8, మార్చి 2015, ఆదివారం

పునీత


పునీత    - వనజ తాతినేని 


ఇష్టంగానో అయిష్టంగానో

దొంగలాగానో దొరతనం నటిస్తూనో

వికృత మృగత్వ కాముక రూపాలకి 

దోచుకోవడానికి దారులెన్నో  

మానధనం అభిమానధనమనే భాండాగారం 

నీకున్నందుకు నువ్వెంత గర్వపడాలి !

విలువకట్టేది ఆయాచితంగా దోచుకునేది వాళ్ళే అయినప్పుడు 

నువ్వొక నిమిత్తమాత్రురాలివే కదా ! ప్రాణమున్న శిలవే కదా !


ప్రాణమూ దేహమూ వేరుకానట్లే

హీనత్వమూ దీనత్వమూ నీ చిరునామాగా మార్చకు 

ఆపాదించే అధికారం ఒకరికి ఇవ్వనేల ? వగచనేల ? 

పవిత్రత కుబుసాన్ని విడిచిపారెయ్ 

ప్యూరిటీ అంటూ ఏమీ లేదిక్కడ   

నువ్విప్పుడు అగ్ని పుత్రిక వారసురాలివి

  

ఆకృత్యమెలా జరిగినా  దాడి రూపమేదైనా 

జరిగిన ప్రతిసారి  నువ్వు 

ఆత్మవిశ్వాసమనే ఇనుపకచ్చడం ధరించాలి 

నీ దేహం దేహమే  ఒక ఆయుధం కావాలి 


ఆధరాలు చిందించాల్సింది 

మధువులు మందస్మితాలు కాదు 

విషకన్యలుంటారని భీతి కల్గించాలి 

పువ్వు, మొగ్గ, బేల,ముగ్ధ పోలికలని 

మై ఫుట్  అంటూ ఈడ్చి కొట్టాలి 

క్షతగాత్ర శరీరాన్ని పరామర్శించే 

కపట ఆత్మీయత కొరకు వెతకకు 

అప్పుడు సానుభూతి ఒలికించే 

ముసుగు దెయ్యాల చింతనుండదు



కథలు కథలుగా వర్ణించి చూపే 

ప్రచార వస్తువుగా మారకు 

నిబ్బరాన్ని నింపుకుని 

జీవిత కదన రంగాన్ని దున్నేహలమవ్వాలి 

క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించే కరవాలమవ్వాలి 

 


దోచిన వాడి తల సిగ్గుతో నేల కూలాలి 

దొరికితే వాడిని,  దొరకకపోయినా 

వాడి కన్నా భయంకరమైన లోకాన్ని 

చీల్చడానికి చెండాడటానికి నీకొక దేహం కావాలి 

లే ..లేచి దేహాన్ని నిలబెట్టు...  

జీవం నింపుకో  జీవితేచ్చ రగిలించుకో 

అభయ నిర్భయ అజేయ నమూనా నీకొద్దు


 

శరీరాలోచనల మురికిని  

నీ కన్నీటి శుభ్రజలంతో జాడించేయి

నువ్వొక పునీతవి కావాలి  

నువ్వొక అపరాజితగా మారాలి  

గొడ్డలి వేటుకి తరువు తలొంచినా  

భూమిని చీల్చుకు వచ్చే వేరు మొక్కలా 

సగర్వంగా  లేచి నిలబడు



కొత్త పాఠం నేర్చుకునేముందు 

పాత పాఠం ఏమి చెప్పిందో అవలోకించు

కని కనబడని దుఃఖ చారికలు  

 ఒడిలి పోయిన వారి తనువులు 

 కడతేరి పోయిన జీవితాలు 

నీకు నిక్కమై నిలిచిన సాక్ష్యాలు


 

మనసు పొరలు చీల్చి చూస్తే 

రక్తసిక్త గాయాలెన్నో అక్కడ

గాయాల అంతర్వేదన కొత్తేమి కాదిక్కడ 

 నిత్యం కోట్లానుకోట్ల రక్తాశ్రువులు చిందుతున్న నేల ఇది 


నేలబారు వ్యాఖ్యలు, నీటి మీద రాతలు

 ఎండుటాకుల చప్పుళ్ళు, కొవ్వుత్తుల నివాళులు 

 నీ రాతని మార్చలేవు . 

నువ్వు తల్చుకుంటే నీ రాతని  

వేరొకరు వేసిన గీతలని మార్చేసే

గీతా వాక్యమవుతావు, గుండె గానం వినిపిస్తావు

 అసలు సిసలైన  శీల నిర్మాణాన్ని  అద్దంలో నిలబెడతావు 


(మార్చి 2015 మాలిక సంచిక లో .. )



కామెంట్‌లు లేవు: