10, అక్టోబర్ 2017, మంగళవారం

మెత్తని వొడి


మన తెలంగాణ "హరివిల్లు"  08/10/2017 లో నేను వ్రాసిన కథ "మెత్తని వొడి" చదవండి మరి.

అత్త వొడి పువ్వువలె మెత్తనమ్మా .. ఆదమరిచి హాయిగా ఆడుకోమ్మా ! ఆడుకుని ఆడుకుని అలసిపోతివా ? ఎఫ్ ఎమ్ లో  నాకెంతో పాట వస్తుంది. దుఃఖం ముంచుకొచ్చిందిఇక నన్నెవరు చూస్తారని  దుఃఖ  పడుతున్న సమయంలో కూడా తన దుఃఖాన్ని మరిచి తన కొడుకుతో పాటు ఆమెని ఓదార్చింది తను కాదు. నిన్ను చూసుకోవడానికి నేను లేనూ ..ఏడవకు అని. ఇప్పుడన్నీ నెపాలు తనపై వేసి అందరి మధ్య తననే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎంతైనా ఆమె అత్త కదా ! ఎంత బాగా చూసుకోవాలనుకున్నా ఆమె అమ్మ కాలేదు కదా
 మా అత్తగారికి నాకు అసలీమధ్య పొసగడం లేదుఆమె కూడా తల్లిలాంటిది అని గర్వంగా చెప్పుకునే నేను ఇలా చెప్పడంకూడా సిగ్గు కల్గిస్తుంది. కోడలినైన నా పై ఆమెకి అకారణ ద్వేషం మొదలైంది కొన్నేళ్ళుగా  ! ఆమె అనుభవించిన సౌకర్యవంతమైన జీవితంకన్నా పై మెరుగు జీవితంలో ఉన్నానని ఆమె ఈర్ష్యకి కూడా అసలు కారణం కావచ్చుమా మామగారు చనిపోయాక ముగ్గురు కొడుకులు ఎవరింట్లో ఉండమన్నా ఉండదు. పోనీలే ఆమెకి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటం ఇష్టం. ఓపిక ఉన్నన్నాళ్ళు ఉంటుందిలే అని ఊరుకుంటాము కాస్త అనారోగ్యంగా ఉంటే చాలు కొడుకులని వదిలేసి మేనమామ కూతురిని, పిన్ని కొడుకుని పిలిపిచ్చుకుని వాళ్ళని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని అడుగుతుంది. మేమున్నాం కదా .. కొడుకులని కోడళ్ళని వదిలేసి మమ్మల్ని అడుగుతుంది ఏమిటని వాళ్ళు అనుకుంటారు అలా చేయకండి అంటే మా మాటలు విననట్టే ఉంటుంది. ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు మంచిదే కానీ లేని రోగాలు ఉన్నాయని ఊహించుకుని అందరి స్పెషలిస్ట్ ల చుట్టూ తిప్పిన తర్వాత కానీ ఆమె ఆరోగ్యం బాగుందన్న నమ్మకం చిక్కేది  కాదుఅన్ని విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటుంది కానీ సమయానికి భోజనం చేయదు. ఏమైనా అంటే నన్నెవరు చూడనవసరంలేదు, వృద్దాశ్రమాలున్నాయి అక్కడికి వెళ్ళిపోతాను అని ప్రక్క వాళ్ళతో చెపుతూ ఉంటుంది. ఆమెని ఒంటరిగా వదిలేసి ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా వీలవని పరిస్థితి. మీ ఇంట్లో ఉండటానికి నాకు భయం అంటుంది. ఎవరూ ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఆమె మాత్రం ఉత్తర,దక్షిణ,పడమటి  తీర్ధ యాత్రలు చేసి వచ్చిందికొడుకుల దగ్గర  రిమోట్ తీసుకుని మరీ అన్నిఛానల్స్ లన్నింటిలోనూ  వచ్చే  సీరియల్స్ ఏమాత్రం మిస్ కాకుండా మార్చి మార్చి  చూస్తుంది. ఆమెకి ఇష్టమైతే ఎక్కడికైనా రెడీ అయిపోతుంది. మేము వెళదామనుకున్న చోటుకి రమ్మంటే ..అబ్బే నా ఆరోగ్యం బాగాలేదు,నేను రాను మీరు వెళ్ళిరండి అంటుంది అదెంత ముఖ్యమైన బంధువుల ఇంట్లో జరిగే వేడుకైనా సరే ! అమెరికాలో ఉన్న మనుమడికి ఫోన్ చేసి ఐపాడ్ అడిగి తెప్పించుకుంది. దానిని ఉపయోగించటం నేర్చుకుని యూ ట్యూబ్ లో పాత సినిమాలు చూస్తూ ఉంటుంది
అసలు ఆమెకి నాకు ఒక జనరేషన్ తేడా ఉంది. అయినా నాతో ఆమె పోటీ పడాలని చూస్తుంది.   ఇక  ఇంటెడు చాకిరినీ,  ఎదుర్కొన్న అనేక కష్ట నష్టాలని కూడా  గడ్డిపరకని చేసేస్తుంది అత్తగారు.  ఎన్ని తప్పులు చేసినా కొడుకులని సమర్దిస్తూనే ఉంటుంది. కోడళ్ళ పై దృతరాష్ట్ర ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటుంది.   తల్లిదండ్రులు ఉచితంగా కని పారేసి అరణంగా ఆడపిల్ల బతుకునే  రాసిచ్చినట్లు  పుస్తకమూ చదవనీయక ప్రపంచ జ్ఞానం చెంత సేదదీరనీయక మనసుకి వెసులుబాటు లేక నాలుగు గోడల మధ్య  బందీని చేసిన తీరుని బాహాటంగానే నిరసిస్తూ ఉంటానే కానీ చొరవచేసి నా ఆనందం కోసం ఏ మాత్రం చొరవజేసి గడప దాటటానికి సాహసం చేయని  నేనుఈడేరని బాధల మధ్య రక్కసి గాయాల రసి కారుస్తున్నప్పుడు ఉండే బాధని మౌనంగా భరిస్తూనే ఉంటాను. ఆ మాత్రం నిభాయించుకోకపోతే యెట్లా అనుకుంటూ సర్దుకుపోవడం అలవాటైపోయింది  కూడా ! పైగా  వృద్దాప్యాన్ని అర్ధం చేసుకోవడం ఎలా అనే పుస్తకాలు అనేక ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను.సానుభూతితో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. సరిక్రొత్త చీరలు ధరించడం,ప్రయాణాలు చేయడం, బంధువుల మధ్య ఆమెని ఆమె కొడుకులని గొప్పగా వర్ణించుకోవడం అంటే భలే సరదా ఆమెకి. వెనుక వినబడే వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం కాబట్టి అలా ఉండొద్దు అని చెపితే కూడా అర్ధం చేసుకోవడమూ కష్టమే ! నేను లేనప్పుడు ఎవరొచ్చినా నాపై చాడీలు చెప్పడం అలవాటైపోయింది కూడా !
 ఆమెకి అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. ఆమెకి  నాకూ  అస్తమానూ పంచుకునే విషయాలేం  ఉంటాయి ఒకవేళ ఉన్నా వంట సంబందిత విషయాలు, చుట్టపక్కాల కబుర్లు తప్పకాలక్షేపం కోసం ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు నాకసలు అలవాటు లేదు.   పుస్తకాలు చదవడమో, ఫేస్ బుక్ చూడటమో, చిన్న చిత్రాలు చూడటమో నాకున్న వ్యాపకం. లేదా  ఫ్రెండ్స్ తో మాట్లాడటం నాకిష్టం. వాళ్ళతో సమానంగా ఆమెతో మాట్లాడే విషయాలు ఏముంటాయంటే  ఒప్పుకోదు. ఆరోగ్యం సమకూరినాక తనింటికి వెళ్ళిపోయి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించినా  నోరిప్పి మాట్లాడకపోతే ఎలా ఉంటాను అని చెపుతూ ఉంటుంది.  
 వృద్ధులకి పిల్లలతో పాటు ఆస్థిలో సమభాగం తీసుకోవడం కూడా సబబు కాదనిపిస్తూ ఉంటుంది నాకు. శారీరక దుర్భలత్వం వచ్చేసినా సరే తగని అహంతో నాకేం తక్కువ ..ఏంటి నన్ను వాళ్ళు చూసేది అన్నట్టు ఉంటుంది వారి ప్రవర్తన. ఆమె వయసుకి ఏ గుడికో వెళ్ళడం,ఆమె వయసు ఉన్నవారితో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోవాలి కానీ .. కోడళ్ళు వెళ్ళిన చోటుకల్లా ఆమెని తీసుకువెళ్ళడం సబబుగా ఉండదని అర్ధం చేసుకోదు. పెద్దవయసు వచ్చినాక మనం ఏం చెపితే అది చేయాలి చేయక ఏం చేస్తారు అన్న పెంకితనం, తమ మాటే వినితీరాలనే పట్టుదల పెంచుకుంటే ఎవరేం చేయగలరుప్రస్తుతం ఆమె వయసు డెబ్బై ఎనిమిదేళ్ళు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఓ పదేళ్ళు తగ్గించి చెపుతూ ఉంటుంది ఆమె పెద్ద కొడుకుకి కూడా అరవై ఏళ్ళు దాటిపోయాయి. కోడళ్ళ వయసుని మాత్రం ఓ పదేళ్ళు ఎక్కువ లేక్కేసుకుని అన్నేళ్ళు ఉండవు నీకు అంటుంది. అలా అడిగినప్పుడల్లా వొళ్ళుమండిపోతుంది నాకు
నేనూ కొత్తపాత్ర లో  అదీ అత్త గారి హోదాలో మారినాక  కూడా నాపై పెత్తనం చేయాలని చూస్తున్న మా అత్తగారిని అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాలేదు. నాకూ ఆమెకి ఎంత తేడా ! అని బేరీజు వేసుకోకుండా ఉండలేకపోతున్నాను.
 అన్నింటికన్నా ముఖ్యంగా  ఆమె ప్రవర్తించిన  తీరుకి నా మనసు  విరిగిపోయింది. భర్త చనిపోయిన కోడలి దగ్గర తోడుగా ఉండాల్సిన ఆమె కోడలిని  నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా వదిలేసి  తన ఇంటికి వెళ్ళిపోయిన ఆమెలో తల్లి మనసు ఉందని ఎలా నమ్మమంటారు ? నాదగ్గర ఉండి  ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండే వారిమి కాదా ? కిలోమీటర్ దూరం లోపులోనే ఉన్నాసరే నెలరోజుల తర్వాత  గానీ ఇంకో పని పడిన రోజున గానీ ఈ  ఇంటికి రాని ఆమెలో   అమ్మని చూసుకోవడం సాధ్యమేనా ? అదే నా కన్నతల్లైతే  అలాంటి స్థితిలో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళగలదా ?
నేనిప్పుడు  పసి పాపనేం కాదు అలాగే  ఆమెలో మాతృత్వం గిడసబారిపోయిందని నేననుకోవడంలేదు. ఆమెని పసి పాపలా చూసుకోవాల్సిన రోజు నాముందు ఉంటుందేమో ..ఎవరు చెప్పొచ్చారు చెప్పండిఅసలీ కోడళ్ళకి అత్తగారిని ఆడిపోసుకోవడమే పని. మళ్ళీ కథలు కూడా చెపుతున్నారని అనుకోకండి.   ఇలా  చెప్పడంలో కూడా ఆమెపై ద్వేషం యేమాత్రం లేదని మీరు అర్ధం చేసుకుంటే చాలు. లోకంలో ఆమెలాంటి వారుంటే కాస్త కోడళ్ళని అర్ధం చేసుకుంటారని నా ఆశ కూడా !

ఆఖరిగా ఒకమాట .. మెత్తని ఒడి ఒకటి ఉంటుందని ఆడపిల్లలకి చెపుతూనే ఉండాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ  పాపలు అమ్మలు అత్తలు కూడా కదా


కామెంట్‌లు లేవు: