ఒక్క మాట - వంద వక్రభాష్యాలు
దీపికా పడుకునే మై చాయిస్ నాకేమి అభ్యంత్తరకరంగా అనిపించలేదు. చాలామంది ఎందుకంత ఉల్కిపడుతున్నారో కూడా తెలియదు . ఇదే మాట దీపిక పడుకునే కాకుండా ఓ..సంప్రదాయ నృత్యకళాకారిణి మాట్లాడి ఉంటె వేరే విధంగా వ్యాఖ్యానాలు ఉండవచ్చు కూడా ! ఇదంతా సినిమారంగంలో ఉన్న నటీనటుల విచ్చలవిడి తనంగా తీసుకునే సగటు మనుషుల ఆలోచనా విధానం. నటీనటులు,రాజకీయ నాయకులు,ఇంకా కొంతమంది పబ్లిక్ ఫిగర్ లు . వారిని అసభ్యంగా ఏమైనా అనవచ్చు ఒసేయ్, ఏమే ,ఎవతె ..ఇలా ఎలా అయినా అనవచ్చు అది స్వేచ్చ అనుకుంటారు (సంస్కార లోపం అని తెలియనంతగా ) అలాంటి అల్ప దృషి వారిపై ఉన్నప్పుడు వారి మాటలని అలాగే చూడటంలో ఆశ్చర్యం లేదు అంతకు మించి గౌరవాన్ని మనం ఆశించలేం !
గత ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క హీరోయిన్ అయినా అశ్లీలత లేకుండా నటించగల్గారా! కనీసం పబ్లిక్ లోకి వచ్చినప్పుడైనా సరైన వస్త్రధారణ చేసుకుంటున్నారా !? మన భారతీయ కుహనా సంస్కారుల ఆలోచనలో వారి పట్ల గౌరవభావం లేనప్పుడు వారి వ్యక్తిగత అభిప్రాయాలని ప్రకటించడం పట్ల ప్రజలకి గౌరవం కలుగదు గాక కలుగదు .
అలాగే స్వేచ్చకి విశృంఖలత్వానికి అతిసూక్ష్మాతిసూక్ష్మమైన సరిహద్దు రేఖ ఏమిటో అరకోడి మెదడు వారికి తట్టి చస్తే దీపికా వ్యాఖ్యలపై ఈ వక్రభాష్యాలుండవు.
జెండేర్ ఇన్సెన్సిటివిటి మఱ్ఱి ఊడల్లా విస్తరించి ఉన్న మన దేశంలో దీపిక మాటలు తేనే తుట్టని కదిలించినట్లే ! అంతకి మించి ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అంతగా పొసగదు కూడా ! స్వేచ్చగా ఉండాలనుకోవడం వేరు - సాధించగల్గడం వేరు .
నా దృష్టిలో సాధికారత అంటే .. దీపిక చెప్పిన మాటలే కాకుండా ... నా మెదడుతో నేనే ఆలోచించి నిర్ణయం తీసుకోగలగడం, నన్ను నేను పోషించుకోవడానికి కావాల్సిన ద్రవ్యాన్ని నేనే సంపాదించుకోవడం , స్త్రీపురుష బేధం లేని చదువు, ఉద్యోగం , వృత్తి,వ్యాపార రంగాలలో నిలదొక్కుకోవడం, నా హక్కులని నేను కాపాడుకోవడం, ఎవరైనా నాపై అధికారం చూపించినట్లయితే వారిని ప్రశ్నించడం ,దౌర్జన్యం జరిపితే ఎదురుతిరిగి వారిని ఎదుర్కోగల సత్తా చేకూర్చుకోవడం, భద్రతగా బ్రతకాలనుకోవడం, పురుష సహకారం పొందగల్గడం, దేశ విదేశాలలో ఒంటరిగా ప్రయాణాలు చేయగలగడం ..ఇలా ఎన్నో !
ప్రపంచవ్యాప్తంగా మహిళాసాధికారత ఎండమావి లాంటిదే ! ఏ దేశానికి సంబంధించి ఆ దేశంలో ఎన్నో అభ్యతరాలు ఉన్నవి . మనదేశంలో అయితే మరీనూ ! మన సాంస్కృతిక వారసత్వాలని మహిళలపై తోసేసి అధిక శాతం పురుషులు మాత్రం పైలా పచ్చీసుగా తిరిగే వారు ఉన్నంతకాలం .. ఒక్క మాట కి వంద వక్రభాష్యాలు తప్పవు మరి .
(అది వ్యాపార ప్రకటన కావచ్చు లేదా అంతరంగ ఆవిష్కరణ కావచ్చు ఏదైనా దాడిని ఎదుర్కోవాల్సిందే )
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి