ఎందుకో నగర జీవనం నాకంతగా రుచించడం లేదు. పల్లెకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని వుంది. నగరంలో ఖర్చులు కూడా అధికంగా వుంటున్నాయి. సాదాసీదాగా జీవించాలన్నా కూడా భారంగా వుంది. నగరంలో నా అభిరుచికి నా (మా) ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టుగా ఇల్లు నిర్మించడం కూడా సాధ్యం కాదనిపిస్తుంది. ఇంటి ముందు రోడ్డు తగినంత వెడల్పు లేక అనుమతులు రావడం కష్టం అనిపిస్తుంది. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టే ఉత్సాహం అణిగిపోయింది.
నా కలల కుటీరం నిర్మించుకోవడానికి పల్లెటూరు బావుంటుందనిపించింది. ఆ పల్లె ఎక్కడో యెందుకు? నేను పుట్టి పెరిగిన ఊరు నాకు చాలా యిష్టం. మా ఇల్లు నాబాల్య జ్ఞాపకాలు నాకు మానసికమైన బలాన్నిచ్చే బంధాలు ఎన్నో వున్నాయి. మనుషులతోనే కాదు మట్టితో కూడా నా బంధం.
నాలుగు తరాలు నా పూర్వీకులు సంచరించిన నేల అది. అక్కడ నేలలో ధూళిలో గాలిలో వారి ఆత్మ సంచరిస్తూ వుంటుందని నా నమ్మకం. పిచ్చి ప్రేమ కూడా! ఎవరికైనా కన్నతల్లి జన్మభూమి కన్నా మించినవి ఏముంటాయి? మనిషికి మట్టికి విడదీయలేని బంధం కదా! అలా అనిపిస్తూ వుంటుంది. అందుకే మా ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అక్కడ నేను నిలబడటానికి కావాల్సినంత నేల కూడా కొనుక్కొని సొంతం చేసుకోవాలి. మా నాన్నగారికి మా అన్నయ్యకు చెప్పాను. రోడ్డు పక్కనే వుండే విధంగా ఒక ఎకరం పొలమైనా దొరుకుతుందేమో చూడమని. అంతకుముందు ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం అమ్మిన పొలం అమ్మకానికి వుందని తెలిసింది. అయితే అది నివాసానికి ఏ మాత్రం వీలు పడని మాగాణి భూమి. ఆ భూమి చుట్టూ ఇటుకరాళ్ళ బట్టీలు నెలకొని వున్నాయి. మా అమ్మ పేరున వున్న భూమి నేను కొనుక్కుంటే బావుంటుంది అనుకున్నాను కానీ అది కొనేసి కౌలుకిచ్చేసి రావడమే! ఎందుకో యిష్టం లేకపోయింది. గట్టి ప్రయత్నం కూడా చేయలేదు.
తర్వాత మరొక ప్రయత్నం చేసాను. రోడ్డు పక్కనే వున్న మూడెకరాలు. ఆహా అనిపించింది. నా కలల కుటీరం పచ్చని తోట ఆవులు తువ్వాయిలు అనుకుంటూ ఏదేదో ఊహాలోకంలో మునిగిపోయాను. ఎకరం ముప్ఫై ఐదు లక్షలు చెప్పారంట. మా అబ్బాయితో చెబితే ఏవేవో సర్దుబాట్లు గురించి ఆలోచించి ఇరువురం సంప్రదించుకుని సాధ్యాసాధ్యాలను లెక్కించుకుని భూమి కొందామని నిర్ణయించుకున్నాం. మూడు ఎకరాలు కొందామని బేరానికి వెళితే అకస్మాత్తుగా ముందు చెప్పిన ధర కన్నా సగం పైనే పెంచేసి ఎకరం యాభై లక్షలు అన్నారు. అయినా ఇప్పుడు అమ్మం. రాష్ట్ర ప్రభుత్వం మారితే భూముల ధరలు మారిపోతాయి. అప్పుడు చూద్దాం లే అన్నారట. నా ఆశలపై కడవల కొద్దీ నీరు కుమ్మరించినట్లైంది. అయినా సరే మరొకమారు మా ఊరు వెళ్ళినప్పుడు మిగిలిన చిన్న ఆశతో ఆ పొలం చూద్దామని వెళ్ళాను. మా ఊరు నుండి మైలవరం వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే. ప్రయాణిస్తూనే పరిశీలించాను. LBEC కి ఒక కిలోమీటర్ పరిధి లోనే వుంది ఆ పొలం. మార్కెట్ విలువ బాగా పెరిగే ప్రాంతమే కానీ పరిసరాలు ఏమంత బాగాలేవు. కనుచూపు మేరా ఎక్కడా పచ్చని పొలాల జాడ లేదు. చుట్టూ ఇటుకరాళ్ళ బట్టీలు, పొగ కాలుష్యం, బట్టీల్లో పని చేయడానికి వచ్చిన బీహారు ప్రాంత పని వారి గుడిసెలు చాలా కంగాళీ గా తోచాయి. నాకు ఆ ప్రాంతం అస్సలు నచ్చలేదు. క్షణాల్లోనే వద్దు, అసలు ఇక్కడ వద్దనే వద్దు అని తీర్మానించుకున్నాను. అసలు పల్లెలు ఎలా వుంటాయని మనం ఊహించుకుంటున్నామో అలా వుండటం లేదు. అక్కడ కూడా ప్లాస్టిక్ కాలుష్య కాసారమే! వీలైనంతగా పర్యావరణాన్ని నాశనం చేస్తూనే వున్నారు. చాలా అసంతృప్తి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెతుకులాట ప్రారంభించాలి అనుకున్నాను. నా వెదుకులాట ఫలిస్తుందో లేదో చెప్పలేం.
నా స్నేహితురాలితో ఈ సంగతి చెబితే పల్లెటూర్లలో పరిస్థితులు ఏం బాగోలేవు. వ్యవసాయం గిట్టుబాటు కాదు. పెరటితోట కూడా పెంచుకోలేం. కోతులు పీకి పాకం చేసి పెడుతున్నాయి. ఏమైనా డబ్బులుంటే ప్లాట్ కొనుక్కొని అద్దెకి ఇచ్చుకో అంది. ఉపరితలంలో కనిపించే సమస్యలు ఇవి. కానీ నేను మానసికంగా ఏం కోరుకుంటున్నానో అంచనా వేయగల్గడం ఆమె కు కూడా సాధ్యం కాకపోవచ్చు.
“బయలు నవ్వింది” కథ నేను రాసినదే! నా ఆలోచనలు మానసిక స్థితి యశోదమ్మ మానసిక స్థితి లాంటిదే! Back to roots.. కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ .. ఓపిక వున్నంత వరకూ.. ఇష్టంగా బతుకుదాం.. మనసుకి కష్టంగా వుండకుండా అనుకుంటున్నాను.
ఏ వ్యాపకం లేక స్థబ్దత నెలకొని జీవనం నిరాశామయంగా వుంది. అపార్ట్మెంట్ సంస్కృతిలో మన అభిరుచికి తగ్గట్టుగా బతకడం నాల్గు గోడల మధ్య కూడా సాధ్యం కాదు. ఇక మొక్కల పెంపకం కూడా పరిమితి
లోనే! మన ఆహారం మనమే పండించుకోవాలి అనే పద్ధతిలోకి వెళ్ళాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నేనసలు ఈ ఆలోచన ఎప్పుడో చేయాల్సింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మాకున్న పొలాలు అమ్ముకున్న తర్వాత ఈ ఆలోచన కల్గింది. అమ్మినంత సులభం కాదు అమరడం. అదీ నేను ఒంటరిగా వుండి చేయవల్సిన ప్రయత్నం అది. మనిషి తనకి చేయాలనిపించింది చేయకుండా కాలం సంకెళ్ళు వేయడం అంటే ఇలాంటి అవాంతరాలు రావడమే అనుకుంటా! సంకల్పబలం వుంది.. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి