హాస్టల్ గది
హాస్టల్ లో ఉన్న ఆడపిల్లలని చూస్తే
ఆక్వేరియంలో అలుపు లేకుండా తిరిగే
రంగు రంగుల చేపలని చూసినట్టుంటుంది
ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లు
గేటు వైపు చూస్తుంటే
కాముకుల చూపుల వలకి
చిక్కుకుపోతారేమోనని భయమేస్తుంటుంది
చదువుల సముద్రంపై రాంక్ ల ఓడపై
ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది
ఏ తుఫాన్ తాకిడికి చిక్కుకుంటారో
ఏ తీరాలకి చేరుకుంటారోనని
దిగులుగా ఉంటుంది
జ్వలనం చలనమూ లేక
యాంత్రికంగా మరబొమ్మల్లా
నడుస్తున్న వాళ్ళని చూస్తుంటే
వీపున మోస్తున్నసిలబస్ లన్నీ
కర్కశ హృదయాల పేరాశగా
కనురెప్పలు మోస్తున్న
కలలభారాలన్నీ కన్నవారివిగా
తెలుస్తూనే ఉంటాయి
వారానికొక రోజొచ్చి ఆత్రంగా
మార్కుల వివరాలడుగుతుంటే
పూల వనాలని ధ్వంసం చేసి
సీతాకోక చిలుకల సంచారం కోసం
ఎదురు చూపులు చూస్తున్నట్లు ఉంటుంది
విద్యా గంధాలని
ఆస్వాదించాల్సిన మనసులు
టాయ్ లెట్ల దుర్గంధాన్ని భరించలేక
వమనం చేసుకుంటారు
తేలికగా రూపాయలెలా సంపాదించాలనే
ఆలోచనల కుళ్ళుని మోస్తూ
ఆత్మీయతకి అలమటిస్తారు
పాటా లేదు పదమూ లేదు
చీకటి గదులు ప్రహారా కాస్తున్న కళ్ళు
వాయిదా వేసుకున్న ఆకళ్ళు
మనిషిగా ఎందుకు పుట్టామోనని వగస్తూనే
గది గోడలు బద్దలు కొట్టాలనే కసితో
చదివేస్తూ ఉంటారు
జైల్లో ఖైదీలకి లాగా పదే పదే
కేలండర్ కేసి చూస్తుంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి