5, అక్టోబర్ 2019, శనివారం

ఫ్లిప్ సైడ్

మళ్ళీ ఆధ్యాత్మికంలో పడినట్లున్నారు. ఏమిటీ సంగతి అని అడిగారు నా మిత్రుడు. 

రోజూ నేను పెడుతున్న వాట్సప్ స్టేటస్ లు చూస్తున్నట్లు అర్దమైంది. నాకు ప్రశాంతత అక్కడ తప్ప యింకెక్కడా దొరికేటట్లు లేదు అని రిప్లై యిచ్చాను. నేను అలా బ్రాంతి లో బ్రతుకుతున్నాననుకుని వుండవచ్చు. అదికూడా నేనే అనుకున్నానంటే అతని ఆలోచనలు నాకు తెలుసు కాబట్టి.   


అసలు మనుషుల అంతరంగంలో యేమి వుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమికాదు. కానీ వారు తమ ఆలోచనలు నిజమేనని వొప్పుకోకపోవడమే కష్టం. 


నేను మాత్రం ఏం తక్కువ? చీపురు అరిగి అరిగి పోయినా కూడా.. ఆప్టరాల్ వొక చీపురు వందరూపాయలు పోసి వూరికూరికే మార్చలేక అరిగితే మాన్లే కాస్త నడుంవొంచి  ఊడ్వ వచ్చు.మంచి ఎక్సెర్ సైజ్  కూడాను అని బతకనేర్చిన తెలివితేటలు చూపిస్తాను.


నేను మహా దైర్యవంతురాలినని, కొందరు నాకు చాలా పొగరని పిసినారిని అని యేవేవో మాట్లాడుతుంటారు. ప్రతిపనికి అయినదానికి కానిదానికి పురుషుడిపై ఆధారపడే మనస్తత్వం కాదు. ఏ పనైనా స్వయంగా చేసుకోవాలనుకుంటాను తప్ప సోమరితనంగా కూడా వొకరిపై పని నెట్టేయడమన్న ఆలోచన చేయను.. నేను సంపాదించని రూపాయలను విచ్చలవిడిగా  ఖర్చు చేయడానికి నాకు అధికారం లేదు అంటాను. అయినా డబ్బులేమీ వూరికే రావడం లేదు కదా. ఆ మాత్రం ఆత్మ విశ్వాసం వున్నవాళ్ళను కృంగదీసే మాటలంటే పట్టించుకోకూడదనుకుని నాకు నచ్చిన దారిలో పోతుంటాను కానీ… కొన్ని విషయాలకు స్పందించకుండా మాత్రం వుండలేను.


గత ఆదివారం నేను ఓ పరామర్శకు.. వెళ్ళివచ్చేసరికి మా బ్లాక్ చుట్టూ కనబడిన మార్పుకు కుదేలైపోయాను.     పచ్చని చెట్లు నిలువెత్తు పెరిగి రంగురంగుల పూలతో భలే శృంగారంగా కనువిందు చేస్తూ వుండేవి. ఆ పూల పొదలచుట్లూ చెట్ల చుట్టూ తిరిగే తుమ్మెదలు సీతాకోకచిలకలు తూనీగలు హమ్మింగ్ బర్డ్స్ ఉడుతలు  యింకా పూల దొంగలకు అన్నింటికి ఆలవాలమైనట్లు వుండే అన్నిరకాల చెట్లను మొదలకంటా నరికించేసారు. బిల్డర్ నరకమని చెప్పారండి అన్నాడు వాచ్ మెన్. 


"మనుషులకు తిరిగే వాహనాలకు వేటికి అడ్డుకాదు. పైగా శ్రావణమాసం. అలా పచ్చగా వున్న పూలు పూసే మొక్కలను నరికినేయడానికి ప్రాణమెలా వొప్పింది. పూలు కొయ్యొద్దు అంటే కోయడం మానేస్తారుగా" అన్నాను. 


"దోమలు  పచ్చ పరుగులు వస్తున్నాయని నరికించేసారు" అన్నాడతను. అతను మాత్రం యేం చేస్తాడు యజమాని ఆజ్ఞ పాటించాలిగా అనుకుని పైకి వచ్చేసాను. కానీ రెండురోజులు మాములు మనిషిని కాలేకపోయాను. 


ఎంత కఠినంగా వుంటున్నారు మనుషులు.  అసలేమాత్రం జాలి కరుణ లేని రాతి హృదయాలు అయిపోతున్నాయని అనుకోవడమే కాదు మరి కొందరి దగ్గర  పదే పదే వాపోయాను.కళ్ళు మూసినా తెరిచినా రంగుల రంగుల పూల పందిళ్ళు కదలాడుతూనే వున్నాయి.అసలు మనిషి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించడం మానేసాం. నేను నా అనే చట్రంలో పడి తిరుగుతున్నాం. పాంచ భౌతాత్మికం శివం ప్రకృతియే లక్ష్మి అని తెలియదా లేక యెవరూ చెప్పలేదా? 


ఉదయాన్నే పూలు తెచ్చుకోవడానికని ప్లాట్ దగ్గరకి వెళ్లాను. అక్కడ నీలిరంగు  శంఖు పూలు దిట్టంగా పూస్తున్నాయి. పూలను కోస్తుంటే గోడపై నుండి పలకరించింది వెనుకింటి ఆమె. పెద్ద పరిచయంలేదు కానీ హాయిగా మాట్లాడబోయాను. 


"ఇవిగో యీ మొక్కలన్నీ నేనే వేయించాను అంది. “ఈ శంఖుపూల తీగ నేనే నాటానండీ అది కుండీలో పెరిగి పూలుపూసి కాయలుకాసి గింజలు రాలి మళ్ళీ మొలిచాయి” అన్నాను. ఒప్పుకుంటేనేగా సాక్ష్యానికి యింట్లో అద్దెకి వుంటున్న అమ్మాయిని తోడుతెచ్చుకుని నేనే గింజలు వేసేను అంది. 


ఇవిగోండి..కాసిని పూలు తీసుకోండి అని యివ్వబోతే యివాళ పక్కింటివాళ్ళ దొడ్లో కోసుకొచ్చాను అంది. అసలామె బాధేమిటో నాకర్ధమవక ఆలోచిస్తుంటే ఆ గోరింటాకు చెట్టు నేనే వేయించాను. ఈ మందారాలన్నీ వేయించాను. చాలా పూలు పూసేయి అందరికి పంచేదాన్ని అంది.నీక్కూడా కావాలంటే కోసుకుని వెళ్ళు అంది వుదారంగా. నా స్థలంలో  ఆవిడ వుదారత యేమిటో నాకర్ధమై చావలేదు.   ఇప్పుడు నేను  కూడా మరిన్ని  మొక్కలు నాటుతానంటే యెందుకమ్మాయ్ ఇల్లు కట్టినాక వేసుకో అని చెట్లుంటే దోమలు పురుగుపుట్రా వస్తాయి బయట కూర్చోలేము అంది. ఓహ్ ..ఇదా యీమె బాధ అనుకుని అక్కడనుండి తప్పించుకుని వచ్చేసాను. 


ఆమెకి మాకు గోడ అడ్డుంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా స్థలం యింకా వుంది  అనేసేదేమో. ఇప్పటికే ముందువైపు వున్నాళ్ళు  వెనక్కి వెనక్కి జరిగి రెండొందలు గజాలు మాయం చేసేసారు. నోరున్నవాడిదే రాజ్యం అయిపోయిందని వాపోవడం తప్ప చరిత్రని తవ్వి వెనక్కి తెచ్చుకోవాలనే జ్ఞానం ఆశ రెండూ లేని నిర్లిప్తత జీవులు మా ఇంట్లో వాళ్ళు. ఏది నాది యేది మీది అన్నీ వొదిలి అందరూ వెళ్ళేది ఆ వొలుకుల్లోకే కదా వెళ్ళేదన్నవైరాగ్య జ్ఞానం వచ్చేసిన వృద్దులం అయిపోయాం. వొంట్లో జవజీవాలు సన్నగిల్లడం కాదు పోరాడే శక్తి లేదని వెనకడుగు అంతే. నాకెందుకో పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే అన్న నానుడి గుర్తుకొస్తుంది అప్రయత్నంగా. మేమంతా మంచి పులులం అని మాకు మేమే సెహబాష్ అని వెన్ను చరుచుకుంటుంటే ఆక్రమణదారులు మా  మంచి తనాన్ని చేతకాని తనంగా భావిస్తున్నారని నా గట్టి అనుమానం.వలస వెళ్ళి స్థానికత కోల్పోయిన కుటుంబం మాది. అక్కడ వున్న వాళ్ళతో పోల్చుకుంటే మా కుటుంబం బలహీనం. బలహీనుడి మనోభావాలతో బలవంతుడు బంతాట ఆడుకుంటాడు. తప్పులేదు. Might is right అయ్యేది యెపుడని? ఏ స్వార్ధ ప్రయోజనాలకో కొంతమంది అమ్ముడవుతారు లేదా యేవేవో భేదాలు పొడసూపి నీరుకార్చేస్తారు. బలహీనుల అపజయమంతా యిలాంటి చోటనే దాగివుంటుందనేది సత్యం. కుంకుమ పూల కోసం చేసే జీవన యుద్ధం లాంటిదే నాది కూడా అనిపిస్తూ వుంది. 


ఈ రోజు పేపర్లో వార్త దిగ్భ్రాంతపరిచింది. వంద ఆవులకు పైగానే చనిపోయాయి అని. పక్కనే వున్న పల్లెటూరులో దాతల విరాళాలతో గోశాల నడుస్తుంది. ఎవరో విషప్రయోగం చేసారనే వార్త చక్కర్లుకొడుతోంది. కాదంటాడు సంబంధిత శాఖాధికారి. మంత్రి కూడా. విషం యెలాగైనా ప్రవహించవచ్చు. ఆహారం నీరు నేల మాట ఆలోచన యెక్కడినుండైనా ఆఖరికి ప్రాణాలను కాపాడే మందు కూడా   విషాన్నే వెదజల్లవచ్చు. దాని తీర్మానం దానిది.

  

దేశమంతా పూజించాలనే గోజాతి  వందల కొద్దీ  మనుషుల లెక్కన కుక్కల లెక్కన శవాలై పడి వుండటం చూసి మనసు కలత చెందింది. కారణాలేవైనా యివాళ యివి యెల్లుండి ఈద్ సందర్భంగా తెగిపడే మరిన్ని గొర్రెలు, ఆవులు. మనుషుల మూఢ విశ్వాసాలకు ఆహారప్రీతికి బలైపోయే మూగజీవాలు. ఈ బలులకు అంతే లేదు.ఆ మాట ఎవరితోనైనా అంటే మీరు నాన్ వెజ్ తినరా అని అడుగుతారు. తినేవారికి జీవ హింస తప్పు కాదు.ఏ జంతువైనా తప్పుకాదు కదా అని నా ఆలోచన కూడా! మనుషులకు తినాలనుకున్నప్పుడు తప్ప మిగతాదంతా కారుణ్యమే.  పసి పిల్లను రేప్ చేసి చంపినవాడికి పడ్డ ఉరిశిక్ష కూడా సబబు కాదు అంటారు. మనుషులందరిదీ ఒకే ఆలోచనా విధానమైతే యెట్టా, ఒకరు అవునంటే యింకొకరు కాదనాలి. కాదనడానికి కారణమేమి ఉండనవసరం లేదు. కేవలం వ్యతిరేకించాలి అనేదే ముఖ్యం తప్ప   ఫ్లిప్ సైడ్ యెంతమాత్రం  కాదు.


మా ప్రక్కన ఎకరాలకు ఎకరాలు నివాస స్థలాలుగా విడగొట్టబడుతుంటే మేము చుట్టూరా పచ్చదనాన్ని కాపాడాలని కుండీలలోనైనా మొక్కలు నాటాలని తెగ తాపత్రయపడి నర్సరీల చుట్టూ తిరుగుతున్నాం. ముద్ద మందారాలు ముద్ద గన్నేరులు పూజకు పనికి రావండి అంది వొకామె. అసలు మన ఆలోచనలు  పనులే సమాజానికి పనికిరావండీ అని అందామని  పెదాలపైకి వచ్చి వాటిని వెనక్కి కుక్కుకున్నాను. మనుషులకు అన్నింటికీ మంచి కావాలి. ఈ మంచి మంచి మంచి అన్నది వినలేక చస్తున్నా. యూట్యూబ్  లో అనేకమంది చెప్పిన విషయాలని అరగదీసుకుంటూ విని వినీ కూడా అందరూ మంచికి క్రానిక్ అయిపోతున్నారు. మరి చెడు అంటే యేమిటో ఊహకి అందనంతగా మనుషులంతా యింత మంచాళ్ళు అయిపోతే మిగతా ప్రాణులు పర్యావరణం తట్టుకునేది యెట్లబ్బా !  


కుక్కలనుకుంటా, మంచి కోడిపెట్టనొకదాన్ని లాక్కొచ్చి పూపొదల దగ్గర వదిలేసి పోయాయి. ఆ మాటే వాచ్ మెన్ తో అంటే అయ్యో, పొద్దున్న నుండి నేను ప్లాస్టిక్ నల్ల కారీబేగ్ అనుకుంటున్నానండీ, కోస్తే కిలోన్నర మాసం ఈజీగా పడేది అంటూ వొంగి దాన్ని అందుకోబోయే సమయానికి టక్కున వెనుకింటావిడ గోడమీద ప్రత్యక్షం. కుక్కలు పట్టుకొచ్చినవే అయినా మంచిదో లేదో యేవన్నా రోగాలొచ్చి చస్తే బయటపడేస్తే లాక్కొచ్చాయో అంది. 


కోడి రెక్కను అందుకోబోయిన  వాచ్ మెన్ చేయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఆగిపోయింది. కాసేపు ఆ మాట యీ మాట మాట్లాడినాక ఆ కోడిని తీసుకెళ్ళి డస్ట్ బిన్ లో పడేసి రావయ్యా అని వాచ్ మెన్ ని అంటే .. చెత్తబండి వాళ్ళు వస్తారు కదండీ వాళ్ళు తీసేస్తారు అన్నాడు.  


వాళ్ళు రేపటికి రాకపోతే దాన్ని తీయకపోతే ఇదంతా వాసన కదా, తీసేయకూదడా అంటే అతని నుండి సమాధానమే లేదు. ఓర్నీఇతని ఆలోచనల్లో యెంత మార్పు అనుకుని ఆశ్చర్యపోవడం నావంతు. 


పూల సంచీ పట్టుకుని బండి తీయబోయుంటే  వాచ్ మెన్ “అయితే  మీరు రోజూ యీ పూలు కోసుళుతున్నారు దేవుడికి పెడతానికా అండీ? అయితే నేను పెడతాను లోపల దేవుడి పటం వుంది. మొన్న శుక్రవారం నాడు ఆ తీగకున్న పువ్వు ఈ తీగకున్నపువ్వు తెంపుకొచ్చి పెట్టాను.  పూలరేటు బాగా యెక్కువ వుందండీ, ఇక రేపటినుండి ఈ పూలే పెడతాను” అన్నాడు. 


హతసురాలినైపోయాను. ఇక్కడ కూడా పోటీ యేనా అని. 


రోజూ  తెల్లారేటప్పటికి పూల కోసం పరుగులు పెట్టడం పెద్ద పని అయిపోయింది నాకు. ద్విచక్రవాహనం పైనే అయినా పరుగులు తీయాల్సి వస్తుంది. ఎండెక్కితే పూల కోసం ప్రాకులాట మరింత యెక్కువైపోతుంది. అని  నా కొడుకుతో చెపుతుంటే .. "నువ్వేదో అహింసామూర్తిని అనుకుంటున్నావ్ కానీ నీలోనూ అసుర గుణం వుంది. కావాలంటే గుర్తు తెచ్చుకో ..చిన్నప్పుడు నాలుగైదు సార్లు నన్ను మజ్జిగకవ్వంతోనూ నా  బెల్ట్ తోనూ నన్నేనూ  కొట్టావ్" అన్నాడు. 


"దండం దశ గుణ భవేత్ అంటారు కదా బంగారం, అలా దండించి వుండకపోతే నువ్వింత కుదురుగా పెరిగేవాడివా చెప్పు" అని గడుసుగా అంటుంటే.."నేను నాపిల్లలను అసలు కొట్టకుండా పెంచుతా చూడు"అన్నాడు.


 "మంచిది, పైగా మీకక్కడ నియంత్రణ చేసే చట్టాల చుట్టాలున్నారు కదా" అన్నాను. కాసేపు నవ్వుకున్నాక  మళ్ళీ అన్నాడు "నీలోనూ రాక్షస గుణం వుంది"అని. నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే "అహింస ప్రధమం పుష్ఫం అని నీకు తెలియదా .. భగవంతుకి అర్పించే పూలను కూడా యే మాత్రం కనికరం లేకుండా  ప్రొద్దు ప్రొద్దున్నే విరిసీ విరియకుండానే త్రుంచి త్రుంచి ప్లాస్టిక్ సంచీలో కుక్కి కుక్కి ప్రిజ్ లో దాపెట్టి తీరికగా వీలున్నప్పుడు తీసి కర్ణ కఠోరంగా  అష్టోత్తరాలు వినిపిస్తూ దేవునికి పుష్పాభిషేకం చేయడం మాత్రం హింస కాదు" అన్నాడు.


 నాతో పాటు కరుణశ్రీ పుష్పవిలాపాన్ని బాగా విన్నవాడు. అలా ఆలోచించడంలో తప్పు లేదులే అనుకుంటూనే వెను వెంటనే నేనూ చిన్ని పువ్వా అని అందుకున్నాను. 


"భలే వుందిగా మళ్ళీ చెప్పమ్మా అన్నాడు.. 


"చిన్ని పూవే వాడెనా తన కన్నె వలపు వీడెనా తన చిన్నెలన్నియు వన్నెలన్నియు మన్నులో కోల్పోయెనా? కాంతునెరుగని కన్నె గాదా మొన్న మొన్ననే ముద్దు వల్లిని మొనలు దీరెనుగా!" 

….అని వినిపించి "పూల జన్మకు సాఫల్యం సిద్దించాలి. కేవలం వాటిని దేవుని పాదాల దగ్గరకు చేర్చే వాహకాన్ని నేను"అని  అన్నాను  నన్ను నేను సమర్ధించుకుంటూ. పూల బాసలు తెలిసిన వారికి మాటలయుద్దంలో సున్నితంగా గెలవడం బహుతేలిక కదా! మనసులో అనుకొంటిని కూడా ! 


ఫోన్ పెట్టేసాక తీరిగ్గా కాసేపు అసలు ఆనందమంటే యేమిటని ఆలోచిస్తూ కూర్చున్నా. పచ్చని కొమ్మన విలాసంగా  వూగుతున్న రాచిలక  కేరింతలను ఆహ్లాదంగా  చూస్తూ  .. 


అరె..ఆకాశంలో పాము యెగురుతుంది యేమిటబ్బా అని ఆశ్చర్యపోతూ  ఆలోచించి ఆలస్యంగా మెదడులో జ్ఞానరేఖ తళుక్కుమని  మెరిసి చిన్ని పిట్టలు గూడు కట్టుకోవడానికి కొబ్బరాకులను మోసుకెళుతున్నాయని ఆనందపడటం, రెండు పసుపు  పచ్చ సీతాకోక చిలుకలు గాలిలో వూరేగుతూనే  మూతి మూతి ఆనించుకుని వూసులాడుకోవడం, వుడుతొకటి పద్దతిగా పూలకొమ్మపై కూచుని విరిసిన పూవుని తెంపి మొదలు తిని చివరలను కిందకి వొదిలేయడం యివన్నీ చూస్తుండటం మాత్రం ఆనందం కాదూ.. ఏమిటో వెఱ్ఱి ముఖందాన్ని ఆనందాన్ని వల వేసి పట్టాలనుకోవడం మూర్ఖత్వం కాదూ! రకరకాల పూలు సేకరించి చేసే  పూజలో ఆనందం వుందా ఆరాధన వుందా అర్పణ వుందా కామితములు తప్ప. మనిషికి ఒక ఆశ తీరినాక మరొక ఆశ కాదు కాదు మూకుమ్మడి ఆశలు అవి నెరవేర్చమని ప్రార్ధనలు. నేను మానసికంగా యెదిగేదెన్నడూ? 


అన్నట్టు ఈ ఆనందాలకు తోడు మరో చిన్న ఆనందం జత చేరింది కాసేపటికి. దానికి వొక కథ వుంది. అది కూడా వినేయండి మరి.


మా పార్కింగ్ ప్లేస్ చుట్టూతా  నానా చెత్తంతా పేర్చబడివుంటుంది. అట్టపెట్టెలు పాత చెప్పులు విరిగిన కుర్చీలు పాత చీపురులు ఇంకా ఫాస్ట్ పుడ్ సెంటర్ కు సంబంధించిన సామానుతో పాత సామానుల గౌడన్ లా వుంటుంది తప్ప పార్కింగ్ ప్లేస్ లా వుండదు. ఆ సామానుల మధ్య పేరుకుపోయిన దమ్ముధూళి కారుకు కూడా చుట్టుకుని తళతళలాడే కారు అందాన్ని దెబ్బతీయడం సహించలేకపోయాను.  గత ఐదారునెలలుగా యిదే తీరు. పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ లా వుండాలి.. తప్ప గౌడన్ లా కాదు. అవన్నీ తీసేయమను అని వాచ్ మెన్ కి చెప్పాను. అతను విన్నాడు వినిపించాడో లేదో తెలియదు వినిపించినా పెడచెవిని పెట్టారో తెలియదు. 


నేనలా చిరాకు పడుతూనే వున్నా,రోజులు గడుస్తూనేవున్నాయి. వర్షాలు మొదలయ్యాక ఆ సరంజామా మధ్యనుండి పాములు మండ్రగబ్బలు రావడం మొదలయ్యాక పిల్లలున్న వాళ్ళం.ఇలా వుంటే మేముండలేము అని వాచ్ మెన్ అతని భార్య పాట పాడటం మొదలెట్టి కష్టాలన్నింటినీ చరణాలుగా మార్చి పదే పదే వినిపించారు. ఫలితంగా పార్కింగ్ ప్లేస్ కొంత శుభ్రపడింది. 


విసుక్కుంటాను అపుడపుడు. అసలు వీళ్ళ తీరు యింతే! మూడొందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు నీచు కంపు ఘమ ఘమ లాడే  మసాలా కంపులతో కాలక్షేపం చేస్తారు తప్ప పార్కింగ్ ప్లేస్ శుభ్రం చేయరు. పైగా అక్కడ కట్టెల పొయ్యలు పెట్టి డేగిసాలు డేగిసాలు బిర్యాని వండుతూ వంటసాల చేస్తున్నారు. ఏమన్నా అనకముందే మా పార్కింగ్ ప్లేసే కదండీ అనడం. అక్కడంతా అరాచకం. వొకటి రెండుసార్లు గట్టిగా మాట్లాడం వల్ల వాళ్ళు నన్ను చూస్తే ముఖం గండుగా పెట్టుకుని చూడటం మాములై పోయింది.  పులి మీద పుట్రలా నా చికాకును మరింత పెంచుతూ సీజన్ అయిపోగానే డ్రింక్స్ షాపు సరంజామా అంతా తెచ్చి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లో సర్దారు. నష్టపడ్డారంట. షాపు అద్దె కట్టలేక సామాన్లన్నీ అక్కడ  సర్దిపెట్టారని వాచ్ మెన్ సమాచారం.  కొంత సామాను  మాకు కేటాయించిన స్థలంలో సర్దుకున్నా చూసి చూడనట్టు ఊరుకున్నాను. అదీ వెనుకటి కథ. 


ఇక యిప్పటి ఆనందక్షణాలు లోకి వచ్చేద్దాం.


 ఈ రోజు ఈద్. లిప్ట్ దగ్గరలో కూర్చుని మాట్లాడుకుంటున్న టోపివాలాలను చూసి ఈద్ ముబారక్ చెప్పబోయి సందేహించాను.  అంతలో పది పన్నెండేళ్ళ పిల్లవాడు రెండు చేతుల మధ్య తూకం మిషన్ పెట్టుకుని.. "కొంచెం లిప్ట్ డోర్ తీస్తారా" అని అడిగాడు. లిఫ్ట్ డోర్ లు తెరిచి అతను వెళ్ళాల్సిన అంతస్తు నెంబర్ నొక్కి లిఫ్ట్ డోర్ మూస్తూ "ఈద్ ముబారక్ భాయీ" అన్నాను. పెద్ద వాళ్ళు మాటలాపి నావైపు చూస్తుంటే పిల్లవాడు “థాంక్స్ ఆంటీ “అన్నాడు రెండుసార్లు. రెండోసారి థాంక్స్ చెప్పినప్పుడు  “ఇట్స్ ఓకే” అన్నాను. 


పండుగ అందరిది. తీసుకోవడంలోనే వుందంతా. అసురులు భూసురులు అంతా మన ఆలోచనల్లోనే వున్నారు. తగు విధంగా బయటకు వస్తూ వుంటారంతే! అని అనుకున్నాను. 


రేపు శ్రావణ మంగళవారం. గౌరీ దేవిని పూలతో బాగా అలంకరించాలనే ఆలోచన వచ్చినదే తడవుగా రేపుదయం ఊహలలో మెదిలింది.  ప్రొద్దు ప్రొద్దుటే పూల చెట్లు పొదల చుట్టూ తిరుగుతూ యెవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని .. అని అబ్బురపడుతూ ప్రకృతిలో మమేకమైనట్టూ, పూజలు సేయ పూలు తెచ్చాను తీయరా తలుపులను రామా ..అని ఆర్తిగా పిలిచినట్టూ  పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు ..  అనుకుంటూ వుందునా, లేక నిన్ను అర్పించ హృదయపుష్పం చాలును కదా ప్రభూ/దేవీ  అంటూ ఎస్కేపిజం ప్రదర్శిస్తానో అన్నది రేపుదయానికి కానీ తేలదబ్బా. ఆలోచనల్లో మార్పు ఆచరణలోకి మారడం చాలా కష్టం. నా మటుకు నాకు నాణేనికి రెండోవైపు చూడటం సులువైన వ్యవహారమే!


కామెంట్‌లు లేవు: