15, ఫిబ్రవరి 2018, గురువారం

సౌందర్యానుభవం

అందమైన హృదయం ఉన్న వారికి అన్నీ అందంగానే కనబడతాయని నానుడి.అలాగే అందంగా కనబడని వాటిని నిర్విద్దంగా తిరస్కరిస్తారని కూడా అంటూంటారు.

"అతనెంత అందంగా ఉంటాడు" అని స్త్రీలు  బహిరంగంగా ప్రకటించడం కూడా నిషిద్దం కొన్ని కుటుంబాలలో అయితే  చూపులతో ఉరి వేసేస్తారు మరి.

ఈ మధ్య నా ఫ్రెండ్ ఇలా అంది " వాడు అందంగా ఉండేవారికి వలవేస్తాడు ఆ అందాన్ని అడ్డంగా వాడి పారేసిన తర్వాత త్రోసి పడేస్తాడు"  అని. ఆమె భర్త "మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువా!  కాస్త అందంగా కనబడితే చాలు చటుక్కున ప్రేమించేస్తారు.డ్రెస్ మార్చినట్లు మార్చి పడేస్తారు" అని. మాటలతో యుద్ధం చేసుకుంటున్న వారిని వారి పాటికి వదిలేసి  అసలీ అందానికి ప్రేమకి అవినాభావన సంబంధం ఏమిటీ ?  అని ఆలోచించసాగాను.

అసలందమంటే యేమిటీ ? అందాన్ని నిర్వచించలేము. కవులయితే పోలికలతో చెప్పగలరేమో ! ఒకోసారి కవి దృష్టి పథానికి  కూడా గోచరించని నిర్మలమైన సౌందర్యాన్ని కనులు..  కాదు కాదు  హృదయం మాత్రమే కనుగొనగలవు. ఓ సినీ కవి తన ఇంటర్ వ్యూ లో తన జీవన ప్రయాణంలో అందమైన అమ్మాయి కనబడినప్పుడల్లా ఆమెతో పీకల్లోతు  ప్రేమలో పడిపోయానని చెపుతుంటే "వీడి ముఖం తగలెయ్య, ఎంతమందిని ప్రేమిస్తావురా, అసలు వీడికి పెళ్ళై౦దో  లేదో , అయితే దాని బొచ్చెలో రాయే! ఇలాంటివాడిని కట్టుకున్నందుకు" అని  మా ప్రక్కింటావిడ తిడుతుంటే  ఉలికి పడి బాహ్యప్రపంచాలోకి వచ్చిపడ్డాను. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు కదా అని.

నిజానికి ఆ కవి మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది నాకు.  అలా అందాన్ని తమదైన సృహతో గుర్తించి,ఆస్వాదిస్తే తప్ప వారు అలా అన్నేసి  ప్రేమ,శృంగార  గీతాలు వ్రాయలేరని  అనిపిస్తూ ఉంటుంది . కొందరు పురుషులు స్త్రీలందరిలోనూ అమ్మని చూస్తే కొందరు పురుషులు కావ్యనాయకి ని చూస్తుంటారు అది వారిలో ఉన్న చిత్తప్రవృత్తులే కారణం అని అర్ధం చేసుకోవచ్చు .   బయటకి చెప్పం కానీ  ఎవరికీ వారు స్వీయానుభవంలో,అనుభూతిలో సౌందర్యాన్ని తదాత్మయం చెంది ఉంటారు.

ఇక నా స్వీయానుభం  ఒకటి చెప్పదలచానిపుడు. సౌందర్యాన్ని అలౌకిక ఆనందంతో చవిచూసిన సందర్భానికి అక్షర రూపం ఇది. ఒకానొక ప్రయాణంలో ..చీరాల టు విజయవాడ ప్రయాణంలో వేసవి కాలం సాయంత్రపు యె౦డకూడా నిప్పులు చెరుగుతున్నట్లే ఉన్న సమయంలో ట్రాక్ మరమత్తుల నిమిత్తం  రైలు వేగం నెమ్మదించింది.  ధారాళంగా కారుతున్న చెమట చికాకుల మధ్య ఓ మధురమైన కంఠ స్వరం వలవేసి నన్ను అటువైపు లాక్కెళ్ళింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. "రాగాల సిగలోన సిరి మల్లివి,సంగీత గగనాన జాబిల్లివి " అంటూ అతను పాటనందుకున్నాడు. నేను అప్రయత్నంగా సీట్ నుండి లేచి తర్వాత ఆ సీట్  ఎవరో ఆక్రమిస్తారని తెలిసికూడా అతని  వైపుకి వెళ్లాను. అతను అర్ధనిమీలిత నేత్రాలతో యేపాటి బిడియం సంకోచం లేకుండా యేవాయిద్యాల సహకారం లేకుండా ఆనందంగా  పాడుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ పాటలు వింటూ అనేక గళమాధుర్యాన్ని  వీనుల విందుగా ఆస్వాదించిన నేను  ఆ సమయంలో అంతటి మధుర స్వరం అంతకు ముందెన్నడూ విన్నట్టు ఇక ముందు కూడా వింటానో లేదో అన్నట్టుగా  ఆ రసస్వాదనలో మునిగి పోయాను. పాట వెంబడి పాట. ఆ స్వర తుషారానికి వడ్లపూడి మల్లెల పరిమళం అల్లుకున్నట్లు అనిపించింది. రైలు వేగమందుకుని ఎప్పుడు కృష్ణా కెనాల్ పైకి వచ్చిందో తెలియదు. ఆ ఇనుప వంతెనపై రైలు నడిచే  కరకు శబ్దాలు  అతని గాన ఝరికి అడ్డుకట్ట వేసినట్లైంది   నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడ్డాను. "చాలా మంచి వాయిస్, చక్కని పాటలు పాడారు, థాంక్స్ అండీ " అన్నాను. అతని పెదాలు సన్నగా నవ్వాయి. ఇకపై సంభాషణ ఏమీ జరగలేదు. అతను నేను  చేస్తున్న  ప్రయాణం ఇంకా కొనసాగితే బాగుండుననిపించింది. స్నేహితులతో మాట్లాడుతున్నాప్పుడు అతని మాటలు విన్నాను. పాట పాడినట్లే ఉన్నాయి  ఆ మాటలు కూడా ! తర్వాత విజయవాడలో దిగిపోయి జనప్రవాహంలో కలిసిపోయాం.

యేళ్ళు గడిచినా అతని అందాన్ని ఇప్పటికీ కళ్ళ ముందుకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను ..ఊహూ..అసలు సాధ్యం కాదు. అతనిప్పటికీ నాకు గుర్తు ఉండటానికి కారణం గళ సౌందర్యమేనా?  అతని అందం విశాలమైన ఆ కనుదోయలో ఆ కనుబొమలలోనూ ఉందా ?  ఆ గడ్డం నొక్కులో ఉందా ? నవ్వకపోయినా నవ్వినట్లు ఉండే ముఖ కళవళికలోనా, నవ్వినప్పుడు కనబడే తెల్లని పలువరసలోనా ..లేకపోతే తలుపుకి ఆనుకుని ఒంటి కాలితో నిలబడిన తీరులోన (style) .. లేకపోతే అతను కనులు మూసి తన్మయత్వంతో పాట పాడే తీరులోనా లేక గళమాధుర్యంలోనా ,లేక  రమేష్ నాయుడు స్వరాలలోన,   డాక్టర్ సి.నారాయణరెడ్డి పదాలలోన, లేక  ఆ పాటలో నటించిన శ్రీవిద్యలో అణువణువునా నిండిన అందం గుర్తుకు వచ్చిన జ్ఞాపకం లోనా ? ఏమో ..అసలు చెప్పలేను . ఆనాటి పాట  బాలు గళాన్ని  మరిపింపజేసింది ఎంతగా అంటే ..అప్పుడతను పాడిన  పాటలని ఎపుడైనా   వింటున్నప్పుడల్లా  అతని సమ్మోహన గళమే   ఈ స్వరాలై  నన్ను వేటాడుతూ ఉంటుంది. బహుశా సౌందర్యమంటే అదే అనుకుంటాను.

ఇప్పటికీ ఎప్పటికీ అతని రూపు రేఖలని నేను వర్ణించలేను. కానీ నేను మేధోపరంగానూ,మనసుతోనూ, హృదయం తోనూ అనుభంలోకి వచ్చిన సౌందర్యం అది. హటాత్తుగా అతనెదురైనా అతన్ని గుర్తించలేకపోవచ్చు కూడా !  ఆ క్షణంలో ఆ అనంత సౌందర్యాన్ని నేను అనుభవించాను.  ఆ క్షణాలని అపురూపంగా  ప్రేమించాను. ప్రేమించిన అనుభూతిని అనుభవించాను. సౌందర్యం సహజమైనది,  సంస్కారం వంతమైనది. సాన పెట్టినది కావడం వలెనే అది వజ్రంలా కాంతులీనుతూ ఇప్పటికి అదీ సున్నితంగా కోసేస్తూ ఉంటుంది అని నా అనుభవం. నదిలా ప్రవహించే సంగీతంలో అతని స్వరమొక పిల్ల కెరటం.  అయాచితంగా అతని గానామృతాన్ని ఆస్వాదించడమే ఒక సౌందర్యానుభవం.

ఒక అనుభూతి,ఒక ఆస్వాదన.ఒక జీవితానుభవం  ..ఇదే అనంత సౌందర్యం నా దృష్టిలో .  క్షణ క్షణం పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది.లోలోపలికి ఇంకి పోతూనే ఉంటుంది. కనబడే  వెలుగై కాంతులీనుతూ  ఉంటుంది.
.

కామెంట్‌లు లేవు: