1, అక్టోబర్ 2015, గురువారం

జారిపోయిన రోజు



పేదరాసి పెద్దమ్మ ఆరబోసిన పసుపు కుంకుమలని
దొంగిలించిన సూరీడు తేలి తేలి వస్తుంటే
శుభోదయాల సారాన్ని మనసు నిండా నింపేసుకుంటున్నా
అంబరాన పక్షులేసిన దారుల గుండా
చూపు సారిస్తూ వలసపోయిన  పక్షిలా నువ్వు
తిరిగి వస్తావేమోనని దారితప్పుతావని కాపుగాస్తున్నా
ఆకాశపు వృక్షం విస్తరించిన మేఘపు కొమ్మ జాలి జూపి
కాసిని చినుకులు రాల్చితే సేదదీరుతున్నా
తెలి మేఘాల మధ్యగా కనబడుతున్న నక్షత్రాలని లెక్కిస్తూ
కోయని దోసెడు జాజి పూల దాపున మలిగిన కమలాన్ని అవుతున్నా
గాలి మోసుకొస్తున్న కబుర్లని
ఒడలెల్లా ఒదిగి శ్రావ్య  రవంగా మార్చిన వెదురు
నీలా తీపి గాయమై సలుపుతున్నా సహిస్తున్నా
కనురెప్పల దాహానికి వాయిదా వేసి
రాత్రి కొసన వేలాడే నెలవంకతో
జామంతా సహవాసం చేస్తూనే ఉంటున్నా
గూడు లేని గువ్వనై తలుపులు మోయని గుమ్మాన్నై
తెరిచిన హృదయంతో విరహమయ్యానో విఫలమయ్యానో
కానీ సగం కోసం సహనమవుతున్నా
మోహ భ్రాంతికి గురయ్యావో
కాలసర్పం వేసిన కాటుకి బలి అయ్యావో
జాడ మాత్రం తెలియక రోజులో జారిపోయా
జాలిగా మరో రోజుకి మారిపోయానలాగే ..



కామెంట్‌లు లేవు: