20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వేలాది కథలు




కొన్ని చిన్న కవితలు.. 

*****

 నమూనా 


గుల్జార్ లా రాయలేవా నువ్వు అని అడిగావు.

గుల్జార్ లా నేను రాయను. నాలాగే నేను రాస్తాను అన్నాను.

నా కవిత్వానికి మూలం నువ్వే కదా! 

నీ నమూనా నేనే కదా! 


******


నువ్వు నేను


నువ్వు వర్షమై పలకరిస్తావ్ 

నేను పువ్వులా వికసిస్తాను

యుగ యుగాల కాలం నుండి ఇంతే! 


*********

నిరంతరం 


మనుషులు అనుభవించడానికే 

పుడుతుంటారు. కష్టమైనా

సుఖమైనా, సిరిసంపదలైనా

కీర్తిప్రతిష్ఠలైనా, అవమానాలైనా.


వీటి కొరకే నిరంతర యత్నం. 


**********


తేడా


గట్టిపడ్డానని అనుకుంటారు 

ఘనీభవించానని తెలియక

చూపులకు స్పర్శకు వున్నంత తేడా ఇది. 


**********

బహుమతి 


అనుకున్నది అనుకున్నట్టు జరగడం అతి ప్రయాస నాకు. 

అనుకోకుండా లభించిన బహుమతి నువ్వు. 

ఇందులో అతిశయోక్తి ఏముంది? 


******


నిద్ర లేమి


స్థిమితంగా యేనాడు నిద్రపోయానని.. 

కొన్నినాళ్ళు నీ నిరీక్షణలో  

మరి కొన్నినాళ్ళు  నీ హింసలో ..


********


త్రిశంకు స్వర్గం 


నొప్పి కొసన పట్టుకుని వ్రేలాడుతున్నా

నువ్వు నన్ను వదలవో నేను నిన్ను వదలనో 

జన్మంతా త్రిశంకు స్వర్గం. 


*********

వేలాది కథలు


వేలాది రోజులు వేలాది కథలు. 

కథకుడు నువ్వే శ్రోతను నేనే!

ముగింపు ఏదో ఒకనాడు 


*********


సెల్ఫీ 


ఇది సెల్ఫీ ల కాలం. 

దశాబ్దాలుగా నువ్వు నేను

ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు 

అయితేనేం.. 

నీ వామ భాగంలో నేను

నా సవ్య భాగంలో నువ్వు

తలవని తలపుల

కలసిన కలయికల సెల్ఫీ మనది. 


********

ఒంటరి రాత్రి


వేలాది రాత్రులుగా

నిన్ను తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాను. 

అది తెలుసుకుంటావో ఏమో

కలలోకి వచ్చి ప్రేమగా తల నిమిరి వెళ్తావు 

నిద్ర మెలుకువ కాని భ్రాంతిలో

పగలు ముగుస్తుంది. 



#వనజ తాతినేని



కామెంట్‌లు లేవు: