#మినీ కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#మినీ కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, సెప్టెంబర్ 2026, బుధవారం

కవితా వర్షం

 


విద్య


పువ్వును మొగ్గగా వున్నప్పుడో

వడిలి పోయినప్పుడో 

నేల రాలినప్పుడో చూసి ప్రేమించలేను 

మహా అయితే.. 

ఆసక్తిగానో జాలిగానో చూస్తుంటాను


నిన్ను అలా కానేకాదు

నీ బాల్యాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని

నీ లోపాలతో సహా సర్వకాలాల్లో

నిన్ను నిన్నుగా మిన్నగా 

ప్రేమించడమే నాకు తెలిసిన విద్య. 


********


వాన 


నీ తలపుల వానలో 

తడిసి ముద్ధయ్యాను.

వాన ఎప్పుడు వచ్చి 

మిగతా వాటిని తడిపి 

వెళ్ళిందో నాకెలా తెలుసు

కవితా వర్షంలో మళ్ళీ తడుస్తున్నాను. 



ఆంగ్ల అనువాదంలో… 


 Vidya / The Art I Know*


I cannot love a flower

When it is still a bud,

Or when it has withered,

Or fallen to the ground.

At most, I look at it

With curiosity or pity.


But not you, never like that.

Your childhood, your youth, your old age,

With all your flaws, in all times,

To love you as you are,

And even more than you are,

That is the only art I know.



Vaana / Rain*


Drenched I am,

In the rain of your thoughts.

How would I know

When the real rain came,

Drenched everything else,

And left?

Again I am drenched,

Now in a shower of poems.


23/10/2026. 10:05 am

_ వనజ తాతినేని. 


20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వేలాది కథలు




కొన్ని చిన్న కవితలు.. 

*****

 నమూనా 


గుల్జార్ లా రాయలేవా నువ్వు అని అడిగావు.

గుల్జార్ లా నేను రాయను. నాలాగే నేను రాస్తాను అన్నాను.

నా కవిత్వానికి మూలం నువ్వే కదా! 

నీ నమూనా నేనే కదా! 


******


నువ్వు నేను


నువ్వు వర్షమై పలకరిస్తావ్ 

నేను పువ్వులా వికసిస్తాను

యుగ యుగాల కాలం నుండి ఇంతే! 


*********

నిరంతరం 


మనుషులు అనుభవించడానికే 

పుడుతుంటారు. కష్టమైనా

సుఖమైనా, సిరిసంపదలైనా

కీర్తిప్రతిష్ఠలైనా, అవమానాలైనా.


వీటి కొరకే నిరంతర యత్నం. 


**********


తేడా


గట్టిపడ్డానని అనుకుంటారు 

ఘనీభవించానని తెలియక

చూపులకు స్పర్శకు వున్నంత తేడా ఇది. 


**********

బహుమతి 


అనుకున్నది అనుకున్నట్టు జరగడం అతి ప్రయాస నాకు. 

అనుకోకుండా లభించిన బహుమతి నువ్వు. 

ఇందులో అతిశయోక్తి ఏముంది? 


******


నిద్ర లేమి


స్థిమితంగా యేనాడు నిద్రపోయానని.. 

కొన్నినాళ్ళు నీ నిరీక్షణలో  

మరి కొన్నినాళ్ళు  నీ హింసలో ..


********


త్రిశంకు స్వర్గం 


నొప్పి కొసన పట్టుకుని వ్రేలాడుతున్నా

నువ్వు నన్ను వదలవో నేను నిన్ను వదలనో 

జన్మంతా త్రిశంకు స్వర్గం. 


*********

వేలాది కథలు


వేలాది రోజులు వేలాది కథలు. 

కథకుడు నువ్వే శ్రోతను నేనే!

ముగింపు ఏదో ఒకనాడు 


*********


సెల్ఫీ 


ఇది సెల్ఫీ ల కాలం. 

దశాబ్దాలుగా నువ్వు నేను

ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు 

అయితేనేం.. 

నీ వామ భాగంలో నేను

నా సవ్య భాగంలో నువ్వు

తలవని తలపుల

కలసిన కలయికల సెల్ఫీ మనది. 


********

ఒంటరి రాత్రి


వేలాది రాత్రులుగా

నిన్ను తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాను. 

అది తెలుసుకుంటావో ఏమో

కలలోకి వచ్చి ప్రేమగా తల నిమిరి వెళ్తావు 

నిద్ర మెలుకువ కాని భ్రాంతిలో

పగలు ముగుస్తుంది. 



#వనజ తాతినేని



20, మార్చి 2026, శుక్రవారం

కవి సమయాలు

గింజులాట    - వనజ తాతినేని 

నువ్వు యెప్పుడూ స్పష్టం

నేనెప్పుడూ .. అస్పష్టంగానే

ఈ గింజులాట జీవిత కాలం 

ఒకనాటి మురిపెం పువ్వులది

యాభైరెట్ల ఆనందం తుమ్మెదలది.

సఫలం కాని జీవితాలపై .. 

సానుభూతి వడగళ్ళ వర్షం. 

వద్దు.. ఆత్మ హననాలపై  

కనికరం వద్దు. జాలి దయ

సానుభూతి భరించడం కష్టం

మిక్కిలి అవమానకరం.   

***************

అతడు: మీ కవులు జీవితాన్ని ఆస్వాదించలేరు అనుభవించలేరు. ఎంత సేపూ ఊహల్లో మునిగి తేలుతూంటారు. ఆరోపణ దండిగా వినబడుతుంది. 

ఆమె: అనుభవం  మంచిగానో చెడ్డగానో వుంటుందని ఊహించగలరు కాబట్టే.. కొత్త కొత్త అనుభూతి పరంపర లో నిండా మునిగి తేలుతారు. ఇక అనుభవం తో పనేముంది!?  స్థిరంగా చెప్పింది.

నేను: ఏమిటబ్బా! రెండు సబబుగానే వున్నట్టు వున్నాయి. 🤔🤗 ఎవరి వైపు చెప్పాలిప్పుడు.😘😅

**********************

 "పువ్వు చుట్టూ వాత్సల్యపు నీడలా 

నువ్వు నా చుట్టూ ఉన్నావు ఈశ్వరా! 

అవసరమైనప్పుడల్లా.. గీతానివై తారసపడతావ్!

 నా లోపలి వెలుగు నా లోపలి స్వరం.. నేనే కానీ..  

అది నువ్వే అని ఎరుకలో వున్నాను. 🙏

****************


నా కవిత్వంలో..

నీ జాడ వెతుక్కోకు 

భంగపడతావ్.

ఉక్రోషంగా..

మొగ్గ రేకులను

బలవంతంగా విడదీసి 

మధువును రుచి 

చూడటానికి ప్రయత్నించకు

పోక్సో చట్టం వుంది 

జాగ్రత్త!! 








16, ఫిబ్రవరి 2026, సోమవారం

తళుక్కులు

 

తళుక్కులు - వనజ తాతినేని


అవమానాలు పూలహారాలై 

మెడను అభినందించాక

కనురెప్పలపై వెలిగే  రంగుల దీపాలు 

కన్నీళ్ళ దండగా జారాయి

************

ఎండిన పూల తోటలను 

నాగళ్ళు దున్ని వెళ్ళాయి

నా ప్రియమైన వ్యక్తి నిదురించాక

మేఘాల కోసం ఎదురుచూపు లేదిక.

**********

మంచి అద్దం ఒకటి

కొనుక్కోవాలిప్పుడు

బహు పాత్రాభినయం అవసర పడింది.

********* 

16/02/2026  09:15 am. 


12, ఫిబ్రవరి 2026, గురువారం

తళుక్కులు

వేచి చూస్తుంది.  

నిరీక్షణ ఆమె రెండవ పేరు 

******

వేప పూసింది.

మాఘమాసం చివర్లోనే 

వసంతం. 

******

అనాలోచిత చూపు

మొదటి సారి 

నీతో నే మాటాడిన మాట 

********

నిశ్శబ్దం వాన వాసనేస్తుంది

పంచుకున్నాం ఇద్దరం 

*******

రెక్కలు నావి 

ఎగరడానికి వొకరి అనుమతి ఎందుకు? 

ఆకాశం అందరిది. 


**********

అహంకారం 

అతని చిరునామా 

రిథమ్ ఆమెకు తెలిసినంతగా

తెలియదు అతనికి.

********

1, జనవరి 2026, గురువారం

మినీ కవితలు

 ప్ర. పొద్దున్నే .. యెందుకలా తిరుగుతావ్

కనబడని దండన మంత్రం అది. 

జ. ఏం లేదు, చెట్లకి కవిత్వం పూస్తుంది

ఛాయాచిత్రంతో వొడిసి పడదామని. 

************

ప్ర.ఏం చేస్తున్నావ్

జ.శీతల గాలులు వణికిస్తున్నాయి.

సంగీతంతో వెచ్చబడుతున్నా! 

వ్యా. ఆ గ్రీన్ టీ లో అల్లం నిమ్మరసం వేసుకో

ఆ పైత్యం తగ్గుతుంది. 

**************

హ్మ్.. ఆమె ది ఊర్ద్వ లోకం 

అతనిది సాధారణ లోకం.

మరికొన్ని… 

ఒక పువ్వు కన్నా నేను ఏమి చెప్పగలను!!

1. నువ్వు కవి కావాలనుకుంటే పువ్వుల భాషను నేర్చుకో ముందు. 

తర్వాత అనువదించు.

**

2. మోరలెత్తి ప్రార్ధిస్తుంది పుష్పం.. ఏ కరములైనా తనను త్రుంచి స్వామి చరణయుగళముల చెంత నుంచమని.

***

3. వత్తునని రాక నా గుమ్మానికి నన్నే కాపాలా పెట్టావా?

(స్వంతం కాదు. బహుశా గాలీబ్ మహాశయునిది కావచ్చు)

****

4. రాలినప్పటికీ సౌందర్యం వెగటు పుట్టించదు. సమాధి కట్టి జ్ఞాపకాన్ని బతికిస్తుంది.


#వనజతాతినేని #vanajatatineni #mobileclicks #mobilephotography #follower #poetry #hilights

23, డిసెంబర్ 2025, మంగళవారం

మినీ కవితలు


ఖాళీ తనాన్ని ఒంపేసుకునేందుకు తొందర యెందుకు? 

జ్ఞాపకాలను తిరగతోడితే.. రాళ్ళు అనుకుని ఒదిలేసిన

మంచి ముత్యాలు కనబడతాయి.

అరచేతికి  అవి అందనూవచ్చు

హృదయ యంత్రానికి కందెనలు అవి. 

సమయం జారిపోతుంది గడియ పెట్టండి.


©️Vanaja Tatineni 




నిత్యం పువ్వు నేనూ ఒకే కల కంటాం.

దృశ్యాన్ని ఇంకించుకోవాలని. 

నేను కొంచెం విభిన్నం.. 

కాఫీ కప్ లో సౌందర్య దాహం  

                

                        - వనజ తాతినేని





1, అక్టోబర్ 2022, శనివారం

రెక్కలు - ఊహలు

 రెక్కలు - ఊహలు 

తుమ్మెదలు సీతాకోకచిలుకలు వొకరినొకరు
పరామర్శించుకున్నాయి 

ఎవరి అన్వేషణ వారిది ఎవరి ఆస్వాదన వారిది

కలహించుకోకూడదని తోట చెప్పిన మాట తలకెక్కించు కున్నట్టున్నాయి. 

*********

శుభ్రమైన నీలాకాశంలో 

దిష్టిచుక్కలా సోమరి మేఘం

సూర్యుడికి దిష్టిచుక్క కాబోలు

************

గాలి ఈలలు వేస్తుంది

ఒకటే రొద. దానికి

వెదురుపొదల జాడ దొరికితే బాగుండు 

రవళుల తుఫాన్ మది తీరం దాటుతుంది.

*********

సమర్పణ

ప్రేమించడం అంటే …

కాఠిన్యం నిండిన మనసును 

పూల మృదుత్వంతో మార్పిడి చేసుకోవడం

దయను అంటు కట్టుకోవడం

ఉన్ననాళ్ళన్నీ నీ ఉనికిని  బేషరతుగా సమర్పించడం.