ఒక నెల రోజుల క్రిందట నా కొడుకు అమెరికా ప్రయాణానికి కావాల్సినవన్నీ సర్దుతూ ఉన్నప్పుడు కానీ ..విమానం ఎక్కించడానికి విమానాశ్రయం వద్దకి వెళ్లినప్పుడు కానీ నేను కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు జంటగా ఇంకొకరిని ఇచ్చి పంపానుకదా! మీరిరువురూ కష్టసుఖాలలో ఒకొరికొకరు తోడుంటూ ... లోకాలని ఏలండి బంగారు .. అని మనసులో దీవించాను, వారిని చల్లగా చూడమని భగవంతుని ప్రార్దించాను.
మళ్ళీ నెల రోజుల తర్వాత అలవాటుగా ఈ రోజు వీడియో కాల్ లో నా కొడుకుతో మాట్లాడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఎందుకంటే .. అప్పుడే ఇక్కడ ఒక ఉద్యోగం దొరికి ఉంటే, లేదా చిన్నపాటి వ్యాపారం చేసుకోవడానికి సరిపడా బ్యాంకు లోన్ లభించి ఉంటె నా కొడుకుని విదేశం వైపు కన్నెత్తి చూడనిచ్చేదాన్నే కాదు . నిజం . (నా బిడ్డని నేను చూడాలనుకున్నప్పుడు ఒక పూట లేదా ఒక రోజు ప్రయాణంలో కలిసే విధంగా ఉంటె బాగుండును అని నేను అనుకుంటాను . ఎన్నో ఆంక్షల మధ్య వేరొక దేశంలో ఉన్న నా కొడుకు ఇంటికి అతిధిగా వెళ్లాలని నేను అస్సలు అనుకోను ).
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి వాళ్ళ వాళ్ళ బ్రతుకులపై, భద్రతపై, జీవనోపాధి పై భరోసాలేదు. పిల్లలకి చదువులు లేవు, చదువులుంటే సరైన ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు .. ఉన్నదంతా ఒకటే పెట్టుబడిదారి వ్యవస్థ. లంచగొండితనం, రాజకీయనాయుల స్వార్ధం. నాలుగేళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చిన నా బిడ్డ ఇక్కడ పరిస్థితులని చూసి తను అమెరికా వెళ్ళే నాటి పరిస్థితులని తలచుకుని బేరీజు వేసుకుని అప్పటికన్నా మరీ అధ్వానంగా తయారయిన రాష్ట్రాన్ని, దేశాన్ని, ముఖ్యంగా మా బెజవాడ వీధుల్ని, రహదారులని చూసి, భూబకాసురాలని, చిన్నాభిన్నమైన ఆర్ధిక పరిస్థితులని చూసి దిగులుపడ్డాడు . వెళ్ళాలి కదా, వెళ్ళక తప్పదు కదా! అన్నాడు . బ్రతుకు పోరాటం అంటే అదేనేమో ! ఇక్కడ వ్యక్తిగతమైన ఇబ్బంది కన్నా సామాజిక పరిస్థితులని బట్టి భీతిల్లిపోయాడు . ఇంకో అయిదేళ్ళు చూస్తానమ్మా ! ఇక్కడ ఇలాగే ఉంటె .. నేను ఇక ఇండియా రాను, అక్కడే సెటిల్ అయిపోతాను అన్నాడు .
నా కొడుకే కాదు మా బంధువులబ్బాయి నాణ్యమైన విద్య చదువుకుని మంచి మార్కులతో ఇంజినీరింగ్ చదువుకుని క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపిక కాక సంవత్సరం పాటు చిన్నపాటి ఉద్యోగం దొరకక .. అమెరికాకి ప్రయాణమయ్యాడు. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ నుండి గత నెల రోజుల కాలంలో ఎన్ని వేలమంది అమెరికాకు ప్రయాణ మయ్యారో ! ఇక్కడ జీవించే బలహీన వర్గాలకి ఎలాగు భరోసాలేదు . ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి భరోసా లేదు . ఎవరు కల్గించగలరు .. ఇక్కడ జీవించడానికి భరోసా ?
విశ్వకవి ఠాగూర్ వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-
ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు'
నమ్మకమీయరా స్వామీ నిర్భయమీయరా..స్వామీ .. (చంద్రబోస్ సాహిత్యం గుర్తుకొచ్చింది }
నమ్మకమీయరా స్వామి
నిర్భయమీయరా స్వామి
సన్మార్గమేదో చూపరా స్వామీ
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా
చెడుకు ఎదురు పోరాడే
మంచినెప్పుడూ కాపాడే
పిడుగు దేహమీయరా ప్రభూ
ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాచగుణం ప్రభూ
వినయం విలువలనీయరా
లోన నిజం గుర్తించే
పైన భ్రమను గమనించే
సూక్ష్మ నేత్రమీయరా స్వామీ
సర్వమందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనకై
స్వామీ సమయం స్వచ్ఛతనీయరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి