శ్రీమతి వనజ తాతినేని గారు వ్రాసిన చెరగని గీత కథ చదివినప్పుడు చిన్న ముల్లు గుండెలో గుచ్చుకున్న భావన కలిగింది. సాధారణంగా స్వదేశాలు వదిలి వివిధ దేశాలకి వచ్చిన వాళ్ళకి, ఆ గాలి నేల అలవాటయ్యి ఒక కొలిక్కి చేరుకునేసరికి మనుషుల మధ్య తారతమ్యాలు చాలా వరకూ నశించి, అగ్గిలో పుటం వేసిన బంగారంలా మారిన హృదయాలతో అందరికీ ఒకరి పట్ల ఒకరికి సహానుభూతి కలుగుతుందనిపిస్తుంది చాలా సార్లు.
అయితే, ఇప్పటికీ అతి కొద్ది మందిని చూసినప్పుడు వారికి అగ్రవర్ణ అధికార ధోరణి మారలేదనిపిస్తుంది. అలాగే అనాదిగా దౌర్జన్యాలకి గురి అయిన కొన్ని వర్ణాల వారికి ఇంకో వర్ణం వారి మీద ఒక లాంటి అక్కసు ఇంకా పోలేదని కూడా అనిపిస్తుంది. అగ్ర రాజ్యాలుగా భావిస్తున్న ఉత్తర అమెరికా దేశాల సంస్కృతికి అది గొడ్డలి పెట్టు అని నేను భావిస్తాను. పై కారణాల వల్ల, ఒక దేశానికో ప్రాంతానికో చెందిన వారందరూ ఇతరులతో కలవకుండా ఒక చోట స్థిరపడటం కనిపిస్తుంది. వాళ్ళు ఇంకొకరితో కలవడానికి ఇష్టపడరు. ఒక వేళ పొరపాటున ఇంకొకరు ఉన్నచోట ఇల్లు కొనుక్కున్నా, ఇతర దేశస్థుల వంటల వాసనలు నచ్చక కొందరు ఇళ్ళు అమ్మి వెళ్ళిపోవడం కూడా తరచుగా చూస్తుంటాము. ఇక్కడ వింటే ఈ విషయం వింతగా మనకి అనిపిస్తుంది కానీ భారత దేశంలో ఇది చాలా సాధారణ విషయమే కదా? చిన్నప్పటినించీ ఇలాంటివి చాలానే చూసి ఉంటాము మనము కూడా. అయితే, ఇక్కడ జరిగినవి చూడగానే మన గతం మనని చెళ్ళున కొట్టినట్టయితే, మనం కొంత మారినట్టే. ఈ విషయాన్ని రచయిత్రి తన కథలో చిన్నప్పుడు ఆటలాడుకున్నప్పుడు చూసిన యేసు కుమారిని గుర్తు తెచ్చుకుని స్పృశించడం నాకు చాలా నచ్చింది.
చాలా వరకూ మనసులో కలిగే భావాలు పైకి కనబడనీయకుండా దాచుకునే సంస్కృతి ఉన్న ఈ దేశాలలో, అక్కడక్కడ కనిపించే దారుణమైన తేడాలు మనసుని బాధించక మానవు. ఈ చెరగని గీతలనేవి చాలా పెద్ద సబ్జెక్టు. ఇంత పెద్ద అంశాన్ని ఒక కథలో ఇమడ్చడం లో రచయిత్రి కృతకృత్యులయ్యారు.
పిల్లలకి కథలు చెప్పేటప్పుడు బూచిని చూపినట్టే ఒకోసారి తెలియని దేవదూతలని కూడా సృష్టిస్తాం మనం. ఆ పాత్రలు పిల్లల మనసుల్లో పూర్తిగా నాటుకుపోతాయి. అలా చెప్పిన ఒక పాత్ర మీద చిన్ని తల్లి అల్లుకున్న ఆశ, ఆ ఆశ తీరనప్పుడు మెరిసే చిన్ని కళ్ళల్లో, మోములో ద్యోతకమైన నిస్పృహ చాలా బాధ కలిగించింది. సంస్కృతి ఏదైనా సరే, పిల్లలూ దేవుడూ చల్లని వారే అని నమ్మడమే కదా మానవత్వమంటే. ఆ చిన్నారులలో కూడా తారతమ్యాలు చూపించే వాళ్ళని కలవకపోవడం, వాళ్ళ గురించి మాట్లాడకపోవడమే మంచిదని సూటిగా ఒక పాత్ర చేత చెప్పించారు రచయిత్రి. అలాగే చివరలో మళ్ళీ మనదేశం పిల్లలందరూ ఒక చోట కలిసి ఆడుకోవడమే ఉత్తమం అని ఇంకొక గీత గీసి కథకి ముగింపునివ్వడం అనూహ్యం. చక్కని కథ, చక్కని కథనం ఎక్కడా ఆగకుండా చదివించింది.
మనుషుల మధ్య అన్ని తారతమ్యాలు తొలగే రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం.
వనజ తాతినేని అముద్రిత కథాసంపుటి పాఠకులను విశేషంగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. వనజ గారికి అభినందనలతో..
- లక్ష్మి రాయవరపు కెనడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి