(చిత్రం చూసి సరదాగా వ్రాసిన కవిత్వం .. ముఖ్యంగా అమాయకమైన అమ్మాయిల కోసం )
పులిస్వారీ
ప్రేమంటే రాతి ద్రవమని
ఎంత వొడ పోసినా తొలిపేసినా
బరువైనదేదో మిగిలి ఉంటుందని
తెలియని పద్మ పత్ర హృదయ ఆమె
వేష భూషణం ధరించివచ్చినా
వయసుకి ఒణుకొచ్చినా
మనసుకి జొరం వస్తూనే ఉంటుంది
వెలుగు కోసం రాత్రిని దున్నేస్తూ
స్వచ్చంగా లేదని ప్రేమని వడపోస్తూ
ఊహల బాటలో ముళ్ళు రాళ్ళేరేస్తూ
ప్రేమనే జీనుపై కూర్చుని
కలల ప్రయాణం చేస్తూంటుంది
వెన్నెల రాత్రులు, అమవాస చీకట్లు
ఋతుకన్యలు, సీతాకోక చిలుకలు
నేస్తాలై వెంబడిస్తూనే ఉంటాయి .
పెదవి ఒంపున జారిన మౌనరాగం
కంటిన మెరిసిన విధ్యుత్ తరంగం
జుగల్బందీ ..గా మారి బాట చూపుతాయి
అగాధాల అంచులపై స్వారీ చేస్తూ
మృత్యుకుహరాల ముంగిట్లో వాలే వలస పక్షి ఓలే
స్వేచ్చగా తరలిపోతుంటుంది
దాలిగుంటలో మరుగుతున్న నీళ్ళలా
ఓ వాంఛ తీవ్ర తరమయితే
ప్రయాణ ప్రమాదం
ప్రమాద ప్రయాణం ... రెంటికీ తేడా తెలియదు
మాటు వేసి అదును చూసి వేటు వేసే
పులి పంజా దెబ్బ తెలియజాలకా
ఓ వంచన కాలసర్పమై కాటు వేసేదాకా
కష్టమైనా ఇష్టంగా పులి స్వారీ చేస్తూనే ఉంటుంది.
ఆమె పులిస్వారీ చేస్తూనే ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి