తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు వున్నారు కానీ..
బిడ్డలను మోసం చేసిన తల్లిదండ్రులు లేరు. కనీ.. పెంచి.. ఎన్నో ఆశలు పెంచుకుని విదేశాలకు ఉన్నత చదువులకు పంపితే.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు..
తల్లిదండ్రులను వదిలేసి వారిని మానసికంగా చంపేసిన పిల్లలు ఎంత ఉన్నత ఉద్యోగాలు చేస్తే ఏమిటి?
థూ.. 😡😡 అని ఛీత్కరించాను.
తెల్లారినాక… ఈ రోజు మరికొందరి వ్యథలు రాయాలనిపించింది.
మా అన్నయ్య ఉదయం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు.
నేను ఏమన్నానంటే.. ఆ.. ఏం సాధించామని శుభాకాంక్షలు చెబుతున్నావ్, అందుకునే అర్హత కూడా లేదులే.. అన్నాను.
“అయితే వొక పని చేయి! ఒక కొండను తవ్వి పక్కన పొయ్యి. అప్పుడు అర్హత వచ్చినట్టు” అన్నాడు.
సెటైర్ కి నవ్వు వచ్చినా..
లైఫ్ అంటే చాలా విరక్తి వచ్చేసింది ..రా అబ్బాయ్ అన్నాను.
ఏమైందమ్మా.. అన్నాడు మా అన్నయ్య నా దిగులు స్వరం విని.
అనుభవం నాదే కానవసరం లేదు. ఎవరిదైనా అయ్యో పాపం అనిపిస్తుంది అని
నా ఫ్రెండ్ నిన్న చెప్పిన అమెరికా కొడుకు కథ చెప్పాను.
ఆమె చెప్పిన మాటలు యదాతథంగా ఇక్కడ.. రాస్తున్నాను.
*****************
ఈ కాలం పిల్లలు చాలా స్వార్ధపరులు అయిపోయారు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి సమయం వుండదు. వాళ్ళ ఫ్రెండ్స్ , సరదాలు షికార్లు షాపింగ్ లు పార్టీలు
వాటికే సమయాలు. కనీ పెంచీ వాళ్ళ ఉన్నతికి అహర్నిశం పాటు పడితే .. వాళ్ళు అమ్మానాన్నలతో మాట్లాడే సమయానికి కూడా డబ్బు లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళను చదివించడం తప్పు అయిపోయింది. మగపిల్లలు వ్యవసాయం చేసుకుంటే కళ్ళెదురుగా వుండేవారు. ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్ళకు పెళ్ళి చేసేస్తే పైత్యం పనులు చేయకుండా వుండేవారు.. అనిపిస్తుంది. విదేశాలకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు అనేక బాధలు అనుకో!
ఈ కొడుకులున్నారే.. వాళ్ళ సంగతి చెబుతాను చూడు.. వారి భార్యకు 20 జతల చెప్పులు వున్నా ఇంకొన్ని జతల చెప్పులు కొంటారు. పది ఖరీదైన వాచీలున్నా ఇంకో వాచీ కొంటారు. క్లోజెట్ లో వందలకొద్ది జతల బట్టలున్నా నెల నెలా కొంటూనే వుంటారు.ఇరవై హ్యాండ్ బ్యాగ్ లు వున్నా clutch కొంటూనే వుంటారు. రోజూ.. కొరియర్ వాడు ఏదో వొకటి ఇచ్చిపోతూనే వుంటాడు. వాటన్నింటికీ.. డబ్బులుంటాయి. అమ్మనాన్నలకు తిండీతిప్పలకు అయ్యే ఖర్చు పంపడానికి మాత్రం డబ్బులు లేవు అని కసురుకుంటారు. కళ్ళనీళ్ళు నింపుకుని వెర్రిముఖాలు వేసుకుని చూడటమే!
మేము ఎట్టాగొట్టా సర్దుకుంటాం నువ్వు జాగ్రత్త రా .. అయ్యా! అని చెప్పాను అంది నా ఫ్రెండ్.
ఇక కూతురు సంగతి చెబుతా విను. అక్కడికి పోయినా.. అన్నీ మనమే చేసి పెట్టాలి. ఇక్కడికి వచ్చినా అన్నీ చేసి అమర్చాలి. మన అనారోగ్యాలు మన నొప్పులు మన డబ్బు ఇబ్బందులు వారికేమీ పట్టవు. ఆడపిల్లకు ఏం బాధ్యత వుంటది? అన్నీ కొడుకులే చూసుకోవాలి అంటూ.. తెలివిగా జారుకుంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చిందే బంగారం కొనడానికి బట్టలు కొనడానికి అన్నట్టు రోజూ షాపింగ్ లు ఫ్రెండ్స్ ఇళ్ళకు తిరగడాలు. వారికి కావల్సిన లిస్ట్ అంతా తెచ్చి సూటేకేస్ లకు సర్దే కూలీలు లాగా చూస్తారు మనల్ని. అసలు రాకుంటే.. ఏ బాధ లేదు, ఎందుకు కన్నామా ఇలాంటి బిడ్డల్ని అని చెప్పుతో కొట్టుకొంటున్నా “ అంది.
మహిళా దినోత్సవం లో తల్లుల వ్యథలు ఇవి. మహిళగా సాధించిన వ్యక్తిగత విజయాల కన్నా బిడ్డల స్వార్థం బారిన పడిన తల్లులను కృంగదీసే అంశాలు ఇవి.
మహిళలూ.. Take care of yourself.. మాతృ ప్రేమను పరిమితం చేసుకోండి అని మాత్రం చెప్పగలను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి