అమ్మని బతకనిద్దాం
సీమంతాలే ఎరుగని తల్లులు
రహస్యంగా జార విడిచిన కన్నేతల్లులు
పాలు కారే పాలవెల్లిలు
మూగగా రోదించే.. మమతల పరవళ్ళు
అమ్మకానికి వెల్లువైన అమ్మలు
అమ్మకాలేని అమ్మలు..
ఇలా.. కొందరు "స్త్రీలు"
సృష్టిలో తీయనిది,మధురమైనది
అందమైనది,అద్భుతమైనది "స్త్రీ".
స్త్రీ లేకుంటే ప్రేమే లేదు.
ప్రేమ లేకుంటే సృష్టే లేదు.
అమ్మ లేకుంటే జన్మే లేదు.
జన్మ లేకుంటే జగమే లేదు.
జగమే లేకుంటే ఏమి లేదు..
శూన్యం తప్ప.
అటువంటి శూన్యాన్ని
జగమంత కుటుంబంగా చేసినది "అమ్మ" .
అటువంటి అమ్మ గొప్ప చెప్పటానికి..
ఏ భాష లోని పదాలకైనా పదును సరిపోతుందా..!?
నిన్న-నేడు-రేపు..ఎన్నటికి
అమ్మ నిన్నుపొదువుకునే ఉంటుంది
"అమ్మ"ని, "అవని" ని పదిలంగా కాపాడుకుంటేనే
మన ఉనికి పదిలం.
ఏ నవీన నాగరిక సోపానాలైనా..
ధ్వంసమైన సంస్కృతికి ఆనవాలు.
అమ్మలని వద్దనుకునే సంస్కృతి సిగ్గు చేటు..
చెత్త కుండీ దగ్గర
పసిపాప రోదన కని అడవు నుండి
తప్పి పోయిన పులి
ఆత్మ హత్య చేసుకుంది..
విషపు నాగు..
ఆత్మహుతి చేసుకుంది.
అమ్మ తనాన్ని..అమ్మని..
పదిలంగా కాపాడుకుందాం..
అవని పై అమ్మని..బ్రతకనిద్దాం..
1 కామెంట్:
అమ్మ తనం గురించి బాగా చెప్పారు.అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే !అమ్మతనం లోని కమ్మదనం కనుమరుగవుతున్న వేళ,చెత్త కుప్పల ప్రక్కన బిడ్డల్ని వదిలి వేయటం ,ఆడపిల్లల్నిగర్భంలోనే , పసితనం లోనే చంపి వెయ్యటం ఎటుపోతున్నాము.మీ ఆవేదనతో ఏకీభవిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి