మొన్నెప్పుడో … ఇతరులను గాయపరిచిన ఆయుధాన్ని తీసుకుని నది వద్దకు వెళ్లాను శుభ్రపరుద్దామని.
నది అదృశ్యమైంది. కన్నీటితో హృదయాన్ని మనో మాలిన్యాలను శుభ్రం చేసుకుని చేతులు జోడించి వేడుకున్నాను
నది ప్రత్యక్షమైనది చిరుగాలితో దీవించి
నది నీ ఆత్మ అని వినిపించింది
ఎవరో తత్వవేత్త చెప్పినట్టు దాతృత్వంలోను ఇతరులకు సహాయపడటంలోను నదిలా నీవు వుండు అన్న. వాక్యం గుర్తొచ్చింది
అంతలో..
పొడారిపోయిన కళ్ళతో నీళ్ళు నింపుకుని వెళ్దామని నది తీరానికి వచ్చారు కొందరు. దప్పిక తీర్చకోవడానికి నీళ్ళతో పాటు కాసింత తడిని మనసుకు అద్దుకుని మరికొంత కన్నీళ్ళను నింపుకుని వెళ్ళారు.
మరికొందరు తీరాన కూర్చుని నదిని చిత్రించారు ప్రకృతి అంత సహజంగా
మంద్రంగా అలల సవ్వడిని కెరటాల ధ్వని ని తరంగ ధ్వని ని కూడా సృష్టించారు.
కానీ నదిని భూమి వలె ఇంకించుకోలేక పారిపోయారు. వడిగా ప్రవహించలేక పోతారు నదిలా. అలసి చతికిలపడిపోతారు నాలా.
పద.. ముందుకు పద అంది నది.
వంతెనలు పడవలు నౌకలు కనబడని నది వెంట ప్రయాణం దీర్ఘంగా సాగుతున్నట్లు వుంది.
ఆరు నదులు దాటలేని నేను
విసుగుపడి రెక్కలు తొడిగి నదిని మోసుకుని సముద్రాలు ఎడారులు కీకారణ్యాలు దాటాను.
మోయలేక నదిని పదిలంగా ఓ చోట జారవిడిచాను.
భూమిని తొలిచి నీరు పైకి లాగకముందు అనాది జీవుల ప్రాణాధారం నది కాదూ.. అది అందరిది కదూ..
మరలా నది వెంట నేను. పద పద.. ముందుకు పద అంటుంది.
సాగుతూ వుండటమే గమ్యం చేరేదాకా.
17/09/2022 -09:20 PM.
(ఏ కళ అయినా నదిలా ప్రవహిస్తూనే వుంటుంది. అంతూ దరి లేనిది. ఇంకా ఎక్కడో చోట మిగిలేవుంటుంది. తడి తడిగా..
నాలో కవిత్వపు తడి.. ఆరిపోలేదు.. నది నడకల సాక్షిగా)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి