8, జులై 2019, సోమవారం

అంతరంగ మిత్రునితో మాటలు

🌼ఈ రోజు భగవంతునితో నా మాటలు🌼. అంతరంగ మిత్రునితో మాటలు చెప్పినట్లు ..

ఈశ్వరా... నీ పూజకు పూవులను తెచ్చాను. రాలిన పూవులను చూస్తూ జాలిపడి.. అయ్యో.. ముందు రోజు మిమ్ములను విస్మరించడం యెంత పొరబాటైనదీ.. మిమ్ములను తృంచుతూ నా పూల సజ్జ నింపుకుంటూ కూర్చుంటే నా స్వామి పూజకు వేళ మించిపోదూ.. అనుకుంటూ.. పూచిన ప్రతి చెట్టు నుండి కొన్ని పూలను సేకరించే ముందు చెట్టుకు పొదకు తీగకు క్షమాపణలను చెపుతూ గోటిగాటు పడకుండా రెమ్మలు విరగకుండా పూవు నలగకుండా .. సున్నితమైన పూలను అంతే సున్నితంగా తల్లి నుండి వేరు చేసి తేవడం పట్ల నాది కఠినమైన మనసు అని గోచరిస్తే అందుకు నేనేమి చేయగలను. ఎన్నెన్నో పూలను సేకరించి వాటిని నీకర్పిస్తూ మనసారా నిను కీర్తిస్తూ .. వొడలు మరిచి సంకీర్తన చేస్తూ పరమానందంలో తనమునకలవడమే కదా నేను చేయుచున్నది. మధ్య మధ్య చిత్తము మరొక విషయములపై వాలుచున్ననూ క్షణాలలో తెప్పరిల్లి చిత్తముని మందలించి మనముని నీపై లగ్నం చేసి నిను పూజిస్తుంటిని కదా .. మల్లన్నా.. నా ప్రార్దనలన్నీ ఎవరి కోసమో నీకు తెలియనిదా.. నీలో సగమై వున్న అమ్మను కోరిన వెంటనే కామితములను తీర్చే పెద్ద దొడ్డమ్మను వొదిలి.. నా కోరికలను నీకు విన్నమించుటలోనున్న ఆంతర్యం నీవెరుగనిదా..! అమ్మని వొదిలి అయ్యను అడుగుతున్నారంటేనే.. బిడ్డలకు తండ్రి వెన్నలాంటి మనసు తెలుసుననే కదా... తండ్రీ.. చంద్ర కళావసంత శిరో శివా.. కరుణాకరా.. భక్తబంధూ .. చరణం శరణం తవాస్మి.

పరమేశ్వరా.. నీ పూజకు తెచ్చే పూలలో వాటిని తుమ్మెద ముట్టని పూవులని యెటుల తెలుసుకుందును.?. మకరందాన్ని పొడిచి పొడిచి ఆరగించ బుల్లి పిట్టల కాలి జాడలను గుర్తించగలను కానీ, అటులను నిన్న పూచి తమ వన్నె చిన్నెలన్నీ తరిగి నేటికి నేలరాలిన పువ్వులను గుర్తించగలను కానీ.

ఎవరైనా స్వయంగా మొక్కలను నాటి పెంచి పోషించిన పిమ్మట పూచిన పూలను నీకర్పించుట పాడి యగును కానీ పరులు పెంచిన తోటలో పూలను తస్కరించి నీకర్పించుట తగదు కదా ! నాకా భాగ్యమును కల్గించలేదని కినుక వుంది క్లేశమూ వుంది. అయిననూ నిను పూజించడంలో గొప్ప శాంతి వుంది. అది నేనెలా వొదులుకోగలను.

కొందరు నా పూజల పట్ల బహిరంగంగా నేను తెలియజేయుట పట్ల అదేదో ఘోర తప్పిదం అయినట్లు ఎగతాళి చేస్తూ విమర్శించు చుందురు. ఏమీ వారు మాత్రం వారి వారి దేవుడ్ని ప్రార్ధించడం లేదా .. వారు చేతులు జోడించి నమస్కరించుదురో అరచేతులను ఆకాశం వైపు చూపుతూ ప్రార్ధించుదురో లేదా పైన కుడి ఎడమలను తాకుతూ కిందికి దిగి మరల వేళ్ళలో వేళ్ళు జొనిపి పెదవులు కలిపి ప్రార్ధించేదరో కదా, ..ఒక్క హిందువులనే పరమత పీడితులని నిందించుట ఏల? ఎగతాళి చేయుట ఏల? అసలు పరమత సహనం లేకుండా పోతుంది కదా తండ్రీ .. నేనెన్నడూ యితరులని అలా చేసినది లేదు. ఒకవేళ అలా చేసిన యెడల శిక్షింపుము తండ్రీ..

ఈమధ్య నేను పరమత సహనం చూపాలి ఎవరిని అల్పులుగా బలహీనులుగా చూసి దండించడం పాపం, నేరమూ అందరికి సమంగా బ్రతికే హక్కు వుందని వాదించి వాదించి వారి దృష్టిలో శత్రువుని అయ్యాను. నాలుగు రోజులుండి పోదామని వచ్చిన మిత్రురాలు కూడా అందరూ సమానమన్నందుకు కోపగించుకుని తిరుగు ప్రయాణమయ్యింది ప్రాణ స్నేహితులమైన వారి మధ్య కూడా ఉగ్ర భావాలు చోటు చేసుకుని శత్రువలవలె వ్యవహరించు కర్మలు చేయుట ఈ దేశమున సర్వసామాన్యమైనది. నీకు తప్ప ఎవరికీ మొరపెట్టుకున్ననూ ప్రయోజనం లేని కాలమున వుంటిని నేను. స్వమతమును భుజాన మోస్తూ మరల నిన్ను పూజించే నన్ను ఎగతాళి చేసిన మూర్కులను క్షమించి వారిని కూడా చల్లగా చూడు తండ్రీ .. అక్షర అజ్ఞానాన్ని వ్యాపింపజేసే వారి యెడల  కూడా కరుణవహించి అందరిని శాంతిగా సుఖంగా జీవించే జ్ఞానాన్ని ప్రేమను ప్రసాదించు తండ్రీ ! ఇవాల్టి నా ప్రార్ధన ఇదే !

పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితా త్వం జగతః సహాయః కృతాపరాధం తవసర్వ కార్యే కృపానిధే మాం శివపాహి శంభో..





కామెంట్‌లు లేవు: