది. వెనక్కి వెళ్లి కుర్చీలో కూర్చుని ఎవరికో ఫోన్ చేసి తొందరగా రా నువ్వు అని చెప్పి కాల్ కట్ చేసి, మళ్ళీ ఇంకో ఫోన్ చేసి భయ్యా నేను ఇక్కడ బాంక్ లో ఉన్నాను. ఇక్కడ బురఖా తీసి ముఖం చూపెట్టండి అంటున్నారు. మనవాళ్ళకి చెప్పి మీరందరూ కలసి తొందరగా రండి అంది. బురఖా తీసి ముఖం చూపెట్టమంటే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుందేమిటీ ఈవిడ. అయినా నాకెందుకులే ! డబ్బులు అవసరం అయితే ఆమే వస్తుంది అనుకుంటూ పనిలో మునిగి పోయాడు వెంకట్.
పావు గంట గడిచిందో లేదో బిల బిలమంటూ ఆడామగా కలిసి ఓ పాతిక మంది దాకా బ్యాంక్ దగ్గరకి .చేరుకున్నారు. కొంత మంది లోపలికి వచ్చి బురఖా వేసుకున్న ఆమె దగ్గర నిలబడి "ఎవరూ నీతో అలా మాట్లాడింది "అని అడిగారు . వెంకట్ ని చూపించి "ఇదిగో ఇతనే బురఖా తీయండి ముఖం చూడాలన్నాడు" అంది.
"ఏం ..సాబ్ ! మా ఆడవాళ్ళని బురఖా తీసి ముఖం చూపించామంటారా ! అది ఎంత తప్పో మీకు తెలియదా ? అలా మాట్లాడినందుకు మిమ్మల్ని వదిలేది లేదు, ముందు మీరు బయటకి రండి మీ సంగతి తేల్చుకోవాలి " అంటూ పోట్లాటకి దిగాడు.
బయటున్నమగ వాళ్ళందరూ కూడా లోపలి వచ్చి అతనితో గొంతు కలిపారు. ఈ లోపు లోపల కూర్చున్న బురఖా మనిషి బయటకి వెళ్లి అక్కడున్న బురఖా వేసుకున్న ఆడవాళ్ళతో కలిసి పోయింది. అసిస్టెంట్ మేనేజర్ చైతన్య వెంకట్ ని అక్కడి నుండి తప్పించి స్ట్రాంగ్ రూం లోకి పంపి ప్రొద్దున్నే ఈ న్యూసెన్స్ ఏమిటి బాబూ అనుకుంటూ మేనేజర్ కి ఫోన్ చేసి విషయం చెప్పి " సర్ ! మీరు వెంటనే బ్యాంక్ కి వచ్చేయాలి. ఇక్కడ యుద్ద వాతావరణమే ఉంది, ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడం కూడా మంచిది "అని సలహానూ ఇచ్చాడు .
మేనేజర్ గారు వస్తున్నారు ఆయన వచ్చాక విషయం మాట్లాడదాం. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అన్నాడు ప్లీజింగ్ గా చైతన్య .
"రానివ్వండి. ఆయన వచ్చాకే బయటకి వెళతాము. మా ఇంటి వాళ్ళని పట్టుకుని అంత అవమానించాక ఊరుకుంటామా ! మేమేమన్నా పనిలేక వచ్చామా ! మీ ఏ సి రూముల్లో కూర్చోడానికి " అని ఒకరంటే , "ఆడాళ్ళం అనే జాలి కూడా లేకుండా ఎండలోకి వెళ్లి నిలబడమంటున్నాడు, వీళ్ళకి మనమంటే అసలు విలువ లేకుండా పోతుంది" అని బురఖా వేసుకున్నామె అనగానేవ్యవహారం మరీ ముదిరేటట్టు ఉంది అనుకుని "క్షమించండమ్మా ! ఇంతమంది కౌంటర్ ముందు నిలబడితే తోటి కష్టమర్స్ కి ఇబ్బంది అవుతుందని కొంచెం పక్కకి నిలబడమన్నాను తప్ప మీరంటే నాకేమీ చిన్న చూపులేదు" అని సంజాయిషీ ఇచ్చుకున్నాడతను.
కాసేపటికి మేనేజర్ హడావిడిగా వచ్చాడు. వచ్చీ రావడం తోనే గుంపుగా ఉన్న వారిలో కొందరిని తన కేబిన్ లోకి ఆహ్వానించి "వెంకట్ అనే అతను ఈ మధ్యే వచ్చాడండీ. అతనికి మీ ఆచారాలవీ పెద్దగా తెలియవు . మీరు ఈ విషయాన్ని తప్పుగా తీసుకోవద్దు" అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు.
"అంత మాత్రం తెలియకుండా ఎలా ఉంటారు సర్ ! అతను కావాలనే అలా అన్నాడు, ముందు రూం లోకి వెళ్లి దాక్కున్న అతనిని బయటకి పిలిపించండి "
" ఈవేళ లేడీ స్టాఫ్ అంతా సెలవులో ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఒకరున్నా ఈ గొడవ ఉండకపోనూ! మీరు గనుక ఓ పది నిమిషాలు కూర్చుంటే మీ పని చేసి పంపిస్తాను" అని చెప్పాక కూడా వాళ్ళు ఊరుకోలేదు ఇంకా బిగిసి పోయారు.
"అతనిని పిలిచి మా ఆడమనిషి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెపితే కానీ ఊరుకోము. లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాము " అన్నారు . మేనేజర్ తల పట్టుకోలేదు కానీ తలపట్టుకున్నంత పని చేసి వెంకట్ ఉన్న స్ట్రాంగ్ రూం వైపు వెళ్లి "వాళ్ళతో చాలా గొడవ. మనకేమో వాళ్ళ ఆచారాలు గురించి తెలియవు. పొరబాటుగా కూడా ఏమైనా అంటే అసలు ఊరుకోరు. చిన్న విషయాన్నికూడా పెద్దదిగా చూస్తారు. పైగా ఇక్కడ ఖాతాలన్నీ వాళ్లకి సంబంధించినవే ఉంటాయ్, వెళ్లి వాళ్లకి ఒక సారీ చెప్పేయ్, గొడవ సద్దుమణిగి పోతుంది " అని సలహా ఇచ్చాడు.
వెంకట్ బయటకి వచ్చి బురఖాలో ఉన్న ఆమెకి "మీ ఆచారం గురించి నాకు తెలియదమ్మా , క్షమించండి "అంటూ చేతులు జోడించాడు. అంతలోకి పోలీసులూ వచ్చారు. తెలియక అన్నానని అతను సారీ చెప్పాడు కదా ! ఇక మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి అంటూ అందరిని బయటకి పంపేసి క్యాష్ డిపాజిట్ చేసే వారికీ మిషన్ పై సహాయం చేస్తూ ఉండిపోయాడు సెక్యూరిటీ గార్డ్. "ఆయేషా బేగం " గారిని లోపలి పంపండి, లేడీ కానిస్టేబుల్ ఆమె ముఖం చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నాడు మేనేజర్.
ఖాతా పుస్తకం, సంతకం పెట్టిన చెక్ పట్టుకున్నామె లోపలికి వెళ్ళింది. లోపలి వెళ్ళిన రెండు నిమిషాల్లోనే లేడీ కానిస్టేబుల్ బురఖా వేసుకున్న ఖాతాదారు బయటకి వచ్చారు. లేడీ కానిస్టేబుల్ మేనేజర్ గారి వైపు చూసి ఆ ఖాతాదారు పుస్తకంలో ఉన్న ఫోటో ఈమె ఒకటే సర్. మనిషి ముఖం సరిపోయింది అని చెప్పింది. అతను తల ఆడించి మీరిక వెళ్లి ఆ కౌంటర్ లో క్యాష్ తీసుకోవచ్చు అన్నాడు.
ఉఫ్! పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లు ఉందని అనుకుంటూ సీట్ లో కూర్చుని భగవంతుడా ! నిద్రలేచి ఎవరి ముఖం చూసానో, ఎంత రాద్దాంతం జరిగింది,. ఈ బురఖా వేసుకున్న మహిళలు వచ్చినప్పుడు కాస్త అన్నీ తెలుసుకుని మాట్లాడాలి అనుకున్నాడు వెంకట్.
పది నిమిషాల తర్వాత క్యాష్ తీసుకుని బయటకి వస్తున్న బురఖా మనిషి వైపు అనుమానంగా చూసాడు సెక్యూరిటీ గార్డ్ . ఆమె వేసుకున్న చెప్పులని,బయట నిలబడిన ఇంకో బురఖా మనిషి చెప్పులని పట్టి పట్టి చూసాడు. ఆలోచిస్తుంటే అతనికి వెంటనే జరిగిన మోసం అర్ధమైంది.
ఈ లోపులో లోపల నుండి బయటకి వెళ్ళిన బురఖా మనిషి "మా అమ్మీ ఖాతా అండీ ఇది. తను రావడం వీలుపడక అర్జంట్ గా డబ్బులు అవసరపడి నేను రావాల్సి వచ్చింది అని చెపితే పోయేదిగా. ఏమీ తెలియకుండా చెక్ మీద సంతకం పెట్టి అనవసరంగా యాగీ చేసావు. ఎవరూ కనిపెట్టలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత నవ్వులపాలు అయ్యేవాళ్ళం " అంది తెల్ల చుక్కలున్ననల్ల బూట్లామెతో.
ఖాళీ ఆటో కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ వారిదగ్గరికి గబ గబా వెళ్ళాడు సెక్యూరిటీ గార్డ్ . "బ్యాంక్ లో అందరిని మీరు తేలిగ్గా మోసం చేయగల్గారు కానీ పైన అల్లా చూస్తూనే ఉంటాడు కదా ! ఆయన మిమ్మల్ని క్షమించడు" అన్నాడు.
.
"మోసం చేయడం ఏమిటీ? అల్లా క్షమించడు అనడం ఏమిటీ ? " దబాయింపుగా అడిగింది తెల్ల చుక్కలున్న నల్ల బూట్లామె.
"మోసం చేయడం ఏమిటీ? అల్లా క్షమించడు అనడం ఏమిటీ ? " దబాయింపుగా అడిగింది తెల్ల చుక్కలున్న నల్ల బూట్లామె.
"బురఖాలతో మోసం చేయవచ్చని మీరే చెపుతున్నారు కదమ్మా , పైగా మీ వాళ్ళందరిని వేసుకొచ్చి బ్యాంక్ వాళ్ళపై రుబాబు చేసారు, ఇది చాలా తప్పు కదా, అందరూ అంతగా పట్టించుకోలేదు కానీ నాకంతా తెలిసి పోయింది. మీరిద్దరూ ఎత్తూ, మందం ఒకేలాగా ఉన్నారు బురఖా వేసుకున్నారు కనుక బయట వాళ్లకి ఎవరు ఎవరో కనుక్కోవడం కష్టం . ఒకవేళ మీరు తల్లి, ఆమె కూతురేమో ! 'ఆయేషా బేగం అనే ఆమె మాత్రం పొద్దున్నే వచ్చినామే కాదు" అన్నాడు రూఢీగా
"లోపల అయిపోయింది, మళ్ళీ బయట కూడా మొదలెట్టారా ! మళ్ళీ మా వాళ్ళని పిలవాలా ఏమిటీ? " అని ఫోన్ తీసి నంబర్ నొక్క బోయింది తెల్ల చుక్కల నల్ల బూట్లామె.
"అంత వెర్రి మాలోకం ఎవరూ లేరమ్మా ఇక్కడ. మీ వాళ్లకి ఫోన్చేయండి. మా వాళ్ళని పిలిచి మీరు చేసిందేమిటో నేను చెపుతాను" అన్నాడతను గట్టిగానే.
" ఏం చేసాం ? ఏం చేసామో చెప్పు? " అన్నారు ఇద్దరూ కూడబలుక్కుని అన్నట్టుగా
"పొద్దున్న బ్యాంక్ కి వచ్చిన ఆమె ఇదిగో ..ఈ తెల్ల చుక్కలున్ననల్ల బూట్లు వేసుకున్నామె. నేను బాగా చూసాను. చెప్పులు విప్పి వెళ్ళమని చెపితే విప్పకుండా విసురుగా లోపలి వెళ్ళింది. గొడవ అవుతున్నప్పుడు లోపలికి వెళ్ళినామె ఈ ఎర్ర చెప్పులున్నామె. ఈ ఎర్ర చెప్పులామెనే కదా లేడీ కానిస్టేబుల్ లోపలికి తీసుకెళ్ళి ముఖం చూసి రుజువు చేసుకుంది. మళ్ళీ ఒకసారి ఆమెతో చెక్ మీద సంతకం పెట్టిస్తే అప్పుడే మీ బండారం బయటపడేది " అన్నాడు గుట్టు విప్పుతూ.
అతనన్న మాటలు విని గతుక్కుమన్నారు ఇద్దరూ. సమాధానమేమీ చెప్పకుండా మౌనంగా నిలబడ్డారు. " నేను ముస్లిమ్ నే తల్లీ! రోజుకు ఒక్క పూట అయినా నమాజు చేస్తాను. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న అని దివ్య ఖురాన్ చెప్పలేదా? ఇలా మోసం చేయడం తప్పు కదూ" అన్నాడు ఉర్దూ లో.
వాళ్ళేమీ మాట్లాడకుండా వెళుతున్న ఆటోని ఆపేసి అక్కడ నుండి జారుకున్నారు.
"పాపం! ఆ వెంకట్ సరిగ్గానే అంచనా వేసాడు కానీ అతని మాట ఎవరూ పట్టించుకోలేదు.బురఖా ధరించి ఏకంగా ఒక మనిషి స్థానంలో వేరొక మనిషి వెళ్లి బ్యాంక్ వాళ్ళని బురిడీ కొట్టించవచ్చు అనుకున్న వాళ్ళని వీళ్ళనే చూసాను. అమ్మో! ఎంత మోసం జరిగి పోయింది" అనుకున్నాడు. కానీ తనకి తెలిసిన విషయాన్ని బ్యాంక్ లో ఎవరితోనూ పంచుకోలేదు సెక్యూరిటీ గార్డ్.
ఆరోజు రాత్రి భోజనం తింటూ బ్యాంక్ లో జరిగిన విషయాన్ని భార్య నస్రీన్ తో చెప్పాడు.
"వాళ్ళు మన వాళ్ళని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచావ్ కదా !, నీ పని దొంగలని కనిపెట్టడమేగా! దొంగలని కనిపెట్టి కూడా వారిని వదిలేసి జీతమిచ్చి పోషిస్తున్న బ్యాంక్ ని మోసం చేసావు కదా!" అనడిగింది ఆమె.
"ఏదో చిన్నపిల్ల. తల్లి అనారోగ్యంతో ఉందని వచ్చింది. ఆతల్లి సంతకం చేసిచ్చిన విత్ డ్రా ఫారం తో పని అయిపోయి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. ఇంటికి వెళ్లి తల్లితో సంతకం పెట్టించుకురావడానికి బద్దకించి తల్లి బదులు ఆ ఆపిల్లే చెక్ పై సంతకం పెట్టి దబాయించింది. అదీ తప్పే అనుకో"
"అందరికి సంబంధించిన బ్యాంక్ లో ఒక మతానుసారాన్ని అనుసరించి పూజలు జరపడం ఏమిటని ఆ బురఖా వేసుకున్నామె విసుక్కున్నట్లే . సంతకం తేడా ఉండటం వల్ల మనిషి ముఖం చూసి నిర్ధారించుకోవడం అవసరమే అన్న బ్యాంక్ ఉద్యోగి మాటల్లోనూ సమంజసం ఉంది కదా ! అందులో తప్పేమీ ఉంది. అయినా ఆ పిల్ల చేసింది తప్పే కదా ! ఆమెని అలా వదిలేయడం నాకు నచ్చలేదు" అంది నస్రీన్.
"ఇక్కడ తప్పొప్పులు, ఆచారాలు గురించి నేను మాట్లాడబోవడం లేదు బీబీజాన్ .. అయినా కోట్లకి కోట్లు అప్పులు తీసుకుని దివాళా సాకు చూపి బ్యాంక్ లకి ఎగనామం పెట్టి విదేశాలకి పారిపోయిన వాళ్ళని ఏం చేయగల్గుతున్నారు ? తిరిగి రప్పించలేక చేతులెత్తేసిన వాళ్ళతో పోల్చి చూస్తే ఇదేమంత పెద్ద తప్పు? పిచ్చుక మీద బ్రహ్మస్త్రం అవసరమా అనిపించింది. తిమింగలాలని వదిలేసి చిన్న చేపని పట్టుకుని ఏం లాభం ? వాళ్ళ ఔదార్యంలో తృణమో ఫణమో వాళ్లకి దక్కి ఉంటుంది. నా ఔదార్యంలో ఏమోలే ..చిన్నపిల్ల అన్న జాలి మాత్రమే ఉంది. ఆ మాత్రం ఔదార్యం తప్పంటావా ? "అన్నాడు.
నస్రీన్ మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంలో ఔదార్యం గోచరించిందతనికి.
*********************౦*****************
"అందరికి సంబంధించిన బ్యాంక్ లో ఒక మతానుసారాన్ని అనుసరించి పూజలు జరపడం ఏమిటని ఆ బురఖా వేసుకున్నామె విసుక్కున్నట్లే . సంతకం తేడా ఉండటం వల్ల మనిషి ముఖం చూసి నిర్ధారించుకోవడం అవసరమే అన్న బ్యాంక్ ఉద్యోగి మాటల్లోనూ సమంజసం ఉంది కదా ! అందులో తప్పేమీ ఉంది. అయినా ఆ పిల్ల చేసింది తప్పే కదా ! ఆమెని అలా వదిలేయడం నాకు నచ్చలేదు" అంది నస్రీన్.
"ఇక్కడ తప్పొప్పులు, ఆచారాలు గురించి నేను మాట్లాడబోవడం లేదు బీబీజాన్ .. అయినా కోట్లకి కోట్లు అప్పులు తీసుకుని దివాళా సాకు చూపి బ్యాంక్ లకి ఎగనామం పెట్టి విదేశాలకి పారిపోయిన వాళ్ళని ఏం చేయగల్గుతున్నారు ? తిరిగి రప్పించలేక చేతులెత్తేసిన వాళ్ళతో పోల్చి చూస్తే ఇదేమంత పెద్ద తప్పు? పిచ్చుక మీద బ్రహ్మస్త్రం అవసరమా అనిపించింది. తిమింగలాలని వదిలేసి చిన్న చేపని పట్టుకుని ఏం లాభం ? వాళ్ళ ఔదార్యంలో తృణమో ఫణమో వాళ్లకి దక్కి ఉంటుంది. నా ఔదార్యంలో ఏమోలే ..చిన్నపిల్ల అన్న జాలి మాత్రమే ఉంది. ఆ మాత్రం ఔదార్యం తప్పంటావా ? "అన్నాడు.
నస్రీన్ మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంలో ఔదార్యం గోచరించిందతనికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి