1, ఫిబ్రవరి 2018, గురువారం

ఒకే వొక ముఖం

ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ నానదు అనేది ఒట్టి అబద్దం. అందరి నోట్లోనూ నానదు. 

వజ్ర కఠోరమైన సంస్కారముంటే యే గింజైనా నానుతుందని నా నమ్మకం. 

విచారమేమిటంటే ..స్నేహాల ముసుగులో ఆత్మీయుల ముసుగులో నడిపే సంభాషణలు కూడా రక్షణ లేనివే ! సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి మాటలు చేరవేయడమే కాదు ధ్వని ముద్రీకరించి, దృశ్యాలతో సహా చిత్రీకరించి ఇంకొకరికి చేరవేయడం వినోదం అయిపోయింది. కొందరి స్వభావం అలాంటిదని తెలిసినా నేను భయపడను. ఎందుకంటే నా నాలుకెప్పుడూ నా నియంత్రణలోనే ఉంటుంది. ఒకవేళ అవసరమైతే సదరు వ్యక్తినే నిలబెట్టి విషయం మాట్లాడే,తేల్చుకునే ముక్కుసూటి తత్త్వం  గనుక ఎవరి దగ్గరో వాపోవడాలు,మధ్యవర్తిత్వాలు నడపమనడాలు నా స్వభావానికి తగని విషయాలు. కొంతమంది కాలక్షేపపు కబుర్లలో నన్ను ఉదహరించడాలు నాకు నచ్చవు. వ్యక్తులని గొప్పగా  గుడ్డిగా ఆరాధించడమనేది వ్యక్తిత్వ హననం అనేది నా నిశ్చితాభిప్రాయం. విపరీతంగా మోసి మోసి తర్వాత .."అయ్యో " వీళ్ళు ఇలాంటివారా ..అని హఠాత్తుగా ఆశ్చర్యపోవడమనే బారిన పడకుండా ఎవరి వారు కాపాడుకోవడం ముందుగా వారి కర్తవ్యం. మనవాళ్ళు అనుకున్న వాళ్ళే మన నెత్తిన చేతిని పెట్టడానికి తయారుగా ఉంటారనేది నా అనుభం కూడా ! 

ఈ రోజు కొద్దిగా బాధకల్గింది ..అందుకే ఆ బాధకి అక్షర రూపమిచ్చి నా డైరీ లో వ్రాసుకుంటున్నాను.. 

నా అనుభవం ఆవేశం ఆవేదన మరికొందరికి ఉండొచ్చు రావచ్చు ..  కాలక్షేపం చేయండి కానీ ఈ కాలక్షేపపు కబుర్లు అటు ఇటు మోయకండి. పిల్లికి వినోదం ఎలుకకి ప్రాణ సంకటం అన్నది మనమందరం యెరుగుదం కదా ! అందరూ జాగరూకులై ఉండండి నేస్తులారా .. 

ఉన్నది ఒకే ముఖం

ఖచ్చితంగా నాకుంది వొకే ముఖం... 

ఎక్కడెంత స్పందించాలో ఎక్కడెలాటి ముఖం పెట్టాలో... 

ఆ తూనికలేమిటో,ఆ కొలతలేమితో బొత్తిగా నాకు తెలియదప్పా .. 

నాకు తెలిసిందల్లా మనసు ఆలోచన యేదైతే వుందో అచ్చంగా అదే ముఖంపై నాట్యమాడటం.. వీపుపై ముఖాలు మోసే అలవాటు నాకు లేదు కాబట్టి .. 

ఇష్టమైతే లెక్కలో ఉండండి. లేకపోతే వో మీట నొక్కితే సరిపోయే ! అంతర్జాతీయ పరిధిలో చర్చలు,సొల్లు కబుర్లు ఎందుకు ? మీ మీ కథలు కవితలు యేకంగా భూ గ్రహాన్నే ఉద్దరించాలనుకునే వ్రాతలు రాసుకునే సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు ?

వ్రాతల్లో కాదు మెదడుతో హృదయంతో యెదుగుదల చూపండి. అదే మనిషి తనం. భగవాన్ రూపం  





కామెంట్‌లు లేవు: