ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రచయిత
తర్వాత ఏమి జరిగింది!? అతని జీవితంలోకి వెలుతురు యెలా ప్రవేశించింది!?
చేపలు చెప్పిన కవిత్వం విందామా... వెలుతురు నింపుకుందామా!?
మొదటి చేప చెప్పిన కవిత్వం..
“ ఇటునుంచి అటు చూసాను
మరల మరల వచ్చే మరణం
ఆ చివర కనిపించింది
అటునుంచి ఇటు చూసాను
ఒకే ఒక్కసారి వచ్చే జీవితం
ఈ చివర కనిపించింది
ఎటునుండి ఎటు చూడాలో
ఇప్పుడు అర్దమైంది”
ఇక రెండో చేప చెప్పిన కవిత
“ఈ భూమ్మీద
మూడొంతులు నీరు
ఒకవంతు నేలా ఉన్నాయి
కాబట్టి మనిషి కష్టాలూ దుఃఖమూ
అతడి మొత్తం జీవితంలోని
ఒకవంతు పరిధిలోకి మాత్రమే వస్తాయి
మిగతా మూడొంతుల్లోకి
మానవ దుఃఖ ప్రవేశాల్ని సృష్టి
నిషేదించింది
ఈ సృష్టి సౌకర్యం తెలియక
ఒకవంతు దుఃఖానికి
నాలుగురెట్లు రోదిస్తున్న మనుషులని చూసి
ఎనిమిది దిక్కులు
ఎప్పటికీ జాలిపడుతూనే ఉన్నాయి”
ఈ రెండు కవితలు చెప్పినది ఎవరో తెలుసా!?
చెరువులో చందమామ.
ఆత్మహత్య చేసుకోవాలని చెరువులోకి దూకిన మనిషిని చెరువులోని చందమామ రక్షించి వొడ్డుకు చేర్చి తన వొడిలో పడుకోబెట్టుకుని ఉపదేశం చేసింది.
అతను నమ్మలేదు తనను రక్షించింది చెరువులో చందమామ అంటే. కానీ పైకి చూస్తే ఆకాశంలో చందమామ కనబడుతూనే వుంటాడు. చెరువు వొడ్డున చందమామ వొడిలో తను. చందమామను నమ్మాడు. చందమామ చెప్పిన చేప చెప్పిన కవితలను మనసుతో విన్నాడు బుర్రతో ఆలోచించాడు. ఇంటికి తిరిగి పయనమయ్యాడు. చెరువులో చందమామ వెలుగుతూనే వున్నాడు.
ఆత్మహత్య చేసుకోవాలని వచ్చిన ఆ మనిషి రచయిత. గయ్యాళి భార్యతో జరిగిన గొడవలో ఆవేశంలో ఆమె యిలా అంటుంది.. ”సంపాదించడం చేతకాకపోతే ఎందులోనైనా దూకి చావొచ్చుగా, మమ్మల్నెందుకు చంపుతారు” అని భార్య నోరు జారిన తర్వాత తీవ్ర అశాంతితో అతనికి నిద్ర పట్టక చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని వస్తాడు. కానీ చెరువులోకి దూకబోయే సరికి అతని ఇద్దరు ఆడపిల్లలూ గుర్తుకువచ్చి ఆపని చేయలేక ఎన్ని బాధలు భరించి అయినా ఆ బిడ్డలకోసం బతకాలని నిర్ణయించుకుంటాడు.
ఎలాంటి బాధలనైనా భరించి జీవితాన్ని దాటేయడానికి మనిషి లోపలికి ఏదో వొక వెలుతురు ప్రవేశిస్తే బాగుండును అనుకుంటాడు.
చెప్పాను కదా... ఈ మనిషి ఒక రచయిత అని. చనిపోవడానికి చెరువు దగ్గరకు వచ్చి... తను చనిపోవడానికి చెరువులోకి దూకితే చందమామ రక్షించినట్లు కథ అల్లుకుని ఆ కథలో చేపలు చెప్పిన కవితలు తనకు అన్వయించుకుని తనలోకి వెలుతురు నింపుకుని ఇంటికి చేరడానికి వెనక్కి మళ్ళుతాడు కథలోని మనిషి. రచయిత కూడా. ఇందులో రచయిత తనకూ ఉపదేశం ఇచ్చుకుని పాఠకులకూ ఇచ్చాడు.
జీవితాన్ని ఈదలేక బ్రతుకు ముగించుకోవాలనుకునే ప్రతి నిరాశావాదికి ఏదో వొక ఆశ కొత్త వెలుతురు లోనికి ప్రవేశించాలని... అది ఆ మనిషిని ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడుతుందని హృద్యంగా చెప్పిన కథ ‘’వెలుతురు’’ ఈ కథా రచయిత భగవంతం. మనుషులు ఎవరైనా చేపలు చెప్పిన కవిత్వాన్ని మనసుపెట్టి అర్దం చేసుకుంటే తమంతటతామే ఆత్మహత్యా ప్రయత్నాలను విరమించుకుంటారు.
ఈ కథ నేను చదివి సంవత్సరంన్నర అయింది. ఈ కథ చదివిన సమయానికి నేను తీవ్రమైన వొత్తిడిలో వున్నాను. ఈ కథ నాలో కొత్త వెలుతురు నింపిందని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా.
మంచి కథ.. నిడివి రెండు పేజీలే! అద్భుతమైన కథ.
నమకాలీన పరిస్థితుల్లో బతుకు దుర్భరమై ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో... రచయితల భాద్యత గురించి P.Jyothi గారు సమాజంలో భాగం అవ్వాల్సిన భాద్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు..కథలు వ్రాసేసి తమ భాద్యత అయిపోయిందనుకోకుండా ప్రత్యక్ష సమాజంలో ఆత్మహత్యలను నివారించడం మన చుట్టూ వున్నవారిలో ఆ లక్షణాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయడం..లాంటి వాటిలో స్వచ్ఛందంగా పాల్గొనాలి అని.
అందుకే ఈ కథను గుర్తు చేసాను. కథ కోసం... మార్చి 2020 చినుకు మాసపత్రిక చూడాల్సిందే!
ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం సందర్భంగా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి