3, జూన్ 2024, సోమవారం

I am an Author ..

 నేనొక రచయిత ని.. అవునంటారా కాదంటారా!? 

భోజరాజుకు కథలు చెప్పిన 32 సాలభంజికలు

వొక్కొక్కరే ముందుకు రావాలిప్పుడు. 🤗🫢

**********

ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరై శ్రద్దగా సభను వింటున్నాను. నన్ను పలకరించి తనను పరిచయం చేసుకున్నాడు ఆ యువ రచయిత. ఓ రెండు పుస్తకాలు నా చేతిలో వుంచి.. 

‘కథలు రాయడం చాలా సులభం, తెలుసా అండీ “ అన్నాడు.

అవునా! అన్నట్టు చూసాను. లోలోపల నాకెందుకు.. వొక్కో కధ రాయటానికి సంవత్సరాలు తరబడి పడుతుంది.. నాలో ఆలోచనాశక్తి సన్నగిల్లిందేమో! విభిన్నమైన అంశాలతో కథలు రాయాలని అవి అందరూ మెచ్చుకోవాలని అత్యాశ కాబోలు అనుకుని .. 

“ఎన్ని కథలు రాసారు ఇప్పటికి” అన్నాను .. నా వయసులో సగం వయస్సే వున్న అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ.. 

“150 పైగానే రాసాను. ఇంకా కవిత్వం వ్యాసాలు సమీక్షలు కూడా ! “ అన్నాడు.

“ఎన్నేళ్ళ రచనా ప్రస్థానం”.. నా ప్రశ్న 

“కేవలం ఐదేళ్ళేనండీ.. మహాప్రస్థానం చదివే తీరిక దొరకలేదు నాకు. కానీ నా జీవితకాలంలో ఆరుద్ర సమగ్ర సాహిత్యం అంత రాయాలని నా కోరిక అండీ.” అన్నాడు. 

‘మంచిది. చేతి కీళ్ళు అరిగిపోగలవు జాగ్రత్త ‘’ అన్నాను. 

అతను పక్కకెళ్ళాక  ఇంకో రచయిత మిత్రుడొచ్చి.. “ఏమిటీ ఆ యువ రచయిత తో అన్ని కబుర్లు” అన్నాడు. 

 అతను చెప్పినవన్నీ చెప్పాను. 

గట్టిగా నవ్వి ఆ రచయిత కి మెదడు తో పని ఎందుకు? రెండు చిన్న పనులు తెలుసంతే! Copy > paste సోషల్ మీడియా వేదిక, కథల యాప్ .అతని రచనల్లో నీ కథలు కూడా వున్నాయి .. చూసుకో! అని హెచ్చరించాడు. 

 ఓహో అదా సంగతి అని నవ్వుకున్నాను… 

నేను రాసినదాన్ని ఎలా భద్రపరచుకోవాలి.. అచ్చమైన రచయిత మెదడుకి పని చెప్పానన్నమాటే కానీ.. ఈ గ్రంధచౌర్యం భావ చౌర్యం  చేసిన ప్రసిధ్ధ రచయితలు  గుర్తొచ్చి మరింత నవ్వుకున్నాను. 

ఆంగ్ల రచనలు చదివి తమ భాషలో కథలు రాసి ఎందరో ప్రసిద్దులైనారు. ఒకామె ఒక ప్రసిద్ద బెంగాలీ నవల గురించి ఆంగ్లంలో  వ్యాసం చదివి తన భాషలోకి అనువదించి వ్యాసం రాసింది. అలాంటికోవలో వాడే ఈ రచయిత అనుకున్నాను. 

ఇతనూ… ఎప్పుడో వొకప్పుడు ఏ ఫేస్ బుక్ గోడ పైనో  తన కథ చూసి .. నా రచన ఇది అని గగ్గోలు పెట్టటం ఖాయం.

ఈ మధ్య వొక రచయిత అన్నారు .. storyline చెబితే ChatGPT 10 pages కథ ఇచ్చింది అంట. దాన్ని 100 పేజీల నవల రాస్తాడు అంట. లక్షల రూపాయల బహుమతి, అకాడమీ అవార్డ్ లు రావచ్చు నేమో! 😊

ప్రపంచమా! వర్దిల్లుమా… ఆలోచనాశక్తి నశించి.. ChatGPT Al తోనూ copy>paste తోనూ.. 😢😢

……….. 

PS: నా ఆలోచనాశక్తి తో రాసాను. 😊🎈




కామెంట్‌లు లేవు: