11, మార్చి 2018, ఆదివారం

రెప్పలతడి

ఈ రోజు సాక్షి Funday లో ఈ వారం కథ గా ప్రచురితమైన కథ "రెప్పల తడి" చదవండి .. 



 సత్యవతికి అర్ధరాత్రి లోనే  మెలుకువ వచ్చింది. శతాయుస్షులో సగం  దాటబోతున్నా  ఆమె   కాలాన్నిసద్వినియోగంగా  అరగదీయడం  ఇప్పటికీ నేర్చుకోలేకపోయానని బాధపడుతుంది   వొళ్ళు అరగదీసి, యిల్లు అరగదీసి, పాత్రలరగదీసి ఇంకా  పుస్తకాలనిఛానల్స్ ని  కీ బోర్డ్ ని  కూడా అరగదీసి చివరికి  మంచాన్ని అరగదీద్దామంటే అసలు చేతనవడం లేదని తనని తాను తిట్టుకుంది. పోనీ కాసేపు రోడ్డు నరగదీద్డామనుకుంటే రోడ్డుపై తిరిగే  మనుషుల ముఖాలు అరిగిపోతాయేమోనని ముఖం చాటు చేసుకుని వెళ్లిపోతుంటారని చివుక్కుమనే మనసుని రాయి చేసుకుంటుంది.   
మళ్ళీ అంతలోనే  ఆలోచన చేస్తూ "అవునూ, మనసెందుకు అరిగిపోకుండా రాతి కవచంలా ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంది.  వెధవ మనసని వెధవ మనసు" అని   తిట్టుకుంటూ  బెడ్ రూమ్ లో నుండి  బయటకొచ్చి  సోఫాలో  కూలబడి యాంత్రికంగా టీవి ఆన్ చేసింది
తనువూ మనసులు ఆలోచనలు అన్నీ కలిసి విడదీయరాని అనుబంధం ఉన్న అర్ధనారీశ్వరతత్వానికి రూపమే భార్యాభర్తల బంధం అంటూ చెపుతున్నాడు ఓ పెద్దాయన. ఇన్ని కలవడం అసలు సాధ్యమయ్యే విషయమేనా?  యిగో లు సాటిస్ పై చేయడం కోసం ప్రతి క్షణం నటించడమే కదా ! ఏనాడూ భర్త  తన మనసు తీరాన్ని  ఓ అనురాగపు అలలా తాకనేలేదు. సాంగత్యమంతా హృదయ ఘోష.   విరగొట్టి వెళ్ళిన మనసుకి కట్టుకట్టే నాధుడు లేనే లేడనట్టు విరక్తిగా బతికింది అని తోచగానే ఎందుకో చప్పున దుఃఖం ముంచుకొచ్చింది.  అప్పటికప్పుడు గడచిన జీవితాన్ని తరచి చూసుకుంది.
*********** 
ఈ యేడుపు ఏడవలేదనేగా  ఆరోజు అందరూ విచిత్రంగా చూసారు. "చెట్టంత మనిషి చనిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు, యే౦ మనిషో పాడు" అంటూ చెవులు కొరుక్కున్నారంట కూడా. భావోద్వేగాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి అప్పుడెందుకు రాలేదో నేను మాత్రం యే౦ చెప్పగలను, అయినా  ఇంకెక్కడ ఉంటుంది దుఃఖం? ఇన్నేళ్ళ దుఃఖం లోలోపలికి యింకిపోయి కడలి లెక్కన లోన  దాగుంది. దాన్ని తోడిపోసే చేద యెవరి చేతిలోనో,చేష్టలోనో  అతని చావులోనో ఎందుకుంటుంది.? కనుల పొరల మధ్య  పొంగుతున్న నదులని ఆపడం ఎవరికైనా సాధ్యమా ! అని గొంతెత్తి ప్రశ్నించాలనిపించిది సత్యవతికి. 
 అసలీ  భార్య /భర్త అనే  బంధాన్ని  మోయడంలోనే   ఏదో తెలియని ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి తనం ఉందేమో! అందుకే అతగాడు  తన  బంధంలో వూపిరాడక యింకొక బంధంలో యిరుక్కుని అనుభవించినన్నాళ్ళు జీవితాన్ని  అనుభవించి కాటికి కాళ్ళు జాపుకుని కళ్ళెదురుగా వచ్చి పడి  అప్పుడు కూడా సాధిస్తుంటే క్షణ క్షణానికోసారి  చచ్చి మరలా పుట్టి  నిత్యం చస్తూ బ్రతుకుతూ వుండటంలో యె౦త నరకయాతన అనుభవించిందో ఈ యిరుగుపోరుగమ్మలకి తెలుసా అసలు? రేపో మాపో అన్నట్లున్న మనిషి కూడా  కక్ష, కార్పణ్యంతో  యేదో ఒక వొంకతో సాధిస్తుంటే,  పూట పూటకి రుచికరంగా వండి  పెట్టడం లేదని వొంటికాలి మీద మీదకి వస్తుంటే తనమీద తనకే జాలి కల్గేది. కనీసం అప్పుడైనా అభిమానం ముంచుకొచ్చి  కఠినంగా ఉండాలన్నా సిగ్గేసేది. నీరు పల్లమెరిగినట్లు బంధాల బరువులన్నీ  భరించే వారిపైనే నాట్యమాడుతుంటాయనుకుని  అన్నీ భరిస్తూ   అతని ఆఖరి శ్వాస కూడా సుతిమెత్తగా గాలిలో కలిసిపోయే వరమివ్వమని కోరుకుంది  తప్ప ఆ  ప్రాణిని  ఇంకో విధంగా యాతనకి  గురి చేయాలని అనుకోలేదు కదా అననుకుంటుంది స్వగతంలో.
అర్ధాంగిగా  విలువ సంపాదించుకోవడమంటే జనం ఇచ్చే విలువ లెక్కించుకుంటూ  తనకి తానూ ఏ విధమైన విలువనిచ్చుకోకుండా వ్యక్తిత్వాన్ని అస్థిత్వాన్ని హననం  చేసుకోవడన్నమాట  అని లోలోపల   గొణుక్కు౦టుంది.  ఎవరైనా ఏమి వదిలి వెళతారు? కాసిని నవ్వులనోఆకాంక్షలనో, దుఖాలనో, అవమానాలనో ఇంకా చెప్పాలంటే  బిడ్డల రూపంలో అహంకారపు జాడల్ని వదిలి వెళతారు. ఇప్పుడు నాకు మిగిలింది విధవరాలు  అన్న అవమానమేగా అంటుంది సన్నిహితులతో.  
మూన్నెళ్ళ తర్వాత ఒక  సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోసుకోవాలని గేటు బయటకి వెళ్ళగానే ఎదురింటి ఆమె ముఖంపై విసురుగా తలుపేసుకుంది.  సత్యవతికి బయటకి వెళ్ళాలంటే అవమానపడాలనే భయమేస్తుంది. ఆ సమయంలో గతంలో  ప్రక్కింట్లో ఉండే కుమారి గారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆమె  చిన్న మామగారు అనారోగ్యంతో బాధపడుతూ తాను భార్య కన్నా  ముందుగానే మరణిస్తానని గ్రహించి  ఆమెకి ఎన్నో ముందు జాగ్రత్తలు చెప్పారంట. కొడుకు కూతురు ఎవరింటికి వెళ్లొద్దు. నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని నిన్ను జీతం భత్యం లేని పని మనిషిని చేసేస్తారు అలాగే బొట్టు గాజులు తీయడం లాంటివి ఏమీ చేయొద్దు, ఇరుగు పొరుగు యెలా ప్రవర్తించినా ఏమీ పట్టించుకోవద్దు. మొక్కలని, కుక్కలని పెంచుకో  ప్రేమ, ప్రశాంతత కల్గుతాయి అనిఆయన సత్యం చెప్పారు అనిపించింది సత్యవతికి. కుమారి గారు చెప్పిన మాటలతో పాటు బుజ్జోడు  మరీ జ్ఞాపకం వస్తున్నాడు. హృదయపు చెమ్మ రెప్పల మధ్యకి  ఎప్పుడు ప్రాకిందో మరి. నాలుగు నెలలు గతంలో వెళ్ళింది. 
 ************ 
సత్యవతి ఇంట్లో యేకాకిగా మిగిలిపోయిన రోజులవి. పదిమంది ఉండాల్సిన ఆ  పెద్ద ఇంట్లో పలకరించే వాళ్లే కరువు. ఎవరికీ వాళ్లకి  భర్త చనిపోయిన మనిషికి సాయంగా ఉండటానికి  ఏదో అయిష్టత. దానిని కప్పి పుచ్చుకోవాడానికి అనేక రకాలుగా బొంకటాలు. మాటలు కూడా కరువే, ఫ్రీ జిబి డేటా పుణ్యమా అని ఒకవేళ యెవరైనా  పలకరించినా తిన్నావా, పడుకున్నావా లాంటి చచ్చు పుచ్చు ప్రశ్నలు తప్ప మాటల్లో మనసుండదు. ఎప్పుడు లైన్ కట్టవుతుందా యెదురుచూడటమే. కురిసినప్పుడు విసుక్కోవడం యె౦డినప్పుడు యెదురుచూపు చూడటం లాంటిదే  ఈ పలకరింపు కూడా ! అనుకునేది 
 ఆ  మధ్య బుజ్జోడితో స్నేహం ఆమెకి  హాయిగా ఉండేది. పార్కింగ్ ప్లేస్లో పడుకోబెట్టిన భర్త  శవం ప్రక్కన ఆమె  మౌనంగా కూర్చున్నప్పుడు కూడా  వచ్చి  ఆమె  ప్రక్కనే  మౌనంగా కాసేపు నిలబడి వెళ్ళాడు. మా బంధం ఏనాటిదో! ఈ జన్మలో కొన్ని నెలల ముందేగా కలిసింది మరి. బహుశా  పూర్వజన్మ వాసనలు వదలవేమో అని ఆలోచించేది. అయినా  ఈ వాసనలే కదూ మనుషులని తమ దేహాల చుట్టూ తిప్పుకుంటాయి. చివరాఖరికి  గుంతలో పాతిపెట్టమనో ,అగ్ని కీలలకి ఆహుతిమ్మనో కూడా  తరుముతూ ఉంటాయి అని భారంగా నిట్టూర్చేది  కూడా ! అన్నట్టు బుజ్జోడు ఎవరో చెప్పలేదు కదూముందు  వాడి గురించి  చెప్పాలి మీకు. ఏడాది క్రితం వాడు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాడికి మెడలో బెల్ట్ కూడా ఉంది, వాడిని  పెంచుకుంటున్న ఎవరో తీసుకొచ్చికావాలని  బయట వదిలేసి వెళ్ళిన బాపతు. వాచ్ మెన్ సుబ్బారావు వాడిని దగ్గరకి  తీసి  పెంచుతున్నాడు.పసి బిడ్డలనే కర్కశంగా ముళ్ళపొదలలో విసురుతున్న ఈ రోజుల్లో కుక్కని వదిలేయడం ఏమంత పెద్ద విషయం లేమ్మా అన్నాడు కూడా !
 బుజ్జోడు అమాయకమైన చూపులతో  యెవరినయినా కట్టిపడేస్తాడు, విశ్వాసం కూడా అట్టే ప్రదర్శించని శరీర భాష. ఎవరిని పల్లెత్తి పలకరించిన పాపాన పోడు.గేట్  దగ్గర పడుకుని  వచ్చేపోయే వాళ్ళని మౌన మునిలా చూస్తూ ఉంటాడు. అరవటం రాదు సరికదా  కరవడం అనే సహజ లక్షణాన్ని మర్చిపోయాడు. రోజూ ఖాళీ పాల బాటిల్స్ వేసిన సంచీ  గేట్ కి తగిలించి రావాడనికి వెళ్ళినప్పుడు సత్యవతి  వాడిని బుజ్జోడా  అని పిలుస్తూ  ముద్దు జేసేది  అయినా వాడిలో చలనం ఉండేది కాదు. వాడికి పట్టడానికి పాలు యెవరు పోస్తున్నారు? అనడిగి  ఎప్పుడైనా నేను  కూడా  కాసిని పాలు పోస్తానని చెప్పింది కానీ  ఏ రోజు వాడి గిన్నెలో  చెంచా పాలు పోసిన పాపాన పోలేదు. స్వతహాగా ఆమెకెందుకో బుజ్జాడి జాతిని చూస్తే విముఖత. మనుషులు తల్లిదండ్రులని, పిల్లలని కూడా చూడనంత ప్రేమగా అపురూపంగా చూస్తున్నందుకు మనుషులపై ఏర్పడిన విముఖత వాటిపై  అసహ్యంగా రూపాంతరం చెందిందనుకుంటా.
ఒకరోజు బుజ్జోడి  గిన్నె నిండా  విరిగిపోయిన పాలు ఆ గిన్నె చుట్టూ  ముసురుకున్న ఈగలు గమనించి బుజ్జోడు ఏడి  అని అడిగింది.  అదిగోనమ్మా, కారు కింద అన్నాడు సుబ్బారావు. ఒంగి చూస్తే నలతగా నేలకి అంటుకుని పడుకున్నాడు. జాలేసింది ఆమెకి, కూర్చుని వాడిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తల నిమిరి "ఏంటమ్మా వొంట్లో బాగోలేదా, జ్వరమొచ్చిందా ? సుబ్బారావు హాస్పిటల్ కి తీసుకు వెళతాడు, వెళ్ళు .  ముందు కొంచెం పాలు తాగు" అంటూ కాసేపు వాడిని చేత్తో పరామర్చించి దగ్గరలో ఉన్న డాక్టర్ అడ్రెస్స్ చెప్పి వాక్సిన్ కూడా వేయించమని చెప్పి వచ్చింది.
ఇక అది మొదలు రోజు పాల బాటిల్స్ సంచీ ఇవ్వడానికిఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి  సుబ్బారావు వచ్చినప్పుడల్లా అతని వెనుకే సత్యవతి  ఇంటికి వచ్చేవాడు. "బుజ్జోడా, నువ్వూ వచ్చావా? పాలు తాగుతావా అని అడిగేదిఅలా వారి  పరిచయం పెరిగింది. ఆమె  సాయంత్రం పూట వాకింగ్ కి వెళుతున్నప్పుడో , కూరగాయలు కొనడానికి  రోడ్డు మీదకి  వచ్చినప్పుడో  ఆమె  వెంట బయటకి వచ్చేవాడు . వాడి జాతి వాళ్ళని  చూస్తే  వాడికి భయంమనుషుల కాళ్ళ ప్రక్కన  నక్కి నక్కి ఉండటమో  లేకపోతే లోపలకి పరిగెత్తడమో చేసేవాడుఒకోసారి సత్యవతి ప్రక్కనే ఉందన్న  ధైర్యంతో వాడి జాతి ప్రాణులని చూసి గయ్ గయ్ మని అరుస్తూ అచ్చు వెనుక బోలెడంత  ప్రజా బలముందని రెచ్చిపోయి మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిలా తన ప్రతాపం చూపేవాడు. గేటు ఎదురుగుగా  రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టు దగ్గరకి వెళ్ళి కాలెత్తి పనికానిచ్చుకుని ఆనందాన్ని అనుభవించేవాడు. వాడు వేస్తున్న వేషాలు  ఆటకాయి చేష్టలు చూస్తూ  నవ్వుకుంటూ రోజూ  కాసేపు నన్ను నేనే  గేటుకి కట్టేసుకోవాల్సిందే  అని మురుసుకునేది సత్యవతి.
  
ఎప్పుడైనా ఆమె  కిందకి వెళ్ళని రోజున ఆ ఫ్లోర్ కి వచ్చి లిఫ్ట్ కి  గేటు కి మధ్య పచార్లు చేసేవాడే తప్ప గేటు దాటి లోపలికి అడుగు  కూడా వేసేవాడు కాదు. అప్పుడు సత్యవతికి  చప్పున  మల్లీశ్వరి చెప్పిన క్యాటరింగ్  రావు గాడు గుర్తుకొచ్చేవాడు. ఒంటరి స్త్రీలున్న ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి కదా అని  ఎవరింట్లోకి బడితే వాళ్ళింట్లోకి అనుమతి లేకుండా జోరబడే కుక్క అని అని తిట్టి అంతలోనే నాలిక కరుచుకుని బుజ్జోడుని తక్కువచేయకూడదనే ఇంగితం పాటించేది.
  బుజ్జోడు మధ్యాహ్నసమయాలలో మెట్లమీదే  పడుకుని ఉండేవాడు.  కర్ణేoద్రియాలకి కఠోరంగా వినిపించే మనిషి శబ్దాలకన్నా మౌనంగా వినిపించే భాషే  మేలనుకుని పుస్తకమో ఫోనో పట్టుకుని మెట్లమీదకి వెళ్లి కూర్చునేది  సత్యవతి .  బుజ్జోడి కళ్ళలోకి ఆమె  వాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ వుండే వాళ్ళు.
ఒకరోజు బయటకి వెళుతూ "బుజ్జోడా బయటకి వెళదాం వస్తావా" అని అడిగింది . మౌనంగా గేటుదాకా వచ్చాడు కానీ యెక్కి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. బండి స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్లిందో లేదో భౌ భౌ మని అరుస్తూ రయ్యిన బండెనుక పరిగెత్తాడు. ఆమె  కొంచెం ఆశ్చర్యంగా వాడి వైపు చూస్తూ రానన్నావు కదా, ఇప్పుడు కొత్తగా అరుస్తున్నావు ఏమిటి అనడుగుతూనే బండిని పోనిస్తుండగా బండి ముందుకు పరిగెత్తి అడ్డంగా నిలబడ్డాడు. ఆమె  బండి ఆపేసి కాలు క్రింద వుంచి "రా !ఎక్కి కూర్చో" అని చోటిచ్చింది. బండి ఎక్కకుండా  కాలు ప్రక్కన నిలబడి భౌ భౌ మని  అరుస్తున్నాడు మళ్ళీ .   "రానప్పుడు  యెందుకనవసరంగా అరుస్తావ్? ఏముంది ఇక్కడ అంటూ  ప్రక్కకి వొంగి చూసుకుని  ఏదో ఆలోచనలో ఉండి  బండి స్టాండ్ తీయకుండానే ముందుకు వెళుతున్నానని వెంబడించి  హెచ్చరిక చేసినందుకు  సత్యవతి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. బుజ్జోడి పై ప్రేమ ముంచుకొచ్చింది, బండి స్టాండ్ వేసి  వాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులాడింది.

ఆరోజు ఏం జరిగిందంటే ఇలాగే  తెల్లవారుఝామునే మెలుకువ  వచ్చిన సత్యవతికి   బుజ్జోడుని వెంటనే చూడాలనిపించిందిఇప్పుడేం చేస్తున్నాడో అనుకుంటూ మళ్ళీ అంతలోనే  ఇంకేంజేస్తాడు? మెట్లమీద మునగదీసుకుని పడుకుని యేదైనా అలికిడి వినగానే కళ్ళని మాత్రమే తిప్పుతూ చూస్తూడంటం తప్ప. వాడిని చూసి  పదిహేను రోజులవుతుంది. రోజూ గ్రిల్ల్స్ బయట నిలబడి చూసి చూసి వెళ్లిపోతున్నాడంట. వాడికి నాకు ఏదో తెలియని అనుబంధం. వాడిని అప్పటికప్పుడే చూడాలనిపించింది సత్యవతికి.  ఆత్రుతగా మెట్లమీదుగా క్రిందికి దిగి వస్తూ   ఈ రోజు  ఎవరేమనుకున్నా సరే వాకింగ్ ఫ్రెండ్స్ తనని చూసి పలకరించకుండా గబా గబా ముందుకు వెళ్ళిపోయినా సరే  బుజ్జోడితో కలిసి వాకింగ్ కి వెళ్లి రావాలని  నిశ్చయించుకుంది.  
ఎవరికీ వారు  స్వేచ్చలేదు స్వాతంత్ర్యం లేదు అని వాపోవడం ఎందుకు ? కావాలని తీసుకుంటే  ఏమవుతుంది ? నాలుగు రోజులు  చెవులు కొరుక్కుంటారు అంతేగా ? అయినా సమాజానికి ఇంకేమి పని లేదా తన పనులు మానేసి  ఎంతసేపూ ప్రక్కనోడు ఏం చేస్తున్నాడోనని భూతద్దం పెట్టి మరీ చూస్తుందా ఏమిటీ? అనుకుంటూ మెట్లు దిగుతుంటే ఆ చప్పుడుకి తలతిప్పి చూసిన బుజ్జోడు మెల్లిగా లేచి నించున్నాడువాడి తలమీద చెయ్యేసి "యేరా బుజ్జోడా! ఇన్నాళ్ళు నేను కనబలేదని దిగులుపెట్టుకున్నావా? నేను వచ్చేసాలే, మనిమిద్దరం రోజూ వాకింగ్ కి వెళ్లి వద్దాం,సరేనా " అన్జెప్పి ఆమె  మెట్లు దిగుతుంటే బుజ్జోడు ఆమె  వెనుకే వచ్చేసాడు.

మెయిన్ గేట్ తీసుకుని రోడ్డు మీదకి  వచ్చారు వారిద్దరూఎక్కడో వర్షం కురుస్తున్న ఆనవాలు. ఉత్తరపు వైపు నుండి వచ్చే చల్లని గాలి శరీరాన్ని తాకగానే గత ఇరవై రోజుల నుండి  నాలుగు గోడల మధ్య బిగించి ఉన్న సంకెళ్ళ నుండి  విముక్తిని కల్గినట్లు అనిపించింది సత్యవతికి. ఆమె  ముందూ,  వెనుక బుజ్జోడు  పల్చటి వెన్నెల వెలుగులో అక్కడక్కడా వెలిగే దీపాల వెలుగులో  నున్నటి తారు రోడ్డు మీద రెండు రౌండ్ లు తిరిగారుఅప్పటికే కొంతమంది వాకింగ్ చేస్తూ కనబడారు. వాళ్లకి ఎదురవకుండా ప్రక్క వీధిలోకి వెళ్లి మెయిన్ రోడ్ మీదగా వాళ్ళ  సందులోకి వచ్చేసరికి  సన్నగా చినుకులు పడసాగాయి.  సత్యవతి తలపైకెత్తి చూస్తే నల్లని మబ్బులకోపు. "వానొచ్చేసిందిరా, అయినా  సరే మనం ఇంటికి వెళ్లొద్దు. వానలో తడుస్తూ ఇంకో రౌండ్ వెళ్లివద్దాం" అంది ఉత్సాహంగా. రోడ్డు ప్రక్కనే  ఉన్న గుంటలో  నిన్న కురిసిన వర్షం నీరు చేరుకొని అది చిన్న చెరువుని తలపిస్తుంది. అందులో వీధి కుక్క ఒకటి పడుకుని ఉంది . బుజ్జోడు ప్రక్కనే ఆమె ఉందనే  దైర్యంతో ఆ కుక్క మీద కయ్యానికి వెళ్ళాడుఆ కుక్క కూడా అక్కడ నుండి లేవడం ఇష్టం లేదన్నట్టుగా లేచి  గయ్యిమని  అరుస్తూ రోడ్డు దాటి అవతలకి వెళ్ళింది దాన్ని వెంబడిస్తూ వెళ్ళబోతున్న బుజ్జోడి మీదకి విజయ పాల వ్యాన్  యమదూతలా  దూసుకొచ్చేసింది.  
సత్యవతికి  ఆపాదమస్తకం వణికిపోయింది. వ్యాన్ ఆగకుండానే ముందుకు వెళ్ళింది. ఆమె  పరుగెత్తి కెళ్ళి బుజ్జోడి  శరీరాన్ని చేతుల్లోకి తీసుకుంది. దెబ్బలేమీ తగల్లేదులే అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న మరుక్షణంలోనే  బుజ్జోడు  ఆమె  కళ్ళలోకి చూస్తూ పెంచే చేతికి తెలియకుండా  త్రుంచే చేయి ఒకటి  అదృశ్యంగా అనుసరిస్తూనే ఉంటుంది కదా అన్నట్లుగా  తలవాల్చేసాడుచుట్టూ జనం పోగయ్యారు, అయ్యో పాపం అంటూ జాలి కురిపించి  కొద్దిగా ముందుకు సాగి రోజూలాగానే  రోడ్డ్డు ప్రక్క ఇళ్ళల్లో పూసిన పూలని కొమ్మలొంచి మరీ కోసి క్యారీ బ్యాగ్ లో వేసుకుంటూ ముందుకు సాగిపోయారు. మరికొంతమంది స్త్రీలు వాకింగ్ కని  వస్తూ వొళ్ళో బుజ్జోడిని పెట్టుకుని కూర్చున్నఆమె  దగ్గర ఆగి సానుభూతి చూపసాగారు.   అప్పటిదాకా కురుస్తున్న పాల వెన్నెలంతా కరిగి జడి వాన అయిందా అన్నట్టు వర్షం మొదలైందిభర్త చనిపోయినప్పుడు కంటెంట చుక్క కూడా కార్చని  ఈమె యిప్పుడు  యె౦దుకిలా యేడుస్తుందని  అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూస్తున్నారుఆ వర్షంలా  ఆమె  దుఃఖం  కూడా కురుస్తూనే ఉంది
 ***************
అది జరిగి రెండు నెలలైనా   కేవలం బుజ్జోడి జ్ఞాపకాలతోనే  మళ్ళీ  అటో ఇటో  ధారలై  కురుస్తూనే ఉంది  రెప్పలని  తడుపుతూనే ఉంది.  తడి ఆరని జ్ఞాపకాలలో సత్యవతి బ్రతుకుతూనే ఉంది. 


కామెంట్‌లు లేవు: