13, అక్టోబర్ 2015, మంగళవారం

ద్వారాల మాట

మొన్నటి దాకా మనసు భోషాణానికి

గోడలే తప్ప కిటికీలు దర్వాజాలు లేని వాళ్ళం

ఇప్పుడిప్పుడే అక్షర గవాక్షం గుండా 

హరితవనాల వైపు తొంగి చూస్తున్న వాళ్ళం



పాక్షికంగానో పరోక్షంగానో బాధలనుభవించడం తప్ప

భావాలని వెల్లడించుకోలేని వాళ్ళం

రోజుకొకసారైనా ప్రేమ జడివానలో

తడ వాలనుకుంటున్న వాళ్ళం

కురిసినప్పుడైనా

దోసేడైనా దాచుకోలేని అసహాయురాళ్ళం



మెడలపై కత్తిని పెడుతున్నా

కత్తి మొన మీద అస్తిత్వాన్ని వెదుక్కుంటున్న వాళ్ళం

సంపదలనిచ్చే హక్కులధికారాలకంటే

బంధాలనల్లుతూ ప్రేమార్హతకై తపించిన వాళ్ళం



మొన్న మొన్నటిలాగానే అంత కన్నా ఎక్కువగానే

ఇప్పుడు మా విలువల్ని త్రుంచేసి వలువలూడ్చేసి

అరచేతిలో కావాల్సిన అవయాన్ని చూసుకుంటూన్నావ్

కామోద్దీపం కావించుకుంటూ ఆకలిగొన్న రాకాసిలా

మామధ్య సంచరిస్తున్నావ్ .



తినాలనుకున్నప్పుడల్లా ఇన్స్టంట్ పుడ్ లా ఓ ఆడతనాన్ని

చేజేక్కించుకునాలనుకునే వేటగాడి మనస్తత్వాన్ని

నిల్వాహారాలని వెచ్చజేసుకునే ఓవెన్ లా

ఇంట్లో ఓ ఆడది ఉండాలనుకునే అవసరాల ఆలోచనకి నీళ్ళొదలి చూడు

సత్యాన్ని చూడు …



మీకన్నా ఒక ద్వారం ఎక్కువున్న వాళ్ళం

ఆ ద్వారం నుండే లోకాన్ని చూడటానికి అనుమతిచ్చిన వాళ్ళం

నిత్య సాంగత్యపు గాయాల సలుపు తీరకుండానే

జీవనౌషదాన్ని పూసుకుంటూ యంత్రాల్లా పరిగెడుతున్నవాళ్ళం


ద్వారాల పైనే ఉన్న మీ కాముక దృష్టిని మరల్చి

360 డిగ్రీలకోణంతో చూపులని విశాలత్త్వంతో నింపండి

ఎటు తిప్పినా ఇద్దరం కలసి తిరగాల్సిన వాళ్ళమే కదా

ఎదురుపడుతూ నైనా వెనకగానైనా నడవాల్సిన వాళ్ళమే కదా

ప్రేమతోనూ చెపుతున్నాం .. పరుషంగానూ చెపుతున్నాం

ఎలా చెప్పినా మీరిది వినే తీరాలి ఇది రుధిర ద్వారాల మాట

ఇది దశమ ద్వారాల మాట.


13/10/2025.

కామెంట్‌లు లేవు: