3, జనవరి 2026, శనివారం

జానకి కన్నుల జలధి తరంగం

 



జానకి కన్నుల జలధి తరంగం   - వనజ తాతినేని.


నిన్న నీకు సమీపంగా వచ్చివెళ్ళాను 

చిరుగాలి తరగలా నిను సృశించి వెళ్ళానేమో కూడా! 

ముందుగా.. నీ వద్దకు రావాలని వద్దనీ కూడా అనుకోలేదులే! 

రాసి పెట్టి వుంటే అదే జరుగుతుందని అనుకున్నా.


అంతకుముందు కూడా మన మధ్య

ఓ అంతర్గత సంభాషణ జరిగింది కూడా! 

అయినా నేను వస్తున్న సంగతి చెప్పనేలేదు.

నువ్వు అక్కడుంటేనేం నేనిక్కడుంటేనేం

తలపుల వారధి అనుక్షణం కలిపే వుంచుతుంది కదా! 


గడపటి కాలంలో…

జానకి కన్నుల జలధితరంగం రాముని మదిలో  

విరహ సముద్రం గురించి కొన్నిసార్లు డగ్గుతికతో  

చెప్పుకుని వుంటాం వందల వేలసార్లు మనసంతా పెట్టి 

విని వుంటాం. మూగగా రోదించి వుంటాం. 


ఇన్నేళ్ళ తర్వాతైనా.. 

కొన్ని నిమిషాలు ఎదురెదురుగా నిలబడి 

మర్యాదల సరిహద్దులు మధ్య చూసుకోవడం 

పలకరించుకోవడం ఇబ్బందిగా వుంటుంది. 

చిరుగు హృదయానికి అతుకు వేసుకున్నట్టు

సొట్ట పడిన పాత్రకు మాట్లు వేసుకోవడంలా వుంటుంది. 


నా రాకపోకల దారిలో రైలు మార్గం కనబడింది. 

కాసేపు అక్కడ ఆగాల్సివచ్చింది. 

ఎన్నటికీ కలవని ఆ పట్టాలను చూస్తూ.. 

కచ్చితంగా అవి మనమిద్దరమే అనుకున్నాను


అసలు నువ్వు నేనూ కలసి లేనిదెప్పుడూ.. 

ఇంతకు ముందు మనలా లక్షలమంది కూడా 

ఇలా చెప్పుకునే వుంటారు. 


You are out of my site 

You are out of my mind

In my heart అని.

నేనూ అదే చెబుతున్నా.. కినుక వహించకు.


ఇద్దరు మనుషులు కలిసి కుశలప్రశ్నలు వేసుకుని 

ఆత్మీయ కరచాలనం చేసుకుంటే కూడా.. 

ఎవరేం అనుకుంటారో .. ఊహాగానాలు చేస్తారో 

అని యోచించే పిరికిదాన్ని.

ఇలాంటి భీరువుని జన్మజన్మలకూ ప్రేమించకు. 

వదిలేయమన్నానని వదిలేయకు. 


ఇంటికి వెళ్ళాక అనుకున్నా..

బృందావనం విడిచి ద్వారక కు వెళ్ళిన కృష్ణుని 

తలుచుకుంటూ.. 

పొన్న చెట్టు నీడన  నిలబడి ఉన్న రాధ ని  నేను అని.

చండీ దాస్ సృజించిన ధీర రాధ ని కాను నేను అని.

ప్రియురాలిని తలపుల్లో నింపుకుని దుఃఖ కవిత్వాన్ని

రాసుకునే గాలీబ్ కవిని నేను అని.


పిరికి వారి స్వర్గం కవిత్వం అని నమ్మినదాన్ని 

ఈ కవితా మాలికలైనా ప్రేమతో స్వీకరించు! 

కనీసం  ఈ కవన సముద్రాన అయినా  

చేతులు కలిపి మునకలు వేద్దామా!? అంటాను

నాకు ధైర్యసాహసాలు యెక్కువే అని కూడా అంటాను హాస్యంగా

చిప్పిల్లుతున్న కన్నీరు సాక్షిగా.. ఇదంతా నువ్వేం పట్టించుకోకు

నీకసలు ఏమీ తెలియదు.మునిగిందీ తేలింది నేనే!


(2025 డిసెంబర్ 31 ది ఫెడరల్ తెలంగాణ డాట్ కామ్ లో ప్రచురితం)





కామెంట్‌లు లేవు: