కవిత్వమంటే
మనిషీ ..
కవిత్వమంటే
మురుగు కాల్వలో
కొట్టుకుపోయే క్యారీ బేగ్ కాదు
మహా సముద్రంలో
తేలియాడుతున్న డంప్ యార్డ్ కాదు
కాలయోనిలో యెప్పుడే కవి ఉదయిస్తాడో
పురిటి వాసన కొడుతూ
నలు దిక్కులెపుడు చెలరేగుతాడో
అక్షరాలుగా మారినది
అతని హృదయ కంపనలేమో
వాక్యమై తేలినది అనేకుల
ఆలోచనల ఆజ్యమేమో
నింపాదిగా చూస్తే కదా తెలిసేది
చూసేవాడికేమి తెలుసు కాడి బరువు
భుజం మార్చుకుని చూడు
కుబుసం విడుస్తున్న నాగు నడుగు
మిలమిలలాడటం ఎంత కష్టమో
కవిత్వమంటే..
అంధకార అడవిలో గుడ్డి వెలుగు
మనో వేగాశ్వాన్ని అధిరోహించడానికి
కాలూనే రికాబు
గుండెని పొడిచే గునపం
మెదడుకు గుచ్చుకునే పల్లేరు తీపు
పూలకై దోసిలి పట్టిన మనిషికి
ఆయాచితంగా లభించిన అగ్ని కణిక.
(గణేష్ దిన పత్రిక ఆదివారం సంచికలో 09/11/2018.)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి