2, ఏప్రిల్ 2015, గురువారం

దృష్టి కోణం

మన దృష్టి కోణం మారాల్సిన అవసరం ఉంది .


ఈ విషయం చెప్పడం మా ఇంటి నుంచే మొదలెడతాను .


అన్నయ్య - నేను - చెల్లి


మా చిన్నప్పటి సంగతి . నేను 5th class చదువుతున్నపటి సంగతి నాకు బాగా గుర్తు అన్నయ్య నేను ప్రతి రోజూ .. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళడానికి ముందు ప్రెవేట్ కి వెళ్ళే వాళ్ళం. ఉదయాన్నే లేచి పళ్ళు తోముకుని పరగడుపుతో పరుగెత్తేవాళ్ళం. సుమారు ఏడుగంటల వార్తలకి ముందు "మల్లాయ్'అనబడే మల్లికార్జున అన్నయ్యకి పావుసేరు గ్లాసు నిండా చిక్కటి పాలు , అలాంటి గ్లాస్ లోనే అందులో సగభాగం ఉన్న కాఫీని తీసుకుని వచ్చి ఇచ్చి మళ్ళీ మేము తాగేసిన ఖాళీ గ్లాసులని తీసుకుని వెళ్ళే వాడు .

నాకు పాలంటే అసలు ఇష్టం లేదు . nestle డబ్బాలలో వచ్చే కాఫీ పొడి మంచి సువాసనగా ఉండేది కాఫీ కూడా చాలా బావుండేది . అది నాకిష్టమని కాకుండానే .. అమ్మ అన్నయ్యకేమో పాలు,నాకేమో కాఫీ ఇవ్వడంలో తేడా అర్ధమయ్యేది కాదు. కాస్త బుర్రపెట్టి ఆలోచిన్చేదాన్ని . అలా ఆలోచించి ఆలోచించి ..చించి మా అమ్మని ఠపీ మని అడిగేసా ! అన్నయ్యకేందుకు పాలు ఇస్తున్నావ్ ,నాకెందుకు కాఫీ ఇస్తున్నావ్ ..అని


"అన్నయ్య మగపిల్లాడు బలంగా ఉండాలి. నువ్వేమో వాడికన్నా ఇప్పటికే ఎత్తు ఉన్నావ్ బలంగా ఉన్నావ్" ఎంతైనా మగ పిల్లాడేగా ఆన్నిటికి దిక్కు "అనేసింది .కాస్తో కూస్తో పుస్తకాలు చదివి ఆడపిల్లలకి చదువు కావాలి ,చదువు మూడో నేత్రం లాంటిదని బంధువులందరితో వాదనలాడి మా చదువులని అటక ఎక్కించకుండా కాపాడే అమ్మ ...కూడా అలా అందంటే .. ఆడ-మగ పిల్లల మధ్య తేడా ఎంత ఉందొ అప్పుడే అర్ధం అయ్యింది నాకు.


దాదాపు సమాజంలో చాలా మంది అభిప్రాయం ఆడపిల్లలు వేరు మగ పిల్లలు వేరు అని మరికొన్నేళ్ళకి గమనించాను . ఆ తేడాతోనే పెరిగాం కూడా ! నాకు పదహారేళ్ళ వయసప్పుడు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు తారుమారైతే మా వాళ్ళకి వెంటనే నాకు పెళ్లి చేయాలనే ఆలోచన ,అన్నయ్య చదువు మానేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయడానికి వెళ్ళడం జరిగిపోయాయి ,ఇంకో రెండేళ్ళకి ఇంటర్మీడియట్ చదువు ముగించి డిగ్రీ చదువుకి వెళ్ళడానికి అనేక అభ్యంతరాల మధ్య చెల్లెలు చిన్న పిల్లలకి పాఠాలు చెప్పే పంతులమ్మ అయి కుటుంబానికి సాయపడినప్పుడు పెద్దవాళ్ళ భాధ్యతారాహిత్యాన్ని నిర్మొహమాటంగా ప్రశించినప్పుడు ..నాకు గర్వంగా ఉండేది . ఎందులో ఆడపిల్లలు తక్కువ అని . ఇప్పటికి అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మా ఇంటి నుండి అందులో ఎలాంటి సందేహం లేదు కూడా !


పిల్లల పెంపకంలో వ్యత్యాసాలు చూపించడం నాకు అస్సలు నచ్చలేదు ,నాకు నచ్చలేదని ఏవీ జరగడం ఆగలేదనుకోండి 

smile emoticon

 . నేనైతే మాత్రం నాకు ఇద్దరు పిల్లలుంటే ఒకరు ఆడ- ఒకరు మగ అయితే ఇద్దరినీ ఒకే విధంగా పెంచి ఉండేదాన్ని .


ఆడపిల్లలు సైకిల్ తొక్కుతుంటే ,గోలీలాడుతుంటే , చెట్లేక్కుతుంటే ప్రతిసారి నువ్వు ఆడపిల్లవని గుర్తు చేయడం, మగ పిల్లాడని సమర్ధత లేకపోయినా ముందుకు నెట్టడం సమాజంలో ఇప్పటికి ఉన్న తేడాని గర్హించాలి .


అమ్మాయ్ ! నీకేం తెలియదు ,నువ్వూరుకో ..అని నలబైఅయిదేళ్ళు వచ్చిన కూతురిని మందలించే తల్లిదండ్రులు , నువ్వు నోర్మూసుకో ! నిన్నేవడైనా అడిగాడా ..ఉచిత సలహాలు ?  అని మొగుడు చించుకోవడం, అమ్మా ! ఇవన్నీ నీకవసరమా ..అని స్మూత్ గా చెప్పే కొడుకులు ..పితృస్వామ్య భావజాలానికి ప్రతీకలు . వీరికి ఆడవాళ్ళు ప్రశ్నిస్తే సహించలేరు , జ్ఞానవంతులైతే సహించలేరు, మీతో మేమూ సమానమంటే భరించలేరు . ఎప్పటికి అణుకువగా ఉండాలి , తమ సహాయాన్ని అర్ధించాలి ,తమ వెనుకే నడవాలి. పొరబాటున కూడా స్వతంత్ర్యభావాలని వ్యక్తీకరించకూడదు. ఇవే భావజాలాలు ఇంకా రాజ్యాలేలుతున్నాయి.


ఎవరైనా ఈ మూసదోరణిని ధిక్కరిస్తే ..వాళ్ళు అసలు ఆడవాళ్ళు కానే కాదు అని ముద్ర వేసేస్తారు . . ఆడుగడుగునా ఆధిపత్య భావజాలంతో తమ మాటే నెగ్గాలనే పంతం ఉన్నవారు ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు చట్ట సభల్లోనూ ..స్త్రీల వైఖరి చాలామందికి నచ్చదు.


ఆడవాళ్ళు హుందాగా,అమాయకంగా, అతివినయం చూపిస్తూ ఉంటే వారు మన సంస్కృతికి వారదులు . పురుషుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే ,ధిక్కరిస్తే... రౌడీ...లు . సమయమేదైనా, సందర్భమేదైనా ఆడవాళ్ళ బాహ్య ప్రవర్తన వెనుక అతర్లీనంగా వారిపై ఉండే అణచివేత ప్రభావం ఉంటుంది అది ఇల్లు అయినా చట్ట సభలైనా ! ప్రతి ప్రేలుడు వెనుక రాపిడి ఉంటుంది . ఆ కోణంలో మనం చూడటం నేర్చుకోవాలని నేన నుకుంటాను . ఒకవేళ ఆడవాళ్ళ ప్రవర్తన వెనుక అజ్ఞానం,అహంకారం,మితిమీరిన విశ్వాసం కూడా ఉండి ఉండవచ్చు ..నేను కాదని అనలేను. వ్యక్తుల బలహీనతలు అందరి వ్యక్తుల ఆలోచనాదోరణికి,ప్రవర్తనకి కొలమానం కాదు, అందరూ ఒకటి కూడా కాదు . అది గమనించాలి .


ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే .. ఇంకా ఇంకా ఆడ-మగ తేడా ఉంది ఉంటుంది కూడా ! అలాగే నాణేనికి రెండోవైపు ఉంటుంది అది చూడటం మర్చిపోవద్దు . అభిమానం పారదర్శకంగా చూడటానికి అడ్డుపడుతుంది . కనులకి క్రమ్ముకున్న పొరలు విప్పి చూడాలి అప్పుడే తెలుస్తుంది మన దృష్టి కోణం ఏమిటో !.


అలాగే స్త్రీ విద్య గురించి ... మా దగ్గర బంధువు ... ఇలా అన్నారు . 

"ఆడాళ్ళు చదివితే మాట వినరు " ఆమాట వినగానే నాకు చప్పున నవ్వు వచ్చింది ఇలా అనే మూర్ఖ శిఖామణులు 60% ఉన్నారు . అలా అనేవారి భార్యలు ఉద్యోగమో.. వ్యాపారమో .. చేస్తూనే ఉంటారు . కానీ సమాజంపై మాత్రం వారి అభిప్రాయం ఇలా ఉంటుంది 


ఆర్టికల్ 21 ఎ ప్రకారం 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్భంద విద్యాహక్కు ఆర్టికల్‌ 350(ఎ) ప్రకారం ప్రతి విద్యార్థి మాతృ భాషలో విద్యను అభ్యసించే హక్కు ఉంది.కానీ మన పిల్లలకి మాత్రుబాషలో విద్యావిధానం అమలు జరపడంలేదు . తల్లిదండ్రులే వేలం వెర్రిగా ఆంగ్లమాధ్యమం వైపు పరుగులు తీస్తున్నారు . ప్రభుత్వ పాఠశాలల్లోడ్రాప్ అవుట్స్ లేకుండా చేయడానికి 6- 14 మధ్య ఉన్న పిల్లలకి ఉచిత నిర్భంద విద్య అమలుచేయడానికి విద్యా కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు, సాంఘికసేవా సంస్థల కార్యకర్తలని భాగస్వామ్యం చేసారు గ్రామీణ ప్రాంతాలలో ఈ విద్యా కమిటీల పనితీరు మెరుగైనదనే చెప్పవచ్చు .

నిరక్షరాస్యతని పారద్రోలాలని అందరికి విద్య అందించాలని ప్రభుత్వం ఇంత కృషి చేస్తుంటే చదువుకుని పెద్ద పెద్ద ఉద్యాగాలు చేస్తూ "ఆడాళ్ళు చదివితే" అంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారు

లింగ బేధం లేకుండా అందరికి చదువు కావాలని కోరుకోవడం పోయి '"ఆడాళ్ళు" అణగద్రోక్కాలి అనే భావన ఎందుకో బొత్తిగా బోధపడటంలేదు . అసలు ఆడవాళ్ళు ఇంతలా చదువుకోవదానికి వెనుక ఎన్నెన్ని అభ్యంతరాలు ఎదుర్కొన్నారో .. తెలుసా? స్త్రీ విద్యాఆవశ్యకత గురించి 112 ఏళ్ళ క్రితమే భండారు అచ్చమాంబ గారు " ధన త్రయోదశి" అనే కథలో చెప్పారంట . వంద ఏళ్ళకే తిరోగమనంలో పడిందా మహిళా విద్య?

అయినా భార్యల చదువులని, సమాజంలో ఇతర స్త్రీల చదువులని ఎద్దేవా చేసే పురుష ప్రపంచం వారి వారి అక్క చెల్లెళ్ళు, వారి పుత్రికా సంతానం చదువుల పట్ల సానుకూల దృక్ఫదంతో ఉండటం కొంత సంతోషం కల్గించే విషయమే!

ఎవరైనా స్త్రీ విద్య గురించి స్త్రీల గురించి హేళనగా మాట్లాడితే ఒప్పుకోకండి . తగిన సమాధానం చెప్పాలి కదా !

స్త్రీ విద్యని ప్రోత్సహిస్తూ,గౌరవిస్తూ  ప్రతి ఒక్కరూ స్త్రీలకి సహకారం అందించాలని కోరుకుంటూ .. ఈ పోస్ట్ .


కామెంట్‌లు లేవు: