14, సెప్టెంబర్ 2017, గురువారం

ఆవలివైపు


కారు ఆగిన ప్రదేశాన్ని చూసి ముఖం చిట్లించుకుంది ఆమె. చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం. మురుగు వాసన. ‘‘కారు నిలపడానికి ఇంతకన్నా మంచి చోటు  దొరకలేదా’’ అని  డ్రైవర్ పై చిరాకు  పడింది.

“రెండు నిమిషాల పనే అన్నాడండీ బాబు. మీరు బయటకి రాకుండా లోపలే కూర్చోండి’’అంటూ డ్రైవర్ క్రిందికి దిగి " మహాతల్లి ! కోపం, నిర్మొహమాటం రెండూ ఎక్కువేమనసులో అనుకున్నాడు

"వీడికి ఈ మురికి కూపాలలో ఉండే మనుషులతో పనేమిటో " కొడుకుని  విసుక్కుంటూ కారు లోపలనే  కూర్చుని బయటకి చూస్తూ కూర్చుంది. వాస్తవ జీవితం కల్పనని మించి విభ్రాంతికి గురిచేయడమంటే ఏమిటో కంటికెదురుగా కనబడే దృశ్యాన్ని చూసి తెలుసుకుంది కొత్తగా మరొకసారి.

చిరుగుల చీర, తైల సంస్కారంలేని జుత్తు ఎముకలగూడు మోస్తున్న పూర్ణ గర్భం ఈ లోకపు దుష్టత్వాన్ని  మోయలేక మతి తప్పిన వైనమో లేక  మతి లేని మగువని ఆ స్థితికి తెచ్చిన దిగజారుడు తనమో  చూసి ద్రవిస్తున్నదామె మనసు. మతి స్థిమితం లేనట్లుగా ఉన్న స్త్రీ  నిగనిగ లాడుతున్నమామిడి పండ్ల బండి ముందు నిలబడి చేయి చాచింది . పండ్ల వ్యాపారి ఆమె  వైపు  అసహ్యంగా చూసి అవతలకి వెళ్ళమన్నట్టు చేయి విసిరాడు. పిచ్చినవ్వు నవ్వి మళ్ళీ చేయి చాచింది. అతను క్రిందకి వొంగి బండి అడుగుఅరలో  పెట్టిన కుళ్ళిన మామిడి పండుని తీసి ఆమె చేతిలో పెట్టాడు.

ముందుకి నడుస్తూనే  ఎడం చేతిలో పండుని పెట్టుకుని కుడిచేతి గోళ్ళతో కుళ్ళిన భాగాన్ని లాగి రోడ్డుపై పారేసి పండుని మరో వైపుకి తిప్పుకుని  ఆ పండు తింటూ ముందుకి వెళుతుండటం చూసి  కడుపులో దేవినట్లైంది ఆమెకి. కిందికురికి  ఆ చేతిలో పండుని లాక్కుని విసిరి కొట్టి కొన్ని పళ్ళని కొని పిచ్చితల్లికివ్వాలని తపనపడింది కానీ పరిశుభ్రపు పిచ్చి  ఆమె కాళ్ళకు సంకెళ్ళు వేసింది. ఓ నిండు గర్భిణికి కుళ్ళిన పండిచ్చిన లోక సంస్కారం ముందు  ఆ కుళ్ళుని ఊడ్చి పడేసి బతకడం కోసమో లేక  మరో ప్రాణిని బ్రతికించడం కోసమో  ఆ పిచ్చి తల్లి చేస్తున్న  ఆరాటమో  పోరాటమో చూసి ఊరుతున్న  కన్నీరుని పదే పదే తుడుచుకుంటుందిడ్రైవర్ ని పిలిచి  వంద రూపాయలిచ్చి  ఆమెకి మామిడి పండ్లు కొని ఇచ్చిరమ్మని  పంపింది. యజమానురాలి తీరుకి ఆశ్చర్యపోయాడు  డ్రైవర్ఇప్పుడేగా  మురికి కంపు అని విసుక్కుందీవిడ. మొత్తానికి  ఒక విచిత్రమైన వ్యక్తి అనుకుంటూ ముందుకు కదిలాడు.

అంతలోనే "నా పనైంది,ఇక వెళదాం పదండి "అంటూ ఆమె  కొడుకు  వచ్చి కార్లో కూర్చునే టప్పటికి డ్రైవర్ వెనక్కి రాక తప్పలేదు. అయ్యో ! ఆ పిచ్చి తల్లికి  కొన్ని పండ్లైనా కొని ఇవ్వలేకపోయాననే బాధతో  తడికళ్ళని రుమాలుతో తుడుచుకుంది.

కాసేపటి తర్వాత బావర్చీ లో లంచ్టూ బై త్రీ ని కూడా కతకలేక వదిలేస్తే " ఇందాక  ఆమ్మగారు  ఒక పిచ్చి మనిషిని చూసారు, ఆవిడే కళ్ళల్లో  మెదులుతుంది అనుకుంటా, బాధతో అన్నం  కూడా తినడం మానేశారు అని  విషయం చెప్పాడు డ్రైవర్.

" అమ్మ ఇతరులకి పెట్టే విషయంలో  ముందు ఉంటుంది. అవసరానికి మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదుమనం సాధారణంగా బ్రతికితే మరికొందరు కనీస అవసరాలతో  బ్రతుకుతారనుకునే పెద్ద మనసే కానీ అపరిశుభ్రంగా ఉన్న మనుషులన్నా,పరిసరాలన్నా అసహ్యంగా ముఖం పెడుతుంది. దగ్గరికి కూడా రానీయదుఒకో మనిషికి ఒకో  లోపం  ఉంటుందనుకుంటా" అని పెద్దగా నవ్వి మళ్ళీ "అంతే కదమ్మా" అన్నాడబ్బాయి

తన గురించి కొడుకు చేసిన వాఖ్యానానికి  నవ్వుకుని  "అమ్మని అంతలా గొప్పగా ఎత్తేసి మళ్ళీ అంతలోనే దబుక్కున కింద పడేసినట్లు మాట్లాడవచ్చునా? నోటికి  చేతికీ నియంత్రణ ఉండాలి" అంటూ  విసుక్కుని మూతి ముడుచుకుంది.

"అమ్మా ! ఆ మనిషి గురించి బాధ పడటం మానేయి. ఇంకో వారంలో మళ్ళీ వస్తాంగా, అప్పుడు ఆమెని వెదికి ఓ బుట్ట   మామిడి పండ్లు కొనిద్దాం సరేనా ! ముందు బిర్యానీ తిను అన్నాడు. ఆమె తల అడ్డంగా తిప్పిందిఎంతలేదన్నా  ఇంటికి వెళ్ళేటప్పటికి నాలుగు గంటలు పడుతుంది, అప్పుడు దాకా ఏమీ తినకుండా ఎట్లా ఉంటావ్ ? సరే ఆకలైనప్పుడు దారిలోనైనా తిందువుగాని   సరేనా అంటూ డిష్ లో పదార్ధాన్ని  పేక్ చేయించుకుని వచ్చి కారులో పెట్టాడబ్బాయి

దారంతా ఉత్సవానికి ముస్తాబైనట్లున్న తరువుల పూల శోభ గాయపడిన  ఆమె హృదయానికి మలాం పట్టీ వేసింది. డ్రైవర్,కొడుకు పాలకుల పర్యావరణ సృహని మెచ్చుకుంటూంటే " ఈ ఎత్తైన భవనాలు,కంటికి కనబడే పచ్చదనం అన్నీ పై పై మెరుగులే ! వీటి మధ్యన అసలైన పేదరికం తాండవిస్తూనే వుంటుంది, దానిని పట్టించుకోకుండా  పై పై మెరుగులు అద్ది ఇదే అభివృద్ధి అని కళ్ళకి కనికట్టు కడతారు  నాయకులుఅంది

“ వాళ్ళు ఏమైనా చేయనీ, మనం మాత్రం ఇలా రహదారుల ప్రక్కనే కాకుండా లోక సంచారం చేస్తూ ఎక్కడికి బడితే అక్కడ మొక్కలని నాటి వనాలని విస్తరింపజేయాలి, నేలంతటిని పూలవనాలగా మార్చాలి’’ అని అబ్బాయి తన సౌందర్య పిపాసని  వెల్లడిస్తే " పేరు వ్రాయని ప్రయాణికులు నాటిన మొక్కలే కదా ఈ రోజు ఇలా నీడనిస్తుంది. మనమూ  ఎక్కడబడితే  అక్కడ వీలైనన్ని మొక్కలు నాటుకుంటూ వెళదాం" అంది మనఃస్పూర్తిగా.

   దేశ రాజకీయాలు, విదేశాల్లో  ఉద్యోగాల వేట  లాంటి అనేక  కబుర్లతో కొన్ని గంటల ప్రయాణం తర్వాత కారు కీసర వంతెన దాటగానే  టోల్ చెల్లించి బాగా స్పీడ్ అందుకోకముందే రోడ్డు ప్రక్కన  వారికి కనబడిన దృశ్యం అసలైన లోకాన్ని మళ్ళీ ఇంకొకసారి కళ్ళకి చూపింది. జనారణ్యం వాడిన చెత్తంతా హైవే కి ఆనుకుని ఉన్న చెరువుకట్టపై గుట్టలు గుట్టలుగా పేరుకుని ఉంది మధ్య మధ్యలో కొన్ని గుట్టలు  పొగలు కక్కుతూ విషవాయులు వెలువరిస్తూ  పరిసరాల ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. వాటి మధ్యలో ఓ పిల్లవాడు కూర్చుని కుమ్మరించిన ఎంగిలి విస్తరాకుల్లో నుండి ఆహార పదార్ధాలని ఏరుకుని తింటున్నాడువారు  దృశ్యాన్ని  జీర్ణించుకునే లోపే కారు రెండు  కిలోమీటర్లు  ముందుకు  వెళ్ళింది.

"అమ్మా ! చూసావా" అన్నాడబ్బాయి.  ఆమె బాధగా తల ఊపింది. "కొద్దిగా కారు వెనక్కి తిప్పండి" అన్నాడు డ్రైవర్ తో  అబ్బాయి. డైవెర్షన్ తీసుకుని వెనక్కి ప్రయాణించి చెత్తగుట్టలప్రక్కన  కారు ఆగేటప్పటికీ  ఇంకా అలాగే ఎంగిలాకుల్లో నుండి ఆహారాన్ని ఏరుకుని తింటూనే ఉన్నాడతనుడ్రైవర్,అబ్బాయి  గబ గబా కారు దిగి బావర్చీలో పేక్ చేయించుకుని వచ్చిన ఆహారపు పొట్లం నీళ్ళ బాటిల్  వెంట తీసుకుని వెళ్ళి ఆ గుట్టల మధ్య నుండి  అతన్ని  బలవంతంగా ఇవతలికి తీసుకు వచ్చారుఆమె కారు నుండి  దిగకుండానే ఎంగిలి తింటున్న బాలుడిని చూస్తూవుంది. ఎండిపోయిన శరీరంతో   బాలుడిలా కనబడుతున్నాడు కానీ సుమారు  ఇరవై ఏళ్ళు ఉండవచ్చని అనుకుందిఅతని వళ్ళంతా గాయాలు, ఇంకా  పచ్చిగానే  ఉండి రక్తమోడుతూ ఉన్నాయి. ఆమె ముఖంపై విచారం కమ్ముకుంది.

" ఇదిగో ఇందులో బిర్యానీ ఉంది తిను, ఈ నీళ్ళు తాగు. ఇలాంటి చోట కూర్చుని ఆకుల్లోది  ఏరుకుని తింటున్నావ్ ఏమిటీ ? ఏ ఊరు మీది "అనడిగాడు అబ్బాయి జాలిగా.  "మన వూరే" అని  అతని సమాధానం. " నీకెవరూ లేరా? వంటి మీద  ఈ దెబ్బలేంటి?" అన్నింటికీ  ఒక వెఱ్ఱి నవ్వే అతని  సమాధానం. “ హాస్పిటల్ కి వెళ్లి  దెబ్బలకి కట్టు వేయించుకుందువు గాని, మాతో రా వెళదాం అని పిలిచాడు అబ్బాయి.

 డ్రైవర్  కంగారుగా "వద్దు బాబూ, అతనిదీ ఈ వూరే అని చెపుతున్నాడు. ఎవరో ఒకరు ఇతను మా వాడే అంటూ వచ్చి మనమే కారుతో గుద్ది  దెబ్బలు తగిలిచ్చామని కేసు పెడతామంటారు, తర్వాత డబ్బులు గుంజుతారు, మనకెందుకు ఆ గోల? వెళదాం పదండిఅంటూ అబ్బాయిని తొందరపెట్టాడు డ్రైవర్.

"అమ్మా! మనీ ఇవ్వుఅన్నాడబ్బాయి కారు దగ్గరికివచ్చిప్రతి చిన్న అవసరానికి  అమ్మని అడిగి తీసుకునే అలవాటు. సందర్భం తెలియకుండా చేతికి ఎముక లేదన్నట్టుగా దానం చేసే అబ్బాయి గుణం తెలిసిన అమ్మ  అరే ! చిన్న నోట్లు లేకుండా ఉన్నాయే,ఇప్పుడెలా ? అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె ఒడిలో ఉన్న   హాండ్ బ్యాగ్ అందుకుని  చేతికందిన నాలుగు పెద్ద నోట్లు తీసుకుని అనాధ యువకుడి దగ్గరికి వెళ్ళాడు "మనం ఇచ్చినా అతని దగ్గర ఆ డబ్బులు ఉండనీయరుఎవరో ఒకరు కొట్టి లాక్కుంటారు" అని  డ్రైవర్ అంటున్నా వినకుండా అతని జేబులో డబ్బు పెట్టి "హాస్పిటల్ కి వెళ్ళు" అంటూ వెనక్కి  తిరిగి చూస్తూనే కారులో ఎక్కి  కూర్చున్నాడబ్బాయిఆకలి తీరని ఆ యువకుడు డివైడర్ పైకెక్కి  పూసిన చెట్టు ప్రక్కన కూర్చుని ఆత్రంగా పొట్లం చించుతున్న దృశ్యం ముందుకి వెళుతున్న కారు అద్దంలో కనబడుతుంది ఆమెకు.
  
 వెంటనే కొడుకు గురించి లోలోపల   దిగులు పడింది. గొప్పగా సంపాదిస్తున్నాను కదా అని చేతికి ఎముక లేదన్నట్లుగా ఇచ్చేసుకుంటూ వెళితే ముందు ముందు  ఇబ్బంది పడాల్సి వస్తుందేమోదానకర్ణులని పేరు పొందీ తుదకు చితికిన ఎంతమంది వెతలు చూసి ఉండలేదు తను.  ఆ విషయాన్ని  సున్నితంగా చెప్పినా అబ్బాయికి కోపం వచ్చేస్తుంది. లాక్కున్నట్లు డబ్బు తీసుకుంటూనే ఖర్చుపెట్టే ప్రతిదానికి నీకు లెక్క చెప్పాల్సి వస్తుంది, అందుకే ఇండియాకి వచ్చినప్పుడు నా అకౌంట్ నన్ను మెయిన్టైన్ చేసుకోనిమ్మని అంటానంటాడుప్రాణం చివుక్కుమంటుంది ఆమెకి. అంత వయస్సు వచ్చిన బిడ్డపై నా డబ్బు పెత్తనం  ఏమిటీ ? విలువ తెలిసొచ్చేనాటికి అదే తెలిసొస్తుంది  ఎవరెట్లాపోతే నాకెందుకు ? ఇలా ఎన్నాళ్ళు కాపలా కాయగలను నేను మాత్రం  అనుకుంటుంది కోపంగా.

అమెరికా నుండి  ఎవరైనా వచ్చారు  అనగానే స్నేహితులు,బంధువులు వాళ్ళ దగ్గర నుండి డబ్బుల వర్షం కురుస్తుంది అనుకోవడం సహాయాలు అడిగేయడం.  లేదా  మొహమాటానికి ముసుగేసుకుని ఏ ఫేస్ బుక్ లోనో,వాట్సాఫ్ లోనో మెసేజ్ పెట్టి అర్ధించడం మామూలైపోయింది. ఆ డబ్బు సంపాదించడానికి  అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించరు. డబ్బు కణాలని తాగేయడానికి తయారుగా ఉన్న జలగల్లా కాచుక్కూర్చుంటారు.  పరిచయమున్న ప్రతివారికీ అమెరికా వలస పక్షి ఇక్కడ వాలగానే  లేని అవసరాలు,తీరని కోరికలు పుట్టుకొస్తాయి కాబోలు, ఛీ ఛీ ఏం మనుషులో .. అనుకుంటూ ఆలోచనల్లో నుండి తెప్పరిల్లింది కొడుకు మాటలకి.

“కోట్లమందికి తినడానికి  తిండి లేదు. ఎండావానకి తలదాచుకోవడానికి చిన్న గుడిసె కూడా ఉండదు కానీ  కోట్లకొద్దీ డబ్బు, వందల గదులున్న భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినా ఈ బీదాబిక్కికి కడుపు నిండా భోజనం పెట్టడానికి మనసు ఉండదు. పంచభక్ష్య పరమాన్నాలు వండించుకుని తినగల్గిన  వాళ్లకే విందులు వినోదాలు, ఆకలి తీరని వాడికి ఎంగిలి విస్తరులలో ఏరుకుని తినే దుస్థితి. చాలా బాధగా ఉంటుందండీ ఈ తేడాలు చూస్తే ! జీవితమంటే ఏమిటోనన్నది ఆలోచించే మనసూ లేదు తీరికలేదు జనాలకి. ఆర్ధికంగా ఎదిగిన కొలది మనసు ఇరుకైపోతుందేమో! అన్నాడబ్బాయి  డ్రైవర్ తో ఆవేశంగా.  

"అంతే నండీ ! నేను ఎంతో మంది  ధనవంతుల దగ్గర పనిచేసాను. చాలామందికి ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు. కొందరు అంత డబ్బున్నోళ్ళు కాకపోయినా రేపటి గురించి ఆలోచించకుండా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనదగ్గర ఎంత ఉంది అని కాదు ఇచ్చే మనసు ఉందా, లేదా అన్నదే లెక్క" అన్నాడు డ్రైవర్.

"మనం చేస్తున్నది అపాత్రదానం అననిపిస్తే కష్టపడి సంపాదించినవారికి ఇంకా బాధగా ఉంటుంది. అవసరానికి మించి ఇస్తే సోమరితనం నేర్పినట్లు ఉంటుంది అది గమనించుకుని చేయాలి నాన్నా " అంది కొడుకుతో
 "నువ్వు భలే మాట్లాడతావమ్మా ! ఎదుటి మనిషికి ఏది అవసరమో ఏది అనవసరమో మనమెలా నిర్ణయించగలం? కాబట్టి ఇవ్వాలనుకుంటే ఎక్కువ ఆలోచించకుండా ఇచ్చేయడమే, ఇందాక  నేనంత డబ్బు ఇచ్చాసానే, అపాత్రదానం అయిపోతుందేమో అని మనసులో గుంజుకోకుఎవరి చేయి  అయినా  డబ్బుని  ప్రయాణి౦ప చేసే వాహకమే అని నువ్వే చెప్పావ్ నాకు" అన్నాడు

“ సహాయం చేసే చేయికి చిన్న నోటు కి పెద్ద నోటుకి  కచ్చితంగా తేడా తెలిసి ఉండాలి, లేకపోతే కొన్నాళ్ళకి పై చేయి క్రింది  చేయి అవుతుందనే సత్యం  కూడా  తెలిసి  ఉండాలి’’ అంది ఆమె

"అమ్మా ! ఇక ఆపుతావా నీ జాగ్రత్తల పాఠం" అని విసుక్కున్నాడతను.

తాను ఉదారంగా చేయలేని పనులని అబ్బాయి ఈజీగా చేసేస్తాడని లోలోపల గర్వమే ఆమెకికొడుకు భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి జరిగి అతని భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకుని మనసునే ముకుళిత హస్తాలుగా చేసి "నాకెన్నో బేషజాలుభయాలు, సంకోచాలిచ్చిన నువ్వు   నాకు మాత్రం అణువణువునా మానవత్వాన్ని నింపుకున్న బిడ్డనిచ్చావ్మేము  నాటిన ఈ ప్రేమ మొలకని మహా వృక్షాన్ని చేసి ఆ నీడన అన్నార్తులు సేదదీరే వరమీయి తండ్రీ ! ఈ దయా సముద్రాన్ని ఎండనీయకుతండ్రీ !" అని కనిపించని భగవంతుడిని  వేడుకుంది.
   
కంచికచర్ల వూర్లోకి రాగానే "ఇక్కడ సెంటర్లో  టీ బాగుంటుంది,తాగి వెళదాం" అంటూ కారు ఆపాడు డ్రైవర్. " సింధు వాళ్ళు ఈ ఊర్లోనే ఉండేది. ఎన్నో ఏళ్ళు అయింది వాళ్ళని చూసివాళ్ళింటికి వెళదామా?"  అనడిగింది  అమ్మసరేనన్నాడు ఆబ్బాయి. టీ త్రాగిన తర్వాత అడ్రెస్స్ వెతుక్కుని  సింధు వాళ్ళింటికి చేరుకున్నారు.

"మీరు కాసేపు ఇక్కడ కూర్చుంటారుగా,ఈ వూర్లోనే మా చెల్లెలు ఉంది,ఆమెని చూసేసి  అరగంటకల్లా వచ్చేస్తాను, వెళ్ళమంటారాఅని అడిగాడు డ్రైవర్.  "సరే మరి,త్వరగా వచ్చేయండి,డబ్బు ఏమైనా కావాలా అనడిగాడబ్బాయి

"వద్దులెండి" అన్జెప్పి కారు వెనక్కి తిప్పిన డ్రైవర్ ఆలోచనల్లో అతనింటి  అవసరాలు మెదులుతున్నాయి. భార్యకి చేయించాల్సిన కిడ్నీ పరీక్షలుపెద్ద కూతురి కాలేజీ ఫీజులు తప్పనిసరై కూర్చున్నాయి నెత్తిమీద. ఈ మధ్యనే చిన్న పిల్ల పుట్టిన రోజని యజమానురాలిని రెండు వేలు అడ్వాన్స్  అడిగాడు.

"అవసరాలు వూరుతూనే ఉంటాయి. ఏది అత్యవసరమో తెలుసుకుని అందుకు ఖర్చు పెట్టుకోవాలి కానీ సరదాల కోసం  ఇంత ఖర్చు చేయాలా ? అడ్వాన్స్  ఇవ్వడం నాకిష్టం ఉండదు, ఇంకోసారి అడగొద్దు" అని నిక్కచ్చి గా చెపుతూనే రెండు వేలిచ్చింది. మళ్ళీ ఇప్పుడడిగితే  డబ్బు ఇవ్వకపోగా చివాట్లు పెడుతుంది. అందుకే చెల్లెల్ని చూసి వచ్చే వొంకతో వెనక్కి రావడం మంచిదైంది అనుకున్నాడు. ఇప్పుడతని కళ్ళల్లో  డివైడర్ పై కూర్చున్న అనాధ యువకుడి జేబులో ఉన్న  నాలుగు గులాబీ రంగు పెద్దనోట్లు మెరుస్తున్నాయి.

చుట్టాలింట్లో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉండగా  అబ్బాయి  “అమ్మా .. నా ఫోన్ ఏది” అనడిగాడు
“ఇక్కడ వాడుకునే ఫోన్ అయితే నా దగ్గరే ఉంది, ఐ సెవెన్ అయితే నా బేగ్ లో కూడా లేదు. కారులోనే ఉందనుకుంటాఇందాక  టీ త్రాగడానికి దిగేటప్పుడు  ఛార్జింగ్ కి పెట్టావు కదా” అంది ఆమె.  

తల్లి దగ్గరున్న తన  ఇంకో ఫోన్ తీసుకుని ప్రక్కకి వెళ్ళాడుఫైండ్ మై ఐ ఫోన్  సెర్చ్ చేస్తూ ముఖం చిట్లించాడు. ఇదేంటి టోల్ గేట్ దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది అని తల్లితో అనబోయి మాటని అణుచుకుని  తొందరగా రమ్మని డ్రైవర్ కి కాల్ చేయమ్మా  అన్నాడు.

ఖరీదైన ఫోన్ కనబడలేదని కంగారు పడుతున్నాడు కాబోల్సు అనుకుని  డ్రైవర్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్, వచ్చేస్తున్నావా? అని అడిగింది ఆమె. “పది నిమిషాల్లో వచ్చేస్తున్నానండీ” అన్నాడతను.

కారు రాగానే డోర్ తెరచి ముందు సీట్లో   కనబడుతున్న ఫోన్ ని చూసి హమ్మయ్య అనుకుంది.

అబ్బాయి మాత్రం  మిగిలిన ప్రయాణమంతా ముభావంగానే  ఉన్నాడు. డ్రైవర్ తో కూడా ఏమీ మాట్లాడలేదు. మధ్యలో కారు ఆపి  వెనక సీట్లోకి మారి తల్లి భుజం పై తల వాల్చి నువ్వే కరెక్ట్ అమ్మా ! అన్నాడు.

వీడికి ఇప్పటికిప్పుడు మెదడులో ఏం పురుగు తొలిచిందో  ఏమో ? అనుకుంది ఆమె.

  


కామెంట్‌లు లేవు: