26, జనవరి 2014, ఆదివారం

ముంజేతి కంకణం

నిన్నరాత్రి  నా ఫ్రెండ్  నాతో మాట్లాడుతూ  .. "అమ్మాయిని చదివించడం అనేది తప్పేమో అనిపిస్తుంది " అంది . నాకది నిజమేనేమో ..నని కూడా అనిపించింది  

భద్రత లోపించిన సమాజంలో   ఆడపిల్లని ఉన్నత విద్యల కోసం,ఉద్యోగాల కోసం  బయటకి పంపడం పెను సవాల్ గా మారిందన్నది నిజం కూడా !  

నా ఫ్రెండ్ కూతురు ముంబాయి ఐ ఐ టి లో చదువుతుంది. అత్యున్నత స్థాయి విద్యాలయాలో విధ్యార్డులైన పిల్లలు స్త్రీ పురుష బేధం లేకుండా అందరూ కలిసి  గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళడం కాంపెయిన్ లు నిర్వహించడం మారుమూల ప్రాంతాలలో ఉన్న సమస్యలని గుర్తించి అవగాహన పెంచుకుంటూ ప్రజల అవసరాలని గుర్తిస్తూ ,వారికి వారి సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ  సామాజిక అధ్యయనం చేస్తుండటం చాలా సంతోషకరమైన విషయం కూడా.  . నా ఫ్రెండ్ కూతురు  తరచూ కాంపెయిన్ లకి వెళ్ళడం వల్ల అలా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో సంభాషించడంలో  అశ్రద్ద ,నిర్లక్ష వైఖరి వల్ల ఇంట్లో భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం జరుగుతున్న చూస్తున్న వింటున్న ఉదంతాలు చూస్తే భయం కల్గుతుంది మరిక  నా ఫ్రెండ్ ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యం  ఏముంది ?  

విద్యా, వ్యవసాయ, ఉపాధి , సేవా రంగాలలో శ్రమ శక్తిలో, పూర్తీ స్థాయి  గృహ నిర్వహణలో  సమాజ ప్రగతిలో స్త్రీల భాగస్వామ్యముంది  ఈనాడు అలా భాగస్వామ్యం కాని రంగమంటూ ఏది లేదు . పొట్ట చేతబట్టుకుని ఉన్న ఊరు విడిచి ఒంటరిగా పయనమవుతున్న కాలం ఇది . స్త్రీ జాతి పై  చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కడ చూసినా లైంగిక దాడులు జరుగుతున్నాయి  . 

చేయడానికి పని లేనప్పుడు , ఒకవేళ రేయింబవళ్ళు కష్టించినా కూడా నాలుగువేళ్ళు నోటిదగ్గరకి కూడా వెళ్ళలేని దీన బ్రతుకులు హీనమైన బ్రతుకులు కోట్లానుకోట్లు ఉన్నాయి ధనవంతుడు మరింత ధనవంతుడిగా ,మధ్య తరగతి మానవుడు పేదవాడిగా పేదవాడు మరింత పేదవాడిగా మారుతున్న ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో విచ్చినమవుతున్న సాంస్కృతిక జీవనంలో నైతిక విలువలు లోపించి హింసా ప్రవృత్తి హెచ్చిల్లి దొంగతనాలు దోపిడీలు,  వ్యభిచారం ,అవినీతి, అరాచకాలు పెరిగి  అలజడులు రేగి జన జీవితాలని అభాద్రతాభావంలో ముంచెత్తుతున్నాయి. ఈ నేర ప్రవృత్తిని అరికట్టగల మార్గాలు ఏమయ్యాయి ? అరాచక శక్తుల కనుసైగలలో నగరాలు నిద్రపోతున్నాయి సామాన్యుల ప్రాణమాన రక్షణ చేసే నాధుడే కరువయ్యారనిపిస్తుంది. పాలకుల వద్దకు ప్రజలెళ్ళి మొరపెట్టుకుంటే వాళ్ళు బండరాళ్ళవలె చలనం లేకుండా ఉంటే ఆదుకునే దిక్కెవరు? ఏదైనా స్త్రీ జాతి బతికి బట్టకట్టడం,సమాజంలో మనగల్గడం పెను సవాల్ గా మారిందన్నది నిజం . 63 సంవత్సరాల గణతంత్ర రాజ్యం సాధించిన ప్రగతి ముంజేతి కంకణంలా ఇలా ఉంది . ఏం చేద్దాం చెప్పండి ? 

నాకు అప్రయత్నంగా ఈ పాట గుర్తుకు వచ్చింది  

ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో 
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో 
ఎవ్వరో వారెవ్వరో 

శీలానికి శిలువలు, కామానికి కొలువులు 
కన్నీటి కలువలు, ఈ చెలువలు 
కదులుతున్న ఈ శవాలు, రగులుతున్న శ్మశానాలు 
మదమెక్కిన మతితప్పిన, నరజాతికి నందనాలు 
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో 

ఈ గాధలు ముగిసేదింకెన్నడో?   14 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఆడపిల్లలు భయపడడం కాదు చేయవలసినది బాధ్యతగా మెలగడం, జాగురూకతతో ఉండటం కావల్సినది. అరటాకు వెళ్ళి ముల్లు మీదపడ్డా ముల్లెళ్ళి అరటాకు మీద పడ్డా నష్టం అరటాకు కే కనక అరటాకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, కాదంటే చెప్పగలది లేదు, నమస్కరించడం తప్ప.

Meraj Fathima చెప్పారు...

వనజా, మీ పోస్ట్ కదిలించింది.
బాగుంది అనలేను,

Manasa Chatrathi చెప్పారు...

వనజ గారూ,

స్త్రీ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ, స్త్రీ స్వతంత్రాన్ని మనసారా అభిలషిస్తూ , అందుకు ఆదర్శంగా నిలబడే బలమైన వ్యక్తిత్వం గల మీ వంటి వారి నుండి ఈ పోస్ట్ చూడటం, బహుశా సమాజంలో పెరిగిపోతోన్న భయాలకు ఒక నిలువుటద్దం.

ఎందుకు చదవాలమ్మా...అంటే 'పెద్ద ఊళ్ళెళ్ళవూ, పెద్ద ఉద్యోగాలు చేయవూ...దర్జాగా బతకవూ.." అని పాలబువ్వలు తినిపిస్తూ అమ్మలు పిల్లలని ఉత్తేజపరిచే రోజులకిక కాలం చెల్లనుందేమో. ఎంత చదివినా బిక్కుబిక్కుమనేప్పుడు, ఏ ఉద్యోగమైనా మనసు నిలిపి స్వేచ్చగా పని చేయలేనప్పుడు, పగలూ రాత్రీ తేడాల్లేకుండా ఇంటికి ఒంటరిగా వెళ్ళడమే భయమనుకుని వెనుకడుగు వేసే పరిస్థితులే అడుగడుగునా అడ్డొస్తున్నప్పుడు, నిజమే, ఏం చేయాలసలు?

చదువుల కన్నా ముందు, కరాటే లాంటివేమన్నా నేర్చుకుంటే కాస్త ఫలితం ఉంటుందేమో? తెలీదు. మీరు అడిగిన ప్రశ్నలు మాత్రం నన్నూ తొలుస్తున్నాయి.

Narasimha Rao Maddigunta చెప్పారు...

మీ ప్రెండ్ గారి భయం ఆమెగారి ఒక్కరిదే కాదు. ప్రస్తుతం మన సమాజంలోని సగటు తల్లితండ్రుల భయం అది.వాస్తవాలకు దూరంగా పనికి మాలిన వాదాలు చేస్తూ, మగాడు మారాలి , మగాడు మారాలి అని ఒక ప్రక్క అంటూ , ఇంకొక పక్కా అలా మారని మగాళ్ళకు తప్పు చెసే అవకాశాలు కల్పిస్తుంటే , దానిని జ్ణానం అనుకోవాలా? ఇంట్లో పిల్లడు దొంగ తనం చేస్తున్నాడు అనుకుంటే బీరువాలకు తాళాలు వేసుకుని జాగర్త పడతాం. పిల్లవాడి దొంగ బుద్ది మారేదాక ఇది తప్పదు. వాడిని దండించడం కూడా తప్పదు. కానీ కేవలం దండనా బయంతో ఒక్క రోజులో పిల్లవాడిని మార్చగలమా? పిల్లవాడిని దండిస్తే సరి పోదని చెప్పి , బీరువాలకు తాళాలు వేసుకోవడం మానేస్తామా?

కాబట్టి ఎవరెన్నీ ఆదర్శాలు వల్లించినా , స్త్రీల రక్షణకు నేరస్తులకు కఠిన శిక్షలు తో పాటు స్వీయ నియంత్రణలు లేక కుటుంబ కట్టుబాట్లు ఏర్పరచుకుని ప్రతి ఒక్కరూ పాఠించినప్పుడే సత్పలితాలు పొందగలం.

జయహొ చెప్పారు...

నా ఫ్రెండ్ కూతురు తరచూ కాంపెయిన్ లకి వెళ్ళడం వల్ల అలా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో సంభాషించడంలో అశ్రద్ద ,నిర్లక్ష వైఖరి వల్ల ఇంట్లో భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి
మేడం,
ఇక్కడ మీరు ఎమి చెప్పాల్నుకొంట్టున్నారో అర్థం కాలేదు. నలుగురితో కలసి కాంపైన్ వెళ్లే వారికి సమాజిక స్ప్రుహ పెరిగి అందరితో కలసి మెలసి పోతారు కదా! మరి ఆమే కి తల్లిదండ్రులతో సంభాషించడంలో అశ్రద్ద ,నిర్లక్ష వైఖరి ఎందుకు అలవడుతుంది.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

సమాజంలో మార్పు కుటుంబం నుండే మొదులవ్వాలనేది మనందరికీ తెలుసు . పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అశ్రధ్ధ చేస్తున్నారు . పెరిగే వయస్సులో ముఖ్యంగా పిల్లాడి విషయంలో తల్లిదండ్రులు అతిగారాబం చేసి చెడగొడు తున్నారు . మీ పిల్లాడు ఫలానా తప్పు చేశాడు . అని తల్లిదండ్రులను పిలిపించి చెప్పినప్పుడు ఆతల్లి సుతరామూ ఒప్పుకోదు . పైపెచ్చు తనబిడ్డ అమాయకుడు . మీరే నాకొడుకు మీద నిందలు మోపుతున్నారు . అని వాదిస్తుంది . ప్రధానోపాధ్యాయులుగా మగపిల్లల పెంపకంలో శ్రధ్ధవహించ వలసినదిగా తల్లిదండ్రులకు చెప్పి చెప్పి విసిగి పోయాను . మాటా మందలింపు లేకుండా పెరిగి పెద్దయిన వాళ్ళు ఇలా కాక ఎలా తయారవుతారు . గొప్ప చదువు లైతే చదువు తున్నారు గాని బుధ్ధులు మాత్రం వక్రంగా తయారవు తున్నారు . కార్పొరేట్ విద్యల వల్ల రేంకులు , ఉద్యోగాలూ ఐతే వస్తున్నాయి కాని , మనుషులుగా మాత్రం తయారు కావడం లేదు . తాము తమ మగ పిల్లలను మంచి పద్దతిలో పెంచుకోకపోతే ఆ దుష్ఫలితాలను తమ ఆడ పిల్లలూ , తాము , సమాజమూ అనుభవించ వలసి వస్తుంది . మేము పెరిగిన పరిస్థితికీ , నాటి తల్లుల పెంపకానికీ నేటికీ తేడా గమనించండి . ఒక్కరిద్దరైతే మాత్రం బిడ్డలకు క్రమశిక్షణ నేర్పనక్కరలేదా . కుటుంబాలలో, విద్యాలయాలలో మంచి వ్యక్తిత్వాలను సంతరించుకోకుండా పెరిగిన పౌర సమాజం హింసాత్మకంగానే ఉంటుంది . తప్పెవరిది ?

Vanaja Tatineni చెప్పారు...

జయహో.. గారు.. మీకు అర్ధం కాని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ కి తన కూతురు అలా కాంపెయిన్ లకి వెళ్ళినప్పుడు తను నెట్ వర్క్ సరిగా లేకపోవడం, ఫోన్ స్విచ్ద్ఆఫ్ అవడం వల్ల కమ్యూనికేషన్ గాప్ రావడం వల్ల ఆ అమ్మాయి భద్రత గురించి ఆలోచిస్తూ ఇప్పటి పరిస్థితులని బట్టి భయాందోళనకి గురి అవుతుంది
అందులో అసహజం ఏమి లేదు కదా !

Vanaja Tatineni చెప్పారు...

నరసింహారావు గారు మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. నేరానికి తగిన శిక్ష ఉండాలి. అలాగే సమస్యలకి మూలాలు కనుగొని ఆ వైపు నుండి పరిష్కార మార్గాలు సూచించాలి. మన దురదృష్టం ఏమంటే ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు సరికదా... నేర ప్రవృత్తిని ప్రకోపింపజేసే మీడియా మధ్య బ్రతకవలసి రావడం. :(

Vanaja Tatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ .. జాగురూకత ఉండటం చాలా అవసరం. ఆత్మా సంరక్షణ విద్యల ఆవశ్యకత ఉంది.
ధన్యవాదములు మాస్టారూ ..

Vanaja Tatineni చెప్పారు...

మెరాజ్ ..థాంక్ యూ సో మచ్ !

Vanaja Tatineni చెప్పారు...

Manasa.. మీ వ్యాఖ్య ఈ పోస్ట్ కన్నా చాలా బావుంది . మీరన్నది ముమ్మాటికి నిజం . ముందు చదువు కన్నా ఆత్మా సంరక్షణ విద్యలే అవసరం. చాలా రోజుల నుండి బ్లాగ్ వ్రాయడం లేదు . నా ఫ్రెండ్ మాటలతో ఆలోచనలో పడి.. ఈ పోస్ట్ వ్రాసాను. నిజంగా భయానక పరిస్థితులే! మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు

Vanaja Tatineni చెప్పారు...

వెంకట రాజారావు . లక్కాకుల గారు సమాజంలో ఆర్ధిక అసమానతలు ఉన్నప్పటికీ కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలకి ముఖ్యంగా ఉండాల్సింది ..క్రమశిక్షణ . క్రమశిక్షణారాహిత్యంలో పెరిగిన పిల్లలు దారితప్పి నడుచుకోవడం చూస్తున్నాం..గంజాయి విత్తనాలు నాటి తులసిమొక్క కావాలంటే రాదు కదా!మీ ఆవేదన అర్ధమయింది ఈ రోజు BVV prasad గారు facebook లో ఇలా అన్నారు. ఆ పోస్ట్ కి వచ్చిన స్పందన కూడా ఎంతో ఆలోచింపజేస్తుంది . మీరు చూడండి ఈ లింక్ లో .. https://www.facebook.com/BVVPrasad/posts/10200400303648743?stream_ref=10 .

అజ్ఞాత చెప్పారు...

సరైన వ్యవస్థలు లేకపోవడం, ఉన్నవి సరిగ్గా పనిచెయ్యకపోవడం సమస్యలకి మూలాలు.
ఉదా. రైల్వే స్టేషన్, బస్‌స్టాండులలో ప్రిపెయిడ్ ఆటోల వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే అందరూ ఉపయోగించుకుంటారు. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రిపెయిడ్ ఆటో ఎక్కే చోట CC కెమేరాలు ఉన్నాయి. దీనివలన ఏ ఆటోలో ఎవరు వెళ్ళారో సులభంగా తెలిసిపోతుంది. ఏదైనా అఘాయిత్యం జరిగితే ఆటో డ్రైవర్‌ని గుర్తించవచ్చును.

ఎగిసే అలలు.... చెప్పారు...

Samajamlo sarige duracharampai chaalaa chakkagaa raasaru.chaalaa baagundi vanaja gaaru :-):-)