Back to Roots సాధ్యమయ్యే పనేనా.. రెండవ భాగం.
Back to Roots సాధ్యమయ్యే పనేనా.. రెండవ భాగం.
ఎందుకో నగర జీవనం నాకంతగా రుచించడం లేదు. పల్లెకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని వుంది. నగరంలో ఖర్చులు కూడా అధికంగా వుంటున్నాయి. సాదాసీదాగా జీవించాలన్నా కూడా భారంగా వుంది. నగరంలో నా అభిరుచికి నా (మా) ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టుగా ఇల్లు నిర్మించడం కూడా సాధ్యం కాదనిపిస్తుంది. ఇంటి ముందు రోడ్డు తగినంత వెడల్పు లేక అనుమతులు రావడం కష్టం అనిపిస్తుంది. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టే ఉత్సాహం అణిగిపోయింది.
వాళ్ళ పిల్లలు అమెరికాలో వున్నారు. డబ్బు కి వాళ్ళకేం లోటు ( పచ్చిగా చెప్పాలంటే.. వాళ్ళకేమి దొబ్బిడాయ్) అంటారు కానీ.. నిజాలు ఇవి.
**********
పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ లగ్జరీ గా బతుకుతుంటారు. Mk bags $200 చెప్పులు ధరిస్తారు. SUV కార్లలో తిరుగుతారు.వారి తల్లిదండ్రులు ఇక్కడ వృద్దాప్యపు పెన్షన్ కోసం రైతు భరోసా కొరకూ క్యూ లో నిలబడతారు. సిగ్గు వుండదు వీరికి అని వొక గ్రీన్ కార్డ్ హోల్డర్ వ్యాఖ్యానించారు.
ఆమె మాటలతో కొంత ఏకీభవిస్తూనే.. ఇంకొక అభిప్రాయం చెప్పాను. పొలం కౌలు కిచ్చి రైతు భరోసా అందుకున్నవారు.. పదెకరాల పొలం వుండి తెల్లకార్డు వున్నవారు వున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు కూడా వుంటుంది వీరికి.
అలాగే అర్హులై వుండి కూడా ఆ వైపు తొంగి చూడనివారు వుంటారు.. నా లాగా.
నేను వింతతువు పథకం క్రింద పెన్షన్ కి అర్హురాలిని. నాకు ఏ విధమైన ఆస్థిపాస్థులు లేవు. 9 ఏళ్ళ క్రితం కొన్న కారు వొకటి నా పేరున వున్నది అంతే!
అది తీసేస్తే నేను ప్రభుత్వ పథకాలకు పూర్తి అర్హురాలిని. నేను పెట్రోల్ డీజిల్ కొంటాను. కరెంట్ బిల్ కడతాను. బస్ ఎక్కుతాను. నిత్యావసర సరుకులు బట్టలు బంగారం అన్నీ టాక్స్ చెల్లించే కొంటాను. నేను నాకు వచ్చే పెన్షన్ ఎందుకు వొదులుకోవాలి ? అప్లై చేస్తాను అనుకున్నాను కూడా!
విదేశాల్లో పిల్లలున్నంత మాత్రాన వారేమి తల్లిదండ్రులకు చేతికి ఎముక లేనట్టు డాలర్స్ ఏమీ విసిరేయరు. వారి సర్ధుబాట్లు వారి బాధలు వారివి.
ఇక్కడ పేరంట్స్ కి మాత్రం ఖర్చులు ఎక్కువ.. సహాయాలు చేయమని అడిగేవారు ఎక్కువ. మింగలేక కక్కలేక మౌనం వహించి పిసినారి అని పేరు వేయించుకోవడం తప్ప పది వేల రూపాయలు కూడా ఇంకొకరికి అప్పు ఇవ్వలేని పరిస్థితి. వారు మార్చిన ఐ ఫోన్ లు వాడుకుంటూ బడాయిగా కారు మీద తిరుగుతూ ఫాల్స్ ప్రిస్టేజ్ లో బతుకుతున్న తల్లిదండ్రులు ఎందరో!
విదేశాల్లో పిల్లలున్నారంటే డబ్బులుంటాయనే భ్రమలు తొలగిపోవాలి. హాస్ఫిటల్ ఖర్చులకు భయపడి హాస్ఫిటల్ కు వెళ్ళకుండా అనారోగ్యాన్ని మొండిగా నెట్టుకొస్తూ వున్నవారు ఎందరో!
నా వరకు నేనైతే పుస్తకాలు కొనడం మానేసాను. టూర్లు మానేసాను. విరాళాలు సహాయాలు ఇవ్వడం మానేసాను. వేడుకలకు వెళ్ళడం మానేసాను.
హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. వాళ్ళబ్బాయి అమెరికాలో వున్నాడు ఆమె కు ఏమిటబ్బా.. అనుకోవద్దు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ కోసం అప్లై చేస్తాను. చిన్నపాటి ఖర్చుల కోసం వుంటాయి అని.
అభిమానం తో భర్త ఆస్థి అంటుకోని.. 93 లో వొకసారి 2004 లో వొకసారి పుట్టింటి వారిచ్చిన పొలం అమ్ముకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా కొడుకు పై 100% ఆధారపడ్డ అమ్మని నేను.
స్వశక్తి తో బతికిన కాలం 2000 to 2017 మధ్య కాలం. తలెగరేసి బతికిన కాలం. ప్రస్తుతం విశ్రాంతి మోడ్ లో వున్నాను.
ఎవరైనా రెండు ఎకరాలు పొలం కౌలుకి ఇస్తే కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కి రూపకల్పన చేయాలని మహా ఉబలాటంగా వున్నాను. నా దగ్గర చాలా ప్లాన్స్ వున్నాయి మరి. 😊
ఇప్పుడు నేను పెన్షన్ కి అర్హురాలినా.. కాదా !? మీరే చెప్పండి. ఒకవేళ కమ్యూనిటీ గార్డెన్ ఆలోచన సక్సెస్ అయితే.. పెన్షన్ వద్దనే వద్దు కూడా!
రిటైర్మెంట్ ఏజ్ రాకుండానే ఏడేళ్ళ నుండి ఖాళీగా వున్నాను.. అమెరికా ప్రయాణాల వల్ల.
స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో మరీ గుర్తుకు వస్తుంది. నాకన్నా మా అత్తమ్మ నయం. కొడుకులతో పాటు సమానంగా వాటా తీసుకుని బెట్టుగా పై చేయి గానే బతుకుతుంది వొంటరిగా.
ఏందో! నాకు మనసవలేదు అలా చేయడం.
పిల్లలపై అతి ప్రేమ కొంప ముంచుతుంది కూడా.
తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు వున్నారు కానీ..
బిడ్డలను మోసం చేసిన తల్లిదండ్రులు లేరు. కనీ.. పెంచి.. ఎన్నో ఆశలు పెంచుకుని విదేశాలకు ఉన్నత చదువులకు పంపితే.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు..
తల్లిదండ్రులను వదిలేసి వారిని మానసికంగా చంపేసిన పిల్లలు ఎంత ఉన్నత ఉద్యోగాలు చేస్తే ఏమిటి?
థూ.. 😡😡 అని ఛీత్కరించాను.
తెల్లారినాక… ఈ రోజు మరికొందరి వ్యథలు రాయాలనిపించింది.
మా అన్నయ్య ఉదయం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు.
నేను ఏమన్నానంటే.. ఆ.. ఏం సాధించామని శుభాకాంక్షలు చెబుతున్నావ్, అందుకునే అర్హత కూడా లేదులే.. అన్నాను.
“అయితే వొక పని చేయి! ఒక కొండను తవ్వి పక్కన పొయ్యి. అప్పుడు అర్హత వచ్చినట్టు” అన్నాడు.
సెటైర్ కి నవ్వు వచ్చినా..
లైఫ్ అంటే చాలా విరక్తి వచ్చేసింది ..రా అబ్బాయ్ అన్నాను.
ఏమైందమ్మా.. అన్నాడు మా అన్నయ్య నా దిగులు స్వరం విని.
అనుభవం నాదే కానవసరం లేదు. ఎవరిదైనా అయ్యో పాపం అనిపిస్తుంది అని
నా ఫ్రెండ్ నిన్న చెప్పిన అమెరికా కొడుకు కథ చెప్పాను.
ఆమె చెప్పిన మాటలు యదాతథంగా ఇక్కడ.. రాస్తున్నాను.
*****************
ఈ కాలం పిల్లలు చాలా స్వార్ధపరులు అయిపోయారు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి సమయం వుండదు. వాళ్ళ ఫ్రెండ్స్ , సరదాలు షికార్లు షాపింగ్ లు పార్టీలు
వాటికే సమయాలు. కనీ పెంచీ వాళ్ళ ఉన్నతికి అహర్నిశం పాటు పడితే .. వాళ్ళు అమ్మానాన్నలతో మాట్లాడే సమయానికి కూడా డబ్బు లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళను చదివించడం తప్పు అయిపోయింది. మగపిల్లలు వ్యవసాయం చేసుకుంటే కళ్ళెదురుగా వుండేవారు. ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్ళకు పెళ్ళి చేసేస్తే పైత్యం పనులు చేయకుండా వుండేవారు.. అనిపిస్తుంది. విదేశాలకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు అనేక బాధలు అనుకో!
ఈ కొడుకులున్నారే.. వాళ్ళ సంగతి చెబుతాను చూడు.. వారి భార్యకు 20 జతల చెప్పులు వున్నా ఇంకొన్ని జతల చెప్పులు కొంటారు. పది ఖరీదైన వాచీలున్నా ఇంకో వాచీ కొంటారు. క్లోజెట్ లో వందలకొద్ది జతల బట్టలున్నా నెల నెలా కొంటూనే వుంటారు.ఇరవై హ్యాండ్ బ్యాగ్ లు వున్నా clutch కొంటూనే వుంటారు. రోజూ.. కొరియర్ వాడు ఏదో వొకటి ఇచ్చిపోతూనే వుంటాడు. వాటన్నింటికీ.. డబ్బులుంటాయి. అమ్మనాన్నలకు తిండీతిప్పలకు అయ్యే ఖర్చు పంపడానికి మాత్రం డబ్బులు లేవు అని కసురుకుంటారు. కళ్ళనీళ్ళు నింపుకుని వెర్రిముఖాలు వేసుకుని చూడటమే!
మేము ఎట్టాగొట్టా సర్దుకుంటాం నువ్వు జాగ్రత్త రా .. అయ్యా! అని చెప్పాను అంది నా ఫ్రెండ్.
ఇక కూతురు సంగతి చెబుతా విను. అక్కడికి పోయినా.. అన్నీ మనమే చేసి పెట్టాలి. ఇక్కడికి వచ్చినా అన్నీ చేసి అమర్చాలి. మన అనారోగ్యాలు మన నొప్పులు మన డబ్బు ఇబ్బందులు వారికేమీ పట్టవు. ఆడపిల్లకు ఏం బాధ్యత వుంటది? అన్నీ కొడుకులే చూసుకోవాలి అంటూ.. తెలివిగా జారుకుంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చిందే బంగారం కొనడానికి బట్టలు కొనడానికి అన్నట్టు రోజూ షాపింగ్ లు ఫ్రెండ్స్ ఇళ్ళకు తిరగడాలు. వారికి కావల్సిన లిస్ట్ అంతా తెచ్చి సూటేకేస్ లకు సర్దే కూలీలు లాగా చూస్తారు మనల్ని. అసలు రాకుంటే.. ఏ బాధ లేదు, ఎందుకు కన్నామా ఇలాంటి బిడ్డల్ని అని చెప్పుతో కొట్టుకొంటున్నా “ అంది.
మహిళా దినోత్సవం లో తల్లుల వ్యథలు ఇవి. మహిళగా సాధించిన వ్యక్తిగత విజయాల కన్నా బిడ్డల స్వార్థం బారిన పడిన తల్లులను కృంగదీసే అంశాలు ఇవి.
మహిళలూ.. Take care of yourself.. మాతృ ప్రేమను పరిమితం చేసుకోండి అని మాత్రం చెప్పగలను.