1, జనవరి 2011, శనివారం

శాంతిమంత్రం




             శాంతిమంత్రం

   
ఆ దళ మైతేనేం  ఈ దళ మైతేనేం  
నేపధ్య..పూజ మాత్రం ఒకటే.! 
దళాలన్నీ చెట్టు  ప్రాణం  నుండి పుట్టుకొచ్చినవే 
కొమ్మలు వేరైనా కాండం ఒక్కటే!
మూలాలు మాత్రం.
అణగారిన భావాలనుండి..
బలంగా పాతుకున్నవే 

విరామాల ప్రస్తావనలో
దళాలన్నీ వర్ణాలని మరచి.. 
అలంకారాలన్నీ విడిచి.. 
సహజ వర్ణాన్ని స్వీకరించి 
జన జాగృతికై నిర్భీతిగా 
మిట్ట మధ్యానపు సూరీళ్ళు లా
నలుచెరుగుల నుండి
నడివీదుల్లోకి నడచి వస్తుంటే  
అడవితల్లి దారంతా  పూల వర్షంతో  
మౌనంగా అభిషేకించింది 

విరామాల ప్రస్తావనలో..
విజయం సాధించింది.. 
సాంత్వన  చేకూర్చుకుంది.. 
మాత్రం తల్లులే.!

చీకటి మాటున..
అంగ బలం, అర్ధ బలం
ఆయుధ బలం సమకూర్చుకుని
రాజ్యం కుటిల యత్నాలని 
తిప్పి కొట్టి.. కర్కశ తుపాకులకి
ప్రాణాలని బలి ఇచ్చి 
తల్లులకి గుండె కోతని మిగిల్చిన
గిరి పుత్రుల తో పాటు  పోయింది,  పోతున్నది..
అమాయుకుల ప్రాణ  బలం .

శాంతి మంత్రం  కొంగ జపంలా మారితే
శాంతి  కపోతాలకి రెక్కలార్చుకునేదుకు
నెలవు దేవాలయ గోపురాలు కాదు..
తుపాకీ బారేళ్ళు
ఇప్పుడు.. శాంతి మంత్రానికి  నిలువెత్తు  సాక్ష్యం  
అస్తమిస్తున్నసూర్యునిలోని అరుణిమా
మరునాటికి   నెత్తురోడుతూ
మరింత ఎర్రబారే  ఉద్యమ సంద్రమా

1 కామెంట్‌:

Dr.Suryanarayana Vulimiri చెప్పారు...

వనజ వనమాలి గారు, మీ కవిత బాగుంది. మీరు సిరివెన్నెల గారు తీసుకున్న శీర్షిక చాల దగ్గరగా వుంది. మంచి కవిత.